దండకము - 1
శ్రీరామ
శ్రీరామ
శ్రీమత్కృపాసింధు! హేదీనబంధూ! మహాదేవదేవా! ప్రభూ! రామచంద్రా! సదాలోకరక్షైకకార్యాబ్ధిమగ్నా! శుభాకార! సంఘంబునందున్న పాపంబు లన్యాయకార్యంబులన్ జూడుమా నేడు దేశంబులో నెల్లెడం దీవ్రవాదంబు విస్తార రూపంబు దాల్చెన్, మతోన్మాద మత్యుగ్రరీతిన్ విజృంభించె, స్వార్థంబె ముఖ్యంబుగా లోకులీనాడు విత్తార్జనంబే ప్రధానంబుగా బూని బంధుత్వభావంబులన్ రోసియున్నారు సంపత్తులే శాశ్వతంబా? యికే శాఖలో చూచినన్ లంచగొండుల్ సదన్యాయమూర్తుల్ (మహాన్యాయమూర్తుల్) విరాజిల్లుచున్నారు, సత్యంబు, ధర్మంబు, శాంతంబు, క్షేమంబు, యోగంబు లేమూలనో దాగె, వేదోక్త, శాస్త్రోక్తరీతుల్ భయంబందియుండెన్, పరాధీనమై పోవుచుండెన్ స్వధర్మంబు, చూడంగ దేశాధినేతల్ సదా స్వార్థమే పూనియున్నార లేమూలలో చూచినన్ స్కాములే దర్శనం బిచ్చుచుండంగ ఈదేశమున్ రక్ష చేయంగ నింకెవ్వరున్నార లోదేవ! రావా మరోమారు త్రేతాయుగంబిందు కల్పించి రక్షించు, శ్రీరామరాజ్యంబు తెప్పించుమా యంచు ప్రార్థించుచున్నాడ, దండంబు లందించు చున్నాడ కాపాడు మీదేశమున్ రామచంద్రా! నమస్తే నమస్తే నమస్తే నమ:
దండకము - 2
శ్రీవైష్ణవీమాత
శ్రీవైష్ణవీమాత
శ్రీచక్రసంచారిణీ! దైత్యసంహారిణీ! లోకమాతా! జగద్వ్యాప్తఘోరాఘసంఘంబులం ద్రుంచగా మోహనాకారివై జమ్ముకాశ్మీర మందున్న కాట్రాఖ్యమై యొప్పు గ్రామంపు గోత్రాగ్రభాగంబు నందుండి, శ్రీవైష్ణవీ నామధేయంబుతో భక్తులన్ బ్రోచుచున్, సర్వసౌభాగ్యసంపత్తు లందించుచున్, పుత్రమిత్రాది సౌఖ్యంబులం గూర్చుచున్, తల్లివై గాచుచున్నావు, నీనామ సంకీర్తనల్ చేసినన్, నిన్ను పూజించి వర్ణించినన్, నీకథాలాపముల్ భక్తితో చేసినన్, నిన్ను దర్శించి నీయందు విశ్వాసముం జూపి ప్రార్థించు వారెల్లరున్ శాశ్వతానందముం బొంది మోక్షంబు సాధింపరే తల్లి! నీపాదపద్మంబులే మాకు దిక్కమ్మ, పాదాంబువుల్ తీర్థమమ్మా! హృషీకేశశక్రాది సర్వామరుల్ నీకృపాపాత్రులై లోకరక్షాఢ్యతన్ బొంది యున్నారు, ముల్లోకముల్ నీయధీనంబులమ్మా! జగన్మాత! సద్బుద్ధి యందించి కాపాడవమ్మా! యికన్ వైష్ణవీ! మాతృమూర్తీ! నమస్తే నమస్తే నమస్తే నమ:
దండకము - 3
శ్రీ ఆంజనేయ
శ్రీయాంజనేయా! ప్రభూ! వాయుపుత్రా! మహద్దివ్యచారిత్ర! వీరాధివీరా! శుభాకార!
శ్రీరామభక్తాగ్రగణ్యా! దశగ్రీవవంశాంతకా! లోకపూజ్యా! మహాత్మా! పరాకేలనయ్యా!
మొరాలించవయ్యా! సమస్తాఘసంఘంబులంద్రుంచి శీఘ్రంబె కావంగ రావయ్య!
నీయద్భుతంబైన చారిత్రమున్ భక్తితో బాడగా సర్వసౌభాగ్యముల్ గల్గు సందేహ
మొక్కింత లేదయ్య! నిన్భక్తితో గొల్తు భాగ్యంబు గల్గించి రక్షించుచుం,
దల్లివై ప్రేమనందించుచుం, దండ్రివై గాచుచున్, మిత్రరూపంబునం జేరి
సన్మార్గముం జూపుచున్, భ్రాతవై ధైర్యముం బెంచి కాపాడవయ్యా! సదా నిన్ను
ధ్యానింతు, పూజింతునయ్యా! కథాలాపముల్ జేతునయ్యా! మదీయాంతరంగంబు నందున్న
దుర్బుద్ధులన్ ద్రుంచి, సద్భావసంపత్తులం జేర్చుమా, సాధుసంగంబులం గూర్చుమా,
సర్వదా నీపదాబ్జాతముం దాకి యర్చించు సౌఖ్యంబు గల్పించి, నీయందు సద్భక్తి
గల్గించవయ్యా! సదా సర్వదు:ఖాపహారీ! మహాకాయ! శ్రీయాంజనేయా! నమస్తే నమస్తే
నమస్తే నమ:|
No comments:
Post a Comment