పుడమితల్లి
*తరలము*
పుడమి తల్లికి వందనం బిడి పూజ్యభావము జూపుటల్
బడులలోనను విద్యలందున బావనత్వము దెల్పుటల్
జడత వీడుచు నుత్సహించుచు సాధు మానసదీప్తితో
మడమ ద్రిప్పక రక్షసేయుట మానవత్వము తానగున్. 1.
*తరలము*
మనుజకోటికి జీవరాశికి మంగళంబులు గూర్చుచున్
ఘనతరంబగు సౌఖ్యసంపద కాంక్షితార్థము లిచ్చుచున్
మనుట కన్నివిధాల సాయము మానకుండగ చేయు నీ
యనఘ కంజలి చేయగావలె నమ్మయౌ ధర కాత్మలోన్. 2.
*తరలము*
భవ మొసంగును స్వీయదేహపు పావనస్థలమందునన్
జవము దెల్పును సంతతంబును సత్వయుక్తికి కోరకే
యవిరళంబగు వస్తుసంతతి నందజేయుచు నుండు నీ
యవని యందరి మాత గావున నంజలించుట యుక్తమౌ. 3.
*తరలము*
అనుపమాఘము చేయుచుండిన నన్నిరీతుల దౌష్ట్యమున్
తనకు కర్మముగా దలంచుచు దాను జూపుచు నుండినన్
మనుజకోటిని రక్ష చేయుట మానకుండును ధాత్రి,యీ
జనని నాయతవత్సలాఢ్యను సన్నుతించుట ధర్మమౌ. 4.
*తరలము*
పుడమితల్లిని గాచుటౌ విధి పూర్ణధర్మము తానగున్
వెడలిపొమ్మనకుండు నెంతటి ద్వేషభావముజూపినన్
విడిది గూర్చుచు నాదరించును విజ్ఞతాగరిమంబుతో
నడుగబోవదు తన్ను జీల్చిన నాదరించును తల్లియై. 5.
హ.వేం.స.నా.మూర్తి.
No comments:
Post a Comment