Sunday, 30 September 2018

ఎన్నికలవేళ


ఎన్నికలవేళ

మ.
అవకాశంబు లభించనుండె వినుమా! హాస్యంబు గాదోయి! నీ
జవమున్ సత్త్వము ధీవిశేషము లిటన్ సవ్యంబుగా జూపి సం
స్తవనీయంబగు రీతి నీదు మతమున్ ధైర్యంబుగా నిల్పి మా
నవ! నీనేతల నెన్నుకోవలయు విన్నాణంబుతో నిచ్చటన్.                                              1.
ఉ.
ఎన్నికలందు గెల్పుకయి యెన్నియొ మార్గము లెంచుచుండి ము
న్నెన్నడు లేనిరీతి యవహేళన చేయుచు ధర్మపద్ధతిన్
పన్నెద  రౌర! జిత్తులను వారల మాటల కీవు లొంగుచున్
గ్రన్నన నిర్ణయమ్ములను గైకొన కుండుట నీకు యుక్తమౌ                                               2.
ఉ.
నమ్ముము భారతీయ ననాగరికాగ్రణి! యోట్ల కోసమై
కమ్మని వాక్యముల్ పలికి కర్మఠుడైనటియించువానినిన్
నమ్మెద వేని యాపయిని నైజము జూపు నధీశుడౌ తరిన్
వమ్మొనరించు భావమును వాస్తవ మియ్యది దేశమందునన్.                                           ౩.
ఉ.
నేతను నిర్ణయించు నెడ  నిష్ఠను బూనక యుందువేని నీ
వ్రాతను మార్చివేసి పలు బాధలు వెట్టు , వికాస మంచు ని
శ్చేతను జేయు నిన్నిలను శీఘ్రగతిన్ బడద్రోయు  దుఃఖ సం
ఘాతము నందు మేల్కొనుము కాదనకుండగ భారతీయుడా!                                        4.   

సీ.      ఆహార మందింతు సౌహార్దమును జూపు
డార్యులు మీరంచు నను నొకండు 
భోజనార్థము మీకు భాజనంబులు గూర్చు
బాధ్యత నాదంచు పలుకు నొకడు
వాసంబు చేయంగ వసతిని సమకూర్చు
పని నాది యని యిచ్చు వచన మొకడు
ఆరోగ్య రక్షకై యన్ని సౌకర్యాలు
కలిగింతు ననియెడి ను డొకండు
వృద్ధుల పింఛన్లు విస్తృతంబుగ నిత్తు
నాగక నేనంచు నాడు నొకడు
అండయై యుండెద నుండుడు ధైర్యాన
నని బల్కుచుండెడి యత డొకండు
తల్లులారా! నాదు తండ్రులారా! యంచు
నాదరంబున బిల్చు నాత డొకడు
సోదరుండను నన్ను నాదరించుడు మిమ్ము
నాదుకోగలనంచు నను నొకండు
ఆ.వె.
బహుళ గతుల నిట్లు పలుకుచుండెడి వారు
తామె గెల్వ గోరి తథ్యముగను
త్యాగ మూర్తు లట్లు తారసిల్లుచు నుంద్రు
వారి హృదయ మరయ  వలయు జనుడ!                                                                    5.
ఆ.వె.
కల్ల బొల్లి మాట లెల్ల కాలం బిందు
చెల్ల బోవటంచు నుల్లమునకు
తెల్లమౌ విధాన మెల్లగ జూపించు
టెల్ల యుచిత మోయి! యొల్లకొనక.                                                                           6.
ఉ.
నీ మతదానమే మనకు నిర్మలమై వెలుగొందు పాలనన్,
శ్రామిక కర్షకాదిజనసంము గాచుచు నెల్లవారికిన్
క్షేమము నిండినట్టి సుఖజీవన మందగ జేయు గావునన్
ధీమతివై సమర్ధనము దెల్పుట  యుక్తము భారతీయుడా!                                              7.
శా.
దూరాలోచన లేక యల్పసుఖముల్ తోరంబుగా నెంచి దు
ర్వారానంతమహాపదన్ పడకుమీ భాగ్యాన్వితా! భారతా!
వీరిం బూనిన స్వార్థనామక బృహద్భీతావహవ్యాధులన్
పారంద్రోలగ యోగ్య కాల మిదియే ప్రాజ్ఞత్వముం జూపుమా.                              8.
శా.
వేదప్రాభవదీప్తమైన భువిలో విస్తారరూపంబునన్
ఖేదంబున్ గలిగించు భూతములకున్ క్షీణత్వముం బంచి స
మ్మోదం బీ భువినందగల్గు ఫణితిన్ ముఖ్యంబుగా నెంచి నీ
మీదం గల్గినయట్టి బాధ్యత లిటన్ మేలంచు పూరించుమా.                                             9.
కం.
వినదగును మాటలన్నియు
నతరయోచనము చేసి కడు దక్షతతో
మనుజుల కల్యాణంబును
గని నీమత మిందు  దెల్పగావలె నోయీ.                                                                      10.
ఉ.
భావ మెరుంగు టెట్టులని పల్కెదవా? భగవాను సన్నిధిన్
దావక చిత్తమున్ నిలిపి తన్మయతన్ మలినంబు లన్నియున్
బోవగ ధ్యానమున్ సలిపి పొందగ నొప్పును శక్తి యుక్తులన్
నీవది చేసినన్ గలుగు నిర్ణయ దక్షత నిశ్చయంబుగన్.                                                    11.
ఉ.
నీకది నచ్చకున్న ననునిత్యము దీనజనాళిరక్షకై
తేకువ మీర నిల్చి సుఖదీప్తులు గాంచుచు మానసంబునన్
ప్రాకటమైనరీతి సుమబంధురభావపరంపరావళుల్
సోకెడు నట్టులుండిన వసుంధరగాచు బలంబు గూడెడిన్                                                12.
కం.
ఎటులైనను దేశంబును
పటుతరముగజేయ గల్గు భవ్యాత్మునకే
యిట  పీఠం బందగవలె
నటునిటు సడలంగ నీకు మచలాశయమున్.                                                                 13.
మ.
ఇది నీ బాధ్యత భారతీయ! వినుమా! యిప్పట్టునన్ వేరొకం
డెదలో జేరగనీకుమోయి విధిగా నెంతేనియున్ దీక్షతో
ముదమీ దేశమునందు నింపగల వామోదంబునుం దెల్పియీ
యదనున్ జేకొనుమోయి! భాగ్యదముగా నాశంక లేకుండగన్.                              14.
శా.
ఆకాశంబుననుండి దివ్యపురుషుం డత్యంతవాత్సల్యమున్
నీకై జూపుచు సత్ప్రభుత్వటనన్ నిష్ఠన్ బ్రసాదించగా
నేకాలంబుననైన రాడు మదిలో నెంతేనియున్ ధైర్య మీ
వీ కార్యంబున బూనగా వలయునోయీ!సౌఖ్య సంప్రాప్తికై.                                              15.

Saturday, 15 September 2018

గ్రామము


గ్రామము
మ.
అనురాగంబున కాస్పదంబు భువిలో నత్యంత హృద్యంబు జీ
వనకాలంబున నద్భుతంబయిన ఠేవన్ బంచు నిత్యంబు స
జ్జన సాంగత్యము గూర్చుచుండి సతమున్ సత్వోన్నతిన్ నిల్పు బో
రన మాలిన్యము ద్రుంచు భావములలో గ్రామంబు యోచించగన్.                              1.
ఉ.
అక్కున జేర్చు తల్లివలె నందగజేయును సద్యశంబిలన్
మిక్కిలి ప్రేమ జూపుచును మేలగు మార్గము నెంచ నేర్పు తి
ర్యక్కులకైన గాని కడు హర్షము గూర్చును వత్సలత్వమున్
చక్కగ జూపుచుండు పరుషం బొకయింతయు లేక పల్లె తాన్.                                   2.
మ.
ఇసుమంతైనను కల్మషంబు మదిలో నేవేళనుం దాల్ప దా
వసుసంఘంబును బిడ్డ లందరకునై భవ్యంబుగా బంచు తా
మసభావంబును బారద్రోలుచును సన్మార్గంబు జూపించి నల్
దెసలన్ హర్షము జిమ్ము గ్రామము భువిన్ దేదీప్యమానంబుగన్.                                  3.
శా.
కాలుష్యంబుల కంటకుండ శుచియై కారుణ్యసంపూర్ణయై
మేలైనట్టి విధాన సర్వజనులన్ మిథ్యాపథగ్రస్తులై
లీలం దేలకయుంట దెల్పి సుఖలాలిత్యంబు జూపించుచున్
లాలించున్ సతతంబు గ్రామము మదిన్ లక్ష్యంబులన్ నాటుచున్.                               4.
చం.
రణగొణశబ్దతాడనదురంత మహాపద కంటకుండు త
త్ఫణితినినేర్పి నిత్యమును భవ్య నిరామయ జీవనంబు స
ద్గుణమణులౌ ప్రజాళికిల గూర్చుచు సభ్యసమాజమందు స
ద్గణుతిని బొందగల్గిన విధంబును నేర్పును గ్రామమెప్పుడున్.                                    5.
చం.
నగరనివాసులై యనుదినంబును తీరిక లేక మానసం
బగణిత వేదనాభరితమై వెత లందుచు నుండ వారినిన్
తగువిధి బిల్చి బాంధవసుధారసధారల బంచి ప్రేమతో
ద్విగుణిత శక్తివైభవము తేజము జూపును గ్రామ మెల్లెడన్.                                         6.
 చం.
అతుల ముదాకరంబగుచు హాయిని బంచెడి స్థానమిద్ది, యీ
క్షితిపయి  సర్వమానవుల క్షేమము గోరెడి చోటు, నిత్య మా
గతులకు ప్రేమబంచగల కందువ, మానవ మానవత్వమున్
సతతము లోకమందునను  జాటు నివేశము, గ్రామ మెంచినన్.                             7.
చం.
నిజమగు బంధుభావములు నిక్కపుత్రోవ జరించు పద్దతుల్,
రుజలకు జిక్కి సంతతము రోజక నుండగలట్టి మార్గముల్,
త్రిజగములందు సన్నుతి, వరిష్ఠత లందుటకైన త్రోవలున్,
ప్రజలకు మానవత్వశుభ భావన నేర్పును  గ్రామమెల్లెడన్.                                         8.
శా.
గ్రామౌన్నత్యము నెంచి సర్వగతులన్ కానైన సాహాయ్యమున్
స్వామిత్వంబున సంచరించు ప్రభుతల్ సౌజన్యతాయుక్తితో
నీమంబుం గొని చేయగా వలె నికన్ నిత్యంబు తద్భావనా
సీమన్ గౌరవమొప్పచేకొనవలెన్ క్షేమంబులం గాంచగన్.                                           9.
ఉ.
గ్రామము లేనియట్టిదగు కాలము నందు బ్రపంచ మంతటన్
క్షేమము మృగ్యమౌ ననుట సిద్ధము గావున జీవనార్థులై
ధీమతులౌచు మానవులు తేజము గూర్చెడి పల్లెసీమలన్
నీమముతోడ గావవలె నిర్మలమానసమంది నిచ్చలున్.                                         10.

హ.వేం.స.నా.మూర్తి.
15.౦౯.౨౦౧౮.

Thursday, 6 September 2018

జగదంబకు వేడుకోలు


జగదంబకు వేడుకోలు
(ఉత్పలమాలిక)

అమ్మల గన్న యమ్మవని, యన్నివిధమ్ముల నండ వౌచు నిన్
నమ్మినవారి గాతు వని, నవ్యసుఖమ్ము లొసంగుచుండి ని
త్యమ్మును హర్షసంతతు నంతముగా సిరు  లిచ్చుచుండి వి
శ్వమ్మున నిర్మలమ్మయిన శాశ్వత సద్యశ మిత్తు వంచు ని
న్నిమ్మహి గొల్చుచుండెదరు  హే జగదంబ! కృపావలంబ! స
ర్వమ్మున నిండియున్న వృషవాహనమానసహారిణీ!యవి
ఘ్నమ్ముగ సర్వకార్యముల గాచుచు బ్రాపుగ నుండువానికిన్,
దమ్మము నిల్ప దేవతల దండున నాయకుడైన వాని కీ
వమ్మవు దుష్టదానవుల నంతము చేయుచు దేవతా గణం
బెమ్మెయి నైన దుఃఖముల నేసమయమ్మున గాంచకుండ నం
దమ్మగు జీవనమ్ములను తా రెపు డంది సుఖించు నట్టి కృ
త్యమ్ములు చేయుచుండెదవు  హైమవతీ! శివ! భద్రకాళి! దు
ర్గమ్మ! మృడాని! చండి! గిరిరాజసుతా! కరుణామయీ! యుమా!
నెమ్మది నిన్ను నమ్మితిని నిస్తుల శక్తియు, సత్యసూక్తు లం
దమ్ముగ బల్కు దక్షతయు, ధైర్యము నిండిన మానసమ్ము, భా
వమ్మున సర్వమానవ శుభప్రద కాంక్షయు, కర్మలందు స
త్వమ్మును జూపగల్గెడి విధమ్మును, సభ్యసమాజమందు హృ
ద్యమ్మగురీతి వర్తనము,  తన్మయతన్ గురువృద్ధదీన లో
కమ్మున కెల్లవేళల నకల్మషభావము నూని  సేవలన్
సమ్మతితోడ జేయగల సత్తువ, స్వీయదురాగతమ్ములన్
గ్రమ్మగజేసి లోకమును గాసిని ద్రోయగ జూచువారి య
త్నమ్ముల నడ్డు దక్షతయు, తద్గత క్రౌర్యము దుష్టబుద్ధులన్
వమ్మొనరించు కౌశలము, భవ్యగుణాఢ్యుల చెంత స్నేహమున్,
నమ్మక మాత్మశక్తిపయి, నైజమతమ్మున నిర్భయమ్ముగా
గ్రుమ్మరునట్టి నిశ్చయము, కూడని వానికి నేవిధమ్మునన్
నెమ్మిని జూపకుండుటయు, నిచ్చలు నీపదపద్మయుగ్మమున్
సమ్ముద మందుచున్ గొలువ జాలెడు శ్రద్ధయు, భారతమ్మునన్
గ్రమ్మిన స్వార్థరుగ్మత, నకారణ జాతివిభేదభూతమున్,
నమ్మకమందు ద్రోహము, ననాగరికత్వము, నెల్లమూలలం
జిమ్మిన నీతిబాహ్యత, నశిష్ట చరిత్రల, నార్యదూషణా
ఖ్యమ్ముల నున్నతిం జెరచు యత్నము చేసెడి యుగ్రభూత సం
మ్ముల బారద్రోలగల కాంక్షిత శక్తులు నాకొసంగి గ
ర్వమ్మున నాట్యమాడెడి నరప్రకరమ్ముల దీప్తులార్పి సౌ
ఖ్యమ్ముల నీజగమ్మునకు గల్గగ జేయు మటంచు వేడెదన్
తొమ్మిది రాత్రులన్ జనని! తోరపు భక్తిని నిష్ఠబూని నీ
కమ్మని సత్కథల్ వినుచు కౌతుక మొప్పగ నీదు కీర్తనం
బెమ్మెలు గాదు తత్పరత నెప్పుడు చేయుచు నుండువాడ నో
యమ్మ! హిమాద్రిరాజసుత! హర్షసుఖాదులు గూర్చుచుండి స
త్యమ్మున నుండువారిని, స్వధర్ముల, దీనుల, భాగ్యహీనులన్
బొమ్మనకుండ త్రాతవయి పోడిమి జూపుచు రక్ష చేసి పూ
జ్యమ్మగు సద్యశమ్ము నిడి చక్కగ సాకుచు నుండుమమ్మ! సం
మ్మున నేడు నిండిన నఘాత్మక చర్యల నాపుమమ్మ! డెం
దమ్ములలోన శుద్ధతను దాల్చెడి శక్తు లొసంగుమమ్మ! స్వాం
తమ్ములయందు సవ్య సుపథమ్ముల నేగెడి బుద్ధి నిచ్చి నీ
మమ్ముల నాదరించెడి సమాజము నిచ్చట చూపుమమ్మ! స
ర్వమ్మున నుండుదాన వను వాస్తవ మీయెడ తెల్పుమమ్మ! లే
దమ్మ యొకర్తె యన్య మము నండగ గాచెడి తల్లి యిచ్చటన్
కొమ్మిదె నమ్రతన్ నతుల కోటులు చేయుచు నున్నవాడ ని
న్నిమ్మని గోరబోవను మహేప్సిత సంపద లందమైన మా
ర్గమ్మును జూపి పుట్టుకకు రమ్యత గూర్చు మటంచు వేడెదన్.

హ.వేం.స.నా.మూర్తి.
06.09.2018.



Saturday, 1 September 2018

మానవా

మానవా
చం.
నిరతము స్వార్థచింతనము నిష్ఠను బూనుచు చేయుచుందు వీ
ధరణిని సర్వసంపదలు దాల్చి భవంబును బొందినాడవో?
పరమున కేగు కాలమున వానిని చేతధరించి పోవు త
త్సరణి నెరింగినాడవొ? విధం బిదియా వసియించ? మానవా!   1.
ఉ.
నీవొక సంఘజీవి వనునిత్యము సాటిజనాల మధ్యనే
చేవను బొందుచుండెదవు, శ్రీలు గడించుచు వారి చెంతనే
దీవన లందుచుండెదవు, దీప్తిని గాంతువు,తత్సమాజ స
త్సేవకు నూహసేయ వది చెల్లునె? యజ్ఞత యేల? మానవా! 2.
చం.
భవము నొసంగియున్న భగవానుడు నిన్నిట కంపునాడు నీ
వవనిని జేయగాదగిన దంతయు స్పష్టము చేయకుండెనే?
యవుర! యిదేమి, యీగతి నిహంబున నుంటివి? యిట్లు చేయగా
స్తవముల నందగల్గుదువె? ధన్యుడ వౌదువె యిందు? మానవా! 3.
ఉ.
పావనమైన జన్మమున బాధ్యత నెంచుచు మంచిచెడ్డలన్
భావన చేయలేని పలు ప్రాణులు సైతము సంఘసేవకై
యేవిధి తత్పరంబునను నిమ్మహిలో చరియించుచుండెనో
తావకదృష్టికిన్ తగులదా? యిది చిత్రము గాదె? మానవా! 4.
చం.
అకలుష భావనాయుతుడ వౌచును ధార్మికవర్తనంబునన్
సకలము నాత్మరూపముగ సర్వవిధంబుల నెంచుచుండి సే
వకు నగు మానసంబు గని వైభవ మందుచునుండి దేవతా
నికరము చూపు సత్కృపను నిత్యము పొందుము నీవు మానవా! 5.
ఉ.
అన్నిటికన్న మిన్నయని యార్యులు సెప్పిన యీభవంబు ము
న్నెన్నడు చేసి యున్న యఘహీన సుకర్మల సత్ఫలంబొ యిం
కెన్నడు నైన కల్గుటకు నీశ్వరసత్కృప యంద నుందువో
యెన్నగ లేవు మేలుకొను మేల విలంబము చేయ? మానవా! 6.

హ.వేం.స.నా.మూర్తి.
01.09.2018