Monday, 12 November 2012

తెలుగు భాష

తెలుగు భాషాదినోత్సవం సందర్భంగా వ్రాసిన పద్యములు
తెలుగుభాష యన్న వెలుగులు విరజిమ్ము 
భాష గాదె భువన భాండమందు 
తెలుగువార లౌట దివ్యత నందుటే 
సందియంబు లేదు ఛాత్రు లార!.

తేనె లొలుకు భాష మానితంబగు భాష
మార్దవంబు జూపు మాతృ భాష
భాషలందు జూడ బహుసుందరంబంచు
పొగడ బడిన భాష భువిని నాడు.

నన్నయాది కవుల నున్నత మూర్తుల 
నఖిలజగతి యశము నందినట్టి
భారతాదులైన బహుమూల్య గ్రంథాల
నందజేయు భాష యాంధ్రభాష.

హాయి నందజేసి  యానందమును గూర్చి
మనిషి మనసులోన మమత నింపి
సోదరత్వభావ  మాదరంబున దెల్పు
భాష యాంధ్రభాష భారతమున.

విస్తృతాదరమున వివిధ భాషల లోని
శబ్ద సంపదలను స్వాగతించి 
తన్మయత్వ మంది తనలోన జేర్చెడి
భాష తెలుగు భాష భారతమున.
యతులు, ప్రాసలు, ఛందంబు లద్భుతమగు
గుణములను గూడి మథురమౌ ఫణుతులంది
చిత్తవికసన మొనరించు, సిరులు పంచు
హాయిగా గ్రోలరారె యాంధ్రామృతమ్ము.


విశ్వజనులార! కవులార! విజ్ఞులార!
పరమహితులైన సాహితీ బంధులార!
జాగుసేయగ నికనేల? సత్వరముగ
హాయిగా గ్రోలరారె యాంధ్రామృతమ్ము.


అన్యభాషలపై మోజు నధికముగను
దాల్చగానేల? సరళమై తథ్యముగను
"దేశభాషల లెస్స"యీ తెలుగు గాన

హాయిగా గ్రోలరారె యాంధ్రామృతమ్ము.


కులము, మతములు, గోత్రాలు తలపకుండ
పిన్న పెద్దల భేదాల నెన్నకుండ
మంచి పలుకుల బ్రేమను బంచు చుండు
హాయిగా గ్రోలరారె యాంధ్రామృతమ్ము.


జనుల నొకత్రాట నిలబెట్టి యనుపమగతి
నైకమత్యము బోధించు హర్షమునను
తెలుగునకు సాటి వేరొండు కలదె యెందు?
హాయిగా గ్రోలరారె యాంధ్రామృతమ్ము.


No comments:

Post a Comment