నుపకరించుచు సర్వదా యుర్వియందు
గూర్చు నారోగ్యభాగ్యంబు కూర్మిమీర
మేటి యన్నింట చూడంగ తోటకూర. 1.
చేలలోనుండు, తోటలో చేరియుండు,
ఇండ్లదరులందు దొడ్లలో నిమిడియుండు,
ఎందు బెంచిన సంతస మంది యుండు
మేటి యన్నింట చూడంగ తోటకూర. 2.
పిన్నవారికి, స్త్రీలకు పెద్దలకును
స్వాస్థ్యవర్ధన మొనరించు, సన్మతినిడు
పథ్యమైనట్టి శాకమీ వసుధలోన
మేటి యన్నింట చూడంగ తోటకూర. 3.
హితము గూర్చును, దేహాన వెతల నణచు,
లాభదాయకమై పెంచు ప్రాభవంబు,
ధరణి జనముల కండయై ధరను వెల్గు
మేటి యన్నింట చూడంగ తోటకూర. 4.
కూరయై యుండు, పప్పుతో కూడియుండు,
పులుసుకూరగ రూపంబు పొందుచుండు,
ఉర్వి నెట్లున్న రుచ్యమై యొప్పుచుండు
మేటి యన్నింట చూడంగ తోటకూర. 5.
ప్రాణములు దీసి, ఖండించి పాత్రలోన
నుడక బెట్టుచు బాధించుచున్న నైన
నాగ్రహించక జనులకు హర్ష మొసగు
మేటి యన్నింట చూడంగ తోటకూర. 6.
పరుల కుపకార మొనరించుకొరకు జగతి
జన్మ నొసగెను దేవుండు సత్యమనుచు
త్యాగభావాన నర్పించు తనను తాను
మేటి యన్నింట చూడంగ తోటకూర. 7.
సాత్త్వికాహార మియ్యది జనుల కిలను
బుద్ధివికసన మొనరించు భోజ్యమగుచు
స్వార్థ మొక్కింతయును లేక సత్య మవుర!
మేటి యన్నింట చూడంగ తోటకూర. 8.
No comments:
Post a Comment