జవహర్ నవోదయ
జవహరు నెహురూ పేరున వెలసిన(నామాంకితమగు)
చదువుల నిలయం నవోదయం //జవ//
జగములనేలే జాగృతభారత
నిర్మాణానికి మహోదయం //జవ//
సద్గుణ సంయుత ఛాత్రాఖ్యంబగు
మణిమయ సదనం నవోదయం
ఆరావళి శివ నీలగిరులతో
ఉదయాచలమిది శుభోదయం //జవ//
వినయవర్తనము విజ్ఞానము గల
విమలాత్మకులౌ విద్యార్థులతో
సాధుచరితులై సత్యమూర్తులౌ
అధ్యాపకయుత నవోదయం //జవ//
చదువూ సంధ్యలు సత్య సంధతా
సమతామమతల సదాశయం
ఆటపాటల నఖిలాభ్యుదయము
మంచిని పెంచెడి మహాశయం //జవ//
కాశ్మీరంబూ కర్నాటకయూ
అంతా భారత మందరమొకటని
జాతీయైక్యత చాటుటకొరకై(సాధించుటకై)
మైగ్రేషను కిట మహోదయం //జవ//
హిందువులెవరూ యిసాయిలెవరూ
సిక్కు ముస్లిములు చిన్నా పెద్దా
సకల కులంబులు సర్వ జాతులూ
సములే యనియెడి సదాశయం //జవ//
గాంధీ స్తుతి గీతం
భారతదేశపు భాగ్య విధాతవు
భవ్య చరితుడవు బాపూజీ
కారుణ్యామృత భరితాత్మకుడవు
గర్వరహితుడవు గాంధీజీ //భారత//
జాతికి పితవయి చరితార్థుడవయి
అమల యశంబుల నందితి వయ్యా
అస్పృశ్యభావం బసురత్వంబని
సకల జగంబుల చాటితివయ్యా //భారత//
సత్యాహింసలు, సద్భావంబులు
సహనశీలమే సత్కార్యమనీ
సర్వమతమ్ములు సమాన మంచును
దివిలో భువిలో తెలిపితివయ్యా //భారత//
దేశమాటృకా దాస్యశృంఖలలు
దీక్షాదక్షత దొలగించుటకై
సర్వవిధంబుల సవ్యమార్గమని
సత్యాగ్రహములు జరిపితివయ్యా //భారత//
జన్మభూమికై సమస్త సుఖములు
తృణప్రాయముగా త్యజియించితివీ
స్వాధీనత్వము సాధించుటచే
భవసార్థక్య నందితివీ //భారత//
నీబలిదానము, నిర్మలభావము
నిత్యగానమయి నిలవాలి
భారతీయులకు "బాపూ" నామము
ప్రాత: స్మరణము కావాలి. //భారత//
విద్యాలయం(పాఠశాల)
చదువుసంధ్యలకు చక్కని నిలయము
సాధువర్తనకు నెలవుయిది,
సత్యం, ధర్మం, శాంతి యహింసలు
సమతా మమతల స్థానమిది //చదువు//అజ్ఞానంబను అంధకారమును
ఆమూలాగ్రం బంత మొనర్చుచు
జ్ఞానజ్యోతులు జగాన పంచెడి
కర్మశాలయే(యీ) విద్యాలయము //చదువు//
సమాజసేవయు, సమతాభావము
సత్ శీలంబును, సమయ స్ఫూర్తియు
బహువిద్యలతో పంచుచుండెదరు
శిష్యవత్సలత గురుజనులందరు //చదువు//సద్వినయముతో సత్పాత్రతతో
మాన్యతనందుచు మనమందరము
అన్నిటనుండుచు అధిక శ్రద్ధతో
చక్కని చదువులు చదవాలి
సత్పౌరులము కావాలి/సత్పౌరులుగా కావాలి. //చదువు//
(ధ్వజస్తుతి) మువ్వన్నెల జెండా
త్రివర్ణశోభిత సువర్ణ ధ్వజమిది
విమలతేజమున వెలుగునది
స్వతంత్రదీప్తియు, సౌభ్రాతృత్వము
సకజగంబుల చాటునది //త్రివర్ణ//
కాషాయము బహు కమనీయంబై
శ్వేతవర్ణమది శాంతిరూపమై,
హరిత యుక్తమై, అతిసుందరముగ
ఇలలో నెల్లెడ యెగిరే ధ్వజమిది //త్రివర్ణ//
జాతి విచక్షణ జనులకు తగదని
సర్వవర్ణములు సరిగా సమమని
వేదశాస్త్రముల విస్తృత భావము
దివికిని భువికిని తెలిపే ధ్వజమిది //త్రివర్ణ//
శాంతి యహింసలు, సస్యశ్యామల
మఖిలజగంబుల కావశ్యకమను
విజయసూత్రమును త్రిజగంబులకు
నిరతము చూపెడి నిర్మల ధ్వజమిది //త్రివర్ణ//
అంబేడ్కర్
వందనమయ్యా సుందరహృదయా వందనము
బాబాసాహెబ్ అంబేద్కరాఖ్యా! వందనము //వందన// దేశాలెన్నో తిరిగినవాడవు,
శాస్త్రాలెన్నో చదివినవాడవు
భారతభూమికి బహుమూల్యంబౌ
రాజ్యాగంబును కూర్చినవాడవు //వందన//
దళితసోదరుల ఉద్ధరణార్థము
అవమానములే వరదానములని
ధర్మబద్ధముగ పోరులు సల్పుచు
జీవితమంతయు గడిపిన వాడవు //వందన//
మంచిమనసుతో మహనీయతతో
కులమతభేదము కూడదటంచును
సకలజనాళికి సమతను బంచుచు
జాతిరత్నమై నిలిచినవాడవు //వందన//
వివేకానందుడు
వందనము అభివందనము
వివేకానందున కందము లొలుకగ
వందనము అభివందనము //వందన//
నిత్యానందుడు నిర్మలచిత్తుడునిఖిలాగమముల నిష్ణాతుండు
భారతీయతను బహుదక్షతతో
విశ్వజానాళికి విశదము జేసెను //వందన//
ఋషులకు ఋషియై మనీషి యనియెడు
ఖ్యాతి వహించిన ఘనచరితుండు,
వివాదరహితుడు, వివేకభరితుడు
సుందరరూపుడు సుగుణాత్మకుడు //వందన//
కార్యదీక్షితుడు, కాషాయాంబరధారణ జేసెడు ధీరాత్ముండు,
శాంతిప్రియుడును, సత్యాన్వేషియు
రూపుధరించిన హిందూ ధర్మము //వందన//
నవోదయ సద్భావగీతం
సోదరభావం మదిలో పెంచుక నవోదయంబున మెలగుదమా
తరతమ భేదము దరిరానీయక భారతీయతను చాటుదమా
//సోదర//
మమతను నింపే మైగ్రేషనులో జాతీయైక్యత కనబడగా
చదువుల క్రీడల సహజీవనమున వివేకవృద్ధియె మనబడిగా
(వినబడగా)//సోదర//
మధురవాక్యముల గురుజనులందరు ఆప్యాయతనే పంచగనూ
సర్వకాలముల సద్బోధనలో జ్ఞానదీధితులు పెంచగనూ
//సోదర//
తల్లీ తండ్రీ సర్వము తామౌ గురువుల ఖ్యాతిని పెంచుటకై
జన్మదాతలౌ జననీజనకుల స్వప్నము సత్యము చేయుటకై
//సోదర//
స్వాగతగీతం - 1
స్వాగతాంజలి విమలవినయ వినమితాంజలి
భక్తిభావకోటికుసుమపూరితాంజలి //స్వాగతా//
అతిథివరుల కధిక వత్సలాఢ్య జనులకు
సమతజూపి మమత బంచు సజ్జనాళికి //స్వాగతా//
జన్మనిచ్చి ప్రేమ బంచు జనక వరులకు
సత్యపథము జూపునట్టి సాధుజనులకు //స్వాగతా//
యుష్మదమల మార్గదర్శనంబు గావలె
అస్మదంతరంగ వికసనంబు గావలె //స్వాగతా//
స్వాగతగీతం - 2
(పూర్వవిద్యార్థుల సమావేశానికి)
స్వాగతము, (సు)ఘనస్వాగతము
అగ్రజవరులకు స్వాగతము //స్వాగ//
మీఆగమనము మిక్కిలి మోదము
మీ పథదర్శన మనుసరణీయము
మీ అనుభూతులు, మీఅనుభవములు
మాలో స్ఫూర్తిని, మంచిని పెంచును //స్వాగ//
చిన్నా, పెద్దా భేదము లేదని
మందిర మిదియని అందరు సమమను
సమరభావం - చదువులసారం
చక్కగ నేర్పే(నవోదయానికి)నవోదయంబున //స్వాగ//
(ఎయిడ్సె అవేర్ నెస్ వీక్ సందర్భంగా
విద్యార్థులతో ప్రచారం చేయించడానికి
వ్రాసిన పాటలు)
ఎయిడ్స్ - 1
వద్దుబాబు వద్దురో ఈబ్రతుకు నాకొద్దుచావొక్కటె మార్గంబు సరియైనా నిర్ణయము //వద్దు//
ఏ జన్మలొ చేశానో, ఏ పాపం చేశానో
ఈ జన్మాలోన నాకు ఈ ఎయిడ్సు రోగమొచ్చె
బహు దుర్లభమైన జబ్బు పగ వాడికి కూడ వద్దు //వద్దు//
తల్లి, తండ్రి, అన్న, చెల్లి , పెండ్లా మందరినుండి
వల్లదనెడు మాటాయె పలుకరింత కరువాయె //వద్దు//
తోటి వారి నిట్లు వదిలి దులబరింత సరియగునా?
మానవత్వ మన్నమాట మరచిపోవుటే తగునా? //వద్దు//
వద్దు వద్దు వద్దంటూ మరణము సరికాదంటూ
ఊతమిచ్చి వారిలోన ధీరతనూ పెంచాలి
అంటు వ్యాధి కాదంటూ ఎవరికంట బోదంటూ
మమత బంచి మాటలాడి మధురిమనే పంచాలి //వద్దు//
ఎయిడ్స్ - 2
ఎయిడ్సంటె ఏమిటో ఎందుకదీ వస్తుందోతెలుసుకొనగ రారండీ తెలియజేయ కదలండీ //ఎయిడ్సంటె//
మందు మాకు లేనిదండి, మహమ్మారి యిదియండీ
చక్కగ జాగ్రత్త పడితె యిది ఎవరికి సోకదండీ //ఎయిడ్సంటె//
ముట్టుకుంటె రాదండీ మాటాడిన సోకదండిఇది సోకిన వారి కింత అనురాగం పంచండి //ఎయిడ్సంటె//
దానాలన్నింటిలోన రక్తదాన మన్నారు
తెలియకుండ, తెలుసుకోక రక్తము నివ్వద్దండీ //ఎయిడ్సంటె//
ఈ రుగ్మత నున్నవాళ్ళ నింటినుండి త్రోయకండి,
బ్రతికినంత కాలమైన బలమును చేకూర్చండి //ఎయిడ్సంటె// రామరాజ్యమండి మనది రాముడు మనదైవ మండి,
ఏకపత్ని వ్రతమన్నది ఎప్పుడు మరి మరువకండి //ఎయిడ్సంటె//
తుచ్ఛమైన సుఖము గోరి విచ్చలవిడి విహరించకండి,కట్టుకున్న కులకాంతను నట్టేటా ముంచకండి //ఎయిడ్సంటె//
ఇంద్రియ నిగ్రహము గలిగి ఎయిడ్సు రోగ మంటకుండ
వలసిన జాగ్రత్తలన్ని బహు శ్రద్ధగ పాటించి
రక్షణసూత్రాలనన్ని సోదరులకు తెలియజేసి
ఎయిడ్సురహిత భారతంబు నేర్పాటు చేద్దాము //ఎయిడ్సంటె//
ఎయిడ్స్ - 3
ఎయిడ్సనే రోగమంట ఇనుకోర పోలిగాతగులు కుంటె వదలదంట తెలుసుకోర పోలిగా //ఎయిడ్సనే//
ఎయిడ్సంటే ఏమిటో ఇవరంగ చెప్పవే
ఎట్టాగది వస్తాదో ఇడమరచి చెప్పవే //ఎయిడ్సనే//
హెచ్.ఐ.వి. కణములు ఇసుమంత ఉంటేనుఎయిడ్సురోగ మౌతాది ఇనుకోర పోలిగా
సూది మార్చకుంటేను సూడరోరి పోలిగా
ఎయిడ్సు రోగ మొత్తాది ఇనుకోర పోలిగా //ఎయిడ్సనే//
ఇంకెట్టాగొస్తాది ఇవరంగ చెప్పవే
తడబడకా వడివడిగా ఇడమరచి చెప్పవే //ఎయిడ్సనే//
సొగరమేళ, గడ్డమేళ సుబ్బరంగ పోలిగాకొత్తబ్లేడు వాడకుంటే కొంపమునుగుతాదిరా
ఎట్టాంటి రగతమో ఎరగకుండా ఎక్కిస్తే
ఎయిడ్సురోగ మొస్తాది ఇనుకోర పోలిగా //ఎయిడ్సనే//
కోరికోరి నీతి దప్పి కొంపలంట తిరిగితే
కోరికలే లేకుండా కొంప ముంచుతాదిరో
మందు లేదు, మాకులేదు మాయదారి రోగంరో
సందులంట తిరగకుండ సక్కంగ నడవరో //ఎయిడ్సనే//
అమ్మలార! అయ్యలార! అందరికీ తెలపండిఎయిడ్సుబారి పడకుండా హాయిగ జీవించండి. //అమ్మలార//
ది. 31.07.2004 వ తేదీన
జ.న.వి. వెన్నెలవలస ప్రిన్సిపాల్
శ్రీ ముళ్ళపూడి కోటేశ్వరరావు గారి
పదవీవిరమణ సందర్భముగా
వ్రాసిన గేయం.
నిర్మలహృదితో మర్మములెంచక సన్మానింతము రారండీ,
కూరిమి నిండిన కోటేశ్వరునకు పదవీవిరమణ నేడండీ //నిర్మల//
ముళ్ళపూడి ద్విజవంశంబున తా ముదమొప్పంగను పుట్టెనటా
అధ్యయనార్థం బారోజులలో లండను దాకా వెళ్ళెనటా //నిర్మల//
భావిపౌరులౌ బాలబాలికలు పఠియించుటకై బహుదక్షతతో
సాంఘిక నామక శాస్త్రాంశంబులు విస్పష్టంబుగ వ్రాసెనటా //నిర్మల//
బాలబాలికల బంగరు భవితకు అహరహమూ శ్రమియించెనటా
శాంతినికేతన సదృశంబులుగ విద్యాలయములు మలచెనటా //నిర్మల//
తరతమ భేదము లేనే లేదట మార్గదర్శనను మేటియటా
తలచిన కార్యము సాధించకయే సంకల్పంబును వీడడటా //నిర్మల//
రంగస్థలమున రమణీయముగా నవరసములనే చూపునటా //నిర్మల//
సదమలయశములు సత్సంపదలు కోటేశ్వరునకు కూడవలె
జగదాధారుడు శ్రీసాయీశుడు సకలశుభంబుల నొసగవలె. //నిర్మల//
విద్యార్థులకు ప్రార్థనా సభలో జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలిపేందుకు వ్రాసిన పాట.
కామనలు శుభకామనలుజన్మదినోత్సవ కామనలు
మనలో ఒకరగు మన నెచ్చెలియగు
_______కివె శుభకామనలు //కామనలు//
శతమానాయువు, స్వస్థత నిండిన
చక్కని జీవన మబ్బాలి
సకల సంపదలు సదమలయశములు
సన్మతి నీ కెపుడందాలి //కామనలు//
ఆ భగవానుం డఖిలదుడికపైఅన్నిట జయముల నివ్వాలి
జన్మకారకులు జననీ జనకుల
కాంక్షలు సఫలము కావాలి //కామనలు//
ఇప్పటిలాగే జీవిత మంతా
నవ్వుల పువ్వులు పూయాలి
కూరిమి నిండగ నీకెన్నెన్నో
జన్మదినంబులు జరగాలి //కామనలు//
(వేడుక లిట్లే జరగాలి)
08.11.2006
జ.న.వి. వెన్నెలవలస, శ్రీకాకుళం.
శ్రీమతి పి. సుగుణకుమారి, పి.జి.టి. హిందీ, జ.న.వి.
విజయనగరం పదవీవిరమణ సందర్భంగా
సద్భావంతో సంతసమందుచు సన్మానింతము రారండీ
సద్గుణరాశికి సుగుణాఖ్యార్యకు పదవీవిరమణ నేడండీ //సద్భావంతో//
దీప్తులందుచును ద్విజవంశంబున చక్కగ జన్మము నందినదీ
జననీజనకుల కత్యుత్తమమగు సంతోషంబును కూర్చినది//సద్భావంతో//
పాఠ్యబోధనము బహుయుక్తంబని అధ్యాపికగా మారినదీ,
బోధనచేయుట పూర్వపుణ్యమని తనుహృద్భాషల తలచినది//సద్భావంతో//
నవోదయంబున నానాస్థలముల విద్యాబోధన చేసినదీ
హిందీభాషను సుందరమౌనటు లందరి కెల్లెడ చెప్పినది //సద్భావంతో//
ఎక్కడి కేగిన నెక్కడ నున్నను మిక్కిలి మక్కువ చూపినదీ
విమలాత్మకయని, విదుషీమణియని విమలయశంబుల నందినది
సద్భావంతో సంతసమందుచు సన్మానింతము రారండీ
సద్గుణరాశికి సుగుణాఖ్యార్యకు పదవీవిరమణ నేడండీ //సద్భావంతో//
దీప్తులందుచును ద్విజవంశంబున చక్కగ జన్మము నందినదీ
జననీజనకుల కత్యుత్తమమగు సంతోషంబును కూర్చినది//సద్భావంతో//
పాఠ్యబోధనము బహుయుక్తంబని అధ్యాపికగా మారినదీ,
బోధనచేయుట పూర్వపుణ్యమని తనుహృద్భాషల తలచినది//సద్భావంతో//
నవోదయంబున నానాస్థలముల విద్యాబోధన చేసినదీ
హిందీభాషను సుందరమౌనటు లందరి కెల్లెడ చెప్పినది //సద్భావంతో//
ఎక్కడి కేగిన నెక్కడ నున్నను మిక్కిలి మక్కువ చూపినదీ
విమలాత్మకయని, విదుషీమణియని విమలయశంబుల నందినది
//సద్భావంతో//
ఆభగవానుం డమితాదరమును చూపుచు దీవెన లివ్వాలి
శతమానాయువు స్వాస్థ్యం బబ్బుచు శేషజీవితము సాగాలి //సద్భావంతో//
ఆభగవానుం డమితాదరమును చూపుచు దీవెన లివ్వాలి
శతమానాయువు స్వాస్థ్యం బబ్బుచు శేషజీవితము సాగాలి //సద్భావంతో//
No comments:
Post a Comment