తనకు తానేయౌను తథ్యమిద్ది,
నరుని కన్నింటిలో వరుసగా తోడౌచు
ననుదినంబును హర్ష మందజేయు,
సృష్టి చేయును, పెంచు నిష్టసౌఖ్యం బిచ్చు
కారణంబై నిల్చు ఘనత కెపుడు,
గృహిణియై యన్నింట సహకార మందించు
బహుకష్టముల కోర్చు నహరహమ్ము
అతివ చేయలేని దవనిలో నేదేని
కానరాదన ననుమానమేల?
ముదిత కేదియేని ముద్దార నేర్పింప
నేర్చు నందమొప్ప నిష్ఠ బూని. 1.
చిత్రమందు జూడ చిత్తశుద్ధిగ నీమె
గ్రంథపఠనజేయు కాంక్షతోడ
ఉన్నతాశయమున నుపవిష్టయై యుండె
పొత్తమొకటి చేతబూని యదిగొ. 2.
గ్రంథనామం బేమొ కానరాకున్నది
భవ్యమై వెలుగొందు భారతంబొ,
పరమపూజ్యంబైన భాగవతంబేమొ,
కాకున్న నెంతేని ఘనతగాంచు
వాల్మీకి రచితమై కల్మషంబులబాపు
గ్రంథరాజంబైన రామచరిత
మదియును గాదేని యత్యుత్తమంబైన
ధర్మశాస్త్రంబౌను తనమనమున
హర్షమును నింపి, యెంతేని హాయినొసగు
నట్టి గ్రంథంబు నీయమ యంది మిగుల
శ్రద్ధతో జేరి యిచ్చట చదువబూనె
నంద మొలుకంగ ధన్య యీ యతివ యందు. 3.
జ్ఞానార్జనంబు చేయుట
కేనాడును వయసు, లింగ మీభువిలోనన్
కానేరవు బాధకములు
మానినులకు విద్య మిగుల మాన్యత గూర్చున్. 4.
No comments:
Post a Comment