Friday, 11 March 2016

శివస్తుతి



శివస్తుతి

సీ.              నాకు చేయూతవై నా కరంబులనంది


నడిపించు సర్వేశ! నాగభూష!


నాకు మిత్రుండవై నావర్తనమునందు


సన్మార్గమును జూపు చంద్రమౌళి!


నాకొజ్జవై నిల్చి నాస్వాంత మందున్న


అజ్ఞానమును ద్రుంచు మఘవిదూర!


నాతండ్రివై యొప్పి నాజీవనం బందు


రక్షచేకూర్చు మో ప్రమథనాథ!


తే.గీ.          జనని వౌచును కాపాడు మనయ మీశ!


బంధు డౌచును హర్షంబు పంచు మభవ!


దురితనాశన! యఘములు ద్రుంచు మయ్య!


యిచట నీకన్న దిక్కు నా కెవ్వ రయ్య!


సీ.              నిత్య మెందేగినన్ నీ కీర్తనము చేయు


సద్భావమును గూర్చు శర్వ! నాకు,


సత్కార్యములె చేయు శక్తి నాకందించి

సాధుత్వమును నిల్పి సాకు మయ్య!


మాటలన్నింటిలో మార్దవంబును నింపి

సంఘజీవన మిలను సాగనిమ్ము,


సర్వభూతాలలో నుర్వీతలంబందు

నిన్నె చూచెడి దృష్టి నిరత మిమ్ము,


తే.గీ.          ఫాలలోచన! బహువిధ భాగ్యతతులు


జనుల కందించి సర్వత్ర జగతిలోన


శాంతి సౌఖ్యాలు హర్షాల కాంతు లెపుడు


వ్యాప్తి చెందెడు సౌభాగ్య భాగ్య మిమ్ము

 

హిరణ్యగర్భాది సురాసురాణాం
కిరీటమాణిక్య విరాజి మండితమ్|
సదాశివ త్వచ్చరణాంబుజద్వయమ్
మదీయ మూర్ధాన మలంకరోతు||

అనువాదము:

తే.గీ.           క్రమత బ్రహ్మాది దేవతా గణము దాల్చు
మకుట మాణిక్యరాజిచే మండితంబు
వెలుగు చుండును గాత, నాతలను సతము.
లౌచు నొప్పారు నీజంట యడుగులు శివ!

 


No comments:

Post a Comment