Wednesday, 16 May 2012

కుచేలుడు

ది.13.05.2012 వ తేదీ 
"శంకరాభరణం" బ్లాగులో పద్యరచన శీర్షికన ఇవ్వబడిన  చిత్రానికి 
వ్రాసిన పద్యవ్యాఖ్య
 
కుచేలుడు
సీ.
అధికసంతతి సాకు విధమెద్దియో కాన
          రాదాయె నింక నో ప్రాణనాథ!
దారిద్ర్యమింటిలో తాండవించుచు నుండె
          క్షుద్బాధ దేహంబుఁ గూల్చుచుండె,
భోజనహీనులై(దూరులై) పుత్రు లల్లాడంగ
          చూడలేకున్నాను సుతుల గతులు
ఏజన్మపాపమో ఈ రీతి వికటించె
          తెలియకున్న దికేమి పలుకుదాన
తే.గీ.
రమ్యగుణశాలి లోకైక రక్షకుండు,
బాల్యమిత్రుండు, సంపూర్ణ భాగ్యదాత,
కృష్ణపరమాత్మ సాక్షాత్తు విష్ణువందు
రతని దర్శించి సాహాయ్య మడుగ దగును.
ఆ.వె.
అనుచు ధర్మపత్ని యారీతి పలుకంగ
తన్మయత్వమంది ధరణిసురుడు
పరమభక్తితోడ భగవాను దర్శించ
ద్వారకాధినాథుఁ జేరినాడు.
సీ.
ప్రాణమిత్రుని రాక పరమహర్షముగూర్చ
          ద్వారంబు కడకేగి గారవించి,
ఆ కుచేలునితోడ యాలింగనంబంది
          సింహాసనాసీను జేసి యపుడు
అతిథి దైవముగాన నర్ఘ్యంబు లర్పించి
          పాదంబు స్పృశియించి పాద్యమిచ్చి
భూసురుల్ చూడంగ భోజనప్రియు లంచు
          పక్వాన్న మందించె బ్రాహ్మణునకు
తే.గీ.
సకలలోకైకనాథుడౌ చక్రి యిట్లు
సత్కరించిన తీరుకు సంతసించి
ప్రణతు లర్పించెనే గాని పత్ని కాంక్ష
చెప్ప నోరాడలేదు కుచేలునకును. 
కం.
సర్వాంతర్యామి గదా,
సర్వేశ్వరుడైన చక్రి సంతోషముతో
నుర్వీసురునకు నొసగెను
సర్వైశ్వర్యంబు లింక సద్వైభవముల్.
మత్తకోకిల
కోరి చేరగ భక్తబృందము కోర్కెలన్నియు దీర్చుచున్
వారి యుల్లము లుల్లసిల్లగ వైభవంబులు గూర్చుచున్
ధీరతన్ గలిగించు చుందువు దివ్యతేజమొసంగుచున్
శౌరి! నీకివె వందనంబులు శార్ఙి! యాగమసన్నుతా!
కం.
కరుణాసాగర! ధీరా!
సరసాత్మక! దీనబంధు! సర్వోద్ధారా!
వరగుణ! యదుకులవీరా!
నిరతము మము గావుమయ్య! నిఖిలాధారా!

No comments:

Post a Comment