“చలన చిత్రములు”
ఒకనాడు దేశాన రకరకంబుల మూక..........చిత్రంబు కనువిందు చేసియుండె,
తదుపరి చూడంగ ముదముతో మాట్లాడు
..........బొమ్మ లెన్నెన్నియో పుడమిలోన
చలనచిత్రంబులై యలరించి ప్రేక్షక
..........హృదయంబులను దోచు టది నిజంబు
మారెడు కాలాన మార్పులు చేర్పులు
..........చిత్రనిర్మాణాన చేరుచుండె
చలనచిత్ర మిపుడు శతవసంతంబుల
పాటిదయ్యె కనగ భారతాన
తెలుగు చలనచిత్ర మిలలోన నన్నింట
శ్రేష్ఠమనుచు పొందె స్థిరయశంబు.
రఘుపతివెంకయ్య రమ్యంబుగా నాడు
..........మూకాభినయమున మొదట ప్రతిన
భీష్ముతో జేయించె పిదప ప్రహ్లాదుండు
..........మాటాడి యలరించె మేటియగుచు
ఎందరో దర్శకుల్ వందలసంఖ్యలో
..........నలుపు తెలుపులుగా మలచినారు
చక్కని చిత్రాలు సరదాలకేకాక
..........విప్లవాత్మకమౌచు వివిధగతుల
సంఘసంస్కారదృష్టితో జగతి కింత
బోధ చేసెడు భావంబు పూని సతము
నిష్ఠ గైకొని నిర్మించి నిలిచినారు
ధన్యు లవ్వార లెందైన మాన్యు లికను.
తరువాత కాలాన సరణులు మారంగ
..........రంగుల చిత్రాలు రయముతోడ
వచ్చి నిల్చెను చూడ వర్ణింప తరమౌనె
..........వర్తమానములోని వైభవంబు
రంగురంగులె కాదు రమ్యాతిరమ్యమౌ
..........సాంకేతికాఢ్యత సర్వజగతి
చిత్రసీమను జేరి శ్రీప్రదంబుగ మారి
..........సర్వసౌఖ్యంబుల స్థానమయ్యె
ఇందు గాంచెడు దానినిం కెచ్చటైన
కాంచవచ్చును లేనిది కాంక్షయుండి
వెదకినను లేదు సత్యంబు విశ్వమందు
తెలియు డంచును జగతికి తెలుపు చుండె.
పుల్లయ్యవర్యుండు పూజ్యుడా నరసింహు
..........డటపైని బాబు తా నరయవలయు
నారాయణార్యుండు నవ్యాంతరంగుండు
..........రాఘవయ్యయు జూడ రమ్యగుణుడు
విశ్వనాథుడు, బాపు విజ్ఞులై వీరంద
..........రెన్నియో చిత్రాల నున్నతముగ
దర్శకాగ్రణులౌచు ధరవారి కందించి
..........యశము గాంచినవార లనుపమముగ
తెలుగుసీమను నిత్యంబు వెలుగులీను
చిత్రరాజంబు లెన్నియో చెప్ప గలమె
అకట! యొకదాని మించిన దొకటి యగుచు
ఖ్యాతి గడియించి యున్నవి క్రమముగాను.
నాటినుండియు జూడ నటవర్గమందున
..........తెలుగుదేశమునందు బలువురు గద!
ఈలపాటలవాడు, రేలంగి , నాగయ్య
..........యాంజనేయార్యుడా యక్కినేని
నందమూరియు నింక నందాల బరిణయౌ
..........అంజలీదేవ్యాదులతివలున్ను
ఖ్యాతినందినయట్టి ఘనులు తామెందరో
..........తారలై వెలుగొందువార లవని
శతవసంతాలు నిండిన సమయమందు
ఘంటసాలాది ముఖ్యుల, కవుల, నటుల,
దర్శకులను, నిర్మాతలన్, ధన్యజనుల
నిండు మనమున స్మరియించ రండు నేడు.
No comments:
Post a Comment