Tuesday, 21 March 2023

శ్రీ శో భ కృ దా గ మ న ము న స్వా గ త ము

 

శ్రీ శో కృ దాముస్వా ము

శా.     శ్రీకల్యాణమయంబు తానగుచు సచ్చిత్సౌఖ్యమందించుచున్

             జీకాకుల్ తొలగించి స్వాస్థ్యవిభవశ్రీ లందగా జేయుచున్

             లోకంబందున శ్రేష్ఠహాయనముగా ప్రేమస్వరూపంబుగా

             నాకారమ్ము ధరించి వచ్చినది నూత్నాబ్దమ్ము శోభల్ గనన్.                              1.

ఉ.      శోభకృదబ్దరాజమును శుద్ధమనంబున స్వాగతించెదన్

             వైభవదీప్తి నెల్లెడల భవ్యవిధంబున జిమ్ముచున్నదై

             యా భవవిష్ణుముఖ్యులగు నాద్యసురావళివత్సలత్వ స

             త్ప్రాభవ మీ వసుంధరకు బంచగ వచ్చినదౌట బ్రీతితోన్.                       2.

శా.     వ్యానందము మానవాళి కిచటన్ బ్రాప్తింపగా జేసి స

             త్కావ్యాంతర్గతధర్మకార్యకరణాకాంక్షల్ మదిన్ నింపుచున్

             దీవ్యచ్ఛక్తులు గూర్చి జీవనమునన్ దేజంబులన్ నిల్పగా

             నవ్యాబ్దంబును స్వాగతింతు నిచటన్ స్వాంతమ్ము హర్షించగన్.              3.

మ.     కృషకుల్ నిత్యము ధారుణీస్థలమునన్ క్షేమంబు చేకూర్చు స

             ద్విషయంబున్ గొని సస్యదీప్తి కొర కేవేళన్ నిరీక్షింతు రా

             ఋషులన్ గష్టములందు ద్రోయక కొనుం డీరంచు సద్వృష్టితో

             దృషలన్ దీర్చుము వర్షరాజమ! భువిన్ దివ్యానురాగంబుతోన్.              4.

ఉ.      దానవతేజ మీభువిని ధర్మము గూల్చగ విస్తరించె నే

             డో నవవర్షమా! యఘము లొప్పగు కార్యములట్లు చేయుటల్

             మాన మటంచు నెంచుచును, మానవజాతి మహోన్నతత్వముల్

             జ్ఞానము లెందుబోయినవి? సన్మతి గూర్చగ నిన్నువేడెదన్.                              5.

మ.     తకాలం బది మేలటంచు జనముల్ కాంక్షల్ ఫలం బందకే

             ప్రతికూలత్వము గూడ నిన్ను గనుచున్ బల్మారు దూషించున

             ట్లతులానంతసుఖేతరంబులకు నీవాధారమై యుండ కీ

             క్షితిపై మంగళ మొప్పుగా నిలుపుమా! కీర్తింతు నూత్నాబ్దమా!                 6.

మ.     నమం దెంచుచు సద్ధితంబు నెపుడున్ మాట్లాడ నద్దానినే

             గొనుచున్ గార్యములట్లె చేయు బలమున్ గూడంగ దక్షత్వ మీ

             జనులం జేర్చుము నూత్నవర్షమ! భువిన్ సన్మార్గగత్వంబు తా

             మనునిత్యంబు వహించురీతి గృపతో నత్యార్ద్రచిత్తంబుతోన్.                   7.

చం.    రులను జేరి లోకమును నవ్యవిధంబున గష్టపంక్తికిన్

             నిరతము ద్రోయుచున్నయది నిస్తులమౌ యవినీతి కాంచుమా

             వరగుణ! యబ్దరాజమ! శుభప్రద! దానిని ద్రుంచు యత్న మిం

             దరయగ జేయుమా యనెద నాయతవత్సల వౌచు నిచ్చటన్.                 8.

 శా.     మున్నేరీతిని ధార్మికత్వ మిట నీ భూమిన్ మహద్దీప్తితో

             నెన్నం జాలగ నిల్చియుండినది నే డింపార నారీతిగన్

             ఛిన్నాభిన్నములైన సంస్కృతులకున్ జేర్చంగ దార్ఢ్యత్వ మా

             వెన్నున్ వేడగ రమ్ము నీ వనియెదన్ విఖ్యాత నూత్నాబ్దమా!                              9.

ఉ.      మ్ముచు స్వాగతించెదము నష్టము శోభకృదబ్దరాజమా!

             క్రమ్మగ జేయ నెంచకుము కామ్యదవై శుభదప్రభావవై

             యిమ్మహి నీదుకాలమున నెంతయు బ్రీతిని గూర్చ వేడుచున్

             రమ్మని బల్కుచుంటి నిదె రమ్యవచస్సులలోన నీయెడన్.                      10.

ఉ.      స్వాతిశయోగ్రభూతమిట సర్వజగంబున విస్తరించి  ని

   త్యాతులదుర్గతుల్ జనుల నందగ జేయుచునుండె దానినే

   రీతిని ద్రుంచగావలయు, ప్రేక్షకపాత్రను దాల్చకుండ నో

   నూతనవర్షమా! యిట వినూత్నవిధంబున సంచరించుమా.                   11.

మ.     తులన్ దప్పెను వేదశాస్త్రవిపులాఖ్యానప్రబోధక్రియా

   స్థితమాహాత్మ్యము లీ యుగాన జనులన్ జేరంగ దుర్భావనల్,

   వెతలన్నింటను నిండియుండెను మహద్విస్తారహర్షంబు దు

   ర్మతులం దంచు దలంచుచుండగను వర్షశ్రేష్ఠ! వీక్షింపుమా!                  12.

చం.    నపెర భేదభావములు తప్పని పల్కుచు వేదికాస్థలిన్

   ఘనతరబోధనల్ సలుపగా జనువారలె జాతివాదమున్

   మనమున నుంచి సాగుదురు మాన్యులమంచు వచింత్రు వారికిన్

   గొనకొని సభ్యతల్ గరుప గోరెద శోభకృదబ్దమా! యిలన్.                              13.

చం.    మునుపటి రుగ్మతాస్థితియు, మొన్నటి యుద్ధకరాళనృత్యముల్

   ఘనతరవైపరీత్యము లకారణవైరము లుగ్రవాదముల్

   జనులకు భీతి గూర్చినవి సర్వవినాశము చేయబూని, నీ

   వనుపమశక్తిశాలివయి హాయనరాజమ! నిల్వుమా యిటన్.                   14.

                   ఉ.      శోభకృదబ్దమా! యిచట జూపితి నెన్ని సమస్యలో జగ

                   ద్వైభవదర్శనస్పృహను భావమునన్ గొనుదానవౌట నీ

                   శోభను బంచు మీ భువికి సూరిజనస్తుతవౌచు నిత్య యో

                   గ్యాభయదాతవౌచు నిదె యందుము స్వాగతవాక్సుమాంజలుల్.      15.

 

శ్రీమత్ “శోభకృత్”నామ నూతనసంవత్సర యుగాది సందర్భముగా

అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు

మీ

హ.వేం.స.నా.మూర్తి,

తెలుగుభాషోపాధ్యాయుడు.

No comments:

Post a Comment