Tuesday, 31 December 2024

హ్యా పీ న్యూ ఇ య రం డీ

 అందరికి 


 *"హ్యా పీ న్యూ ఇ య రం డీ"*


కం.

" *హ్యా* పీన్యూయియ" రందరి

కీపృథ్విని మీకు నమర నెల్లసుఖంబుల్ 

దీపిల్లుడు శుభములు గని 

యాపరమేశ్వరునికరుణ నంది జయంబుల్.


ఆ.వె.

*పీ* డలన్ని తొలగి   విస్తృతంబగురీతి 

సుఖము లమరు గాత శుభము గూడి 

నూత్నవత్సరాన యత్నసిద్ధియు గల్గి 

హర్ష మందుగాత యన్నిగతుల.


కం.

*న్యూ* నత్వము దరిచేరని మానితసద్భావదీప్తి మనుజులలోనన్ 

జ్ఞానాధారిత మౌచును 

తానయి నివసించుగాత ధర నీవేళన్.


ఆ.వె.

*ఇ* లకువైభవంబు లెల్లరీతుల బెంచు 

భావజాలమంది పాలకులకు 

ప్రజలజీవనంబు భవ్యమై యీనూత్న

హాయనమ్ములోన నలరుగాత.


కం.

*య* శములు నిండగవలయును 

దశదిశలను గ్రమ్మునట్లు ధరనీ ప్రజకున్ 

నశియించి  యఘములన్నియు 

భృశమీ వత్సరమునందు విస్తృతఫణితిన్.


కం.

*రం* గారుసస్యసంపద 

సంగతముగ చేరుగాత సర్వంసహకున్ 

బంగారమౌచు పట్టిన 

దంగీకృత సౌఖ్య మిచట నందునుగాతన్.


కం.

*డీ* కొట్టి శక్తి చాటెడి 

ప్రాకటవిజ్ఞానభూతి భారతమందున్ 

చేకురి యీవత్సరమున

మీకమరును గాత ముదము మేలగురీతిన్.


2025 నూతనాంగ్లసంవత్సరారంభశుభవేళ 

అందరికీ

హృదయపూర్వకశుభాకాంక్షలు.

🙏🙏

హ.వేం.స.నా.మూర్తి.

No comments:

Post a Comment