Sunday, 28 April 2024

క్రోధి

 “ఓక్రోధీ” నీకీదే స్వాగతం.

తెలుగు యుగాది, క్రోధి సంవత్సరాది.

క్రొత్త సంవత్సరం వచ్చిందనీ, క్రోధి ఆగమనం జరిగిందని

సంతోషంతో గంతులేయాలనిపించింది,

అంబరాన్నంటే సంబరం చేయాలనిపించింది.

షడ్రుచుల ఉగాది పచ్చడితో, 

సంస్కారానికి ప్రతిరూపమైన సాంప్రదాయిక వేషధారణతో, 

మధురభావాల  కవితాగానాలతో, 

పంచాంగ పఠనాలతో 

ఆనందాల సందడి చేస్తూ "మిత్రమా!క్రోధీ!" అంటూ స్వాగతం పలకాలనిపించింది,

శబ్దం, అర్థం, పద్యం, గద్యం, నవల,నాటకం, కావ్యం, గ్రంథం అన్నీ సిద్ధం చేసుకొని

హర్షంతో ప్రేమవర్షం కురిపిస్తూ

ఈసంవత్సరమంతా కలుగబోయే అదృష్టాన్ని స్మరిస్తూ

రెండడుగులు ముందుకు వేశా

దావానలంలా దేశాన్ని చుట్టిన అవినీతిభూతం ఆగమంటూ హెచ్చరించింది,

కులమతభేదాలు వద్దంటూనే 

వాటితోనే అన్ని లాభాలనూ పొందుతున్న పెద్దరికం 

ఎక్కడికంటూ ఎద్దేవా చేసింది, 

కల్లబొల్లికబుర్లే సాధనాలుగా, 

అబద్ధపుటాశలే అస్త్రాలుగా సంచరిస్తున్న మతమార్పిడుల పిశాచం 

ఎటువైపంటూ హేళనచేసింది,

ఈర్ష్యాసూయలతో సాటిమానవుల వృద్ధిని సహించలేని స్వార్థం 

"ఇది అవసరమా" అని ప్రశ్నించింది,

మాటల మాయాజాలంతో ఆకర్షిస్తూ,

అరచేతిలో వైకుంఠాన్ని చూపిస్తామంటూ టోపీలుపెట్టే కుహనాసాధుత్వం 

ఇదేం పనంటూ గర్జించింది.

చీటికీ మాటికీ ఆగ్రహిస్తూ 

కంటికి కనిపించిన దాన్నల్లా కాల్చివేస్తూ, 

చేతికందినదాన్నల్లా విరుస్తూ ఉండటమే దేశభక్తిగా ప్రకటించుకొనే ఆదర్శవారసత్వం 

ఎందుకెందుకని తర్జించింది.

అన్యభాషావ్యామోహసవనంలో మాతృభాషను బలిపశువును చేసి వీరవిహారం చేసే మహోన్నతసంస్కారవంతుల సౌజన్యం 

ఎందుకీ తాపత్రయమంటూ గద్దించింది.

తనను గద్దెకెక్కించి మనవాడనుకున్న జనం 

నిరంతరం కష్టాలఊబిలో కూరుకుపోతుంటే 

అదేమీ పట్టనట్టు స్వార్థంతో పైశాచికానందాన్ననుభవించే ఆధునికాదర్శ నేతృగణం 

వెర్రివాడవంటూ వెక్కిరించింది.

స్వధర్మంలోని శ్రేయస్సును స్వీకరించటానికిష్టపడక 

పరధర్మాలకు తలలొగ్గే మహాజ్ఞానికులం 

ఇదంతా నీ యజ్ఞానమంటూ చిందులేసింది.

వృద్ధాప్యంతో నిస్సహాయస్థితిలోఉన్న తల్లిదండ్రుల్ని ఆదరించటమే ఖేదకారణంగాభావిస్తూ 

వృద్ధాశ్రమాలపాలుచేసే ఆధినికత్వం మూర్తీభవించిన  సభ్యసమాజం 

ఏమిటీ పిచ్చిపనంటూ ప్రశ్నించింది.

భావితరానికి విద్యాబుద్ధులు నేర్పించే గురుసమూహం 

దారితప్పుతున్న విద్యార్థుల్ని మందలిస్తుంటే 

అపరాధంగా భావించి వారిని తర్జించే మహోన్నత వ్యక్తిత్వం 

ఎందుకెందుకని కళ్ళురిమింది. 

భూమాతకలంకారాలై మానవుని మనుగడను కాపాడే వృక్షసంపదను నాశనం చేస్తూ ఆధునికత్వాన్ని సృష్టించే అద్వితీయ కార్యదీక్ష ఆగాగమని హెచ్చరించింది. 

అయినా 

కాలపురుషుడి సక్రమాదేశంతో 

తనబాధ్యతల్ని, ఘనతర కర్తవ్యాల్ని

నిర్వర్తించటానికి

నిస్సందేహంగా, నిస్సంకోచంగా,  నియమబద్ధంగా

నిరుపమానందంతో, నిస్తులవేగంతో 

ఈ జగత్తున ప్రవేశించిన “క్రోధి” ఈ తర్జన భర్జనలకు వెనుకడుగు వేస్తుందా? రాను పొమ్మంటుందా?

అందుకే 

అయనద్వయంతో, 

ఋతుషట్కంతో, 

ద్వాదశమాసాలతో, 

బహుళపర్వాలతో 

విలసిల్లబోయే “ఓక్రోధీ” నీకీదే స్వాగతం. 

అన్యాయాలపై, అక్రమాలపై, అధర్మంపై నీవు సార్థక నామధేయగా ప్రవర్తించినా 

ధార్మిక, అమాయికత్వాలను ఆదరిస్తావని, అభిమానిస్తావని ఆశిస్తూ

“క్రోధీ” నీకీదే స్వాగతం.

No comments:

Post a Comment