"భారతరత్న" అంబేడ్కర్
అస్పృశ్యతాభూత మావహించిన వేళ
గళమెత్తి పల్కిన ఘనుడు తాను,
నిష్ఠతో రాజ్యాంగ నిర్మాణమొనరించి
దారిజూపించిన ధన్యజీవి,
అవమాన భారాల నంతరంగమునందు
దాచియుంచిన యట్టి ధర్మమూర్తి,
అల్పవర్గంబుల కండగా నిల్చుచు
దైన్యత దొలగించు ధైర్యయుతుడు
దీప్తులొలుకంగ భారతదేశమునకు
సేవయొనరించు నిస్స్వార్థ జీవి యతడు
రమ్యగుణశాలి, భారతరత్న మనగ
పేరు వడసిన నేత యంబేడ్కరుండు.
నిత్యదరిద్రవాయువులు నిర్భరజీవన మావహించినన్
సత్యతగోలుపోక సుఖశాంతుల నంతట పంచి పెట్టి తా
నత్యధిక ప్రయాసమున నందర కన్నిట సౌఖ్యదాయి యౌ
సత్యసుశాసనంబులను సాధన జేసి రచించె నక్కటా!
సరియగు రాజ్యాంగంబును
భరతావనికందజేయు భాగ్యవిధాతా!
ధరపై శాశ్వతముగ నీ
కరమర లేకుండగల్గు నధిక యశంబుల్.
అంబేడ్కర్ జయంతి సందర్భముగా----
మహనీయచరితుడై మానవాళికి నవ్య
పథదర్శనము చేయు వాడెవండు?
నవ్యభారతమందు భవ్యమై వెలుగొందు
రాజ్యాంగ మునుగూర్చు ప్రవరుడెవడు
నిమ్నజాతులలోన నామ్నాయసారంబు
నూరిపోసిన యట్టి సూరి యెవడు?
అవమానభారాల కందకుండగదివ్య
జీవనంబును నిల్పు శ్రేష్ఠుడెవడు
ఆత డంబేడ్కరార్యుండు నేతలందు
మించు యశములనందిన మేటి యతడు
ధీరగంభీరగుణశాలి దీప్తియుతుడు
నతులొనర్పగవలెనిప్పు
డతనికిచట.
సంబరములు జీవితమున
నంబరమును దాకు నట్టు
లాదళితాళిన్
సంబాళించిని ఘనుడీ
యంబేడ్కరు డొసగవలయు
నంజలి నేడున్ 1.
మనదేశపు రాజ్యాంగంబును
ఘనతరముగ రచనచేసి
కరుణాత్ముండై
తనసుఖముల నాశించని
ముని నిభు డంబేడ్కరుండు
మ్రొక్కుడు నేడున్ 2.
No comments:
Post a Comment