Monday, 9 April 2012

హనుమ

శ్రీ గణేశాయనమ:            శ్రీ సరస్వత్యై నమ: 
 శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ: 
శ్రీమదాంజనేయాయ నమ: 
శ్రీవేంకటేశాయ నమ:
శ్రీహనుమ
(శ్రీరామచంద్రాపుర హనుమత్ శతకము)
ఛందము - తేటగీతి.
శ్రీకపీశ్వర! హనుమంత! శీఘ్రగామి,
చిన్మయానంద! హరిభక్త! మన్మనోబ్జ
భృంగరాజమ! నాకు సత్సంగమిమ్ము
రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!  1.

శ్రీదుడార్ద్రాంతరంగుండు చిన్మయుండు,
జనకునాజ్ఞల నడవుల సంచరించు
రామచంద్రుండు నీస్వామి రాఘవుండు
రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!  2.

తొలుత విఘ్నేశు గజవక్తృ దలచి పిదప
సకల లోకేశు శ్రీరామచంద్రు దలతు,
ఈశు పరమేశు శంకరు నిందుధరుని
రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!  3.

ఇంక కులదేవు నా వేంకటేశు దలచి,
యాదిదేవుని సకలదు నజుని గొల్చి
చదువులకు తల్లి శ్రీవాణి చక్క దలతు
రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!  4.

లలితహృదయను జగదంబ లక్ష్మి గొలిచి
సర్వమంగళ బార్వతి శరణు జొత్తు,
నతుల నీరీతి సకలదేవతల దలచి
రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!  5.

ముళ్ళపూడ్యన్వయాబ్ధికి మూలమైన
నాదు గురువును నారాయణాఖ్య ఘనుని
దలచి శతకంబు(స్తవములు) నీపైని బలుక జూతు
రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!  6.

అమలహరివంశచంద్రుని విమలచరితు
వేంకటేశ్వరు తనయుండ, వినయశీల
జనని సామ్రాజ్యలక్ష్మియు సాధుచరిత
రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!  7.

పూజ్యుగౌతముగోత్రాన బుట్టినాను
సత్యనారాయణాఖ్యుడ సాధుగుణుడ
పాపహరణము చేసి కాపాడవయ్య,
రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!  8.

కావ్యనిర్మాణమొనరింప కవిని గాను,
భావపూరిత విరచనఫణితి నెరుగ
నిన్ను దలపంగబూనితి నియతితోడ
రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!  9.

నిత్యు శాశ్వతు నినుగొల్చి, నిన్నువేడి         
పలుకబూనితి నీపైని పద్యశతము
పూర్తిచేయింతు వేరీతి పుణ్యమూర్తి!
రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!  10.

పలుక నావద్ద శబ్దసంపత్తి లేదు 
మహితపదముల స్తోత్రనిర్మాణమందు
దిట్టగానింక నాకోర్కి దీర్చుమయ్య,
రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!  11.

దేవ! శైశవదశయందు దినకరమణి
నాకసంబున గాంచి నీవాకలిగొని
ఫలముగాబోలునని మ్రింగబట్టినావు
రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!  12.

తొల్లి యబ్ధిని లంఘించి బల్లిదుడగు
రావణాసురు బెదిరించి, లంకగాల్చి
కాంచి రమ్మన కాల్చిన ఘనుడవవుర!
రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!   13.

భవ్య కృష్ణానదీతట దివ్యభూమి
భక్తజనముల రక్షించి ముక్తి నొసగ
వాసమేర్పడి యున్నట్టి వాడవీవు
రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!  14.

సకలసౌభాగ్యసంపత్తి, సాధుకీర్తి
పుత్రపౌత్రాది యశముల పొందు నరుడు
దేవ!  నీదయ గలిగినం దిరముగాను
రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!  15.

సౌమ్యురాముని సుగ్రీవసఖుని జేసి
వీరవానరు వాలి జంపించి నీవు
సేమ మతివను సుగ్రీవు జేర్చినావు
రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!  16.

లలితహృదయను సీతను లంకనుండి
కువలయాధిపు రాముని కొరకు దెత్తు
వదలుడిక చింత వానర బంధులనెడు
రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!  17.

సీతఁగనుగొన రాముని దూత వగుచు
వార్థి యోజనశతమును వానరేంద్ర!
దాటి లంకను జేరిన మేటివవుర!
రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!  18.

రామకార్యార్థివై నీవు రయముతోడ
నబ్ధిలంఘింప మైనాకు డనియెగాదె,
యనఘ! నాపైని విశ్రాంతి నందుమయ్య,
రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!  19.

కాలమల్పము, కడుభార కార్యమిదియు
విశ్రమించుట గిరిరాజ! వీలుగాదు
సత్యమిదియని ముందుకు సాగినావు,
రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!        20.

రాము నభిరాము రఘుకుల సోము దలచి
క్షణములోననె సీతను గాంచి వత్తు
దైన్యమిక యేల నాజన్మ ధన్యమనవె,
రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!   21.

అకట! ఛాయను గ్రహియించి యబ్ధిపైన
దివిని జరియించు వారి బాధించుచుండు
జలధి వసియించు సింహికఁజంపినావు
రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!  22.

సురస నినుజూచి భక్షింప జూడ నపుడు
మొదట యోజన విస్తృతి, పిదప సూక్ష్మ
దేహమును దాల్చి ముఖమునఁదిరిగినావు
రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!  23.

సూక్ష్మరూపాన లంకలో చొరబడగను
సకలలోకేశుడగునిను జంపజూ
ముష్టిఘాతాన లంకిణి మోదినావు
రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!  24.

శోభనంబుగ సీత నశోక వనిని
శింశుపముక్రింద నీవు దర్శించి యపుడు
వినయమున వంగి ప్రణతులర్పించినావు
రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!      25.

శోకసంతప్తయగుచు నశోకవనిని
శింశుపమునీడఁ జేరిన సీతకపుడు
వీరు నినుజూడ దు:ఖము దూరమయ్యె
రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!  26.


అసురవాగ్బాణధాటికి నసువుబాయ
యత్నమొనరించు సీతమ్మ కనఘ! నీదు
రామనామపు గానంబె రక్షయయ్యె
రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!  27.



రామలక్ష్మణులున్నారు సేమమచట,
పరమపురుషుండు రఘుపతి బంటు నేను   
వానరుండను దు:ఖము వదలుమనవె
రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!  28.

నిన్ను గొంపోవ రాముడాపన్నివారి
వేగరానుండె దు:ఖమ్ము విడువుమింక
తల్లి! వినుమంచు సీతనోదార్చినావు
రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!  29.

అమ్మ! సీతమ్మ! వినుము నీయాజ్ఞయేని
కనుమ నినుజేర్తు రాముని కడకు నిపుడె
విశ్వసింపుమయంటివి, విశ్వవినుత!
రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!  30.

సీత నినుజూచి హనుమంత! చిన్నికోతి
వెట్టు గొనిపోదు వనగ నన్నింత దవ్వు
దివ్యకాయంబు చూపితి భవ్యఫణితి
రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!  31.

పరమశూరుడవయ్యును బాలు భంగి
అంబ జానకి ఘనమైన యాజ్ఞగొనవె
భక్షణముసేయ ఫలముల వనమునందు
రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!  32.

సుందరంబౌచు వెలుగునశోకవనిని
ధ్వంసమొనరించు సమయాన దానవులను
మించి యుత్సాహివై సంహరించి నావు
రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!  33.

ఇంద్రజిత్తుండు బ్రహ్మాస్త్రమేయ నపుడు
వైరి ముందట సామాన్యు పగిది నీవు
పట్టుబడినావు రావణు బలము దెలియ
రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!  34.

దివ్యదేహుని నిను నిరోధింపవచ్చు
నక్షసుతుగని యతి శీఘ్ర మాహవమున
నమరపురికంపి విజయంబు నందినావు
రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!  35.

దుష్ట! రావణ! రాఘవు దురితదూరు
మథనపెట్టుట నీకు సేమంబుగాదు,
వినుము నిజమిది సీతను విడువమనవె
రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!  36. 

పూజ్యు రాముని సాదరపూర్వకముగ
గొలిచి జగదంబ నర్పించి నిలుతువేని
నీకు శుభమగు నంటివి, నిర్మలమతి
రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!  37.

తుచ్ఛవానరుడవటంచు తోకబట్టి
చీరలెన్నియొ చుట్టుచు చిచ్చుబెట్ట
ఘనత కపివర్య! లంకను గాల్చ లేదె!
రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!  38.   

క్షణములోపల వాలంబు కరము బెంచి
కనకమయమగు లంకను గాల్చి యంత 
నసురసేనల గర్వంబు నణచినావు
 రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!  39.
  

దుష్ట రావణువలనను కష్టతతిని
మునిగియున్నట్టి సీతకు మోదమలర
నంగుళీయక మర్పించి తయ్య నీవు
 రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!  40.

ధీరగుణశాలి! వానరవీర! శూర!
రుద్రవీర్యసముద్భవ! భద్రమూర్తి
కరుణ మముజూడు మోదేవ! ఘనముగాను
రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!  41.

మారుతాత్మజ! హనుమంత! మహితతేజ!
రుద్రవీర్యసముద్భవ! భద్రమూర్తి!
యనుచు దలచిన సంకటహరణమగును
రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!  42.


కనగ నాటల బాల్యంబు గడచిపోవు
దేవ! సంసార వాంఛల యౌవనంబు
నిల్చి నీరూపు గనినిను గొల్చుటెపుడు?
రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!  43.




భార్య, పుత్రులు, సంసారభారజలధి
మునిగి పోయితి దయజూపి ముక్తియొసగి
కాచి కాపాడు మోదేవ! ఘనుడవీవె
రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!  44.


తల్లి, తండ్రియు, నాథుండు, దాన భ్రాత
సఖుడ విష్టుడ వికనేమి సర్వమీవె,
నన్ను కరుణించి కాపాడు మన్న! వినుమ
రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!  45.


ఇల్లు, యిల్లాలు, సంపత్తి పిల్ల జెల్ల
శాశ్వతంబులు గావయ్య సత్యమతిని
నిన్ను దలచిన కాలంబె నిత్యమగును
రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!  46.


వేయి పేరుల స్తోత్రాల వివిధగతుల
నిన్నుపూజించి, సేవించి నీదుమూర్తి
కరము దర్శింప సంకటహరణమగును
రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!  47. 


అలఘుసేనను జేర్పంగ జలధిపైన
చెంతనున్నట్టి వానరసేన తోడ
సేతునిర్మాణ మొనరింప జేసి నావు
రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!  48.


రావణానుజు మనములో భావమెరిగి
రయము తోడుత భగవాను రాము జేర్చి
ధర విభీషణు మిక్కిలి ధన్యు జేయు
రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!  49.


మారుతాత్మజ! భవదీయ మహిమ దెలియ
లేక నిను దూషణంబుల నిమ్నగతిని
బలుకు రావణు బోధించి నిలిచినావు
రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!  50. 

మున్ను రణమున సౌమిత్రి మూర్ఛవోవ
దివికి లంఘించి సంజీవి దెచ్చి యపుడు
దేవ! లక్ష్మణు గాపాడినావు గాదె,
రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!51.

వీణవోలెను యవలీల ద్రోణగిరిని
చేత ధరియించి యకట సంజీవి దెచ్చి
భగవదభిరాము సంతోషబరచినావు 
రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!  52.

మకరరూపిణియగు నచ్చరకును వేగ
శాపమోచనమొనరించి సవ్యమతిని
ధన్యురాలను జేసిన ధర్మమూర్తి! 
రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!  53.

కార్యవిఘ్నము గలిగించు కాలనేమి
నంతమొనరించి యమపురి కంపినావు
విమత సంహారమందు నీ సములు లేరు
 రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!  54.
అనఘ! కపివీర! సంగ్రామమందు నీదు
రూపు గనినట్టి యసురులు వీపుజూపి
కదలిపోలేదె, మిక్కిలి కదనభీతి
రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!  55.
సకలకల్మషహరము నీ చరణయుగము
నమ్మి యనునిత్యమర్చించు నరుడు సతము
హాయి నిహపర సౌఖ్యంబు లందగలడు
 రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!  56.
నిత్యు నిన్నీశు గొల్వక నిముసమైన
తుచ్ఛసంసారసుఖముల నిచ్ఛతోడ
తేలిపోవును మనుజుండు బేలయగుచు
 రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!  57.

ఈశ్వరాత్మజ! హరిదాస! విశ్వవినుత!
హరిహరాద్వైతభావంబు నందమొప్ప
తెలియజేతువు లోకాన దివ్యచరిత!
 రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!   58.

మారుతాత్మజ! నీనామమహిమచేత
సారహీనపు సంసారజలధినుండి
ముక్తులగుదురు జనులు నీభక్తులిలను
 రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!   59.

రోమరోమమునందు శ్రీరామనామ
మకట! నీరూపు సుందర మద్భుతంబు
చదువ, వర్ణింప నేరికి శక్యమగును? 
 రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!   60.

పతితపావను డఖిల సంపత్ప్రదాత,
రమ్య గుణశాలి, రాక్షసరాజహంత,
రామచంద్రుండు నీస్వామి రాఘవుండు
రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!  61.

దశరథాత్మజ! రఘువీర! ధర్మమూర్తి!
సకలలోకేశ! శ్రీరామచంద్రయనుచు
సతము జపియించువారలు సఖులు నీకు
రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!  62.

రామ! రఘురామ! దశరథరామ! యనుచు
రామనామంబు సర్వదా నీమమొప్ప
జపము సేతుము మాయందు కృపను జూపు
రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ! 63.

ఆంజనేయుండు మహనీ్యు డమలచరితు
డనుచు లోకంబు నీముందు వినతులగుచు
ప్రణతులర్పింతు రెల్లెడ భక్తితోడ
రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ! 64.

ఎల్లవేళల రఘునాథు నెదను నిల్పి
గుండెలను జీల్చి చూపవె కూర్మితోడ
రామలక్ష్మణస్వాములన్ రామదాస!
రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!  65.

ఎచట రాముండు కొలువుండు నచట నీవు
అంజలి ఘటించి యుండెద వందమొప్ప
అకట! నీభక్తి గాంచగ నద్భుతంబు
రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!   66.

నాగవల్లీయ పత్రాల నవ్యగతిని
నతుల నర్పించి నామార్చనంబు సేయ
పొసగ జనులకు శుభముల నొసదెదీవు
రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!  67.

కేసరాత్మజ! భవదీయ కీర్తనంబు
వాసి గొల్పెడి గాథాశ్రవణము, నీదు
విమల సేవయె పండుగ వినుము నాకు
రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!   68.

సతము దశరథరాముని స్మరణ చేసి
రామ నామంబె యన్నింట రమ్యమనుచు
బలికి లోకులకు తెలియ బరచినావు
రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!  69.

నిన్నె సేవింతు నినుగొల్తు నీదు చరణ
యుగళి నర్చింతు నిరతమ్ము మిగులభక్తి
దయను జూపించి కాపాడు ధైర్యమొసగి
రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!  70.

ముదము గొల్పెడి దివ్యంపు మోము గల్గి
పారిజాతాఖ్య తరువున వాసముండు
మేరునగతుల్యవిగ్రహ! ధీర! శూర!
రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!  71.

అంజనీసుత! యరిహంత! ఆంజనేయ!
జానకీశోకనాశన! జయ సుధీంద్ర!
వాయునందన! శుభమూర్తి! వానరేంద్ర!
రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!  72.

రామనామము విన్నంత రయముతోడ
సంతసంబంది భక్తుల చెంత జేరి
రాము భజియింతు వా పరంధాము నీవు
రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!   73.

వేదవేదార్థచయముల వేత్తవయ్యు
భగవదభిరాము రాముని భక్తుడవయి
దేవ! నీదగు వినయంబు దెల్పినావు
రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!   74.


తీర్థయాత్రలు వేయేల? తిరముగాను
నిలిచి, నినుగొల్చి, త్వత్పాద నిర్మలాంబు
త్రాగుటేమాకు మోక్షప్రదాయి గాదె
రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!  75.


వివిధ చూర్ణములవియేల? విమల మతిని
జనుడు నినుగొల్వ, భవదీయ చరణరజము
పావనము చేయు దేహంబు భవ్యగతిని
రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!   76.

పరమపూరుష! కపివీర! పవనతనయ!
సూక్ష్మరూపాన నొకపరి చోద్యమేమొ
విశ్వరూపత నొకట గన్పింతువీవు
రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!   77.

రోమరోమము నందు నాస్వామి గలడు
చూడుడని బల్కి రండిక చూపుదనుచు
గుండెలను జీల్చి నిలుతువు నిండుహృదిని
రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!  78.

దశరథాత్మజు డఖిలుండు దానవారి,
అంబ వైదేహి సకలలోకైకమాత
వీరి దలచుట పాప సంహారి గాదె
రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!     79.

దివిజమార్గాన గిరి నీవు తెచ్చునపుడు
దానవుండని భరతుండు బాణమేయ
సొక్కి భువిదిగి భరతుని చూచినావు
 రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!    80.

సకలవేదార్థ వేత్తవు, సాధుశీలి
వమల గుణుడవు వ్యాకరణాదులందు
సములు లేరందు రిలనీకు విమలమతికి
రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!    81.

ఉదయ మధ్యాహ్న కాలాల ముదముతోడ
నాథ! కపివర్య! సాయంతనంబులందు
నిఖిల సంకట హర్తను నిన్ను గొల్తు
 రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!    82.

ఈశ! నీకంటె ఘనులెవ్వరిలను చెపుమ,
పరమపావనమైన నీభక్తి హనుమ!
కరము వర్ణింపజాల నీఖ్యాతి వినుమ
 రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!    83.

సకల జగముల నేలెడి స్వామి వీవె
వాసి గొల్పగ దయజూపి వరము లీవె
పతితపావన! మమ్ము కాపాడ రావె
రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!     84.

సకలసంకటహరణ! నీ చరణయుగళి
పరమ మిత్రుని కన్న, సంపదలకన్న
మిన్న, సరిలేదు దానికి మేటి యదియ
 85.
సకలలోకైకనాథ! నీచరణయుగము
భక్తి గొలిచిన వానికి శక్తియుక్తు
లనఘ! హరిపద మవలీల నబ్బగలదు
రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!    86.

సకలసంకటహరణ! నీ చరణయుగళి
గట్టిగా నమ్మి కొలిచెడి ఘనుని కిలను
కనగ సంసార బంధాలు తునిగిపోవు
రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!    87.


వాయునందన! భవదీయ వైభవంబు
వర్ణనము సేయ కవులకె వశముగాదు
సుంత నేర్వనివాడ నే నెంతవాడ
రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!    88.

వైభవమొసంగు సకల సంపదలగోర,
ననఘ! ఘనకీర్తి, వస్తువాహనములడుగ,
విమలమతిజేసి కరుణ చూపించవయ్య
రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!    89.

తనయులనుబొంది, యర్థికి దానమిచ్చి,
యజనములుచేయ పుణ్యంబు లబ్బునేమి?
జనుడు నినుగొల్వడేనియు జగతిలోన
రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!    90.

దేవ! నిన్నె నమ్మితిని నీ సేవజేయ
రాగ వలదన్న, నేనేడ కేగగలను?
దీనబాంధవ! దయజూపు దీను పయిని
రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!    91.

అన్న! సంపద లేవేళ నడుగబోను,
కువలయాధిపతిత్వంబు గోరబోను,
చిన్ని తమ్ముడ నన్ను రక్షించవయ్య
 రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!    92.

పరగ ద్వాపరయుగమందు వజ్రదంష్ట్ర!
సత్యభామను మరిసుదర్శనుని గరుడు(ఖగుని)
గర్వ మణగించి గాతువు సర్వవంద్య!
రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!    93.

వివిధలోకేశ! వానరవీర! జయము
దీనబాంధవ! పరమేశ! దేవ!జయము
పింగళాక్షుడ! హనుమంత! పిదప జయము
 రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!    94.

సర్వరోగహరణ నీకు సాధు జయము,
రామదాసుడ! హే పరంధామ! జయము
సాగరోత్తారకప్రభు! జయము జయము
 రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!    95.

పరమపూరుష! సకలసంపత్ప్రదాత!
జాంబవత్ప్రీతివర్ధన! స్ఫటికతుల్య
దేహ! మైనాకపూజిత! దేవదేవ!
 రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!   96.

భవ్యరామాయణాఖ్య కల్పతరువునకు
నీవ యాధార మనునది నిజము దేవ!
నిన్ను గనకున్న రాముండు ఖిన్నుడౌను
రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!     97.

పంచవక్తృడ! బలవంత! కాంచనాభ!
భక్తవత్సల! లక్ష్మణా ప్రాణదాత!
సింహికాప్రాణభంజన! సిద్ధపురుష!
రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!    98.

విశ్వదీపితమైన నీ విక్రమంబు
ధాటినిగని యత్నించియు తాళలేక
అసురవీరులు చేరిరి యముని పురికి
రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!    99.

శక్తి గలిగియు శ్రీరామభక్తుడగుట
రావణాసురుడాదులౌ రాక్షసులను
స్వామి యాజ్ఞను పాటించి,  చంపలేదు
రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!    100.

గరుడగమన! సురవినుత! కపివరేణ్య!
సతతసుఖదాత! హరిభక్త! సాధుచరిత!
పవనతనయుడ! సకలద! పరమపురుష!
రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!     101.

స్వామి! సీతను సింధూర మేమిటనగ,
రామకల్యాణ మనియన రయముతోడ
నంత, యొడలంత సింధూర మద్దుకొనవె!
రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!    102.

వాక్కునందున నిల్చి హే వానరేంద్ర!
మంచి పద్యాలు శతము వ్రాయించినావు,
ప్రణతుల శతంబు నర్పింతు పావని! గొను
రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!    103.

జ్ఞానశూన్యుడనైన నజ్ఞాని చేత
పద్యశతకము నాచేత పలుక జేయు
నీదు యతులితమహిమ వర్ణింప దరమె?
రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!     104.

నాథ! పలుకంగ వ్యాకరణంబు రాదు,
సర్వలక్షణఛందము నేర్వలేదు,
ఒప్పుతప్పులె కలబోసి చెప్పినాను
రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!    105.

నీమ మొకకొంత తెలియని పామరుండ,
కోపపూరిత హృదయుండ పాపమతిని
దయను జూపించి కాపాడు జయ సుధీంద్ర!
రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!     106.

 నిఖిలజగములు వెదికిన నిన్నుబోలు
దైవమే లేదు, నాకింక తల్లి దండ్రి
యన్న, బంధువు లొకరేమి యన్ని నీవె,
రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!    107.

వాయునందన! కపివర్య! వజ్రదంష్ట్ర!
సర్వలోకేశ! వందన శతము నీకు
ప్రణతులను గొని మమ్ము కాపాడవయ్య,
రామచంద్రాఖ్య పురవాస! రమ్య హనుమ!    108.

స్వగ్రామం "సంగళ్ళపాలెం" సమీపస్థమగు 
"రామచంద్రాపురం" లోని   
"శ్రీమదభయాంజనేయస్వామి"  
యనుగ్రహ,ప్రోత్సాహలతో రచితము. 
శ్రీస్వామికే అంకితము.
















































 

 




 



Sunday, 8 April 2012

ప్రశంస

ది. 08-04-2012 వ తేదీనాడు శంకరాభరణం బ్లాగులో ఇవ్వబడిన "భామకు లేమకున్ సతికి వారిజనేత్రకు కంబుకంఠికిన్" అనే సమస్యకు గురుతుల్యులు శ్రీ నేమాని పండితులవారు "శ్రీమదుమామహేశ్వరికి" అంటూ చేసిన రచన అత్యద్భుతంగా ఉంది. కవిత్వమంటే ఇలా ఉండాలనిపించేలా అలనాటి అల్లసాని పెద్దనగారి ఉత్పలమాలికను తలపించింది. ఈ సందర్భంగా వారికి శతాధిక అభివాదాలతో
నేమాని పండితార్యుల
నామార్చన మద్భుతంబు, నరులందరికిన్
కామితసుఖఫలదాయక
మై మోదములందజేసి యఘముల బాపున్. 

మీమాటలు మంత్రములై
మా మా హృదయాలుదాకి మైమరపించెన్
నేమాన్యన్వయజాతా!
శ్రీమాతయె మీకు గూర్చు సిరులు యశంబుల్.  

ఆర్యా!
నమస్కారములు,
ఆలస్యంగా మీ "శ్రీరామ మానస పూజ" చదవడం జరిగింది.
మహదానందముగా నున్నది.

శ్రీరామ రామ యన్నను
ఘోరాఘములెల్ల బాయు కువలయమందున్
నోరారగ నారాముని
మీ రోకవివర్య! దలచి మించిరి కవులన్.


మీ "మానసపూజన"మిది
నేమానిబుధాగ్రగణ్య! నిత్యస్తవమై
భూమిని వెలుగును సత్యము
శ్రీమన్! గురువర్య! మీకు చేతును ప్రణతుల్.
Pandita Nemani చెప్పారు...
మా శ్రీరామ మానస పూజ గురించి ఆనందమను గొలుపు వ్యాఖ్యలను వ్రాసిన శ్రీ కంది శంకరయ్య గారికి శ్రి హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారికి శుభాశీస్సులు.

శ్రీ హరి వారూ! మీరు విజయనగరము జిల్లాలో ఎక్కడ నుంటున్నారో మాకు తెలియజేయండి. నా విలాసములు:
ఫోను: 0891 - 2565944 / 9440233175

మీ ఫోను పిలుపుకై ఎదురు చూచుచుంటాను.
స్వస్తి.



ది.13.04.2012 వతేదీ "శంకరాభరణం" బ్లాగులో ప్రచురితమైన "గజేంద్రుని ఆర్తి" అను పద్యరచనకు స్పందిస్తూ రచయిత్రి "లక్ష్మీ దేవి" గారిని ఉద్దేశిస్తూ-
హరికథలను పల్కుటచే
హరి, లక్ష్మీదేవి! మీకు ననవరతంబున్
సిరులిచ్చి బ్రోచు నెల్లెడ
వరమగు సద్యశము లింక వైభదీప్తుల్. 

ది.15.04.2012 వతేదీ శంకరాభరణం బ్లాగులో ప్రచురితమైన "భారతరత్న-అంబేడ్కర్" అను స్వరచిత పద్యములకు పెద్దలైన కవిమిత్రుల స్పందనలకు ప్రతిస్పందిస్తూ-
ఘనులౌ కవివరులారా!
వినమితవిద్యార్థి నేను, విజ్ఞులు మీరల్
ప్రణతిశతంబును చేకొను
డనయము వత్సలత నిచ్చు నభినందనకున్.

"ఈశ్వరేచ్ఛ" పద్యాలు చదివి పండిత శ్రీ నేమాని వారొసగిన  యాశీస్సులకు బదులుగా
శుభములు గూర్చుచు నుండెడి
యభినందనలిచ్చుచుందు రస్మద్గురుస
న్నిభులౌ పండితవర్యా!
అభివాదశతంబు జేతు నయ్యా మీకున్. 

ది. 24.04.2012 వ తేదీ నాటి చిత్రవ్యాఖ్య పద్య రచనకు శ్రీ నేమాని వారు వ్రాసిన మహాస్రగ్ధరను గూర్చి
బహురమ్యం బీస్రగ్ధర
యహహా! నేమానివర్య! అతిమథురంబై,
మహితాద్భుతసత్పదగుణ
సహితంబై వెలుగుచుండె సత్కవివినుతా!

కాళిదాసుఁ గూర్చి కథలున్నవెన్నియో
అందు నొక్కదాని కద్భుతముగ
పద్యరూపమిచ్చి హృద్యంబుగా బల్కు
శంకరార్య! మిమ్ము సన్నుతింతు



శ్రీమన్మిస్సనవర్యా!
మీమాటలు మల్లెలట్లు మిక్కిలి సొగసై
ధీమన్! వెలుగుచు నున్నవి
కామితవరదుండు మీకు ఘనయశమొసగున్.


సిరిఁ గోరని వారొక్కరు
నరయగ భువిపైన పండితార్యా! గలరా?
పరమానందం బాశీ
ర్భరితవచస్సులకు, మీకు ప్రణతులొనర్తున్. 



వాత్సల్యము ప్రకటించుచు(గురిపించుచు)
సత్సంగము గూర్చినారు శంకరవర్యా!
ఉత్సాహము జనియించుచు
సత్సౌఖ్యము లబ్బుచుండె చాలిక నాకున్. 


"కంది శంకరార్య! వందనంబులు మీకు
సకలశుభములొసగి చక్కనైన
స్వాస్థ్యమందజేసి సర్వేశ్వరుండెల్ల
వేళలందు బ్రోచు విజ్ఞ! మిమ్ము".  


20.10.2012  నాటి శ్రీ మాడుగుల అనిల్ కుమార్ గారి అంతర్జాల ష్టావానును గూర్చి
అంతర్జాలమునుండి మాడ్గులకవీ! యష్టావధానంబు మీ
రెంతో చక్కగ జేయుచుండిరి భళీ! యీ కార్య మాంధ్రావనిన్
సంతోషంబిక నందజేయగలదో సన్మానపాత్రా! యశ:
కాంతాసంగతి మీకు గల్గు ననిలాఖ్యా! సర్వసౌఖ్యంబులున్.  


21.10.2012 ాటి శ్రీ నేమానివారి  
శ్రీరాజాజశ్వీ స్తుతి పద్యును గూర్చి 

సర్వలోకైకమాతయై జగతినేలు
రాజరాజేశ్వరీదేవిరమ్యచరిత
మంద మొప్పంగ వర్ణించి యనఘులైన
పండితార్యుల కొనరింతు ప్రణతులేను.  


"శంకరాభరణం"  బ్లాగులో  వ్రాసిన వివిధ రచనలకు కవిమిత్రులు స్పందించి అందించిన అభినందనలు.

శ్రీ నేమాని పండితులవారు :

కరమాదరమున నంబేడ్
కరు భారతరత్నవరుని ఘనచరితము శ్రీ
కరముగ వర్ణించిన కవి
వరు నభినందింతు మూర్తి ప్రజ్ఞాశాలిన్.  

హరికులశశి మూర్తీజీ!
పరువెత్తును మీకలమ్ము భావము వెనుకే
విరబూయు పద్యసుమములు
మురిపించును పద్యప్రియుల ముచ్చటలగుచున్. 

సిరులొప్పారెడు పావనస్థలి కురుక్షేత్రంబు హర్యాణ నా
బరగున్ వేల్పుల కాలవాలమయి సద్భావమ్ముతో క్రీడికిన్
హరి బోధించెను గీత గూర్చె జయ మాహ్లాదమ్మునున్ గూర్చు సుం
దర దృశ్యంబుల పెన్నిధానమది యుత్సాహంబుతో కాంచుడీ


అని వర్ణించెను కడు క
మ్మని పద్యమ్ములను వ్రాసి మాన్యుడు ధన్యుం
డును సఖుడు మూర్తి యాతని
కొనియాడుచు దీవెనలను గూర్తును వేడ్కన్ 



హరివంశోధధి పూర్ణచంద్రనిభ తేజా! సత్యనారాయణా!
పరమాదర్శము నీ గుణోన్నతి సదా వాణీపదాబ్జార్చనా
నిరతా! సర్వసుఖమ్ములన్ గనుచు సందీపించుమా నూరు వ
త్సరముల్ నీ యిలవేల్పు నీ కొసగుతన్ సౌభాగ్య పర్వమ్ములన్. 

బాల్యదశ గూర్చి యెనిమిది పద్యములను
చక్కగా విరచించిన సత్కవీశ!
హరివరాన్వయ చంద్ర! నిన్నభినుతింతు
బాల్యదశ వినిర్మలము నమూల్యము కద 


ూపాయిని గూర్చి వ్రాసినద్యులశ్రీనేమానివారి స్పంద
హరివారికి ప్రియమైనది
సిరియేకద దాని గూర్చి చెప్పెడు వేళన్
పరవశమొందెదరు కదా
పరువెత్తును వారి కలము బలె రూపాయీ! 

ప్రిస్పంద
సిరిఁ గోరని వారొక్కరు
నరయగ భువిపైన పండితార్యా! గలరా?
పరమానందం బాశీ
ర్భరితవచస్సులకు, మీకు ప్రణతులొనర్తున్.


శ్రీ మిస్సన్న గారు:

భరతమాత సుతుని భారతరత్నమున్
ముచ్చటైన పద్యములను నిలిపి
వారికిచ్చి ఘననివాళులు భక్తితో
మించి నారు మూర్తి మేలు మేలు. 

గీత పుట్టినిల్లు క్రీడి క్రీడాంగణ
మాప గాత్మజునకు నమర ధాత్రి
కౌరవాధములకు కడపటి తావును
కనుల గట్టు రీతి ననిరి మూర్తి.  





21.10.2012 నాటి శ్రీ నేమానివారి  
శ్రీరాజాజశ్వీ స్తుతి పద్యును గూర్చి వ్రాసినద్యున 
శ్రీ నేమాని వారి ఆీస్ులు
హరి వంశ్యు మూర్తి కవివరు
కరుణామృత దృష్టి గనుచు కామిత మిడుచున్
పరమేశ్వరి ప్రోచుత యని
సరసోక్తుల తోడ నాశిషములను గూర్తున్ 


శంకరాభరణం బ్లాగు నిర్వాహకులు శ్రీ కంది శంకరయ్యగారిని ప్రశంసిస్తూ 
కందివంశజాత! వందనంబులు మీకు
సత్కవీంద్ర! మాన్య! శంకరార్య!
సర్వహితముగోరి శంకరాభరణంబు
నడుపుచున్న మీకు నతులొనర్తు.

నిత్యపద్యరచన నిష్ఠగా జేయించ
దలచి మమ్ముబోంట్ల బిలిచి సతము
పద్యపంక్తు లిచ్చి హృద్యంపువ్యాఖ్యలు
చేయు మీకు నతులు చేతునార్య!

ఎన్నిపనులు నిత్య మున్నను వాటిని
ప్రక్కనుంచి ముందు పద్యరచన
ముఖ్యమని దలంచి ముందొక పంక్తిని
మాకు నొసగు చుండు మాన్య! నతులు.

ఆపకుండ సతత మారోగ్యమునుగూడ
లెక్క చేయకుండ మిక్కిలిగను
ఉత్సహించి మాకు నుత్సాహమును బంచు
చుండు శంకరార్య! దండ మందు.

యతులు ప్రాస లరసి యత్యద్భుతంబుగా
నిట్లు మిత్రులంద రెల్ల వేళ
కవిత లల్లుటకును కారకులైనట్టి
శంకరార్య! మిమ్ము సన్నుతింతు.  





 
 

Saturday, 31 March 2012

సమస్యాపూరణలు

"శంకరాభరణం" బ్లాగులో 
ప్రతిరోజు ఇవ్వబడే సమస్యలకు చేసిన  
పూరణలు.
దూరదేశ మేగి వారాంత మందున
త్వరితగతిని ఇంటి కరుగు చుండి
జాగు చేసి తంచు సతిజూపు చిట్టలు
కలను దలచి హృదయ కమల మలరె.  1.

ఔరా! యియ్యది భారమాయనుచు తానత్యంత సంరంభియై
శూరత్వంబున కార్తికేయుడఖిలస్రోతస్వినుల్ చేరినన్
హేరంబుండవగాహియై నిలువగా హ్రీయుక్తు, నో శక్తిమం
తా! రా రమ్మని బిల్చె శంకరుడు సంధ్యావేళ నుత్సాహియై.   2

మారుని గన్నతండ్రి, పలుమారులు రూపము మార్చు దిట్ట దై
త్యారి, రమాధవుండు, సకలామరభాగ్యవిధాయకుండు, బృం
దారకకోటి రక్షణకు తన్మయభావముతోడ నప్పుడున్
మారె నతండు సుందరిగ, మంజులవాణిగ, నద్భుతంబుగన్.   3.

నందనాఖ్యాబ్దమంతయు సుందరముగ
సమత మమతలు, హృదిలోన సాగునట్లు
నఖిలకామద! వరములీవయ్య, నంద
నందనా! నీకు వేవేల నతులొనర్తు.  4. 

శంకరార్యుల కధిక తేజస్సు మరియు
స్వాస్థ్యమందించి, సాహితీ సత్త్వమొసగి,
యఖిలభారక! కాపాడవయ్య, నంద
నందనా! నీకు వేవేల నతులొనర్తు.   5.

మహ్మదీయాధినాథుని మట్టిగరపి,
బాల్యదశయందె స్వారాజ్యభవన మవుర!
భోన్సలేశుడు నెలకొల్పె భువనమందు
చిరులతయె రావి చెట్టును చీరి యణచె    6.

శ్రద్ధయే మేలు బాల్యాన  చదువు మీద,
భువిని సంసారి కాత్మబంధువులపైన
మోహపాశమ్మె మేలు, సన్మునులకెల్ల
మౌనమే మేలు, బ్రహ్మపై ధ్యాన మున్ను.   7.

కమలదళాయతాక్షునకు, కార్ముకభంగమొనర్చినట్టి యా
సమధికశౌర్యయుక్తునకు, సాధుజనావనకార్యదక్షుకున్
విమలయశోవిశాలునకు, విస్ఫురతన్ వెలుగొందు రామధీ
రమణికి సీతతో జనకరాజొనరించెను పెండ్లి వేడ్కతో.   8.

నిరతము కర్మమార్గులయి నిత్యసుఖంబులు గోరు వారికిన్
హరిహరనామ సంస్మరణ మద్భుతరీతిని సల్పువారికిన్
స్థిరతను మోక్షసిద్ధికిక చిత్తము బ్రహ్మను జేర్చు ధ్యానతత్
పరులకు రామచంద్రుని వివాహము పుణ్యఫలప్రదంబగున్.   9.

కాంచుడు రామోద్వాహం
బంచితమగు యశములొసగు, నఘముల బాపున్
పంచును విభవము శుభకర
మంచు గని తరించి రెల్ల రా పర్వంబున్.    10.

అఘవిదూరుడు(విదారుడు) రాముడే యంచు నమ్మి,
ముక్తి గోరెడు శ్రీరామ భక్తులకును
రామనామమనినరక్తి, రాక్షసులకు
మహిని ప్రాణాంతకంబు దుర్మార్గు లగుట.   11.

మన్ను తిన్నావటంచును మందలించు
జనని కప్పుడు తననోట జగములన్ని
యఖిలభారకుడై చూపు నట్టి పరమ
పురుష గర్భమే సృష్టికి పుట్టినిల్లు.    12.

కలికి పలుకున చేబూని గరళమపుడు
కుక్షిలోనున్న జగముల రక్షగోరి
యుదరమునగాక, కంఠమందుంచు పరమ
పురుష గర్భమే సృష్టికి పుట్టినిల్లు.     13.

జనని కాగోరి వ్రతములు(పూజలు) జరిపి జరిపి
మాస నవకమ్ము గర్భాన మోసి యపుడు
జన్మనిచ్చును స్త్రీమూర్తి జగతి కవుర!
పురుషగర్భ మేసృష్టికి పుట్టినిల్లు?    14.
(పురుషగర్భము+ఏ సృష్టికి పుట్టినిల్లు?) 

జనని నాపుణ్యఫలమని సంతసించి,
మాసనవకమ్ము గర్భాన మోసి నంత
జననమందును మహిలోన జనుడు, పుణ్య
పురుష! గర్భమే సృష్టికి పుట్టినిల్లు.    15.

శంకరాత్మజు గొలువంగ చవితి గలదు,
సర్పరాజుకు చూడంగ చవితి  మరియు
నాగపంచమి వచ్చును, నవమి నాడు
రామకల్యాణ మిలలోన రమ్యముగను.     16.

నిమ్మచెట్టున కాయు దానిమ్మ లట్లె,
కందిపూతకు జూడ కాకరలు నిండు,
జగతి కలికాల మేదేని జరుగ గలదు
నాగ పంచమి వచ్చును నవమి నాడు.   17.

జాతి ధర్మంబు విడనాడి భీతి లేక
పాపపుణ్యాలు తలపక పరుగులిడుచు,
తిథులు వారాలు తారలు తెలియనపుడు(తెలియకున్న)
నాగపంచమి వచ్చును నవమినాడు.    18.

ధర్మపత్నియనియె దాసిని కోపాన
విధవ!యనుచు, పిలిచె విభుడు సతిని
రాగదోయి భామ! రవ్వంత వినుమీవు
తగదు పల్కుటిట్లు తగ్గుమంచు.     19.

వేదభూమిని వసియించు విజ్ఞులార!
భగవదాధారితంబులీ జగములన్ని,
సత్యమియ్యది నమ్ముడు శ్రద్ధతోడ
దైవశక్తిని, హరియించు దనుజబలము .     20.

హరిని దలచిన ప్రహ్లాదు డనఘుడయ్యె
సుఖములను గాంచె,  త్రికరణశుద్ధిగొలువ
దైవశక్తిని, హరియించు దనుజబలము
సకలశుభములు గలుగును శాశ్వతముగ.      21.

అనయము త్రికరణశుద్ధిగ
దనుజత్వము దల్పజేయు దారుణకృత్యా
లనుచితవాక్యాలెన్నడు
కనము, వినము, పలుకమనెడు జ్ఞానులకు నతుల్.   22.

మనపుట్టుక దుర్లభమిది
ఘనతను పొందంగ వలయు కర్మలవలనన్
కనుకన్ దుస్సంగతులను
కనము, వినము, పలుకమనెడి జ్ఞానులకు నతుల్.   23.

అదను చూపించి, సంతోష మెదను నింపి,
మలయమారుత మందించు మహితములగు
కౌగిలింతలే కవులకు ఘనతనొసగు
కావ్య సృష్టిని చేయించు క్షణములోన.   24.

లలిత పదముల భావజాలమ్ముతోడ
చేయబడినట్టి రచన సుస్థిరత నంద
సంతసంబున సద్యశ:కాంత యిచ్చు
కౌగిలింతలే కవులకు ఘనత నొసగు.   25.

రాముడనంతసత్వుడభిరామగుణాఢ్యుడు సీత కోరగా
నామహితాత్ము లక్ష్మణుని యచ్చట రక్షగనుంచి తానికన్
భామకు లేమకున్ సతికి వారిజనేత్రకు కంబుకంఠికిన్
హైమమృగంబు దెత్తునని యద్భుతరీతిగ బల్కెనప్పుడున్.   26.

నీమము దప్పి నిష్ఠురతనిండిన వాక్యములాడుచుండి తా
నామెకు మైత్రిజూపక యనాదరభావముతోడ సాధ్వియౌ
భామకు లేమకున్ సతికి వారిజనేత్రకు కంబుకంఠికిన్
కామితమందనీక బహుకష్టము గూర్చగరాదు భర్తకున్.  27.

ధామము చేరినట్టి పతిదైవము చెంతన నిల్చి, మాటలన్
ప్రేమను జూపి,  నీరమిడి, వీవనవీచుచు ధర్మపత్నియౌ
భామకు లేమకున్ సతికి వారిజనేత్రకు కంబుకంఠికిన్
స్వామిని సేదదీర్చి పరిచర్యలు చేయుట ధర్మమెప్పుడున్.  28.

నామదిదోచినట్టి నిజనాథుడె సర్వశుభప్రదాత, స
ర్వామరతుల్యుడంచు, సుమభాసురభావముగల్గియున్నదౌ
భామకు లేమకున్ సతికి వారిజనేత్రకు కంబుకంఠికిన్
ధీమణికెల్లకామనలు దీరును చేరును సౌఖ్యసంపదల్.    29.

రాక్షసత్వాన సభకీడ్చి రభస చేయు
దుస్ససేనుని చర్యకు ద్రుపదపుత్రి
బెదరె, దుశ్శాసనుంగని భీముడపుడు
రౌద్రముననూగి(వాని) చంపగ ప్రతిన బూనె.    30.

ప్రాపంచికవిషయములే
పాపములకు మూలములగు, పశుపతి పూజల్,
శ్రీపతి సంస్మరణంబులు
పాపంబుల దొలగజేసి భక్తుల గాచున్.     31.

సీతను అపహరించి తెచ్చిన రావణునితో విభీషణుడిలా అంటున్నాడు.

భూపా! స్త్రీహరణంబులు
పాపములకు మూలములగు, పశుపతి పూజల్,   
నీపరనైష్ఠికత్వము
లేపాటివి, నిన్నుగూల్చుటిది సత్యమనెన్.      32.

రేపైనా, మాపైనా
పాపములకు మూలములగు, పశుపతిపూజల్
చేపట్టని దుష్కర్ముల
కాపురములు, సుఖమయంబు కాబోవెపుడున్.    33.

వనచరులకు ఖేచరులకు
ఘనులౌ సన్మునులకింక ఖద్యోతునకా
యనిలున కమరులకైనను
కనరాని విశేషములను కవి కాంచు గదా!  34.

ధనరాశులు వెచ్చించియు
ఘనయశములు పొందియైన, కాలత్రయమున్
కనగల శక్తిని కలిగియు
కనరాని విశేషములను కవి కాంచు గదా!   35.

సకల శుభములు గల్గును, చదువులబ్బు
నమ్మి యా కాణిపాక గణపతినిగన,
నింద లొదవును గాదేమి నియతిదప్పి
చందమామను చూచిన చవితినాడు.    36.

భ్రాత సీతను దెచ్చి పాపమును జేసె
నాకు నికమీద నసురగణపతిని గన
నింద లొదవును గాదే? యని రఘురాము
జేరెను విభీషణుడు శీఘ్రముగను   37.

పతినింద గల్గించు పరమ సుఖమ్ము- అనుదానికి పూరణ(ద్విపద)
అతిపారుషత్వంబులవి యెప్పుడైన
వెతలు పుట్టించును విజ్ఞత నడచు,
అతివరో! వినుమమ్మ యాత్మలోనైన
సతుల కేవేళను సలపంగ రాదు
పతినింద, గల్గించు పరమ సుఖమ్ము
పతిపాదసేవయే పత్నికెల్లపుడు
సుతులను, గతులను, నుతులింక నొసగు
సతతమైశ్వర్యంబు చక్కగా నిచ్చు
మితిమీరబోకంచు మిగుల వత్సలత
సుతకంత బోధించె సుదతి యొక్కర్తె.      38.

సతము హాయియొసగు సంతోషమందించు
శాంతమూర్తియగుచు కాంతులొసగు,
చేరి సత్వమంద జేయుశీతకరుని
కరము కరము మోదకరము గాదె.  39.


అర్థులరుదెంచి యాచింప ననవరతము
నాస్తిశబ్దంబు బలుకక వస్తుతతిని
కొసరి సంతోషమందుచు నొసగెడునర(నృప)
వరునికరము కరము మోదకరము గాదె.   40.


ఉత్సాహ
అరసి భాగ్యనగరదీప్తు లాతపార్తియుక్తులై
దరినిజేరి సేదదీర దలచి టేంకుబండుపై
స్థిరతగోరువారికా హుసేనుసాగరంపు శీ
కరము కరము మోదకరము గాదె సంధ్యవేళలన్(ఎల్లవేళలన్)  41.

శంకరాభరణంబున సంతసముగ
పూరణార్థమైయొసగిరి  సౌరులొలుక
క్రాంతి కల్పనల దలచి - క్రాంతి యనగ
కవుల కల్పన గద యంచు క్రమము గాను.   42.

క్రమత భానుండు మేషాది రాశులందు
ఘనత జేరుటె భువిని సంక్రాంతి యనగ
కవుల కల్పన గదయిక వివిధగతుల
జపము తపములు నిష్ఠతో జరుపుటెల్ల.     43.

తిరుమలేశుని దర్శించు నరులకిలను
మోదకరమైనదేదన్న ముచ్చటైన
బోడిగుండంట, జడలేమొ బోలెడంట
సకలశుభములు గూర్చెడి శంకరునకు  44.
(సకలశుభముల నొసగెడు శంకరునకు)


పుడమి కేతెంచు గంగకై జడలు విప్పె
భక్తులకుగాను లింగరూపంబు దాల్చె
భవుని లీలను వర్ణింపవచ్చు నిట్లు
బోడిగుండంట, జడలేమొ బోలెడంట.   45.

భాగ్యమడగించి, కీర్తి సంపత్తి గూల్చి,
నష్టముల గూర్చునట్టిది నరుల కిలను
కోపమే, భూషణము నీతికోవిదునకు
శాంత మటుపైన మధురోక్తి సంపదయును.    46.

అనయము సుఖదంబౌనిక
హనుమంతుని వేడుకొనిన నాయువు, దీయున్
మనమున గల వెతలన్నియు
ఘనయశములు గల్గునింక కైవల్యంబున్.   47.

కనగలము సద్యశంబులు
హనుమంతుని వేడుకొనిన, నాయువు దీయున్
ఘనతకు చేటొనరించును
మనకర్మలె, మానకున్న మహి దుర్బుద్ధుల్.    48.

అల్లసానివార లద్భుతమైనట్టి
మనుచరిత్రకర్త, మంచన గద
సరళమై వెలుంగు చక్కని కేయూర
బాహు చరితకింక భవ్యముగను.   49.


అసమానధీశాలి యలసాని పెద్దన్న
          కవిరాజు రచియించు గ్రంథమేది?
కావ్య సృష్టిని జేయు కవివరుండేమౌను
          రచనపట్లను తాను రమ్యముగను?
కీర్తినందించిన కేయూరబాహ్వాఖ్య(బాహుని)
          చరితంబు బలికిన జాణ(డె) యెవరు?
హనుమంతునకు జూడ నాయుధం బదియేది
          భాగ్యశాలికి రామభక్తునకును?
పైన చూపబడిన ప్రశ్నలన్నింటికి
వరుసమారకుండు సరణి నిట్లు
ఉత్తరంబులగును చిత్తంబులలరించు
మనుచరిత్ర, కర్త, మంచన, గద.   50.

భక్తి భరితుండు భరతుండు పాదుకలనె
హర్షమును బొంది రాముడే యంచు దలచి
గద్దె నెక్కించి పాలించి ఘనత నందె,
ధరను చెప్పునకు లభించె చెరకు తీపి.    51. 

బట్టలకు దేహరక్షణ భాగ్య, మికను
పాదరక్షణభారంబు మేదిని పయి
నరయ చెప్పునకు లభించె, చెరకుతీపి
వలెను మధురమా రెండింటి భవము జూడ.  52.

కథకుడనెడి యశము పొందు, ఘనత నందు
కరము తన్మయ భావాన హరిని దలచి

పది కథలు చెప్పగలవాడె, పండితుండు

భావ మాధుర్యమును గాంచి భళిర! యనును.  53.

వేదశాస్త్రాలు చదివిన విజ్ఞుడైన
ఘనత నందగ లేడు ప్రస్తుత కాలమందు

మాయ మాటలు బలుకుచు మమత జూపి
పది కథలు చెప్పగలవాడె పండితుండు.  54.


పచ్చి గడ్డిని తినిపించి పగలు రాత్రి
కుడితి త్రాగించి దరిచేరి కూర్మితోడ
మేను కడిగెను గేదెకు, దాని పొదుగు(చన్ను)

చేప, చన్నులలో బాలు చెంబె డుండె.   55.


నిపుణుండౌ మాంత్రికు డొక
డుపకరణము బూని చూపె ఒప్పుగ చిత్రా
లపుడాతని మహిమలలో
విపరీతపు బులుసుకూర విస్తరి మ్రింగెన్.   56.

ఉపవనమున వంటలతో
నపుడే బాలికలు క్రీడలాడుచు నుండన్
కపి యొక్కటి యటుగాజని
విపరీతపు బులుసు, కూర, విస్తరి మ్రింగెన్.   57.

అగ్రేసరుడై యరుల
న్నిగ్రహ మొనరించినట్టి నిర్మలమతి నో
కుగ్రామంబున శిలయగు
సుగ్రీవుని యెడమకాలు శునకము గఱచెన్.   58.

ఆగ్రహరహితుండాతడు
విగ్రహమా సుందరంబు, వీధిని దిరిగే
అగ్రేసర నామము గల 
సు’గ్రీవుని’ యెడమకాలు శునకు గఱచెన్.   59.

రామచంద్రుండు సదయుండు రాఘవుండు,
సకలసద్గుణ సంపన్న జనకతనయ
కరుణనెప్పుడు జగములగాచు వారి
పాదరసమన్న తీయని పానకమ్ము.   60.

బహుదుర్గతులను గనునిక
మహిళను దూషించువాడు,  మాన్యుడు జగతిన్
మహితాత్ముండన బరగును
మహిళను పూజించువాడె మహి నెల్లపుడున్.   61.

పాండుతనయుల మించిన పాపులెవరు
కనుడటందురు ప్రజలం రనుజులార! 
రండు శాంతంబె వలయు కౌరవుల పట్ల
తగ్గుడంచును వారించె ధర్మజుండు.   62.

దేశరక్షణ బాధ్యత తీసుకొనియు
బాసలలనాడు దీటుగ జేసియుండి
నిధులు మ్రింగుటె పనియను నేత నెప్పు
డేడు కొండల వాడు కాపాడలేడు.   63.

బొంకులాడెడు వానిని, శంకలేక
పాపకృత్యాల కొడిగట్టి బహుళగతుల
గురుని దూషణ జేయుచు దిరుగువాని
నేడుకొండలవాడు కాపాడలేడు.  64.

ముందు వెనుకలు చూడక మూర్ఖులగుచు
రాజమార్గాన నంధులై రయము మీరి
బండ్లు నడిపెడి మత్తుల ప్రాణవాయు
వేడు కొండలవాడు కాపాడలేడు.    65.

కారణజన్మురాలు, బహుకష్టములందిన దీమె గాన నో
ధీరగుణాభిరామ! విను దివ్యచరిత్రయు నమ్ము నీవికన్
చేరు మయోధ్య కీమెనిక చేకొని యంచును పుష్పసంతతుల్(వర్షముల్)
జార గుణంబు గల్గుసతి, సాధ్వియటంచు నుతించి రెల్లరున్.   66.

ఆ రమణీలలామ హృదయంబున నిండిన బాధనంతటన్
భూరమణుండు కిమ్మనక, పోల్చకనుండుట గాంచి యీమెకె
వ్వారలు దిక్కటంచు బహుభంగుల చింతిలి యశ్రుబిందువుల్ 
జార  గుణంబు గల్గుసతి, సాధ్వియటంచు నుతించి రెల్లరున్.   67.

చోరుడీతడు వస్త్రాపహారి యనుచు
బహువిధంబుల కృష్ణుని బలుకు చుంద్రు(డ)
బుద్ధిహీనులు, మ్రొక్కిరి మురహరునకు
తన్మయత్వాన విజ్ఞులు ధన్యులగుచు.  68.

భగవదారాధనంబును, పగలు రాత్రి 
దానధర్మాలు చేయుచు ధన్యుడగుచు
స్వర్గసుఖములు గోరెడు భర్తృదివిజ
వారకాంతా విమోహమున్ భార్య మెచ్చె.    69.

చోరుడొకరాత్రి యింటను దూరి నపుడు
మగడు లేకుంట తానేమొ మగువ యగుట
శక్తిగా మారి "శంకర! సకలభువన
భర్త!" యనుకొని, దొంగను బాదె నతివ.   70.

కావ్యనిర్మాణ దక్షులు ఘనులు వారు
కాళిదాసాదు, లెవ్వరు కవులు గారు
పద్యరచనకు పలుపాట్లు పడెడువార
లవని నాబోంట్లు మరి కవిబ్రువులు నిజము.  71.

గీర్వాణభాషలో కీర్తినందినయట్టి
          కవివరేణ్యులు కొంద రెవరటన్న?
తలుపు చప్పుడు విన్న పలికెదరేరీతి
          ఇంట నున్నట్టివా రెప్పుడైన?
కావ్యాలు రచియించి ఘనత కెక్కినవారి
          నిలలోన నేమందు రింపుగాను?
గౌరవార్థంబంచు పేర్లకు చివరలో
          చేర్చుమాటది యేది చెప్పుడనిన,
వరుస నీప్రశ్న లన్నింటి కరయ నింక
సుందరంబైన ఉత్తరం బిందె గలదు,
కాంచు డదియెట్లొ మిత్రులు క్రమముగాను
కాళిదాసాదు, లెవ్వరు, కవులు, గారు.
(కాళిదాసాదులు, ఎవ్వరు?, కవులు, గారు)   72.

తారకమంత్ర మెయ్యదియొ, ధర్మము నిల్చునొ, నిల్వదోగదా
ధీరత గల్గి దేశమున దివ్యసుఖంబులు గూడునా యికన్
భారతమందు నేడు పరిపాలకవర్గము జూడ పెక్కురున్
జారులు చోరులున్, కుటిలచారులు, దుష్టులు దుర్మదాంధులున్.  73.

ఘోరములైన పాపములకోట్లు హరించును, కీర్తి బెంచు మా
కోరికలన్ని దీర్చునని కోరి భజింపగ వేంకటేశునిన్
చేరెడువారు కేవలసుశీలురు, భక్తులె గాదు చూడగా
జారులు చోరులున్, కుటిలచారులు, దుష్టులు దుర్మదాంధులున్.  74.

తొండ ఘీంకరించెఁ దొండమెత్తి.
ఉత్సాహ-
అడవిలోని మృగములన్ని యచట సభను చేయగా
మిడిసిపాటు తోడ వచ్చి మీదదూకె మధ్యలో
దుడుకు తొండ, ఘీంకరించెఁ దొండమెత్తి దన్తి యా
గడుసుదాని చర్యకపుడు కార్యదర్శి కావునన్.    75.

కలియుగాన నేడు కనుడెన్ని వింతలో
ధరణిమీద చేప పరుగు లిడెను,
మేక లెగురు చుండె నాకాశ వీధిలో
తొండ ఘీంకరించెఁ దొండమెత్తి.  76.

పాము మాటలాడె పలుమార్లు మనిషితో
తేలు ప్రజల కెంతొ మేలు చేసె
తొండ ఘీంకరించెఁ దొండమెత్తియటంచు
కట్ట వచ్చు కథలు కలియుగంబు.   77.

అయ్యవారిని గని నవ్వె యాచకుండు.
చేయి వణకించి దానంబు చేయబోక
మాయమాటలు పల్కుచు మమత జూపు
నట్టి పిసినారి తనమున దిట్టయైన
అయ్యవారిని గని నవ్వె యాచకుండు.  78.

బంటు యజమాని తోనిట్లు పలుకు చుండె
రచ్చబండకు పెద్దలు వచ్చినారు
సాయ మొకకొంత వీనికి చేయబోకు
డయ్య! వారిని గని నవ్వె యాచకుండు.   79.


కోయ, వాడు గొట్టెఁ గుపితుడగుచు.
తోటలోన జేరి తుంటరి బాలుండు
చెట్టునెక్కి మిగుల దిట్ట యగుచు
కాపు(చు) వాని యునికి గాంచక పండ్లను
కోయ, వాడు గొట్టెఁ గుపితుడగుచు.  80.

నెత్తిమీద నాల్గు నెమలీకలను గట్టి
ఆకులలదియున్న కోకఁ జుట్టి
తిరుగువాని బాలురరయుచు నవ్వంగ
కోయవాడు గొట్టెఁ గుపితుడగుచు.  81.

ఏడువందలనిన నెక్కువగున? 

శంకరాభరణంబు సాహిత్య దీప్తికై
          చేయుచుండెను గాదె సేవలెపుడు,
దాని నిర్వాహకుల్ ధన్యులీ శంకరుల్
          పూరణల్ నిత్యంబు గోరుచుండి
పద్యపాదము లెన్నొ ప్రతిరోజు ప్రకటించి
          రచనలన్నింటికి రాత్రి పగలు
మార్గదర్శన జేసి మమతతో జ్ఞానంబు
          పంచి పెట్టుచు నుండ బహువిధాల
ఆ.వె.
పద్యరచన చేయు పద్ధతుల్ మెలకువల్
నేర్వ గల్గినాము, నిత్యమిట్లె
సాగుచుండ వలెను సాహితీ వ్యాసంగ
మేడువందలనిన నెక్కువగున?   82.

"హాలసార్వభౌము"డలనాడు ప్రచురించు
సప్తశతములైన సత్కథలను
చదువువార లెంతొ సంతోషమందరే
ఏడు వందలనిన నెక్కువగున?   83.

అందఱు నందఱే మఱియు నందఱు నందఱె యందఱందఱే
 కొందరు స్వార్థపూరితులు, కొందరు చోరకళాప్రవీణులున్
కొందరు దుర్మదాంధులిక కొందరు దుష్టులు, ధర్మదూరులున్
కొందరు ప్రాంతవాదులిట కూడిన నేతల తీరు చూడగా
నందఱు నందఱే మఱియు నందఱు నందఱె యందఱందఱే  84.

అధిక రక్తపుపోటు సౌఖ్యమ్ము గూర్చు
క్రోధ మనియెడి శత్రువు కువలయమున
కీర్తి నడగించు, కలిగించు నార్తి మరియు
నధికరక్తపుపోటు,  సౌఖ్యమ్ము గూర్చు
శాంతగుణమది చూడగ జనుల కెపుడు.     85.

అణచివేయును శక్తుల నధిక రక్తపుపోటు
          సౌఖ్యమ్ముగూర్చునా జగతిలోన?
జవసత్వములు ద్రుంచి సారహీనుని జేయు,
          నంతర్గత వివేక మణచివేయు,
వ్యాధులెన్నింటినో వరుసన బుట్టించి
          కుప్పగూల్చును దేహ మప్పటికిని
తృప్తి చెందగ లేక దీప్తులు హరియించి
          జీవచ్ఛవంబుగా జేయు నరుని
బహువిధంబులుగా నిట్లు పలుక నేల?
దాని మించిన పోటొండు ధరణిలోన

కాన రాబోదు మరి పగవాని కైన
నధికరక్తపు పోటెప్పు డంటరాదు.   86.

సినిమాలను జూచువాడు శ్రీమంతుడగున్.
అనయము భక్తిపరుండై
ఘనముగ జగదంబఁ దలచి కంజాన్వితమౌ
మునిజనహృదయాంతర్వా
సిని మాలనుఁ జూచువాడు శ్రీమంతుడగున్.  87.

పెన్నిధులు గల్గి సుఖియించు పేదవాడె.
సర్వలోకైకమాతయై జనుల కెపుడు
సిరులు పంచెడు జగదంబ చిత్స్వరూప
సన్నిధిని జేరి భక్తితో సన్నుతింపఁ
బెన్నిధులు గల్గి సుఖియించు పేదవాడె.  88.

శనిపట్టిన వారలకగు సకల శుభంబుల్ 
ఘనమౌ రుద్రప్రశ్నము
మనమును సుస్థిరముజేసి మరువనివారై
యనయము పఠియించినచో
శనిపట్టిన వారలకగు సకల శుభంబుల్   89.


 పరపురుషునికై  తపింపవలె  సతి యెపుడున్.
సరసుండై, సద్గుణుడై
యరుసంబున దీనజనుల నాదుకొనంగా
నిరతము శ్రమియించు కృపా
పరపురుషునికై  తపింపవలె  సతి యెపుడున్.  90.

నాలుగైదు కలుప నలువదయ్యె.
ముదముతోడ వ్రాసి ముప్పదియారును
కోరి ముప్పదైను వేరుగాన
వరుస మారకుండ వాటితో నటుపైన
నాలుగైదు కలుప నలువదయ్యె.  91.

గట్రాచూలికిఁ దనయుడు కందర్పు డగున్.
కట్రా వైష్ణోమాతా!
ఈట్రిక్కును వింటివమ్మ! ఈశ్వరి! నేడున్
మెట్రోయుగధర్మముచే
గట్రాచూలికిఁ దనయుడు కందర్పు డగున్.  92.

ఓ ట్రంకుల రామయ్యా!
ఈ ట్రీల చికిత్సలేల? ఇప్పటికైనన్
పట్రా యాపిల్, ద్రాక్షలు
గట్రా  చూలికిఁ దనయుడు కందర్పు డగున్.  93.

పందిరిమంచమున ముండ్లు పరచుటె మేలౌ
నిందలు సరికాదెప్పుడు
పందిరిమంచమున, ముండ్లు పరచుటె మేలౌ
చందం బెరుగక సతులను 
బందీలను చేయువారి పథముల యందున్.  94.

పందిరి మంచమున ముండ్లు పరచుటె మేలౌ
నిందలు సరికాదెప్పుడు
పందిరి మంచమున, ముండ్లు పరచుటె మేలౌ
చందం బెరుగక సతులను
బందీలను చేయువారి పథములయందున్.  95.

తప్పు లెన్నువాడె గొప్పవాడు.
విమలమతిని సఖుని వెతలలో దరిజేరి
పాలుపంచుకొనుచు పలుకరించి
సతము హితముగోరి సదసత్తు దెల్పుచు
తప్పు లెన్నువాడె గొప్పవాడు.   96.

మూర్ఖుడతడు రాజపూజితుండు
జానపదులు పల్కు సంగతులను బట్టి
మూర్ఖుడతడు, రాజపూజితుండుఁ
గాళికృపను బొంది కవికులగురుడయ్యె
కాళిదాససుకవి క్రమముగాను.   97.

పుత్రుడ నేఁ గానటంచు పుత్రుడు పల్కెన్.
"ఛత్రపతి" చిన్నతనమున
చిత్రముగా వచ్చి నిలిచి జిజియాంబికతో
శత్రుతురుష్కుల నణచక
పుత్రుడ నేఁ గానటంచు పుత్రుడు పల్కెన్.  98.

 రంకునేర్చిన చిన్నది బొంకలేదు.
రంకునేర్చిన చిన్నది బొంక - లేదు
దాని కేరీతి సౌఖ్యంబు ధరణిలోన
భావి సద్గతులుండవు భాగ్యరేఖ
తొలగిపోవును కాదని దూరముగను.   99.

కైకవిభుడు రాఘవుండు కాపాడు మిమున్
శ్రీకరుడున్, సద్గుణముల
కాకరుడౌ రామచంద్రు డఖిలాఘములన్
పోకార్చెడి ఘను డా లో
కైకవిభుడు రాఘవుండు కాపాడు మిమున్  100.