హాలికుడు
శా.
శ్రీమంతంబుగ జన్మభూస్థలమునుం జేయంగ నశ్రాంతమీ
వేమాత్రంబును విశ్రమించ కచటన్ హేమంబు పండించగా
నీమం బంది చరించుచుండెదవు నీ నిష్ఠాగరిష్ఠత్వమీ
భూమిన్ జూడగలేము వేరొక యెడన్ పూజ్యుండ వో హాలికా! 1.
మ.
ఉదయాద్రిన్ రవి చేరకుండినపుడే యుత్సాహముం జూపుచున్
మదిలో లోకహితంబు గోరెడి లసన్మంత్రంబులం బాడుచున్
సదయా! క్షేత్రము చేరబోదువుగదా! సత్యస్వరూపుండవై
యెదలో నెంచవు స్వీయ సౌఖ్యమెపుడున్ హే కర్షకా!
సన్నుతుల్. 2.
మ.
పొలమున్ దున్నెడివేళ, క్షేత్రమును
సంపూర్ణప్రభావాన్విత
స్థలముం జేయగ నెంచు కాలమున, సస్యప్రాప్తికై నిచ్చలున్
హలముం దాల్చి చరించువేళ కృషకా! హర్షంబు నీ మోముపై
కౌలువై యుండును సత్య మియ్యది జగత్కల్యాణకాంక్షీ!
నతుల్. 3.
ఉ.
ఎండలు మండుచుండినను, నేర్పడ వర్షము దాపురించినన్,
దండిగ శైత్య మెల్లెడల దాకిన నైనను, స్వీయరక్ష
లే
కుండినగాని బాధపడి యుద్యమమున్ త్యజియించకుండగా
నిండు మనంబుతోడ గణనీయత నందెద వీవు కర్షకా! 4.
తే.గీ.
సృష్టి కారకుడై యుంట స్రష్ట యయ్యె
బ్రహ్మ, భోజ్యంబు లీనేల వలసినటుల
పండ జేయుచు విశ్వాని కండ వైన
నీవు విష్ణుడ వని యందు నిజము కృషక! 5.
శా.
సంతోషమ్ము, జగద్వికాసమునకై స్వార్థత్వమున్ వీడుటల్
సుంతైనన్ సుఖకాంక్ష లేకునికి, యస్తోకానురాగంబుతో
చింతాదూరుల జేసి దేశజనులన్ క్షేమాఢ్యులం జేయు నీ
పంతంబుల్ భళి! రైతుసోదర! మహద్భాగ్యాన్వితా! దండముల్. 6.
శా.
సౌజన్యంబు వహించి ధాత్రిపయినన్ సౌభ్రాత్రముం జూపుచున్
తేజస్సంపద గూర్చుచుండు కొరకై దీవ్యత్ప్రయత్నంబుతో
నోజఃప్రాపక ఖాద్యసంచయము సద్యోగంబుగా నెంచి నీ
రేజాక్షాచ్యుతతుల్య! కర్షకవరా! ప్రేమన్ సమర్పించవే! 7.
మ.
కృషియే యోగముగా దలంచి యిచటన్ కీర్తిప్రభావాన్వితా!
వృషగోసంఘమహత్త్వతత్త్వవిలసద్విజ్ఞానసంపత్తులన్
ఋషితుల్యత్వమునంది పంచెదవు నీ వెల్లప్పుడున్ గర్షకా!
ఝషనక్రాకులవార్థిసంవృతభువిన్ శాంతస్వరూపుండవై. 8.
చం.
అలిగెడి తత్వమించుకయు నంటని సంయమి వీవు కర్షకా!
ఇలపయి నొక్కలిప్తయును నేవిధి నైనను హర్షసంతతుల్
కలుగునె కిన్కబూనుచు స్వకార్యము చేయకయుందువేని నిన్
సలలిత భావనాస్పదుని సన్నుతి చేసెదనోయి హాలికా! 9.
ఉ.
ధన్యుడవీవు, లోకమున ధర్మపథంబున సాగునట్టి స
మ్మాన్యుడవీవు, నిత్యము సమాజహితంబును గోరుచుండి సౌ
జన్యము పూనియుండెదవు సర్వజగంబుల కన్నదాతవై
దైన్యము గూల్చివేసెదవు తథ్యము నీసము లెవ్వరీ భువిన్. 10.
ఉ.
లేమికి జంకబోవు, కనలేదు సుఖంబులనంచు నెప్పుడున్
నీమము దప్పబోవు, మదినిండిన లోకహితైకకాంక్షతో
నేమరకుండ సాగెద వదేమని పంటకు తగ్గ మూల్యముల్
రామిని బల్కబోవు భళిరా! కృషకోత్తమ! నీకు సన్నుతుల్. 11.
ఉ.
పచ్చదనంబు పైరులకు ప్రాకినవేళ, సుమార్పితంబులై
హెచ్చగు సుందరత్వమున నిమ్మహి నయ్యవి వెల్గు వేళలో
పెచ్చుగ ధాన్యరాశులను వేడుక మీరగ నిచ్చువేళ నీ
వచ్చట తన్మయత్వమున నందెద వద్భుతహర్షదీప్తులన్. 12.
ఉ.
పండిన పండకున్న ననువర్షము నీ కడుపెండుచున్న లే
కుండిన వర్షపాత మెటులుండిన నైనను కాల మేగతిన్
నిండిన కష్టసంతతులు నిత్యము జీవనమందు నండయే
ఖండితమైన గాని విముఖత్వము గాంచము నీముఖంబునన్. 13.
ఉ.
విశ్వము నాకుటుంబ మను విజ్ఞత నిండిన మానసంబునన్
నశ్వరమైన జీవిక ననంతచిరస్థిరసద్యశంబులున్
శాశ్వతసౌఖ్యసంపదలు సర్వజనంబుల కార్తిహర్తవై
యీశ్వరసన్నిభా! యభిలషించక పొందెదవోయి హాలికా! 14.
శా.
నీ సద్భాగ్యము వర్ణనీయముకదా! నీకన్ననత్యున్నతుల్
వాసిం గాంచిన వారలేరి భువిలో స్వార్థంబునన్ దేహమం
దాసం జూపనివారు లోకులకునై యౌరా! ముదంబందుచున్
గాసిం గాంచెడివారు హాలికమణీ! కైమోడ్పు లందందగున్. 15.
No comments:
Post a Comment