Saturday, 30 June 2012

బాల్యం

ది. 30.06.2012 వ తేదీ  
"శంకరాభరణం" బ్లాగులో  
"పద్యరచన" శీర్షికన ఇవ్వబడిన చిత్రానికి 
వ్రాసిన పద్యవ్యాఖ్య

బాల్యం
            (బాల్యదశ యన్న బహుమూల్యఫలము గాదె)

పాలు గారెడి బుగ్గలు, పలుకు లెపుడు
దివ్యమాధుర్య భరములై తేజరిల్లు
బ్రహ్మవాక్యంబులో యన భవ్యములయి,
బాల్యదశ యన్న బహుమూల్యఫలము గాదె.   1.

చింత యొకయింత యేనియు సిరులగూర్చి
అంటగాబోదు నిత్యంబు హర్షమొదవు
కష్ట సుఖముల యూసెందు కలుగ బోదు
బాల్యదశ యన్న బహుమూల్య ఫలము గాదె.  2.

కులము, మతములు, గోత్రాలు కోట్లకొలది
సంప్రదాయంబు లాచారసంతతులును
తెలియవలసిన పనిలేదు భళిర! చూడ
బాల్యదశ యన్న బహుమూల్య ఫలము గాదె.  3.

కలిమిలేములు సమములై కలుగు తృప్తి
యఘము పుణ్యంబు లవియెందు నంటబోవు
దైవరూపంబు పసిబిడ్డ ధరణిలోన
బాల్యదశ యన్న బహుమూల్య ఫలము గాదె.  4.

చందమామను గాంచిన క్షణమునందు
చేతులనుఁ జూపి రమ్మని జీరుచుండు
తన్మయత్వంబు నందుచు ధరణి కెపుడు
బాల్యదశ యన్న బహుమూల్య ఫలము గాదె.    5.

కోపమే భూషణంబయి కోరికలను
దీర్చు చుండును వాత్సల్యదీప్తు లొసగు,
రోదనంబిక బలమౌను మేదినిపయి
బాల్యదశ యన్న బహుమూల్య ఫలము గాదె.   6.

తల్లిదండ్రులు, బంధువు, లెల్లవార
లరుసమును జెంది రాజశేఖరులు గూడ
సేవలందింతు రెల్లప్పు డేవలేక
బాల్యదశ యన్న బహుమూల్య ఫలము గాదె.  7.

ఆటపాటలఁ దేలుచు ననవరతము
ఘనత నందుచు కాలంబు గడుపుచుండు
భాగ్యమున కర్హు లిలలోన బాలు రవుర!
బాల్యదశ యన్న బహుమూల్య ఫలము గాదె.   8.

ఏడ్పు విన్నంత జననితా నెందు నున్న
శీఘ్రముగఁ జేరి ముద్దాడి చెంత నిలిచి
పాటలను బాడి యలరించి పలుకరించు
బాల్యదశ యన్న బహుమూల్య ఫలము గాదె.    9.

కోరినంతనె జనకుండు కూర్మితోడ
వస్తుజాలంబు నందించ వలయు ననుచు
యత్న మొనరించు బిడ్డకై యహరహమ్ము
బాల్యదశ యన్న బహుమూల్య ఫలము గాదె.  10.

Friday, 29 June 2012

పేదవాడు

ది. 29.06.2012 వ తేదీ  
"శంకరాభరణం" బ్లాగులో  
"పద్యరచన" శీర్షికన ఇవ్వబడిన చిత్రానికి 
వ్రాసిన పద్యవ్యాఖ్య

పేదవాడు
 సీ.
కట్ట బట్టలు లేవు కరువయ్యె మెతుకులు
          పలుకాలకించెడి వారు లేరు,
రోజున కొకటిగా రుగ్మతల్ వ్యాపించె
          బ్రతికియుండుటె నేడు భారమయ్యె,
దీనబాంధవుడైన దేవాధిదేవుడే
          పాషాణరూపియై పలుకనపుడు
సాటివారలమంచు జగతిలో నడయాడు
          శ్రీమంతులనుగూర్చి చెప్పనేల?
ఆ.వె.
జన్మ మంది నాడ జనులంద రేరీతి
పుట్టి యుండి రట్లె పుడమిమీద
తిండి బట్ట లేక తిరుగుచు నుండెడి
పేదవాని నగుట కేది కతము?
ఆ.వె.
పూర్వజన్మమందు పుణ్యంబు చేయనో?
సంచరించ లేదొ సవ్యగతిని?
తెలియకుండె చెప్పవలయును దేవుడే
పేదవాని నగుట కేది కతము?
ఆ.వె.
సుఖములేక సతము సూర్యోదయాదిగా
గుడులు, వీధులందు, బడులవద్ద
చేరి దాన మింత చేయుడన్ననుగాని
దుడ్డు కొంచెమైన దొరకదయ్యె.
ఆ.వె.
భవమునొసగునట్టి భగవానుడే రక్ష
యందు రెందుఁ బోయె నాఘనుండు
బాధ లిట్లు గూర్చు, భవబంధ మోచనం
బీయ రాడదేమి? ఈశ్వరుండు.
ఆ.వె.
అనుచు మనసులోన నత్యంతవేదన
నందు పేదవారి ననవరతము
నిర్మలాత్ములౌచు, నిస్స్వార్థచిత్తులై
చేరి సాయ మంద జేయ వలయు.
ఆ.వె.
సాటివారి కింత సాయంబు చేయుటే
ధరణిలోన గొప్ప ధర్మ మికను
మంచి మనసుతోడ మానవసేవయే
మాన్యమైన పూజ మాధవునకు.

Thursday, 28 June 2012

ద్రౌపదీ మానసంరక్షణం

ది. 28.06.2012 వ తేదీ  
"శంకరాభరణం" బ్లాగులో  
"పద్యరచన" శీర్షికన ఇవ్వబడిన చిత్రానికి 
వ్రాసిన పద్యవ్యాఖ్య.
 
ద్రౌపదీ మానసంరక్షణం
చం.
వరమున జన్మనందినది, పాండవవీరుల ధర్మపత్నియై
నిరత పతివ్రతాచరణనిష్ఠనుఁ బూనుచు సద్గుణాఢ్యయై
వరలిన యాజ్ఞసేనిని సభాసదులందరుఁ జూచుచుండగా
కరుణ యొకింత చూపక కుకర్ముడు, దుర్మదుడౌచు నప్పుడున్.

తే.గీ.
దుస్ససేనుండు సభకీడ్చి దుష్టుడగుచు
వస్త్రహీననుఁ జేయ ద్రోవదినిఁ బట్టి
యత్నమొనరింప నబలయై యార్తితోడ
దేవ! లోకైకరక్షక! కావు మనుచు
 
కం.
మొర పెట్టగ వెనువెంటనె
కరుణాత్ముండైన శౌరి క్రమముగ చీరల్
తరగని రీతిగ నొసగుచు
మురహరు డా కృష్ణ మానమును కాపాడెన్.

Tuesday, 26 June 2012

అంపశయ్య

ది. 26.06.2012 వ తేదీ "శంకరాభరణం" బ్లాగులో "పద్యరచన" శీర్షికన ఇవ్వబడిన చిత్రానికి వ్రాసిన పద్యవ్యాఖ్య.
 
అంపశయ్య
చం.
శరముల శయ్యపై పడిన శంతనుపుత్రుడు దాహపీడతో
నరయగ నీటికోసమపు డర్జును డాదర మొప్పగా వడిన్
వరమగు బాణయోగమున భవ్యములౌ క్షితిగర్భనీరముల్
ధరణికిఁ దెచ్చె నందరును ధన్యుడటంచుఁ దలంచ ఖేచరుల్.
     ఆ.వె.
          సవ్యసాచి మరియు సాక్షాత్తు విష్ణువౌ
          చక్రధరుని ప్రాణసఖుడె గాక
          సత్యదీపితుండు శక్తియుక్తుండౌట
          జగతిలో నతని కసాధ్యమేది?
     ఆ.వె.
          పరవశించి యంత వాత్సల్యపూర్ణుడై
          పిలిచి చేరదీసి భీష్ము డెంతొ
          తుష్టి చెంది యొసగె నిష్టార్థసిద్ధికై
          ఆశిషంబు లప్పు డర్జునునకు.
     ఆ.వె.
          వృద్ధజనుల సేవ శ్రద్ధతో జేసిన
          వారి కబ్బు సకల వైభవములు
          విజయసిద్ధి గలిగి విజ్ఞత చేకూరు
          సందియంబు లేదికెందుఁ జూడ.

Monday, 25 June 2012

యశోద కృష్ణ.

ది. 25.06.2012 వ తేదీ 
"శంకరాభరణం" బ్లాగులో 
"పద్యరచన" శీర్షికన ఇవ్వబడిన చిత్రానికి వ్రాసిన 
పద్యవ్యాఖ్య.
 

చిట్టికన్న! నీవు చేయకల్లరి నాన్న!
దౌష్ట్యమింతయేని తగదు నీకు,
ఇరుగు పొరుగువారి నీరీతి బాధించి
గోల చేయుటెల్ల మేలు గాదు.

చిన్ని కృష్ణ! నిన్ను మన్నించగాబోను
మన్ను తింటివంచు మాకు దెలిసె
పాలు పెరుగు వెన్న చాలక పోయెనా?
చెప్పరోరి బిడ్డ! తప్పులేల?

కల్లలాడవద్దు కన్నయ్య! నీవింక
మన్ను తినుట నిజమ? నన్నుఁ జూచి
చెప్పుమయ్య తండ్రి! చేరలు నిండంగ
వెన్నఁ బెట్టు దాన వినుము కృష్ణ!

వాదులాట లేల వారింటి పడతితో?
వీరిబిడ్డతోడ భేదమేల?
వెక్కిరింతలేల పెద్దవారలతోడ?
చిన్ని కృష్ణ! నీకు చెప్పుమయ్య!

బుద్ధి గలిగి యుండు, పోవల దటునిటు
కోప మింత నాకుఁ గూర్చబోకు
మని యశోద పలికె, నామోహనాంగుడే
పరమపురుషుడంచు నెరుగలేక.

Sunday, 24 June 2012

శ్రీ ఆంజనేయం

 ది. 24.06.2012 వ తేదీ 
"శంకరాభరణం" బ్లాగులో 
"పద్యరచన" శీర్షికన ఇవ్వబడిన చిత్రానికి 
వ్రాసిన వ్యాఖ్య
శ్రీ ఆంజనేయం

ఉదయభానుని ఫలమని మదిదలంచి
చేరి దానిని భక్షింప గోరి యపుడు
వాయు వేగాన నేగెడు బాలుడైన
అంజనాసుతు నెల్లప్పు డంజలింతు.
 

        శ్రీ వాయుపుత్రా! ప్రభూ! ఆంజనేయా! మహద్దివ్యచారిత్ర! వీరాధివీరా! శుభాకార! శ్రీరామభక్తాగ్రగణ్యా! దశగ్రీవవంశాంతకా! లోకపూజ్యా! మహాత్మా! పరాకేలనయ్యా! మొరాలించవయ్యా! సమస్తాఘసంఘంబులం ద్రుంచి శీఘ్రంబె కావంగ రావయ్య! నీయద్భుతంబైన చారిత్రమున్ భక్తితో బాడగా సర్వసౌభాగ్యముల్ గల్గు సందేహ మొక్కింత లేదయ్య! సద్భక్తి నిన్గొల్తు భాగ్యంబు గల్గించి రక్షించుచుం, దల్లివై ప్రేమనందించుచుం, దండ్రివై గాచుచున్, మిత్రరూపంబునం జేరి సన్మార్గముం జూపుచున్, భ్రాతవై ధైర్యముం బెంచి కాపాడవయ్యా! సదా నిన్ను ధ్యానింతు, పూజింతునయ్యా! కథాలాపముల్ జేతునయ్యా! మదీయాంతరంగంబు నందున్న దుర్బుద్ధులన్ ద్రుంచి, సద్భావసంపత్తులం జేర్చుమా, సాధుసంగంబులం గూర్చుమా, సర్వదా నీపదాబ్జాతముం దాకి యర్చించు సౌఖ్యంబు గల్పించి, నీయందు సద్భక్తి గల్గించవయ్యా! సదా సర్వదు:ఖాపహారీ! మహాకాయ! శ్రీరామభక్తాంజనేయా! నమస్తే నమస్తే నమస్తే నమ:| 

Friday, 22 June 2012

రాణా ప్రతాప్


 

సీ.
రాణాప్రతాపుండు రణరంగ ధీరుండు
          విశ్వవిఖ్యాతుడౌ వీరవరుడు,
మాతృదేశావన మహితయజ్ఞమునందు
          బద్ధకంకణుడైన భాగ్యశాలి
మొగలాయిలను గూల్చ మూర్తీభవించిన
          క్షాత్రతేజమువోలె ఘనత గాంచె
చిత్తోడు కోసమై సిరులు, ప్రాణంబులన్
          ధార పోసినయట్టి ధన్యుడతడు
తే.గీ.
సర్వసుఖములు త్యజియించి శక్తులన్ని
దేశమునుఁ గావ వెచ్చించి లేశమైన
స్వార్థమూనక స్వారాజ్యసవనమందు
సమిధయైనట్టి ఘనుడీత డమలగుణుడు.