"స్వాగతించుచుంటి
ప్లవను భువికి"
(ఆటవెలదులలో)
శ్రీలు పంచు చుండి చిద్విలాసస్థితిన్
మనుజు లందు నిల్పి యనవరతము
క్షేమమందజేసి కీర్తుల నందంగ
స్వాగతించుచుంటి "ప్లవను" భువికి. 1.
అయనములును రెండు నారుకాలంబులు
పదియు రెండు నెలలు ముదముగూర్చ
సదమలత్వమంది సాగుమా నీవంచు
స్వాగతించుచుంటి "ప్లవను" భువికి. 2.
చీడపురుగు వోలె చేరి యీ జగతిని
మ్రింగివేయుచుండి మిక్కిలిగను
హాని గూర్చు నీకరోనను గూల్చంగ
స్వాగతించుచుంటి "ప్లవను" భువికి. 3.
భూతలంబులోని నేతల మదులలో
సాధుభావ సహిత సత్వదీప్తి
కలుగజేయు కొరకు ఘనతరాదరముతో
స్వాగతించుచుంటి "ప్లవను" భువికి. 4.
పెరుగుచున్న ధరల నరికట్టి దీనుల
బ్రతుకులందు వెల్గు పంచి ముదము
గూర్చి జగతి గావ కూర్మితోనీవేళ
స్వాగతించుచుంటి "ప్లవను" భువికి. 5.
కులమతాలభేద మిలలోన పోవుట
సాధ్యమనుట కల్ల సర్వ జనుల
స్వాంతమందు నిలుప సమరసభావమ్ము
స్వాగతించుచుంటి "ప్లవను" భువికి. 6.
కష్టమందు మునిగి కనలుచునున్నట్టి
దీనజనుల కొరకు నైన సాయ
మందజేయు భావ మందించ జనులకు
స్వాగతించుచుంటి "ప్లవను" భువికి. 7.
నమ్మి చేరువారి నమ్మకమ్ములనన్ని
వమ్ముచేసి మోసపరచునట్టి
జనుల స్వాంతశుద్ధి సలుపంగ రమ్మంచు
స్వాగతించుచుంటి "ప్లవను" భువికి. 8.
స్వార్థమందకునికి సాధ్యమా జనులకు
నెదుటివారిపైన నింపుమీర
ప్రేమభావ మందు విధమును నేర్పించ
స్వాగతించుచుంటి "ప్లవను" భువికి. 9.
నన్నుబోలువారె నాసము లందరు
బాధపెట్టదగదు వారి ననెడి
మంచి భావమిలను మనుజులలో నింప
స్వాగతించుచుంటి "ప్లవను" భువికి.
10.
నేను సుఖములంది నిత్యమీ భువిలోన
విభవ పంక్తి గాంచు విధిని జనులు
బ్రతుకవలయు ననెడి భావంబు కలిగించ
స్వాగతించుచుంటి "ప్లవను" భువికి. 11.
వసుధయందజేయు ఫలదీప్తి కిచ్చటి
వారలందరెంచ వారసులను
భవ్యమై వెలుంగు భావంబు కలిగించ
స్వాగతించుచుంటి "ప్లవను" భువికి. 12.
సాటివారు తనను సమ్యగాదరముతో
చూచుచుండునట్టి శుద్ధమతిని
పొందగలుగు శక్తి నందించ జనులకు
స్వాగతించుచుంటి "ప్లవను" భువికి. 13.
క్రమము తప్పకుండ తమలోని దొసగుల
నెరుగ గలుగు శక్తి నరులలోన
కలుగజేసి బహుళ కల్యాణముల్ బంచ
స్వాగతించుచుంటి "ప్లవను" భువికి. 14.
మాతృభాషపైన మమకారమును నిల్పి
మసలగలుగునట్టి మహిత శక్తి
మనుజులందు గూర్చ ఘనతరంబగురీతి
స్వాగతించుచుంటి "ప్లవను" భువికి. 15.
సాటివారి మాట సంయమనంబుతో
వినెడి శక్తి సకల జనులలోన
నిలుపబూను కార్య మలయక చేయంగ
స్వాగతించుచుంటి "ప్లవను" భువికి. 16.
దేశభక్తి గలిగి దివ్యమౌభావంబు
లెదలలోన జేర్చి యిలకు మేలు
కలుగజేయు బుద్ధి కలిగించ జనులలో
స్వాగతించుచుంటి "ప్లవను" భువికి. 17.
పుడమిపైన తాను పుట్టుటలోనున్న
యంతరార్థ మెరిగి సంతతమ్ము
సాగ నరున కిందు సామర్ధ్యమందించ
స్వాగతించుచుంటి "ప్లవను" భువికి. 18.
సర్వగతుల జనులు సామాజికములైన
యాస్తులందు నిలిపి యమల దీక్ష
రక్ష చేయగలుగు దక్షత చేకూర్చ
స్వాగతించుచుంటి "ప్లవను" భువికి. 19.
తనగృహంబు వీధి తనయూరు దేశముల్
స్వాస్థ్యమందజేయు స్థలము లగుచు
నిలుపగలుగు శక్తి యిలవారి కందించ
స్వాగతించుచుంటి "ప్లవను" భువికి. 20.
పచ్చదనములోన బ్రహ్లాదసౌఖ్యంబు
కలదు గాన వృక్ష కులము నిందు
బెంచు వాంఛ జనున కంచితంబుగ గూర్చ
స్వాగతించుచుంటి "ప్లవను" భువికి. 21.
జ్ఞానధనము గలుగు మానవాళిని జేరి
యహము వీడి బుద్ధి నహరహమ్ము
వృద్ధి చేసుకొనెడి విధమును నేర్పంగ
స్వాగతించుచుంటి "ప్లవను" భువికి. 22.
ధార్మికంబులైన కర్మలీ జగతిలో
సంతతమ్ము దలచి జరుపునట్టి
యోగ్యతలను జనుల కొప్పార నందించ
స్వాగతించుచుంటి "ప్లవను" భువికి. 23.
పెద్దలందుభక్తి పిన్నలందనురక్తి
సాటివారిపైన మేటి ప్రేమ
చూపగలుగు శక్తి దీపిల్లగా జేయ
స్వాగతించుచుంటి "ప్లవను" భువికి. 24.
భారతీయ భవ్య పర్వంబులందున
జేరి యుండినట్టి శ్రేష్ఠతలను
తెలియగలుగు బుద్ధి యిలవారికిని జూప
స్వాగతించుచుంటి "ప్లవను" భువికి. 25.
చెప్పుచుండి మృషలు చీటికి మాటికి
తోటివారి సుఖము తొలగద్రోచు
భావములను గూల్చి ప్రజలను గావంగ
స్వాగతించుచుంటి "ప్లవను" భువికి. 26.
ఆధునికతయంచు నడ్డగోలుగ వస్త్ర
ధారణమ్ము చేయు వారిలోన
సద్వివేకబలము సమకూర్చ నీవేళ
స్వాగతించుచుంటి "ప్లవను" భువికి.
27.
స్వేచ్ఛ దొరికె నిచట నిచ్ఛానుసారంబు
సంచరింతు నంచు జనుడు హద్దు
దాటకుండునట్టి తాలిమి నందించ
స్వాగతించుచుంటి "ప్లవను" భువికి.
28.
నదులలోన గోరి నానారకంబులౌ
కల్మషములు కలుపు కరణి వీడు
నట్టి తలపు జనుల కందజేయుమటంచు
స్వాగతించుచుంటి "ప్లవను" భువికి.
29.
తినుటకొరకు గోరి యనిశంబు ప్రాణులన్
జంపునట్టి వాంఛ స్వాంతమందు
జనుడు చేర్చకుండు సత్వంబు సమకూర్చ
స్వాగతించుచుంటి "ప్లవను" భువికి.
30.
వినయమనయమంది విస్తృతాదరముతో
సకలజనులతోడ నకలుషమతి
యగుచు బలుకు శక్తి నందించ జనునకు
స్వాగతించుచుంటి "ప్లవను" భువికి.
31.
ఈ కరోన మరల యెంతేని వేగాన
విస్తరించుచుండె విధము దెలిపి
దాని కందకుండ మానవు గాపాడ
స్వాగతించుచుంటి "ప్లవను" భువికి.
32.
పరుల నింద చేసి నిరతసౌఖ్యంబందు
భావమందు మునుగు వారలకును
స్వాంతశుద్ధిచేసి సత్పథంబును జూప
స్వాగతించుచుంటి "ప్లవను" భువికి.
33.
అనిశ మెల్ల గతుల నాడంబరాలకు
పోక మానవుండు లోకమందు
నాత్మ శక్తి నెరుగ నైన పద్ధతి నేర్ప
స్వాగతించుచుంటి "ప్లవను" భువికి.
34.
నరుడు బాంధవులను బరివారజనులను
మిత్రకోటి నఖిల ధాత్రిలోని
వారి నాదరించు బలిమిని గూర్చంగ
స్వాగతించుచుంటి "ప్లవను" భువికి.
35.
పిన్న పెద్ద యనెడిభేదభావము జూప
కుండ మమత జూపు చుండ గలుగు
భాగ్య మిలను నేటి పౌరుల కందించ
స్వాగతించుచుంటి "ప్లవను" భువికి.
36.
ప్రకృతిలోన నున్న పావనత్వంబును
పాడుచేసి నరుడు కీడు గాంచ
కుండునట్టి భావ ముదయింపజేయంగ
స్వాగతించుచుంటి "ప్లవను"భువికి. 37.
మద్యపానులౌచు మర్యాదలను వీడి
మనుజు లాపదలను మునుగకుండు
జ్ఞానమందజేసి యానందమును జూప
స్వాగతించుచుంటి "ప్లవను"భువికి. 38.
అహరహమ్ము జనుడు సహవాసదోషాన
గతులు దప్పి తిరుగు మతిని మార్చి
సవ్యమార్గమందు సంచరింపగ జూడ
స్వాగతించుచుంటి "ప్లవను"భువికి. 39.
వాదులాటలేల సోదరత్వముతోడ
మెలగుచున్న మీకు గలుగు సుఖము
లనుచు దెలుప జనుల కాదరంబున నేడు
స్వాగతించుచుంటి "ప్లవను"భువికి. 40.
నేను సైనికుండ నీనేల కేరీతి
హాని కలుగ నీయ ననెడి భావ
మందజేయ నరున కాదరంబున నిందు
స్వాగతించుచుంటి "ప్లవను"భువికి. 41.
ధర్మమాచరించు ధరలోన మానవా!
లేని యెడల దుఃఖ మౌనటంచు
బలికి భ్రాంతులన్ని తొలగజేయుట కిప్డు
స్వాగతించుచుంటి "ప్లవను"భువికి. 42.
సకల సృష్టిలోన సర్వేశ్వరుని గాంచి
సంచరించ గలుగు సత్వదీప్తి
కలుగజేయ జనుల కిలకు హర్షము తోడ
స్వాగతించుచుంటి "ప్లవను"భువికి. 43.
మంచిమాటలాడ మాన్యముల్ తరుగవు
మిత్రకోటి చేరు మేలు కలుగు
సంశయింప కనుచు జనునకు తెలుపంగ
స్వాగతించుచుంటి "ప్లవను"భువికి. 44.
పంచదారకన్న, మంచి తేనియకన్న,
చెరకురసముకన్న సురుచిరమ్ము
మాతృభాష కనుక మరువకుడని తెల్ప
స్వాగతించుచుంటి "ప్లవను"భువికి. 45.
మాతృభాషలోన మాటలాడుట మాను
టదియె గొప్ప యనుచు నహరహమ్ము
సంచరించ గలుగు సర్వ కష్టము లనన్
స్వాగతించుచుంటి "ప్లవను"భువికి. 46.
కష్టపడుటలోన కలదు సౌఖ్యము గాన
నిష్టపడుచు చేయు డిలను కర్మ
లనుచు తెలుప వలయు ననుచు నీవేళను
స్వాగతించుచుంటి "ప్లవను"భువికి. 47.
స్వీయధర్మమెపుడు
క్షేమంకరంబౌచు
మహిని వెలగ నన్య మతముల కయి
యరుగువారి కాంక్ష లణచంగ బ్రార్థించి
స్వాగతించుచుంటి "ప్లవను"భువికి. 48.
బహుళపద్ధతులను పైపైని మెరుగులన్
జూపుచుండి మతము పాప మనక
మార్చువారి బుద్ధి మరలించ గోరుచు
స్వాగతించుచుంటి "ప్లవను"భువికి. 49.
నీటిబుడగ బ్రతుకు నిరత మసూయతో
సంచరించ నేల? స్వాంత మందు
మమత దాల్చి నరుడ! మసలుమాయని తెల్ప
స్వాగతించుచుంటి "ప్లవను" భువికి. 50.
పుట్టువేళ లేదు పోవునాడును రాదు
ధనము, దాని మదము దాల్చనేల?
నరుడ! సత్యమెరిగి నడువుమా యని తెల్ప
స్వాగతించుచుంటి "ప్లవను" భువికి. 51.
నేనె ఘనుడనంచు నిరుపమాహంకృతిన్
బొంది యుండనేల? పుడమి నీదు
సృష్టి కాదటంచు చెప్పగా నరునకు
స్వాగతించుచుంటి "ప్లవను" భువికి. 52.
మంచిపనులలోన మనసు నిల్పకయున్న
చేయువారినైన చెరుపకుండ
మసలుచుండి నరుడ! మాన్యత గనుమనన్
స్వాగతించుచుంటి "ప్లవను" భువికి. 53.
జగములందు సుఖము లగణితంబుగ బంచు
రైతు కష్టమందు బ్రతుకుచుండె
సాయపడుట జనుడ! సద్విధి యని దెల్ప
స్వాగతించుచుంటి "ప్లవను" భువికి. 54.
దేహమందు శక్తి దీపిల్లునందాక
కర మహంకరించి, కరుగ
బాధ
పడుట యేల యనుచు బాధ్యతలను దెల్ప
స్వాగతించుచుంటి "ప్లవను" భువికి. 55.
నీతి దప్పి యెపుడు జాత్యవమానమ్ము
కలుగజేయు కర్మ లలఘుగతిని
జేయవలదు జనున కేయెడ యని పల్క
స్వాగతించుచుంటి "ప్లవను" భువికి. 56.
వేదశాస్త్రచయము వివరించియున్నట్టి
విషయ మెరిగి మనుట విజ్ఞత యగు
మరువబోకు మోయి మానవా! యని తెల్ప
స్వాగతించుచుంటి "ప్లవను" భువికి. 57.
వృత్తివిద్యలందు చిత్తంబులను జేర్చి
యార్థికంబులైన హర్షములను
బొందగలుగు శక్తి యిందు జూపించంగ
స్వాగతించుచుంటి "ప్లవను"భువికి. 58.
గురులపట్ల భక్తి తరిగిపోవుచునుండె
వారిలోన నట్లె పావనతయు
నరసి సవ్యభావ మందించ గోరుచు
స్వాగతించుచుంటి "ప్లవను"భువికి. 59.
నాది నేనటన్న వాదులాటలలోన
శాంతి జగతిలోన క్షయము నందె
దాని నుద్ధరించి తథ్యంబునుం జూప
స్వాగతించుచుంటి "ప్లవను"భువికి. 60.
పలుకులోన గలదు బహువిధసౌఖ్యంబు
తలపులోన నట్లె యలఘు సుఖము
తెలిసి నడువు మనుచు దెలుపంగ నరునకు
స్వాగతించుచుంటి "ప్లవను"భువికి. 61.
కట్టుకున్న సతిని, గనిన సంతానమున్
సిరులలోన ముంచ సేవ యగునె?
ధర్మ మెరిగి నరుడ ధన్యత గను మనన్
స్వాగతించుచుంటి "ప్లవను"భువికి. 62.
అందనట్టివాని కర్రులు చాచుచు
చెంతనున్న వాని చింతలేక
మసలవల దటంచు మనుజునకుం దెల్ప
స్వాగతించుచుంటి "ప్లవను"భువికి. 63.
శిష్టజనులతోడ జేరుము సతతమ్ము
దుష్టకోటియందు దూరుటేల?
యనుచు జ్ఞానబోధ జనున కందించంగ
స్వాగతించుచుంటి "ప్లవను"భువికి. 64.
ఇల్లు, పిల్లలంచు నెల్లకాలంబును
మోహమందు నరుడ మునుగ దగవె?
దైవమును దలంచి ధ్యానించు మని తెల్ప
స్వాగతించుచుంటి "ప్లవను"భువికి. 65.
ఎల్లవేళలందు నితరుల సాయమ్ము
కోరుటేల జనుడ? ధీరుడ వయి
స్వీయయత్నమింత చేయుమంచును దెల్ప
స్వాగతించుచుంటి "ప్లవను"భువికి. 66.
పలుకులోన గలదు భాగ్యోదయం బిందు
బలుకులోన గలదు విలయ మనుచు
తెలియ జేసి నరున కిలను సౌఖ్యము గూర్చ
స్వాగతించుచుంటి "ప్లవను"భువికి. 67.
నిత్య మిచట జనుడ! సత్యదూరంబైన
మాటలాడి హితుల మానసములు
దుఃఖమందు గడగి త్రోయకుమని తెల్ప
స్వాగతించుచుంటి "ప్లవను"భువికి. 68.
జనుల మానసములు సత్కార్యములయందు
లగ్న మౌచు హర్షమగ్నులగుచు
సాగుచుండగలుగు సత్వంబు చేకూర్చ
స్వాగతించుచుంటి "ప్లవను"భువికి. 69.
ఎదుటివారి కలిమి నెల్లవేళల నెంచి
యోర్వలేక మనుట యొప్పుకాదు
సత్య మెరుగు డనుచు సభ్యత నేర్పంగ
స్వాగతించుచుంటి "ప్లవను"భువికి. 70.
సాధుజనుల మంచు బోధనల్ సేయుచు
జనుల దోచుకొనెడి ఘనులపట్ల
సావధాను లగుచు సాగుడంచును దెల్ప
స్వాగతించుచుంటి "ప్లవను"భువికి. 71.
నేడు కూడియుండి నిన్నెట్లు వీడునో
ధనము, తెలుప తరమె? కనుక దాని
వెనుక పరుగులేల వినుమంచు దెలుపంగ
స్వాగతించుచుంటి "ప్లవను"భువికి. 72.
ఒక్క మంచి మాట యొప్పిదంబగురీతి
బలుకజాలియున్న నలఘు సుఖము
లందగలవటంచు నవనివారికి దెల్ప
స్వాగతించుచుంటి "ప్లవను"భువికి. 73.
వాస్తవమ్ము వినుడు పుస్తకపఠనమ్ము
వాంఛితార్థదాయి వరము కాన
దానివలన గనుడు జ్ఞానసంపద యనన్
స్వాగతించుచుంటి "ప్లవను"భువికి. 74.
దొరికినంతలోన పరమహర్షము గాంచు
జనుడె యున్నతుండు సర్వగతుల
ననుచు దెలుప నరున కత్యాశ వలదని
స్వాగతించుచుంటి "ప్లవను"భువికి. 75.
ఆర్తుడైనవాని కాత్మీయతను బంచి
సాయపడుట యౌను సత్యముగను
మానవత్వమనుచు మనిషికి దెలుపంగ
స్వాగతించుచుంటి "ప్లవను"భువికి. 76.
స్వర్గ మనెడి చోటు బ్రహ్మాండ మందున
నెందు గలదొ యెవ్వ రరయలేదు
మంచి తలచి కనుడు మహిని స్వర్గంబనన్
స్వాగతించుచుంటి "ప్లవను"భువికి. 77.
ధర్మపథమునందు కర్మఠులౌచును
సంచరించువారి సత్కృతులకు
నోర్వలేమి తగదు సర్వత్ర యనుటకు
స్వాగతించుచుంటి "ప్లవను"భువికి. 78.
ప్రజ్ఞచూపుటన్న ప్రశ్నించుటా కాదు
సవ్యకర్మలందు సహకరించి
సత్ఫలంబు గనుట జనుల కంచును దెల్ప
స్వాగతించుచుంటి "ప్లవను"భువికి. 79.
అజ్ఞు డీతడంచు ననవసరంబుగా
దూరుటేల యొరుని తోరమైన
వత్సలత్వ మెదవ పలుకుట సరియన
స్వాగతించుచుంటి "ప్లవను"భువికి. 80.
తినుట కొరకు కాదు మనుట యీ జగతిలో
బ్రతుకు నిలుచు కొరకు మెతు కటంచు
తెలిసి సంచరించ కలుగు సౌఖ్యం బనన్
స్వాగతించుచుంటి "ప్లవను"భువికి. 81.
వీడు వా డటంచు భేదంబు లెంచక
సమత నిలుప గలుగ జనుడు గాంచు
సత్సుఖంబు లనెడి సత్యమ్ము తెలుపంగ
స్వాగతించుచుంటి "ప్లవను"భువికి. 82.
మాటలందు నొకటి, మనసులో మరియొక్క
టరయ జేతలందు నన్యమొక్క
టిట్టులుండ దగునె యిక మారు డనుటకై
స్వాగతించుచుంటి "ప్లవను"భువికి. 83.
చదువు ముఖ్య, మయిన సంస్కారహీనమౌ
విద్య వ్యర్థ మనెడి విజ్ఞవాక్కు
తెలిపి నరున కతుల దీప్తిని గలిగించ
స్వాగతించుచుంటి "ప్లవను"భువికి. 84.
దానకార్యమన్న దైవస్వరూపంబె
యయిన చిత్తమందు నమలభావ
మందు ముఖ్యమంచు సుందరంబుగ దెల్ప
స్వాగతించుచుంటి "ప్లవను"భువికి. 85.
దైవపూజలెన్ని దారులలో జేయ
నేమి ఫలము పేద కింతయేని
సాయపడక యంచు సత్యంబు తెలుపంగ
స్వాగతించుచుంటి "ప్లవను"భువికి. 86.
చెప్పుధర్మములను చేయకుండిన నాడు
సభల బలుకు టెల్ల సత్యముగను
అరచు టౌనటంచు నర్థమ్ము దెలుపంగ
స్వాగతించుచుంటి "ప్లవను"భువికి. 87.
జలము వ్యర్థపరచి యలఘుతరానంద
మందజూతువేని యదియె భావి
కష్టసంతతులకు గారణమౌనన
స్వాగతించుచుంటి "ప్లవను"భువికి. 88.
దైవపూజలకయి ధనమును వెచ్చించు
నరుడ! దేవుని మన మరసి నడువ
బ్రతుకు ధన్యమౌను క్షితిపయి యని తెల్ప
స్వాగతించుచుంటి "ప్లవను"భువికి. 89.
దేశరక్షణమున ధీరులై ప్రాణముల్
పణము పెట్టు భటులు వాస్తవముగ
ధన్యజీవులనుచు మాన్యత నేర్పంగ
స్వాగతించుచుంటి "ప్లవను"భువికి. 90.
మనప్రవర్తనమ్మె ఘనతగూర్చును గాని
ధనము వస్తుచయము ధరణిలోన
యశము గూర్ప వనెడి యాశయంబును నేర్ప
స్వాగతించుచుంటి "ప్లవను"భువికి. 91.
ఇతడు యోగ్యు డంచు నింపార పదిమంది
పలుక గలుగు రీతి పావనమగు
వర్తనమున నరుడ వసియించు మని బల్క
స్వాగతించుచుంటి "ప్లవను"భువికి. 92.
తెలిసియున్న విద్య దివ్యానురాగాన
బంచగలుగువాడె పండితుండు
వాడు ధన్యు డంచు బలికి మేలొనరించ
స్వాగతించుచుంటి "ప్లవను"భువికి. 93.
క్షణములోన గూలు గనుక జీవనమందు
నున్నతత్వ మొంద నొప్పటంచు
ననిశ మమలు రగుట కావశ్యకత దెల్ప
స్వాగతించుచుంటి "ప్లవను"భువికి. 94.
పిన్నవారలైన విజ్ఞులైయున్నచో
చేరి మ్రొక్క దగును సిగ్గుపడక
ప్రజ్ఞముఖ్యమిందు వయసు కాదని తెల్ప
స్వాగతించుచుంటి "ప్లవను"భువికి. 95.
ప్రకృతి తలచుచుండు బహువిధ సౌఖ్యంబు
జనున కందజేయ గనుక నందు
కల్మషములు నింప కాదు ధర్మంబనన్
స్వాగతించుచుంటి "ప్లవను"భువికి. 96.
ప్రాకులాట లేల పరుల సంస్కృతి నంద
స్వీయ మిచట నుండ శ్రేయద మయి
యర్థరహిత మిట్టి యాకాంక్ష యనుటకై
స్వాగతించుచుంటి "ప్లవను"భువికి. 97.
కవికి కార్య మిందు జవసత్వముల్ గూల్చు
వానిపైన జేయ వాక్సమరము
మరువబోకు డనుచు నరులకు తెలుపంగ
స్వాగతించుచుంటి "ప్లవను"భువికి. 98.
కాలమందు దోష మేలనో ఘటియింప
స్వీయభావనములె చేటు గూర్చు
ననుచు నెరుగు డంచు జనుల బోధించంగ
స్వాగతించుచుంటి "ప్లవను"భువికి. 99.
సత్యవాది యౌచు సన్నుతాచారుడై
మసల గలుగు వాడు దెసలనిండు
యశము లంద గలుగు నరయు డంచును దెల్ప
స్వాగతించుచుంటి "ప్లవను"భువికి. 100
అదియు నిదియు నంచు ననవసరంబైన
హేతువులను జూపి జాతిధర్మ
మనుసరించకుండు టనుచితమని చెప్ప
స్వాగతించుచుంటి "ప్లవను"భువికి. 101
వేదమహిమ దెలిసి విపుల ప్రచారంబు
లితర దేశభూము లెల్ల జేయ
మనకు దగునె యిట్లు మానబూనుట యనన్
స్వాగతించుచుంటి "ప్లవను"భువికి. 102
ఇతరు లెట్టులున్న నేమి నాసౌఖ్యమే
ముఖ్యమంచు నెంచు మూర్ఖతలను
బొందియుండు టుచిత మిందు కాదని చెప్ప
స్వాగతించుచుంటి "ప్లవను"భువికి. 103
అఘము చేయకున్న నది చేయువారిని
బ్రోత్సహించు వాని బొందు కలుష
మనుచు నరుడెరుంగ నందు సౌఖ్యం బనన్
స్వాగతించుచుంటి "ప్లవను"భువికి. 104
తారతమ్య మెరిగి యూరివారలతోడ
సంఘ మిది యటన్న సత్య మరసి
మెలగుచుండు డనెడి మేటి యబ్దంబుగా
స్వాగతించుచుంటి "ప్లవను"భువికి. 105
సర్వభూములందు సస్యవృద్ధిని జూపి
జనుల మానసముల సంతసంబు
నింపబూని యిటకు నీవు రావలెనంచు
స్వాగతించుచుంటి "ప్లవను"భువికి. 106
స్వాస్థ్యదీప్తి జూపి శాంతి యందించుచు
క్షేమ మొసగి యిచట ప్రేమ బంచి
నిలువ రమ్మటంచు నిస్తులానందాన
స్వాగతించుచుంటి "ప్లవను"భువికి. 107
విజయసిద్ధి యిచట విరివిగా జూపించి
ఇతర దేశములకు నెల్లగతుల
మమత బంచ గలుగు మహిమను నిలుపంగ
స్వాగతించుచుంటి "ప్లవను"భువికి. 108