🙏🏻🙏🏻
ఓం నమశ్శివాయ
శా.
శ్రీకంఠా! మునిసేవితా! సురవరా! చిత్సౌఖ్యదా! శంకరా!
లోకేశా! పరమేశ్వరా! స్మరహరా! రుద్రా! యుమానాయకా!
నీకై మ్రొక్కెద, నిత్య మచ్ఛజలమున్ నీశీర్షమం దుంచుచున్
సాకన్ వేడెద భక్తకోటిని కృపాసారమ్ముతో నెల్లెడన్. 1.
శా.
కార్తీకమ్మిది కామితార్థఫలదా! కల్యాణసద్భావనా
స్ఫూర్తిన్ నామదిలోన నింపి నిగమస్తోత్రా! నినున్ గొల్చుచున్
ధూర్తశ్రేణిని జేరకుండు గతి నస్తోకంబుగా గూర్చి స
త్కీర్తిన్ గాంచెడి భావమున్ నిలుపుమా క్షేమంకరా! శంకరా! 2.
శా.
సర్వారాధ్యుడ వీవు లోకములలో శర్వా! దయాసాగరా!
ఉర్వీక్షేత్ర మధర్మకార్యములతో నున్మాదకృత్యాలతో
గర్వాంధోరుదురాగతస్థితులతో కైవల్యదా! నిండె నీ
దుర్వాంఛాగములన్ హరించి బుధసందోహంబులన్ గావుమా. 3.
శా.
రుద్రాధ్యాయజపంబు చేయు బలిమిన్ లోకేశ్వరా! చూపుమా
భద్రాకార! త్వదీయసేవకునకై భక్తాళిసంరక్షకా!
నిద్రన్ మున్గిన జ్ఞానశూన్యుని ననున్ నీవే కృపాదీప్తితో
రుద్రా! చూడు మటంచు మ్రొక్కెదను చిద్రూపా! మహద్వైభవా! 4.
మ.
కరిచర్మాంబర! నన్ను గావు మనుచున్ గాంక్షించుటల్ శంకరా!
వరదాతా! మతిహీనుచర్యలు మహాస్వార్థైకభావంబు లా
కరణిన్ మాని భజించుచుంటిని నినున్ గైవల్యదంబైన త్వ
చ్చరణద్వంద్వము బట్టు భాగ్య మిడి నీసాయుజ్యమున్ గూర్చుమా. 5.
మ.
మనుజశ్రేష్ఠభవం బొసంగితివి సన్మానంబు చేకూర్చుచున్
నను నీవానిగ స్వీకరించితివి యున్మాదస్థితిన్ గూల్చుచున్
నిను సేవించెడి భాగ్య మిచ్చితివి సన్మిత్రాళిసంగంబుతో
ననునిత్యంబును శంకరా! ఇవియె నాహర్షోన్నతీహేతువుల్. 6.
మ.
జటలందించితి వా సురాపగకు వాసం బందు జూపించుచున్
నిటలాక్షా! గిరిజాసమర్పణ ముగా నీదేహమం దర్థమున్
పటుచెల్మిన్ గొనజేసినాడవుగదా! భాగ్యప్రదా! నేను సం
కటనాశం బొనరించు నీకృప నిటన్ గాంక్షింతు నాకీయవే. 7.
శా.
బోళాశంకరు డీసురేశు డనుచున్ బూర్ణైకసద్భక్తితో
గాళీనాయక! కొల్చువారల మహత్కాంక్షాసమూహమ్ము లే
వేళన్ దీర్చెడి వానిగా జగములో విఖ్యాతి నీకందె వాం
ఛాళిన్ దెల్పను త్వత్కృపావిభవమే చాలంచు హర్షించెదన్. 8.
మ.
సురముఖ్యుల్ వినుతించ సర్వజగముల్ శోభిల్ల శీఘ్రమ్ముగా
గరళమ్మున్ గొనినావు భక్తజనసంఘశ్రేణులన్ బ్రోచుటే
నిరతానందదకృత్యమంచు మదిలో నీవెంచుటల్ శంకరా!
యరయం జాలము దేవతాన్యములలో నర్పింతు నీకు న్నతుల్. 9.
పరమానందము నీకథాశ్రవణమే భాగ్యాబ్ధి నీనామమే
నిరతౌన్నత్యదమై ఫలించును గదా నీదర్శనం బీభువిన్
స్థిరసత్కీర్తికి హేతువై వెలుగు నిన్ సేవించుటల్ గావునన్
హర! గౌరీవర! శంకరా! భవహరా! యందింతు గైమోడ్పులన్. 10.
🙏🏻🙏🏻
హ.వేం.స.నా.మూర్తి.
22.11.2023.
No comments:
Post a Comment