వీరబాలలం, బాలవీరులం
భరతమాత యశము పెంచు బాలవీరులం!!
భారతమున శత్రుగణము
పన్నినట్టి వ్యూహరచన
ఛేదించిన అభిమన్యుని
సోదరులం వారసులం
సాహసమే మా ఊపిరి
సౌజన్యమె మాలో సిరి
ప్రమాదాల బారిపడ్ద
వారిని రక్షించుటకై
ఎల్లవేళ దూకగల్గు
ధైర్యమ్మే అందము మరి
!!వీరబాలలం, బాలవీరులం
భరతమాత యశము పెంచు బాలవీరులం!!
పలనాటి యుద్ధమందు
అలనాడిల చెలరేగిన
బాలచంద్ర వీరునకును
తోబుట్టువులై విలసిల్లుచు
లోకంబును సాకునట్టి
సత్వంబును చూపించుచు
మునులచేత ఘనులచేత
జనులచేత సెహబాసని
అనిపించుకు మనగలిగిన
!!వీరబాలలం, బాలవీరులం
భరతమాత యశము పెంచు బాలవీరులం!!
రామాయణ కాలంబున
రాముడినే అడ్డుకొనుచు
శౌర్యంబును చూపించిన
లవకుశులకు బంధువులం
ఆ ధ్రువుడు, ప్రహ్లాదుడు
వృషకేతుడు, షణ్ముఖుడు
మా ఎదలం దెల్లప్పుడు
నివసింతురు నిరుపమమగు
తేజమును చూపింతురు
!!వీరబాలలం, బాలవీరులం
భరతమాత యశము పెంచు బాలవీరులం!!
బాలలమని, అల్పులమని
భావించము మాలోగల
పూర్వీకుల శౌర్యంబును,
వంశీయుల ధైర్యంబును,
సాహసమును, సత్వంబును
నిరంతరము స్మరియిస్తాం.
ఆపదలో చిక్కుకున్న
అసహాయుల రక్షణకై
ముందు వెనుక లెంచకుండ
అదియిది అని చూడకుండ
ధైర్యంతో చరియిస్తాం
శౌర్యంతో రాణిస్తాం
!!వీరబాలలం, బాలవీరులం
భరతమాత యశము పెంచు బాలవీరులం!!
ఈపావన భరతావని
శ్రేష్ఠారుణ దీప్తులతో
విశ్వానికి సద్గురువై
సౌఖ్యాలకు తానిరవై
వరమొసగెడి సత్తరువై
విలసిల్లుచు సుఖ్యాతిని
కొనజేయగ మాబలమును
అనిశంబును చూపెదము
!!వీరబాలలం, బాలవీరులం
భరతమాత యశము పెంచు బాలవీరులం!!