Tuesday, 12 June 2012

గంగాశంతను సంవాదము.

ది.12.06.2012 వ తేదీ 
"శంకరాభరణం" బ్లాగులో 
"పద్యరచన"శీర్షికన ఇవ్వబడిన చిత్రానికి వ్రాసిన 
పద్యవ్యాఖ్య
గంగాశంతను సంవాదము.
సీ.
కోరి దీక్షనుబూని యీరీతి పుత్రులన్
          గంగ కర్పింతువా క్రమముగాను?
"మమతకు నిలయంబు మాతృమూర్తి" యటండ్రు
          కరుణ యొక్కింతైన కానరాదు,
"కలుషహారిణి"వండ్రు కన్నబిడ్డలనిట్లు
          హరియించు టుచితంబె యతివ! నీకు?
వీని నొక్కనినైన విమలాత్మవౌచును
          కాపాడవే తన్వి! కోపమేల?
తే.గీ.
అనుచు శంతను డీరీతి నమిత దు:ఖ
భరితుడై గంగతో బల్కి కరుణ జూపు
మంచు వారింప యత్నించ నప్పుడామె
భర్త కనియెను వినుమింక ప్రాణనాథ!
సీ.
అలనాడె దెల్పితి నతివిస్తృతంబుగా
          సంతానమును గూర్చి చక్కగాను,
వారింప వలదంచు కోరినానప్పుడే
          మగడ! యిట్టులు పల్కఁ దగదు నీకు
నియమభంగము గాన నేనుండ రాదింక
          నీతోడ నికపైన నృపతి! యిపుడె
యేగుచుంటి నటంచు నాగంగ కొమరుని
          నిజనాథు కర్పించి నిలువకుండ
(యేగుచుంటి నటంచు నాగంగ యప్పుడే
          నిజనాథు ముందట నిలువకుండ)
తే.గీ.
చనెను శంతను డాపట్టి ననుపమగతి
బెంచె, వీరాధివీరుడై పేరుగాంచె
నతడు దేవవ్రతుడనంగ, ప్రతిన బూని
భీషణంబుగ మున్ముందు భీష్ముడయ్యె.

No comments:

Post a Comment