Monday, 21 May 2012

ప్రత్యేక ఛందస్సులో పద్యాలు

ప్రత్యేక ఛందస్సులో పద్యాలు

ఉత్సాహవృత్తము (16.05.2012)
( ఏడు సూర్య గణాలు+ఒక గురువు) 
(ఐదవగణం మొదటి అక్షరం యతిస్థానం)
(కేవలం హగణమే వాడరాదు)
భక్తజనులఁ జేరదీసి భాగ్యమందజేయుచున్,
శక్తియుక్తు లొసగుచుండి, సద్యశంబులిచ్చుచున్
భక్తి నింపి హృదులలోన బంధనాలు ద్రుంచుచున్
ముక్తినొసగు దానవీవు మోదమంద వైష్ణవీ!

పాదపవృత్తము (16.05.2012)
(భ,భ,భ,గగ)-యతి ఏడవ అక్షరం
నీదరి జేరితి నేనిక దేవా!
కాదనబోకుము కౌస్తుభధారీ!
నీదయ జూపుము నిత్యమటన్నన్
పాదపమౌనది వాదన లేలా? 

ద్రుతవిలంబిత వృత్తము
(న,భ,భ,ర - ఏడవ అక్షరం యతి)
కరుణ జూపుము కావుము వైష్ణవీ!
ధరను ద్రుంచుము దైన్యము శాంకరీ!
పరమసౌఖ్యము భాగ్యము లిచ్చటన్
నిరతమిమ్మిక నీసుతు లందరున్.

సుగంధి వృత్తము (17.05.2012)
(ఏడు హగణాలు+ఒక గురువు - ఐదవగణం మొదటి అక్షరం యతి స్థానం)
అందమైన పద్యమొక్కటైన చాలు చూడగా
వందనీయమౌచు వెల్గు భావయుక్తమైనచో
నందజేయుచుండు కీర్తి, హర్షదీప్తి కర్తకున్
వందలేల? భావసౌరభంబు లేని పద్యముల్. 

వేదమేమి చెప్పుచుండె విజ్ఞులార! గాంచుడీ
సోదరత్వభావమింత చూప గల్గు సౌఖ్యముల్
భేదమెందు గూడి యుండి ద్వేషబుద్ధి దాల్చుటల్
కాదు మంచి దన్నచో "సుగంధి"యౌను శ్రీహరీ!

పండితార్య! రోజుకొక్క పద్యలక్షణంబులన్
రండు నేర్చుకొండటంచు రమ్యమైన శైలిలో
నిండుగా మనంబులోన నిష్ఠబూని నిత్యమున్
దండిగా వచించు మీరు ధన్యులండి, సన్నుతుల్

పంచచామర వృత్తము ( 18.05.2012)
(జ,ర,జ,ర,జ,గ- పదవ అక్షరం యతి)
నిరంతరమ్ము భక్తితోడ నిర్మలాత్ములౌచు నా
పరాత్పరున్, సదాశివున్, కృపాలు చంద్రశేఖరున్
హరా! యటంచు గొల్చువార లద్భుతంబుగానికన్
పురాకృతాఘముక్తులౌచు పూజ్యులౌదు రెల్లెడన్.

మరింత జాగు చేయనేల మాన్యులార! రావలెన్
పరిశ్రమించ సాధ్యమౌను పంచచామరంబహో
పరాకులేక గూర్తుమింక పద్యరత్నమిప్పుడే
జరల్ జరల్ జగంబు లుంచి చక్కనైన రీతిలో. 

తోటక వృత్తము( 19.05.2012)
(నాలుగు సగణాలు-తొమ్మిదవ అక్షరం యతి)
హరినైనను శంకరునైన ప్రభూ!
కరుణామయ భక్తుల గావు మటం
చరుసంబున వేడుటకై భువిలో
వరమైనది తోటక పద్యమికన్.

వినయంబు సమార్జిత విద్యలకున్
ఘనభూషణమై చిరకాలయశం
బనయంబు సుఖంబు లనంతములౌ
ధనరాశుల నిచ్చును తథ్యమిలన్.

జగదంబవు నీవని శాంకరి! హే
యగజాత! దయాభరితాత్మికగా
నిగమంబులు పల్కును నీ ప్రజకున్
సుగుణంబు లొసంగుము చూపు దయన్.  

స్రగ్విణీ వృత్తము ( 20.05.2012)
ర,ర,ర,ర(7 వ అక్షరం యతి)
గోపికావల్లభా! కోరికల్ దీర్చుమా
కోపమింకేలనో? కూర్మి జూపించుమా
పాపముల్ ద్రుంచుమా భాగ్యముల్ పెంచుమా
నీపదాబ్జంబులే నిత్యమర్చించెదన్.


మీది సద్యత్నమో మిస్సనార్యా! కవీ!
మోదమందించె, దామోదరుం డెల్లెడన్
తా దయం జూపుచున్ ధన్యతం గూర్చుచున్
మీద సత్కీర్తులన్ మీకొసంగున్ సదా.


భుజంగప్రయాతం-21.05.2012 
(య,య,య,య-8వ అక్షరం యతి)

పరాకేలనయ్యా! కృపాపూర్ణ! దేవా!
వరాలిచ్చి మమ్మింక పాలించవయ్యా!
పరంధామ! శ్రీరామ! భాగ్యాబ్ధివంచున్
నిరూపించవయ్యా!మునీంద్రైకగమ్యా! 

శరీరంబు వెల్గొందు సత్వంబు హెచ్చున్
వరీయత్వభాగ్యంబు వైదుష్యమబ్బున్
చిరానందసౌఖ్యంబు సిద్ధించు మీదన్
మురారిన్ భజింపంగ మోక్షంబు గల్గున్.

రమాకాంత! గోవింద!  రాజీవనేత్రా!
క్షమాపూర్ణ! దైత్యారి! శ్యామాభ్రవర్ణా!
ఉమేశాదిముఖ్యామరోద్ధారధుర్యా!
నమస్సర్వలోకైకనాథా! నమస్తే.

వనమయూరము(ఇందువదన) -  22.05.2012
(భ,జ,స,న,గగ - తొమ్మిదవ అక్షరం యతి)


లేరె ఘనదైవములు లెక్కలకు జూడన్
రారు దయజూపుటకు రమ్యమగు రీతిన్
చేరి నిను గొల్చెదను సిద్ధముగ రామా!
రార మము గావగను రమ్యగుణధామా!

రథోద్ధతము ( 23.05.2012)
ర,న,ర,వ - ఏడవ అక్షరం యతిస్థానము
స్వగతం

ప్రేమతోడ నిను బిల్చుచుంటినో
రామచంద్ర! యిటు రమ్ము కావగా
మామకాఘములు మాడ్చివేయుచున్
నీమహాత్మతను నిల్పుమా యికన్.  1.


సత్యచారులయి సాధుశీలురై
నిత్యశాంతులయి నిర్మలాత్ములై
జాత్యతీతులగు శత్రుహీనులా
దిత్యతుల్యులయి తేజరిల్లరా.  2. 

కోరలేదెపుడు కోట్లసంపదల్
దూరలేదు నిను దుర్మదాంధతన్
నేరమేమిటిక? నీదుభక్తునిన్
చేరరావు మరి శ్రీరమాధవా!  3. 


జీవదాతయును చిత్స్వరూపియున్
పావనుండనెడు భావనంబుతో
నీవెదిక్కనుట నేరమా హరీ!
కావవేమి మధుకైటభాంతకా!  4.  

జ్ఞానశూన్యుడను కాముకుండనై
దీనబంధుడగు దేవదేవ! నిన్
కానరావనుచు కాఱులాడితిన్
నేను మూర్ఖుడను నిత్యసౌఖ్యదా!  5.

స్వాగత వృత్తము ( 24.05.2012)
ర,న,భ, గగ - ఏడవ అక్షరం యతి స్థానం
వర్తమానం

మంచివారలయి మానవులిందున్
పెంచి ప్రేమమును పేదలయందున్
పంచగావలయు భాగ్యము లెందున్
సంచితార్థములు సత్ఫలమందన్.   1.

సాటివారికిల సాయము చేయన్
కోటిసంపదలు కూడును గాదా!
ఓటలేక విపులోర్విని తానే
కూటయౌచు సిరిగోరుట మేలా?   2.

ఓటు కోసమని ఉర్విజనాలన్
పూటపూటగని పూజలతోడన్
నోటు జూపెదరు నూరును వేలున్
నేటి కాలమున నేతలు జూడన్.   3.

చేయు బాసలవి చిత్తపథంబున్
వాయువేగమున వైదొలగంగా
మేయుచుండుటయె మేలని వారల్
హాయినుందురిక అద్భుతరీతిన్.   4.

రాజకీయముల రంగులనింకన్
భూజనుల్ తమరు పోల్చగ మేలౌ
మోజులో పడక మోహము వీడన్
తేజరిల్లు భువి దివ్యత నందున్.     5.

మణిరంగ వృత్తము -(25.05.2012)
 ర,స,స,గ  -   ఆరవ అక్షరం యతి స్థానము.  
శివస్తుతి

పార్వతీపతి! పాపవిదారా!
సర్వరక్షక! సౌఖ్యవిధాతా!
శర్వ!ధూర్జటి! శంకర! దేవా!
గర్వ నాశక! కామిత మీవా.  1.

రక్షకుండవు రాజువు నీవై
దీక్షబూనుచు దివ్యజగాలన్
మోక్షదాయక! ముచ్చట గొల్పన్
శిక్ష చేయగ శీఘ్రము రావా.  2.

కాలకంఠుడ! కాంక్షలు దీర్చన్
ఫాలలోచన! భాగ్యము లీయన్
శూలపాణిగ శోభన మొప్పన్
నేలపైకిక నిత్యము రావా.  3.

నాగభూషణ! నాకికపైనన్
యోగశక్తిని యోగ్యతనిమ్మా,
భోగదాయక! భూజనులందున్
వేగమీయవె విజ్ఞత నీవున్.   4.

మధ్యాక్కర -  26.05.2012
2 ఇం+1సూ+2ఇం+1సూ 
(4 వగణం మొదటి అక్షరం యతి, ప్రాసనియమం ఉంటుంది) 
 త్రిమూర్తి స్తుతి

కరుణాత్మకుండంచు ఘనత గాంచెను రామచంద్రుండు
ధరనేలె ప్రజను సంతతిగ దలచుచు తండ్రియై తాను
నరులకాదర్శమై వెలుగు నవ్యమార్గములను జూపె
సురపూజితుం డా ప్రభునకు సుందరాంగున కివె నతులు.

కన్నులున్నవి మూడు కాలకంఠుడు తానింక ఘనుడు
మిన్నేరు జటలలోనుంచె, మెడను పాములు జుట్టె వినుడు
అన్నులమిన్నయౌ గౌరి కర్థదేహము నిచ్చె కనుడు
సన్నుతులొనరించి నరులు! సౌభాగ్యవంతులై మనుడు.

నాలుగు మోముల సామి, నానావిధంబుగా జంతు
జాలము సృష్టించు చుండు, చదువుల తల్లిని సర్వ
కాలము దాల్చెడి విభుడు, కామితార్థదు డింక లోక
పాలకుడౌ బ్రహ్మ కొరకు ప్రణతు లర్పించగా వలయు. 

ఇంద్రవజ్ర ( 28.05.2012)
త, త, జ, గగ - ఎనిమిదవ అక్షరంతో  యతిమైత్రి 
 రామస్తుతి

శ్రీరామ! రామా! యని చిత్తమందున్ 
ధీరాత్ముడౌ రాముని దేవదేవున్
నీరేజతుల్యాక్షుని నీలవర్ణున్
ధారాధరాభాంగుని దల్తు నెందున్.


శ్రీజానకీ సుందర చిత్తచోరా!
రాజేంద్ర! దైత్యాంతక! రాఘవేంద్రా!
జేజేల నర్పించెద శీఘ్ర మింకన్
రాజెల్లు రక్షింపగ రామచంద్రా!

నీవే జగత్త్రాతవు, నీవె మాకున్
భావింప సర్వంబయి భక్తకోటిన్
శ్రీవైభవంబిచ్చి విశిష్టశక్తిన్
కావంగ రమ్మింక సుఖంబు లీయన్.


మాతండ్రివై మాతవు భ్రాతవౌచున్
సీతాపతీ! రావలె చిత్స్వరూపా!
చేతంబు శుద్ధమ్ముగ జేసి మాకున్
నీతిం బ్రసాదించుచు నిల్చి కావన్.

రామా! శుభాంగా! రణరంగభీమా!
స్వామీ! జగత్పాలకచక్రవర్తీ!
నామార్చనం బెప్పుడు నమ్మి నీకున్
నీమంబునం జేసెద నిష్ఠతోడన్.

ఉపేంద్రవజ్ర ( 29.05.12)
జ,త,జ,గగ (ఎనిమిదవ అక్షరం-యతి)
గణేశస్తుతి 
ముదాకరుండాతడు మోదకంబుల్
సదా నివేదించుచు శంక లేకన్
పదద్వయిం దాకుచు వక్రతుండున్
ముదంబునం గొల్తును మోక్షకాంక్షన్.


చతుర్థినాడెంతయు శ్రద్ధతోడన్
మతిన్ బ్రసాదించు నుమాకుమారున్
నితాంతభక్తిన్ గరుణించ మంచున్
శ్రితార్థికామప్రదుఁ జేరి గొల్తున్.

మహోరువిఘ్నంబులు మాయమౌ నా
మహేశపుత్రున్ మహిమప్రయుక్తున్
మహోదరున్ సుందరమంగళాంగున్
సహాయ మర్థించుచు సన్నుతించన్.


సమస్తకార్యంబులు సాగుచుండున్
శమించి విఘ్నంబులు సవ్యరీతిన్
ప్రమాదముల్ గల్గవు భాగ్యమబ్బున్
ప్రమోదముం గూడును భక్తకోటిన్.

గణేశ! లంబోదర! కామ్యదాతా!
ప్రణామ మోదేవ! శుభస్వరూపా!
క్షణంబునం గూల్చుచు గర్వరాశిన్
గుణాన్వితుం జేయుము కూర్మితోడన్. 

ఉపజాతి ( 30-5-2012)
ఇంద్రవజ్ర+ఉపేంద్రవజ్ర = తతజగగ+జతజగగ 
స్వాతంత్రోద్యమం

స్వారాజ్యముం గోరుచు శాంతమూర్తుల్
భరించి కష్టంబులు భవ్యరీతిన్
నిరంతరాత్యద్భుత నిష్ఠతోడన్
వారెందరో పోరిరి వందనీయుల్  1.


పరాధినేతృత్వపు పాపకృత్యా
లరాజకత్వంబు లనాదరంబుల్
దురాగతంబుల్ బహుదుష్టబుద్ధుల్
పోరాడి వారింపగ బూని రంతన్.  2.

శ్రీగాంధి యన్నింటను శ్రేష్ఠుడౌచున్
మృగాకృతిం దాల్చిన మ్లేచ్ఛకోటిన్
భగీరథుండాతడు పారద్రోలెన్
భోగంబు లందించెను పుణ్యభూమిన్.  3.

ఇంద్ర వంశ వృత్తము ( 31.05.2012)
త,త,జ,ర (ఎనిమిదవ అక్షరంతో యతి)
అయ్యప్పదీక్ష
అయ్యప్పదీక్షల్ పరమాద్భుతంబుగా
నెయ్యంబునుం జూపుచు నిర్మలాత్ములై
శయ్యాది సౌఖ్యంబులు సంస్మరించ కే
కయ్యంబులం బూనక కర్మనిష్ఠులై   1.

అత్యంత భక్తిన్ పరమాత్ము దల్చుచున్
సత్యంబునుం బల్కుచు సాధుశీలురై
నిత్యంబు పూజాదులు నిర్వహించగా
నత్యాదరంబుల్ ధర నందుచుండెడున్.   2.

సంతోషముల్ గల్గును, సర్వపాపముల్
సాంతంబుగా నాశమునంది, కీర్తులున్
సొంతంబులై గూడును శోభలందెడున్
చెంతన్ మహైశ్వర్యము చేరుచుండెడున్.    3.

వంశస్థ వృత్తము ( 01.06.2012)
జ,త,జ,ర (ఎనిమిదవ అక్షరంతో యతి)
పరోపకారం
పరోపకారంబున భాగ్యసంతతుల్
చిరాయురారోగ్యపు సిద్ధులెల్లెడన్
మరిన్ని సౌఖ్యంబులు మాన్యదీప్తులున్
నిరంతరం బందుట నిక్కమీ భువిన్.   1.
జలంబులం గూర్చును సర్వదా నదుల్
ఫలంబులందించును భవ్య వృక్షముల్
చలించకన్ గోవులు సాధు దుగ్ధముల్
నిలింపులై యిచ్చును నిత్యమీ భువిన్.   2.
శరీరమందించుట శక్తియుక్తులన్
పరాత్పరుం డా భగవాను డిచ్చుటల్
పరోపకారార్థమె, స్వార్థదూరులై
కరంబు దీనార్తులఁ గావగా వలెన్.    3.

వసంత తిలక ( 02.06.2012)
త,భ,జ,జ,గగ -  8/11వ అక్షరం యతిస్థానం 
9 వ అక్షరం యతి పాటిస్తే "మదనరేఖ" అవుతుంది

శ్రీరామచంద్ర! సుగుణాకర! చిద్విలాసా!
కారుణ్యమూర్తి! భవతారక! కంజనేత్రా!
వీరాధివీర! భువనావన! వేదవేద్యా!
ఘోరాఘనాశక! సుఖంబులు గూర్చుమయ్యా!  1.


నీనామసంస్మరణ జేతును నిర్మలాత్మన్
దానాదులున్ స్తవము లెప్పుడు ధర్మబుద్ధిన్
మానంగబోను సుఖదాయక! మంగళాంగా!
రా, నన్ను గావుమినవంశజ! రాఘవేంద్రా!  2.





























No comments:

Post a Comment