Sunday, 8 September 2019

భవ్యభారతశతకము (మేరాభారత్ మహాన్)


శ్రీరామ
మేరాభారత్ మహాన్
(భవ్యభూమి నాదు భారతమ్ము)
ఆ.వె.
శ్రీలు పంచుచుండు చిద్భాగ్యమును గూర్చు
సర్వజనుల కొసగు సౌఖ్యచయము
సాధుదివ్యచరిత సద్భావభరితయౌ
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      1.
ఆ.వె.
శ్రుతులు పుట్టునేల స్తుతికర్హతనుగూర్చు
శాస్త్రచయము నొసగి సర్వజగతి
ఖ్యాతినందినట్టి కల్యాణగుణదీప్త
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      2.
ఆ.వె.
ఇనుమడింపజేయు నితిహాసములలోన
సన్నుతించ దగిన సంస్కృతులను
సర్వగతుల బ్రజకు సన్మార్గమును జూపు
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      3.
ఆ.వె.
కావ్యతతుల జూపి కమనీయమైనట్టి
భావ మెల్ల జనుల గావ బూని
జగతిలోన నింపు సచ్ఛీలసంయుక్త
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      4.
ఆ.వె.
వసుధ నలరు నట్లు బహుళసంఖ్యలలోన
మహిమ గల్గుభాష లిహపరమగు
సుఖము గూర్చురీతి జూపించుచుండిన
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      5.
ఆ.వె.
జాతులెన్నియున్న నీతిమంతంబైన
వర్తనంబు జూపి వసుధలోన
తనసుతాళినెల్ల ధన్యులన్ జేసెడి
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      6.
ఆ.వె.
సత్యవచనమందు సత్త్వంబు గలదెందు
వినుడు మీరటంచు విస్తృతముగ
విశ్వమంత దెలుపు విజ్ఞానపూర్ణయౌ
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      7.
ఆ.వె.
శాంతమార్గమొకటె సంతోషమును నింపు
వైర మాపదలకు కారణమ్ము
శుభములంది సతము సుఖియించుడని నేర్పు
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      8.
ఆ.వె.
సకలజీవులందు సర్వేశ్వరుండుండు
జీవహింస చెరచు క్షేమములను
నమ్మి నడుచుకొనుడు నావార లని తెల్పు
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      9.
ఆ.వె.
నీదు పూర్వజనులు నిష్ఠతో జరియించి
ఖ్యాతినందినారు కనుము సుతుడ!
ధర్మములను వీడ దగదని బోధించు
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      10.
ఆ.వె.
నీది నాది యనుచు భేదభావములేల?
పుట్టునపుడు లేదు పోవునపుడు
వెంటరాదు ధనము వినుడంచు దెలిపెడి
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      11.
ఆ.వె.
వారు వీరటంచు దూరముం బాటించు
టెల్ల తగదు మీకు దల్లినౌచు
నేను నిలిచియుండ నిక్కమంచును దెల్పు
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      12.
ఆ.వె.
దీక్షబూని వచ్చి భిక్షంబు యాచించు
వాడు దైవసముడు వానిపూజ
భగవదర్చనముగ భావించు డని తెల్పు
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      13.
ఆ.వె.
తిండి లేక యొకడు మెండైన కష్టంబు
లందుచుండ సిరుల నంది యొకడు
సంతసించరాదు సము లందరని తెల్పు
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      14.
ఆ.వె.
అమలభావ మూని యైశ్వర్యమును బంచి
తోటివారితోడ సాటిలేని
ముదము గనుట యొప్పు నిదె ధర్మమని తెల్పు
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      15.
ఆ.వె.
సన్నుతించు రీతి స్వార్థమ్ము విడనాడి
సంహితము గోరి సర్వగతుల
సంచరించు డనెడి మంచిభావము నేర్పు
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      16.
ఆ.వె.
సిరులు బంచకున్న, "నొరులను దూషించి
ఖ్యాతి నందదలచి నీతి దప్పి
తిరుగు టొప్పుగాదు" తెలియుడు మీరను
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      17.
ఆ.వె.
మహిళలన్న వినుడు మహిపైని జరియించు
దేవగణము, పూజ్యభావ మూని
గౌరవించు టొప్పు వారి నిందని తెల్పు
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      18.
ఆ.వె.
జన్మ నొసగునట్టి జనయిత్రి స్త్రీమూర్తి
యామె లేక జగతి నరయ గలమె?
గారవించు టొప్పు నారి నిందని తెల్పు
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      19.
ఆ.వె.
జనున కెల్లగతుల నతర మైనట్టి
యశము గూర్చు మహిళ యామె నెపుడు
సన్నుతించు టౌను సంస్కార మని తెల్పు
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      20. 
ఆ.వె.
తల్లిదండ్రులన్న నెల్లసృష్టికి నిందు
కారణంబు లగుట వారి జేర
బోయి శ్రద్ధతోడ బూజించు డని తెల్పు
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      21.
ఆ.వె.
జన్మదాతలందు సర్వకాలములందు
వినయవర్తనంబు విస్తృతమగు
పూజ్యభావ మొప్పు పుడమిని మీకను
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      22.
ఆ.వె.
జన్మభూమి మరియు జననియు జూడంగ
మిన్న స్వర్గసీమ కన్న నిజము
దీని నెరుగు డంచు మానితంబుగ నేర్పు
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      23.
ఆ.వె.
గురుని సేవ జేయ నరులకు నిహమందు
జ్ఞాన మొదవుచుండు దాన బరము
సుఖద మౌట నిజము చూడుడు మీరను
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      24.
ఆ.వె.
ఉన్నదానితోడ నున్నతంబుగ దృప్తి
చెందవలయు సతము చేర వలదు
కాని దానికొరకు నేనాడు నీవను
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      25.
ఆ.వె.
పెద్దవారలందు నొద్దిక జూపించి
సంచరించ గలుగు నంచితమగు
సౌఖ్య మిలను మీకు జనులార! యనియెడు
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      26.
ఆ.వె.
సాధుసంగమంబు సన్మార్గమును గూర్చు
సర్వగతుల వినుడు సత్వ మొసగు
తెలిసి సంచరించు డిలలోన మీరను
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      27.
ఆ.వె.
చీల్చి బలము జూపి చెండాడవలె నోయి!
యిచటి సంశక్తి కెట్టులైన
చెరపు చేయబూను చెనటు లనని తెల్పు
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      28.
ఆ.వె.
నియతి దప్పి కోరి నీదేశమును జీల్చ
బూను వారి లోని పొగరు నణచ
సాహసించుమోయి! శక్తిమంతుడ! యను
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      29.
ఆ.వె.
సన్నుతించురీతి సర్వేశ్వరుండైన
విష్ణుమూర్తి భువికి విస్తృతమగు
జవము సత్వ మొసగ నవతారములు దాల్చు
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      30.
ఆ.వె.
లింగరూపమంది సంగతంబగురీతి
భక్తజనుల గాచి భాగ్య మొసగు
శంకరుండు దిరుగు సర్వోత్తమంబైన
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      31.
ఆ.వె.
నాల్గుమోము లంది నవ్యానురాగాన
తనను గొల్చువారి కనుపమముగ
వరము లొసగు బ్రహ్మ కిరవౌచు వెలుగొందు
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      32.
ఆ.వె.
దుష్టులౌచు సతము కష్టంబు లీనేల
గూర్చునట్టి యసుర కోటి ద్రుంచు
శక్తి కనకదుర్గ సంచరించుచునుండు
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      33.
ఆ.వె.
ఇలను సర్వజనులు తలచిన పనులలో
తగులబోవు విఘ్నతతుల గూల్చు
విఘ్నరాజు తిరుగు విమలమౌ ప్రాంతమ్ము
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      34.
ఆ.వె.
తలచువారి కొరకు కలియుగదైవమై
సప్తగిరులపైన సంతసమున
నిలిచియున్నవాని కిలను బ్రీతిదమైన
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      35.
ఆ.వె.
సద్గురూత్తములగు సాయినాథాదులు
ప్రేమతోడ సతము క్షేమసౌఖ్య
మిచ్చుచుండు నేల యిందు సందియమేల?
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      36.
ఆ.వె.
"ఏసు! రక్ష"యన్న, నింపుగ నల్లాను
గొల్తుమన్న గాని, కోరి హరిని
ననుసరింతుమన్న నంగీకరించెడి
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      37.
ఆ.వె.
గుడులు గోపురాలు కోటానుకోట్లుగా
వెలసి సతము ముదము కలుగజేయు
చుండునట్టి చోటు రండు దర్శించుడు
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      38.
ఆ.వె.
సుజల లౌచు సతము ప్రజలకు మోదంబు
కలుగ జేయునట్టి గంగవంటి
నదులు పారుచుండు సదమలమైనట్టి
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      39.
ఆ.వె.
దేవతాసమంబు లీవాహినుల్ చేరి
సౌఖ్య మొదవ జేయ సస్యతతులు
పండునట్లు చేసి  భాగ్యంబులను నింపు
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      40.
ఆ.వె.
సగరముఖ్యులైన షట్చక్రవర్తులు
నిర్జరాళి కొరకు నిఖిల శుభము
లందునట్లు సాయ మందించు ప్రాంతంబు
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      41.
ఆ.వె.
అఖిలభువనతతుల నంగంబులను దాల్చు
గోవు నమ్మవలెను కూర్మిమీర
గొలుచుచుండునట్టి కువలయం బియ్యది
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      42.
ఆ.వె.
మన్ను తింటి వనుచు మాత దండించంగ
దలచ నోటిలోన దాగియున్న
లోకములను జూపు లోకేశు స్థానమ్ము
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      43.
ఆ.వె.
స్వర్గమందు నుండు జాహ్నవి ప్రేమతో
పుడమిపైకి జేర గడగు నపుడు
చోటు చూపినట్టి దీటైన ప్రాంతమ్ము
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      44.
ఆ.వె.
ఉత్తరాన జనుల చిత్తంబులను దోచు
చుండి రక్షగూర్చు చుండు నట్టి
హిమగిరీంద్రయుక్త మమలినమౌ నేల
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      45.
ఆ.వె.
భాషచేత గాని ప్రాంతంబులను గాని
భేద ముండ నేమి? మోద మొసగు
భావ మొక్కటౌచు పావనత్వము గూర్చు
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      46.
ఆ.వె.
అమరభాష యిచట నాహ్లాదకరమౌచు
వెలుగుచుండు నట్లె వివిధములగు
ధర్మసూత్రములకు మర్మంబులను దెల్పు
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      47.
ఆ.వె.
వేదభూమి యగుట విశ్వంబునకు దాను
మానవత్వ మనెడి మాట కుండు
భావ మంద మొప్ప బ్రకటించుచుండును
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      48.
ఆ.వె.
శాంతజీవనమ్ము సర్వసౌఖ్యము లిచ్చు
పోరుబాట తగదు మీరు వినుడు
పౌరులార! యనుచు జీరి బోధించెడి
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      49.
ఆ.వె.
వైరియైన జేరి కోరిన శరణంబు
దొసగు లెంచబోక నసదృశమగు
దయను జూపుగాని దండించ నెంచదు
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      50.
ఆ.వె.
విశ్వజనుల సుఖము శాశ్వతైశ్వర్యంబు
గోరి క్రతుచయంబు కూర్మిమీర
చేయవలె నటంచు చెప్పును ప్రజలకు
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      51.
ఆ.వె.
అవనిలోన నీకు నపకారమును జేయు
వానికైన హితము వలసినంత
చేయవలె నహితము చేయంగ వలదను
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      52.
ఆ.వె.
పలురకంబులైన ఫలితంబు లందించు
యజ్ఞములను భువికి నందజేయు
గురునిభంబు చూడ నిరుపమమై వెల్గు
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      53.
ఆ.వె.
కాశి వంటి స్థలము లాశాంతముల దాక
మేటి ధర్మములను చాటుచుండ
దివ్యదీప్తితోడ తేజరిల్లుచునుండు
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      54.
ఆ.వె.
విపులమైన రీతి విజ్ఞానశాస్త్రంబు
విస్తరించలేని విషయములను
వేదచయములోన విస్పష్టముగ జూపు
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      55.
ఆ.వె.
కర్మభూమి యగుట కష్టించి మనుటందు
నతులమైన హర్ష మందగలదు
నరుడ! యనుచు దెలుపు నవ్యానురాగాన
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      56.
ఆ.వె.
విశ్వజనుల కెల్లవిధముల హర్షంబు
గలుగుచుండ వలయు నలఘుసౌఖ్య
మందుచుండ వలయు ననుచును గాంక్షించు
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      57.
ఆ.వె.
బాలలందు నిజము భాగ్యహీనులయందు
దీనులందు మరియు జ్ఞానులందు
దైవముండు ననెడు భావంబులను నేర్పు
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      58.
ఆ.వె.
ఎల్లజనుల కిచట నింపారు సౌఖ్యంబు
లందుచుండవలయు నందు నేను
నుండవలయు ననెడి యొప్పిదంబును నేర్పు
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      59.
ఆ.వె.
ఉర్విజనులలోన నుత్సాహమును నింపు
బహువిధంబులైన పర్వములకు
స్థానమై వెలుంగు ధన్యచారిత్రయౌ
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      60.
ఆ.వె.
ప్రజలె స్వాములౌచు పాలనంబును జేయు
చట్టసభలు గలిగి సకలజగతి
యశము లందుచున్న యతులితభావాఢ్య
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      61.
ఆ.వె.
అమరులైనయట్టి యాదేవతలకైన
సాయమందజేసి సాకియున్న
చరితగలుగువారు సామ్రాట్టు లగునేల
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      62.
ఆ.వె.
మునులు పుట్టినిల్లు  నతరమైనట్టి
తపము లాచరించ దగిన చోటు
పరమ పావనంబు నిరతసౌఖ్యదమైన
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      63.
ఆ.వె.
పలుకులందు జూపు డలఘు మాధుర్యంబు
భావమందు శుద్ధి పనులలోన
ప్రేమ జూపు డనుచు వినిపించు నెల్లెడ
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      64.
ఆ.వె.
అహరహమ్ము కోరి యార్జించుచుండెడి
ధన మశాశ్వతంబు ధరణిలోన
గాన సాయపడుడు దీనుల కని తెల్పు
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      65.
ఆ.వె.
శిరము మీద శివుడు సురగంగ నట జేర్చి
వాసముండునట్టి పావనమగు
ప్రాంత మిచట గలదు వరలు కైలాసమ్ము
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      66.
ఆ.వె.
ఇచటినుండి జేరె నింపార జాహ్నవి
సగరపుత్రతతికి సవ్యగతులు
కలుగజేయుకొరకు నరసాతలమందు
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      67.
ఆ.వె.
వ్యాససుకవి నాడు భారతంబును జూపి
బహుపురాణ చయము వ్రాసి యిచట
వేదవిభజనమ్ము విస్పష్టముగ జేయు
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      68.
ఆ.వె.
వరమునీంద్రుడైన వాల్మీకి రామాయ
ణాఖ్యమైన గ్రంథ మందమొప్ప
రచన చేసి యున్న రమ్యమౌ ప్రాంతమ్ము
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      69.
ఆ.వె.
కాళి! నమ్మినాను కాపాడు మమ్మరో!
యనుచు భక్తుడౌచు ననుపమముగ
కావ్యరచన చేయు కాళిదాసునినేల
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      70.
ఆ.వె.
రమ్యమైనరీతి రఘువంశకావ్యమ్ము
చతురమౌ కుమార సంభవమ్ము
కాళిదాసు వ్రాయు కడురమ్యమౌ నేల
భవ్యభూమి నాదు భారతమ్ము.                                     71.
ఆ.వె.
దూరమైన యట్టి నారీమణికి నాడు
యక్షు డొకడు తెలిపి యభ్రమునకు
సవ్యగతిని జూపి సందేశమును బంపు
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      72.
ఆ.వె.
తోరమైన ప్రేమ దుష్యంతు డలనాడు
వరశకుంతలాఖ్య వధువునందు
జూపి భరతు డనెడి సూనుని బడసిన
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      73.
ఆ.వె.
ధర్మరక్షణార్థ మర్మిలి గృష్ణుడు
కోరి పాండవులకు గౌరవులకు
సవ్య మిదియటంచు సమరమ్ము జరిపించు
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      74.
ఆ.వె.
మృత్యు వందబోవు మేటి భక్తుండైన
మునికుమారు నప్పు డనుపమముగ
హరుడు వేగ గాచి చిరజీవనము గూర్చు
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      75.
ఆ.వె.
ఖలుడు రాక్షసుండు కానలందున సీత
నపహరించ హరుల యండతోడ
హరియు వానితలలు నరుక నేగిన నేల
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      76.
ఆ.వె.
భోజరాజు నాడు పూర్ణసద్భక్తితో
కవులలోన నెవరు నుడటంచు
దెలుప వాణి నిటకు బిలిపించు క్షేత్రమ్ము
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      77.
ఆ.వె.
తృష్ణ దీరురీతి కృష్ణరాయలు నాడు
తెలుగుభాష నిచట వెలుగజేసి
దేశభాషలందు తెలుగు లెస్సయటన్న
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      78.
ఆ.వె.
భరతనాట్య మటులె పరమ హర్షము గూర్చు
నాట్యరీతులెన్నొ నవ్యగతుల
నందియుండినట్టి సుందరప్రాంతమ్ము
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      79.
ఆ.వె.
గాంధి నేతయౌచు బంధనమ్ములు ద్రుంచ
శాంతితోడ బోరు సలిపి స్వేచ్ఛ
కూర్చి పెట్టినట్టి కువలయ మియ్యది
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      80.
ఆ.వె.
శాంత్యహింస లిచట సర్వసద్విజయాల
నందజేయ గలుగు నందరకును
నమ్ము డనుచు గాంధి నాడు తెల్పిన చోటు
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      81.
ఆ.వె.
మహిత దీప్తి గలిగి మణిహారమై వెల్గు
కాశ్మిరమ్ము దేశ నత నిలను
పెంచుచుండునట్టి యంచితంబగు నేల
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      82.
ఆ.వె.
సకలజనులలోన సన్నుతాచారమ్ము
లతుల ధర్మదీక్ష చతుర మతియు
నింపి దేశభక్తి పెంపొంద జేసెడి
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      83.
ఆ.వె.
పరము సత్యమౌట నిరత మీయిహమందు
మంచిపనులు చేయ మానవులకు
నచట నిచట సుఖము లందును నిజమను
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      84.
ఆ.వె.
దైవమన్న దొకటె భావంబులను భేద
మరసి వాదులాట నరుల కెపుడు
తగదటంచు గొప్ప తథ్యమ్ము బోధించు
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      85.
ఆ.వె.
పాపభీతియుండ జేపట్టు కార్యాలు
సవ్యగతిని సాగు సత్త్వ మొదవు
సత్య మనుచు జనుల జాగృతి గలిగించు
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      86.
ఆ.వె.
ధన్యజీవనులను దర్శించి సేవించు
వారి కెల్లగతుల వాస్తవమగు
సంతసమ్ము గలుగు సర్వత్ర యని తెల్పు
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      87.
ఆ.వె.
గురునియందు భక్తి, నిరతంబు పఠియించు
భావమూను శిష్యవరుల కెపుడు
విజయమందు ననుచు విస్పష్టముగ దెల్పు
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      88.
ఆ.వె.
ఛాత్రులందు సతము సద్వత్సలుండౌచు
పాఠ్యబోధనమ్ము పరగ జేయు
గురుడు శ్రేష్ఠు డిలను నిరుపము డని తెల్పు
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      89.
ఆ.వె.
మహిళ లెల్లవేళ మహితమై వెలుగొందు
వేషధారణమున విపులమైన
గౌరవమ్ము గాంతు రారయ యని నేర్పు
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      90.
ఆ.వె.
అతులమైన దీక్ష నణుశక్తి శోధించు
కార్యమందు విజయకాంక్షతోడ
సాగుచుండె నేడు సర్వోన్నతంబౌచు
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      91.
ఆ.వె.
అంతరిక్ష మందు నాశ్చర్యమును గూర్చు
విషయ మెల్లగతుల విశదముగను
తెలియగోరు దీక్ష కలిగిన దీనేల
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      92.
ఆ.వె.
శక్తి జూపుచుండి సాంకేతికంబుగ
విస్తరించి విశ్వ వేదికపయి
నత గాంచుచుండె ననిశ మీదేశమ్ము
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      93.
ఆ.వె.
వృక్షతతులతోడ పక్షిసంతతితోడ
గుడులతోడ కొండగుహలతోడ
సస్యరాజితోడ సర్వదా వెలుగొందు
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      94.
ఆ.వె.
చెట్లు, చేమ, లద్రు లట్లె యా నిమ్నగల్
పుట్ట లొక్కటేమి టెట్టి వైన
దైవ నిభము లంచు భావింపబడు నేల
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      95.
ఆ.వె.
స్త్రీని గౌరవించి చేయూతగా నిల్చి
రక్షచేయ గోరు రమ్యమైన
భావమిందు గలదు పావనప్రాంతమ్ము
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      96.
ఆ.వె.
అస్మదీయ ధర్మ మానందమును నింపు
పరులధర్మ మెపుడు వెరపు గూర్చు
ధర్మదూరులౌట తగదని బోధించు
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      97.
ఆ.వె.
పరమహితము గూర్చు పావనత్వమునందు
వేలు పెట్టువాడు కూలువరకు
విశ్రమించ వలదు వినుడు మీరని నేర్పు
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      98.
ఆ.వె.
నరుడు జీవనాన నడువంగ దగినట్టి
మార్గములను దెలుపు మహితమైన
యశము లందు విధము లనిశంబు నేర్పిచు
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      99.
ఆ.వె.
అల భగీరథాఖ్యు డిలపైన గంగను
బార జేయుకొరకు ఘోరతపము
చేసియుండినట్టి శ్రీమంతమగునేల
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      100.
ఆ.వె.
సర్వగతుల దేశసంపద గబళింప
గడగి నట్టి వైరి గణములకును
గణుతికెక్కురీతి గుణపాఠమును నేర్పు
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      101.
ఆ.వె.
దుర్మదాంధులౌచు నిర్మలత్వంబును
జెరచ జేరుచుండు చెనటి జనుల
బారద్రోలువరకు చేరదు నిద్రకు
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      102.
ఆ.వె.
తెనె లొలుకు శబ్ద దీప్తులు కురిపించి
స్వచ్ఛమై వెలుంగు స్వాంతమంది
యతిథిజనుల గొలుచు నట్టి దీప్రాంతమ్ము
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      103.
ఆ.వె.
దయయు, ధర్మదీక్ష, దానభావంబుల
నుగ్గుబాలతోడ నున్నతముగ
బాలబాలికలకు బనిగొని నేర్పించు
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      104.
ఆ.వె.
ఒరుల యెడల బ్రేమ పరమతసహనమ్ము
సంహితము గోరి సాగుచుండు
భావ మందరకును బంచుచుండెడి నేల
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      105.
ఆ.వె.
చెనటియైన గాని తనదోషముల నెంచి
బాధపడిన వేళ వాని కొరకు
సవ్యమార్గ మొసగు సాధుత్వ భరితయౌ
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      106.
ఆ.వె.
నేడు సర్వజగతి నిష్థతో శోధించి
విశద బరచు సర్వవిషయతతుల
నిచట నొప్పుమీర నెన్నడో జూపించు
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      107.
ఆ.వె.
బహుళగతులలోన బారమార్థికమైన
భావసంపదలను చేవజూపి
జనుల కందజేయు సత్వసంపన్నయౌ
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      108.
ఆ.వె.
విశ్వజనుల కెల్ల విధముల సౌఖ్యమ్ము
చేరవలయు ననుచు గోరుచుండు
గాని యహిత మెపుడు కాంక్షించగా బోదు
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      109.
ఆ.వె.
సకలవిధములైన సాధుభావంబులం
దతులమైన దీప్తులందు జూడ
ధరను లేదొకండు సరితూగగలదెందు
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      110.
ఆ.వె.
వరగుణాఢ్యు డౌచు ప్రజపద్యసభలోన
వరలుచుండు పట్టవర్ధనుండు
వ్రాయజూపె "నాదు భారతంబనుపేర"
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      111.
ఆ.వె.
అమలమై వెలుంగు హరివంశజలధిలో
జన్మమందు మూర్తి సంతసమున
భాగ్యమిది యటంచు వ్రాసె నీ శతకమ్ము
భవ్యభూమి నాదు భారతమ్ము.                                      112.

హ.వేం.స.నా.మూర్తి.
08.09.2019

Sunday, 1 September 2019

"నేను వర్తమానాన్ని ప్రేమిస్తాను"


"నేను వర్తమానాన్ని ప్రేమిస్తాను"

 
చం.
నిజమిది "వర్తమానమును  నిర్మలచిత్తముతోడ నెంచెదన్"
విజయము లందజేయుచును విజ్ఞత నేర్పెడి సాధనమ్ముగా,
స్వజనహితైషిసత్తముల సంగతి జూపుచు భావినందు నా
రుజలను దుష్టశక్తుల నిరోధక భావము గూర్చు దానిగన్.                      1.
చం.
గతము తొలంగి పోయినది కామితముల్ సమకూర్చకుండ, తా
నతులితమైన వేగమున నట్టులె భావియు దాటిపోవునో,
చతురతజూపునో, తెలియజాలునె? తానిట చేరకుండగన్
క్షితిపయి జీవనం బుడుగ జేయునొ? దుఃఖము లందు నెట్టునో?              2.
చం.
అరయగ భావియున్ గతము లన్నిట దూరము లౌట నిచ్చటన్
సురుచిర సౌఖ్యజాలముల చొప్పును జూపెడి వర్తమానమున్
స్థిరమగు భావముం గొనుచు జేర్చెద బ్రేమముతోడ చిత్తమం
దురుతర హర్షసంపదల నున్నతలీలను  గాంచ బూనుచున్.                         3.
చం.
ఇదియగు సత్యకాల మిదియే కనిపించును స్పష్టమౌవిధిన్
ముదమును గూర్చు నియ్యదియె మోహనమౌ నదీప్తి జీవికిన్
సదమలమై వెలుంగుచును జక్కగ జూపుచునుండు గాన నే
నిదె యిట వర్తమానమున నిమ్ముగ బ్రేమము బూని యుండెదన్.            4.
చం.
అనిశము వర్తమానమున నాస్థను బూని చరించుచుండెదన్
నతరభావికాలశుభకార్యములందున యోగ్యమైన భా
వనలను జేర్చి చిత్తమున భాగ్యచయంబుల నందునట్లు జీ
వనమున మార్గదర్శనము వైభవమొప్పగ జేయుచుండుటన్.                        5.
చం.
మనుజుడ నౌట కన్నులకు మాన్యతగూర్చుచు గానిపించి జీ
వనమున కైనసత్త్వము నవారితరీతిని నింపునట్టిదౌ
నమగు వర్తమానమున గాంక్షలు దీరగ బ్రేమ జూపెదన్
మనగల శక్తినిం గనెద మంచిని బెంచెద లోకమందునన్.                       6.
చం.
బహువిధకార్యసంతతినపారఫలంబిడు భూతకాలమున్,
సహనముతోడనుండ గడు చక్కని సౌఖ్యము లందజేతు మీ
కిహమున నంచు బల్కుచు జయిష్ణుత నింపెడి భావికాలమున్
మహిమను గల్పు కాలమిది మంచిని నేర్పును గారవించెదన్.                       7.
చం.
సురుచిరమైన కాల మతిసుందర మన్నిట వర్తమానమే
నిరుపమ మస్మదీయమయి నిత్యము కన్నులముందు సాగుచున్
ధరపయి నుండగల్గుటకు దారిని జూపెడిదౌట దీనినిన్
కరమిట గారవించెద సుఖంబుల నందుచు బ్రేమ జూపెదన్.                   8.

హ.వేం.స.నా.మూర్తి.
01.09.2019.

Saturday, 24 August 2019

ఆత్మహత్య తగదు

ఆత్మహత్య తగదు

ఉ.
శ్రీలను గాంచుచున్ భువిని క్షేమములందుచు సంచరించుచున్
మేలగు కృత్యముల్ సలిపి మేదినిపై యరుసంబు నింపగా
జాలిన జన్మ మిచ్చటను సన్నుతరీతిని దేవు డిచ్చె నీ
కేలనొ యాత్మహత్య? తగునే? జనుడా! గమనించు మీగతిన్. 1.
ఉ.
ఆపరమేష్ఠి నీకిడె మహాత్ముడు మానవజన్మ మిచ్చటన్
శ్రీపతి రక్షకుం డగుచు చేయుచునుండె శుభంబు లెంచగా
నా పరమేశ్వరుండెగద! యంతమునున్ ఘటియించువాడు నీ
కీపరమాత్ములం దెవరు నిచ్చట బల్కిరొ యాత్మహత్యకున్? 2.
ఉ.
నష్టము వచ్చె నాకనుచు నమ్మగ బల్కుచునుండు మానవా!
కష్టము లెంచలే ననెడి కారణమున్ జపియించుచుందు వీ
విష్టముతోడ యత్నముల నిందొనరించిన సౌఖ్యమబ్బు నీ
కష్టము తీరదా యిట నకారణ మెంచకు మాత్మహత్యకున్. 3.
ఉ.
పుట్టుచు దెచ్చితే ధనము? పోయెడి వేళను వెంటరాని దీ
పట్టున తృప్తిలేనివిధి భాగ్యము లందెడి యత్నమేల? నీ
కెట్టుల బోధచేయగల రియ్యెడ చూడుము కానిదానికై
పట్టిన పట్టు వీడ వనివార్యమె యాత్మను హత్య చేయుటల్? 4.
ఉ.
నీకు భవంబు నిచ్చిన వినిర్మల భూమికి సేవచేయుచున్
బ్రాకటమైన సద్యశ  మవారితరీతిని బొందకుండ నీ
యాకృతి మార్చి బాధ్యతల నందక నన్నిట దోష మెంచుచున్
జేకొన నాత్మహత్య నిల జేయునె మంగళ మోయి మానవా? 5.
ఉ.
జీవన మద్భుతంబయిన చిన్మయసౌఖ్యయుతంబు, దీనిలో
పావనమైన బంధములు, భాగ్యదముల్ బహుదివ్యభావనల్
చేవను గల్గజేయునవి, చింతిల నేలనొ? వీని నందకే
యీవిధి యాత్మహత్యలకు నెంచుట యుక్తము కాదు మానవా! 6.
ఉ.
జీవనమందు కష్టములు, క్షేమకరంబు లమేయసౌఖ్యముల్
తావక పూర్వకర్మల విధానముచేతనె కల్గు మానవా!
యీవిధి కుందనేల? లభియించును కష్టమువెంట సౌఖ్యమున్
గావడి కుండలట్టులివి, కావున నెంచకు మాత్మహత్యకున్. 7.
ఉ.
క్ష్మాతలమందు జంతువులు సైతము ప్రాణవిహీన లౌటకున్
చేతమునన్ స్మరింపవు విజేతవు విశ్వమునందు జూడ నీ
వీతనువున్ ద్యజించుటకు నీగతి నెంచుచు నాత్మహత్యకున్
భీతిలకుండ సాగుటను విజ్ఞత యందురె? విజ్ఞ! మానవా? 8.
ఉ.
"ఆడగలేక మద్దెలకు నంటగ జూపుట లోడు" "తామిటుల్
పీడలకిందు భీతిలుచు బెంచిన కాయము ద్రుంచుటన్నచో"
వీడగరాదు ప్రాణ మవివేకముతోడ ననేక దుఃఖముల్
ప్రోడతనంబునన్ గెలువ బూనుట యొప్పును మానవాళికిన్. 9.

హ.వేం.స.నా.మూర్తి
25.08.2019.

శ్రీకృష్ణాయనమః


శ్రీకృష్ణాయనమః

కం.
శ్రీమంత! నందనందన!
స్వామీ! సర్వార్థదాత! సన్నుతచరితా!
క్షేమప్రాపక! వరగుణ
ధామా! వందనము లందదగునో కృష్ణా!                            1.
కం.
కరుణామయ! శుభకాయా!
నిరుపమమృదుభావదీప్త!నిఖిలవ్యాప్తా!
సురుచిరవాక్యాలంకృత!
వరదాయక ప్రణతులంద వలయును కృష్ణా!                     2.
కం.
యాదవవంశవిభూషణ!
శ్రీదా! యఖిలేశ! సతము 'జే'యని నిన్నున్
మోదం బందగ దలచెద
నోదేవా భక్తిభావ మొప్పగ గృష్ణా!                                    3.
కం.
మునిజనసంస్తుత! శౌరీ!
యనఘానుగసౌఖ్యకారి!యసురారి!హరీ!
యనుదినధర్మవిహారీ!
కొనుమిట వందనము చేరి గోపీకృష్ణా!                              4.
కం.
మురళీధర! సద్గురువర!
సురుచిరదరహాసభరితసుందరవదనా!
స్థిరతరహర్షవిధాయక!
ధరణీధరధారి!కొనుము దండము కృష్ణా!                          5.

కం.
గోపీవల్లభ! యురుతర
పాపాపహ! భక్తకోటి బాంధవ! శార్ఙ్గీ! 
హే పద్మాక్షా! ప్రణతులు
శ్రీపతి! సద్భక్తి నీకు జేతును కృష్ణా!                        6.
కం.
గోవర్ధనగిరివరధర!
దేవా! నవనీతచోర! దివ్యాకారా!
పావన భవ్యవిచారా!
తావక పదములకు జేతు దండము కృష్ణా!                         7.
కం.
వందనమయ! గోపాలా!
వందనములు గానలోల! వరశుభశీలా!
వందనము దైత్యకాలా!
వందనములు స్వీకరించ వలయును కృష్ణా!              8.


హ.వేం.స.నా.మూర్తి.
24.08.19.
           

Sunday, 18 August 2019

నిజమైన దేశభక్తి


నిజమైన దేశభక్తి

.
నిజమైనట్టి స్వదేశభక్తి యనినన్  నిక్కంబుగా నెల్లెడన్
బ్రజకుం గాగల సౌఖ్యవర్ధనమునన్ భవ్యానురాగమ్ముతో
డజరించంగల దివ్యభావముల కేడన్ విఘ్నముల్ రాని ధీ
రజయత్నం బగుగాదె దేశమన నర్థంబెంచ బౌరాళియే.                                1.
.
అనుమానం బొకయింత జూపక సతం బత్యంతమౌ ప్రేమతో
నదారిద్ర్యమునన్ మునుంగు జనసంఘంబందు భ్రాతృత్వ మన్
ధనముం బంచుచు వారి కష్టతతులన్ దానై విదారించు భా
వనమున్ దాల్చుట దేశభక్తి యనుటన్ వాదేల సత్యం బగున్.                         2.
.
మమతన్ జూపుచు మానవత్వగరిమన్ మాన్యత్వమున్ నిల్పి నా
సములే యంద రటన్న భావము మదిన్ సంధించి సమ్యగ్గతిన్
సమతన్ జాటుచు సంచరించుచు సదా సంతోషముల్ పొందుటే
భ్రమలం గూల్చెడి దేశభక్తి యని యెవ్వారైన నెంచం దగున్.                         3.
.
అవినీతుల్ నతాపకారకములై  హానిన్ బ్రకల్పించు న
వ్వివిధాంధానుభవంబులున్ బ్రబలవిద్వేషంబు లీనేలపై
జవసత్వంబులు చూపకుండ సుమహచ్చాతుర్యముం జూపి యీ
యవనిన్ గాచుట దేశభక్తి యగుగా కన్యంబు గాదేవిధిన్.                        ౪.
మ.
అమితోత్సాహముతోడ ధర్మమున కార్యావర్తమం దంతటన్
దమశక్తిం బ్రకటించుచుండి యురుసంతాపంబునుం గూర్చు దౌ
ష్ట్యము జూపించెడి దుర్మదాంధుల బృహద్యత్నంబులం గూల్చు కా
ర్యము నందుండుట దేశభక్తియన సత్యంబౌను సర్వంబునన్.                       ౫.
మ.
అతులం బైన మహాగ్రహం బిపుడు నా యాత్మన్ బ్రవేశించె నీ
క్షితిపై నన్నియు ద్రుంచువాడ ననుచున్ జేనంది శస్త్రంబులన్
మతిహీనుండయి సంసంపదల నున్మాదంబునన్ గూల్చు దు
ష్కృతులన్ వీడుట దేశభక్తి యనుచున్ గీర్తింపగా నొప్పగున్.                        ౬.
మ.
భువిపై స్వచ్ఛత నిల్పువాడ ననుచున్ బూర్ణానురాగంబుతో
స్తవనీయంబగురీతి శుభ్రతకునై సర్వత్ర సద్భావనో
త్సవముల్ జేయగలట్టి శక్తిగొని తత్కార్యమ్మునన్ గూర్చు మా
నవకల్యాణము దేశభక్తి యనుచున్ నమ్మందగున్ సమ్మతిన్.                        ౭.
మ.
సువిశాలంబగు భారతావనిపయిన్ శోభిల్లు సద్భావనో
ద్భవవిశ్వైకకుటుంబభావపటలీపారీణతాగంధమున్
వివిధత్వంబున నొప్పు నైక్యతను సద్విజ్ఞాన సంపత్తులన్
స్తవనీయంబుగ గావబూనుటయె దేశంబందు సద్భక్తియౌ.                     8.

హ.వేం.స.నా.మూర్తి.
ది.18.08.2019.

Friday, 16 August 2019

చెట్టు


చెట్టు

మ.
సిరులన్ బంచుచునుందు వెన్నిగతులన్ జీల్చంగ యత్నించినన్
నరులం దాగ్రహ మించుకేని దెలుప న్గాంక్షించబో వెప్పు డో
ధరణీజంబ! శుభాశయాన్విత! మహద్దాక్షిణ్యసంశోభితా!
కరుణాపూర్ణ! నమస్కృతుల్ కొనుమిదే కామ్యప్రదా! వృక్షమా!            1.
మ.
పరు లీజీవులు వీరికేవిధిని నే బంచం దగున్ సౌఖ్యముల్
కరుణాహీనులు వీరలంచు మదిలో క్రౌర్యాత్మకంబైన ఛీ
త్కర భావంబును దాల్చబో వనిశమున్ గల్యాణముల్ గూర్చగా
వెరవం జూడవు దైవ మౌచు జనులన్ బ్రేమింతు వో భూజమా!                       2.
మ.
పలుకన్ సాధ్యమె నీ మనస్స్థితమునై వర్ధిల్లు నౌదార్యమున్
కలికాలంబున నీవుగాక మరి యొక్కండైన నీరీతిగా
దలపన్ జాలునె లోకమంతటికి సద్భాగ్యంబు చేకూర్చగా
నలఘుస్వాదుఫలప్రదాత! నతు లే నందింతు నోవృక్షమా                     3.
మ.
నిను ఖండించును మానవుండు ఖలుడై నిత్యంబు స్వార్థంబుతో
నసంతాపము కల్గజేయు నయినన్ గారుణ్యబావంబుతో
మనుజాళిన్ భవదీయసంతతినిగా మన్నించి యవ్వానికిన్
మనగా నీడను గూర్చుచుందు వదె సన్మానంబుగా భూజమా!                       4.
మ.
రసవంతంబగు సత్ఫలంబు లిచటన్ బ్రహ్లాదముం గూర్చుచున్
వసుధన్ బంచగ దాల్చియుండి యురుసద్భావంబు నీవందినన్
గసితో మానవకోటి నీపయి శిలాఖండంబులన్ రువ్వినన్
పసివారంచు క్షమించుచుందువు కృపాపారీణ వోవృక్షమా!                   5.
మ.
క్షితికిన్ నీవు విభూషణంబ వగుచున్ క్షేమాకృతిన్ దాల్చి నీ
చతురత్వంబును జూపి జన్మదకు సంస్కారాఢ్యవై యన్నిటన్
నుతులందంగల శక్తి గూర్చుచు మహన్నూత్నప్రకాశంబులం
దతులానందము నింపు ధన్యవు భళా! హర్షంబు హే భూజమా!             6.
మ.
అరియై నిన్ను నశింపజేయుటకునై యత్నింప నేతెంచు న
ప్పరశున్ జూచి యభీష్టసిద్ధికొరకై భవ్యోపశాఖంబు స
త్వరమున్ దండముగాగ నిత్తు వెదిరిన్  బాపాత్ము బ్రేమించుటం
దొరు లెవ్వారలు నీకు సాటి? నతులో యుర్వీజమా! వృక్షమా!             7.
.
అసువుల్ దేహము వీడిపోయినను నీ వత్యంత సద్భావనా
భ్యసనంబున్ ద్యజియించకుండ నిను సర్వక్షేమ సంధాయినిన్
గసితో గూల్చినవాడు కూలిన తరిన్ గాల్చంగ నందుండి యా
దెస దోసంబుల నెంచబోవు భళి నీ దివ్యత్వ మో భూజమా!                  8.
మ.
కలుషంబుల్ హరియించి జంతుతతికిన్ గానైన స్వాస్థ్యంబులన్
నిలుపన్ జాలిన ప్రాణదాతవు గదా! నిన్నెంచగా శక్యమే?
పలుకుల్ నాకు లభించునే? విమలసద్భావంబుతో నీకు నీ
యిలపై రక్షణ గూర్తు, కావుము సదా యిందుండి హే వృక్షమా!              9.

Sunday, 11 August 2019

సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్న భారతీయ సైనికుడి మనోగతం.

సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్న భారతీయ సైనికుడి మనోగతం.


శా.
శ్రీమంతం బిది సర్వమానవుల సచ్ఛ్రేయంబులన్ గోరుచున్
ప్రేమం బన్నివిధాల బంచుచు మహద్విజ్ఞానసంపత్తికిన్
ధామంబై వెలుగొందు భూమి యిది వేదస్థాన మిద్దానికిన్
నీమం బొప్పగ రక్షగూర్చుట గనన్ నిక్కంపు సన్మానమౌ.                   1.
శా.
నాదేశం బిది నాకుజన్మ మిచటన్ నాపూర్వకర్మంబునం
దేదో పుణ్యఫలప్రభావవిభవం బిందుండి సిద్ధించె స
మ్మోదానంతద దీని రక్షణ యగున్ ముఖ్యంబు సత్యంబుగా
నాదేహంబును బ్రాణ మిందుకొరకే నాకిందు హర్షం బగున్.                  2.
శా.
ముల్లోకంబులు గెల్వగల్గు బలిమిన్ మున్నున్న నావారు నా
డుల్లాసంబును జూపి దేవగణమం దుత్సాహమున్ నింపి సం
ధిల్లం జేసిరి వారికిన్ విజయముల్ తేజంబునన్ నేను వా
రెల్లన్ నిల్పిన వారసుండనయి నే డిందుంటి రక్షార్థమై.                          3.
శా.
సీమల్ దాటి మదీయదేశమునకున్ జేరన్ బ్రయత్నించి యీ
భూమిన్ నిచ్చలు ఘోరకష్టపటలుల్ పోటెత్తగా జేయుటం
దేమాత్రంబును గొంకనట్టి ఖలులన్ హీనాత్ములం ద్రుంచున
ప్డేమైనన్ వెనుకాడబోవనిది నాకెంతేని మోదం బిడున్.                          4.
శా.
చెండాడంగను జంకబోవ నరులన్ జేకొట్టి నాభూమికిన్
ఖండింతున్ ఖలకోటిశీర్షము లిటన్ గావింతు నీనేలకున్
దండంబుల్ శతకోటి దీక్షితుడనై ధైర్యంబునుం బూని నే
నుండన్ దుష్టులు చేరగల్గుదురె నాయుర్విన్ బ్రయత్నించినన్.             5.
శా.
నాకాయంబున బ్రాణముండ నెవడున్ నానేలనుం ద్రుంచువా
డేకాలంబున బుట్టబో డవనిపై యెందేని జన్మించి, నే
గాకల్దీరినవాడనం చిచటకున్ గాంక్షించి యేతెంచెనే
నాకాలంబున నేగు నిక్కువముగా నా కాలునిన్ జూడగన్.                     6.
శా.
నాభాగ్యంబున నాకు నబ్బెనుగదా నాదేశరక్షావిధుల్
శోభల్ గూర్చెడి వౌట యిందులకునై శుద్ధాంతరంగంబుతో
నీ భూమిన్ చరియించుచున్ సతతమే నెంతేని నిష్ఠాయుతిన్
భీభత్సంబు సృజించువారి నణతున్ వీరత్వముం జాటుచున్.              7.
శా.
దారాపుత్రులు బంధువర్గము లికన్ ధాన్యాది సంపత్తులన్
జేరం జూచుట కాదు జన్మభువిపై చింతల్ ప్రతిష్ఠించు న
వ్వారిన్ శాత్రవవర్గమున్ దునుము సద్భావంబునం దేలుచున్
పోరున్ సల్పుచు బ్రాణమైన విడుతున్ బూర్ణానురాగంబునన్.               8.

హ.వేం.స.నా.మూర్తి.
11.08.2019.