Friday, 27 September 2013

శ్రీ ఆంజనేయ



పానకాలస్వామి


స్వామీ! నరసింహా! విను
నీమంబున పానకంబు నీకర్పించన్
క్షేమంబు కలుగజేయుచు
నీమానవకోటి గాతు వెప్పుడు కరుణన్.


బిందెల కొలదిగ పానక
మందించెడి భక్తగణపుటఘములబాపన్
సుందరరూపం బందితి
వందును మము గావుమయ్య! యతివత్సలతన్.


మంగళగిరిపై చిత్రపు
భంగిమతో వెలసినావు పానకములు గొనన్
మంగళము లొసగు మింపల
రంగ న్నరసింహరూప! రయమున మాకున్.


పానకమెంత యొసంగిన
దానన్ సగభాగమీవు తాదాత్మ్యతతో
పానము చేయుచునుండెద
వానందము జగతివారి కందించుటకై.


నీవుండగ మాకండగ
భావనలోనైన రాదు భయమించుకయున్
దేవా! శ్రీనరసింహా!
మావందన మందుకొనుచు మము గావదగున్.


Thursday, 26 September 2013

పోస్టుకార్డు

పోస్టు కార్డు
దూరదేశ మనక ధారుణీతలమంత
వరుస తప్పకుండ తిరుగుచుండి
నిరత మఖిలజగతి కరుస మందించెడి
పుణ్యశీల భువిని పోస్టుకార్డు. 1.


కారణాంతరాల దూరస్థులై యున్న
బంధుజనుల జేరి బహువిధాల
పలుకరించుచుండు నిలవారి చుట్టంబు
పుణ్యశీల భువిని పోస్టుకార్డు. 2.


కులము మతము లెంచ దిలనుండు వారంద
రన్నదమ్ములంచు నందరికడ
చేరుచుండు కూర్చు శ్రేయంబు లెల్లెడ
పుణ్యశీల భువిని పోస్టుకార్డు. 3.


తోకలేని పిట్ట తోయదమండలం
బాకసంబు దాటి యద్భుతముగ
పరహితంబు గోరి యరుగు నెందైనను
పుణ్యశీల భువిని పోస్టుకార్డు. 4.


పిన్న పెద్ద యనెడు భేదమించుకయైన
చూపకుండ జనుల సుఖము గోరి
సమత జూపుచుండి సత్వమందించెడు
పుణ్యశీల భువిని పోస్టుకార్డు. 5.


మోద మందజేయు పేదవారలకైన
వ్యయము స్వల్ప మగుట, జయద మగుట
స్వార్థ మింత లేక సాయ మందించెడు
పుణ్యశీల భువిని పోస్టుకార్డు. 6.


ఎర్రపెట్టెలోన నింపుగా కూర్చుండి
ఖాకిగోతమందు కట్టుబడుచు
చేరు తప్పకుండ చిరునామ వద్దకు
పుణ్యశీల భువిని పోస్టుకార్డు. 7.


ఇంధనంబు పూన దిసుమంతయైనను
దారి ఖర్చుకొరకు ధనము కోర
దెగిరి పోవుచుండు నేప్రాంతమునకైన
పుణ్యశీల భువిని పోస్టుకార్డు. 8.


ఆప్తయగుచు సతత మన్నివర్గాలకు
వలయు సంగతులను తెలియబరచు,
సమయమంత గడుపు సాంఘిక సేవలో
పుణ్యశీల భువిని పోస్టుకార్డు. 9.


వర్తమానమందు వరుసలు గట్టిన
సాధనాలవలన సన్నగిల్లె
వైభవంబు తనకు, వాస్తవం బేమన్న
పుణ్యశీల భువిని పోస్టుకార్డు. 10.

Monday, 29 July 2013

జయాపజయములు

జయాపజయములు



జయము కలిగెనేని సంతోషమందుచు
నపజయంబు గలుగ నతులదు:ఖ
మనుభవించు జనుడు హర్షావమానాల
కతడు కారకుండె? యవని లోన.


విజ్ఞులార! నిజము విజయాపజయములు

పూర్వ నిశ్చితంబు లుర్విలోన
మర్మమెరుగ దగును కర్మానుసారంబు
లఖిలఫలచయంబు లందరకును. 


కర్మలందు హక్కు కలదు మానవులకు

ఫలములందు లేదు, భాగ్యవశము
ఫలమటంచు దలచి పనులు చేయుటయందె
బుద్ధి నిలుపవలయు పుడమి జనుడు. 


జయము నందినాడ భయమేల నాకంచు

విర్రవీగకుండ, విజయమందు,
నపజయంబునందు నతిశాంతచిత్తుడై
మసలుచుండ వలయు మానవునకు. 


జయము కలుగ దనుచు చలియించకుండంగ

స్థిరత జూపుచుండి వరుసనంత
విజయసిద్ధియందు వినయాత్మకుండౌచు
మెలగుచుండువాడు మేటి భువిని. 


అపజయంబులోన నంతర్గతంబుగా

జయము కలదు నిజము భయమదేల?
అపజయంబు, జయము లారెండు సహజంబు
లనుచు తెలియదగును మనుజునకును.
 

జయము గాంతు మనెడు సంకల్పబలముతో

స్థిరతబూని లక్ష్య మరయు వరకు
పట్టువిడువకుండ గట్టిగా యత్నంబు
సలుప పొందవచ్చు జయము నిజము. 


అపజయంబు మనిషి కతిసౌఖ్యదంబైన

జయము నందు కొరకు సాధనంబె
కనుక దాని జూచి మనమున చింతించ
వలదు ముందు కేగవలయు గాని.