నిజమైన దేశభక్తి
మ.
నిజమైనట్టి స్వదేశభక్తి
యనినన్ నిక్కంబుగా నెల్లెడన్
బ్రజకుం గాగల సౌఖ్యవర్ధనమునన్
భవ్యానురాగమ్ముతో
డజరించంగల దివ్యభావముల
కేడన్ విఘ్నముల్ రాని ధీ
రజయత్నం బగుగాదె
దేశమన నర్థంబెంచ బౌరాళియే. 1.
మ.
అనుమానం బొకయింత
జూపక సతం బత్యంతమౌ ప్రేమతో
ఘనదారిద్ర్యమునన్ మునుంగు జనసంఘంబందు
భ్రాతృత్వ మన్
ధనముం బంచుచు వారి
కష్టతతులన్ దానై విదారించు భా
వనమున్ దాల్చుట
దేశభక్తి యనుటన్ వాదేల సత్యం బగున్. 2.
మ.
మమతన్ జూపుచు మానవత్వగరిమన్
మాన్యత్వమున్ నిల్పి నా
సములే యంద రటన్న
భావము మదిన్ సంధించి సమ్యగ్గతిన్
సమతన్ జాటుచు సంచరించుచు
సదా సంతోషముల్ పొందుటే
భ్రమలం గూల్చెడి
దేశభక్తి యని యెవ్వారైన నెంచం దగున్. 3.
మ.
అవినీతుల్ ఘనతాపకారకములై హానిన్ బ్రకల్పించు న
వ్వివిధాంధానుభవంబులున్
బ్రబలవిద్వేషంబు లీనేలపై
జవసత్వంబులు చూపకుండ
సుమహచ్చాతుర్యముం జూపి యీ
యవనిన్ గాచుట దేశభక్తి
యగుగా కన్యంబు గాదేవిధిన్. ౪.
మ.
అమితోత్సాహముతోడ
ధర్మమున కార్యావర్తమం దంతటన్
దమశక్తిం బ్రకటించుచుండి
యురుసంతాపంబునుం గూర్చు దౌ
ష్ట్యము జూపించెడి
దుర్మదాంధుల బృహద్యత్నంబులం గూల్చు కా
ర్యము నందుండుట
దేశభక్తియన సత్యంబౌను సర్వంబునన్. ౫.
మ.
అతులం బైన మహాగ్రహం
బిపుడు నా యాత్మన్ బ్రవేశించె నీ
క్షితిపై నన్నియు
ద్రుంచువాడ ననుచున్ జేనంది శస్త్రంబులన్
మతిహీనుండయి సంఘసంపదల
నున్మాదంబునన్ గూల్చు దు
ష్కృతులన్ వీడుట
దేశభక్తి యనుచున్ గీర్తింపగా నొప్పగున్. ౬.
మ.
భువిపై “స్వచ్ఛత” నిల్పువాడ ననుచున్ బూర్ణానురాగంబుతో
స్తవనీయంబగురీతి
శుభ్రతకునై సర్వత్ర సద్భావనో
త్సవముల్ జేయగలట్టి
శక్తిగొని తత్కార్యమ్మునన్ గూర్చు మా
నవకల్యాణము దేశభక్తి
యనుచున్ నమ్మందగున్ సమ్మతిన్. ౭.
మ.
సువిశాలంబగు భారతావనిపయిన్
శోభిల్లు సద్భావనో
ద్భవవిశ్వైకకుటుంబభావపటలీపారీణతాగంధమున్
వివిధత్వంబున నొప్పు నైక్యతను సద్విజ్ఞాన సంపత్తులన్
స్తవనీయంబుగ గావబూనుటయె
దేశంబందు సద్భక్తియౌ. 8.
హ.వేం.స.నా.మూర్తి.
ది.18.08.2019.
No comments:
Post a Comment