భూమి
సీ. జన్మంబు నందించు జనని కేకాలాన
నునికిపట్టై వెల్గుచుండు నేది?
జన్మించియున్నట్టి సకలజీవాలకు
తన్మయత్వము గూర్చు తావదేది?
ఈ చరాచరసృష్టి యేమాత్రమును
చింత
నూనక వసియించు స్థానమేది?
స్వపరభేదములేక సర్వంబు తనలోన
చివరి కైక్యంబు తా జేయునేది?
తే.గీ.
తొణకకుండగ, మాటలు తూలకుండ
తరతమంబుల భావంబు తలపకుండ
మోద మందరి కందించు మేదిని యది
వందనంబుల నద్దాని కందజేతు.
౧.
సీ. తనపైన
నెలవుండి తమసుఖంబులు గోరి
ముక్కలుగా జేసి మోదుచున్న,
పనిముట్లు చేబూని పరమార్థ మిదియంచు
తనను గోతులుగాగ త్రవ్వుచున్న,
సతతంబు కృషియంచు నతులహర్షంబుతో
వెన్ను జీల్చెడిరీతి దున్నుచున్న,
వ్యర్థాలు, మలినాలు స్వార్థపూర్ణాత్ములై
మదిదప్పి తనమీద వదలుచున్న
తే.గీ.
క్రోధ మించుక జూపక, బాధపడక,
పెద్దమనసున క్షమజూపి, పిల్లలనుచు
సర్వసౌఖ్యంబు లందించి శ్రమను
బాపి
రక్ష చేసెడి ధరణికి ప్రణతు
లిపుడు. ౨.
No comments:
Post a Comment