ది.11.06.2012 వతేదీ
"శంకరాభరణం" బ్లాగులో
"పద్యరచన" శీర్షికన ఇవ్వబడిన చిత్రానికి
వ్రాసిన పద్యవ్యాఖ్య
గంగానది.
కం.
శ్రీ గంగా సంస్మరణమె
పోగొట్టును పాపచయము పుడమిని జూడన్
వేగమె వైష్ణవసన్నిధి
నా గంగయె గూర్చుచుండు నవగాహమునన్.
కం.
తపమొనరించె భగీరథు
డపుడా గంగను దలంచి యద్భుతరీతిన్
కృప జూపుచు మందాకిని
నృపతికి సమ్మతిని దెల్పె నేలకు రాగన్.
కం.
శివుడు భగీరథుడడుగగ
భువి జేరెడు గంగకొరకు భువనావనుడై
ధవుడై జటలం జూపెను
శివయై స్వర్గంగ యందు జేరిన దపుడున్.
కం.
జేజే గంగా మాతా!
జేజే కరుణాంతరంగ! జే స్వర్గంగా!
జేజే విష్ణుతనూజా!
జేజే లొనరింతుమమ్మ! శ్రేయము లిమ్మా.
కం.
దేవా! సకల సురేశ్వర!
రావా ప్రమథాధినాథ! రా మము గావన్
నీవే సర్వేశ్వరుడవు
నీవే సుఖదాత వింక నిక్కం బీశా!
No comments:
Post a Comment