Sunday, 22 September 2019

సౌందర్యశతకము

సౌందర్య శతకము
(ప్రజ-పద్యం వారి ప్రోత్సాహంతో)
ఇది కదా నిజమైన అందం.

తే.గీ.
శ్రీకరంబైన భావంబు చిత్తమందు
దాల్చి యుర్విని సర్వత్ర ధర్మమందు
సంచరించుట హితకారి సర్వగతుల
నిదియె యందమ్ము నిర్మల హృదయులార!              1. 
తే.గీ.
సత్య మొక్కటి యిలలోన సర్వకాల
మతుల మైనట్టి శక్తిని మతుల నింపి
మనుజు నిటజేయు మహనీయు ననఘు గనగ
నిదియె యందమ్ము నిర్మల హృదయులార!              2.
తే.గీ.
స్వార్థభావంబు విడనాడి సర్వజనులు
నాదు పరివార మనియెంచి మోదమునను
సంచరించుట శుభకర మెంచి చూడ
నిదియె యందమ్ము నిర్మల హృదయులార!              3.
తే.గీ.
ఆశలకు బోక లోభమ్ము లేశమైన
దాల్చ కుండగ తనకున్న దానితోడ
తృప్తి నందుటలోనందు దీప్తి సతత
మిదియె యందమ్ము నిర్మల హృదయులార!             4.


తే.గీ.
పరుల ధనముల నాశించి పాపములకు
బోక సన్మార్గ గామియై పుడమిలోన
వెలుగుచుండుటలో గల్గు నలఘు సత్వ
మిదియె యందమ్ము నిర్మల హృదయులార!             5.
తే.గీ.
స్వపరభేదంబులకు బోక  సంపదలను
తోటివారికి బంచుచు మేటి యగుచు
జగతి మనుచుండ జేకూరు ప్రగతి చూడ
నిదియె యందమ్ము నిర్మల హృదయులార!              6.
తే.గీ.
తాను బలశాలి యౌట నెవ్వానికైన
బాధ గలిగించ నెంచెడి భావమునకు
కడగి వీడ్కోలు చెప్పునత జనున
కిదియె యందమ్ము నిర్మల హృదయులార!               7.
తే.గీ.
స్వీయధర్మంబు నందందు శ్రేయ మనెడు
మాట నొకపరియైనను మరువకుండ
మనుటలో నందు మోదంబు మానవునకు
నిదియె యందమ్ము నిర్మల హృదయులార!              8. 
తే.గీ.
జగతి నందిన మానవ జన్మమునకు
సార్థకత్వమ్ము గూర్చెడి సవ్యగతుల
నెరిగి చరియించు టగుగాదె సరియగు పని 
యిదియె యందమ్ము నిర్మల హృదయులార!            9.

తే.గీ.
పరుషవాక్యాలు పలుకుచు నిరుపమమగు
కష్ట మిలలోని వారికి కలుగ జేయు
వాంఛలను వీడ జేకూరు వాస్తవ సుఖ
మిదియె యందమ్ము నిర్మల హృదయులార!             10.
తే.గీ.
స్వచ్ఛభారత మిలగాంచు సన్నుతులను
గాన శుభ్రతకై బూని  నేను నిలుతు
ననెడి సద్భావమున గూడు నతులదీప్తి
యిదియె యందమ్ము నిర్మల హృదయులార!            11.
తే.గీ.
నాదు భారత మిలలోన నవ్యములగు
యశము లందంగ వలె నందు ననుపమమగు
హర్ష మొదవును నాకను టందె హాయి
యిదియె యందమ్ము నిర్మల హృదయులార!            12.
తే.గీ.
జన్మనొసగిన వారికి సన్మతియయి
సేవచేసెడి భావాన ఠీవి గనుచు
బ్రతుకుచుండటలో గాదె భాగ్య మిచట
నిదియె యందమ్ము నిర్మల హృదయులార!              13.
తే.గీ.
కలుషముల నెల్ల నదులందు గలుపుచుండి
తాను సుఖమందు భావమ్ము నూనకుండ
భాధ్యతల నెంచ నరుసమ్ము బడయవచ్చు
నిదియె యందమ్ము నిర్మల హృదయులార!              14.

తే.గీ.
కాని వానికి ననిశమ్ము కడగి బొంకు
లాడు చుండెడి ప్రకృతిని వీడి యిచట
మనుటలో నందు సంతృప్తి మానవునకు
నిదియె యందమ్ము నిర్మల హృదయులార!              15.
తే.గీ.
తనను గన్నట్టి వారలు తనకు నేర్పు
సంస్కృతులనుండు సత్వమ్ము సవ్యగతిని
తెలిసి మసలుట జనునకు స్థిరత గూర్చు
నిదియె యందమ్ము నిర్మల హృదయులార!              16.
తే.గీ.
స్వీయభాషను విడనాడి పోయి యటకు
భంగ పాటుకు గురికాక భవ్యమతిని
గోరి తనభాష నేర్చిన కూడు శుభము
లిదియె యందమ్ము నిర్మల హృదయులార!              17.
తే.గీ.
అఖిల జగమున నీవేళ నలమియుండి
భీతి గొల్పెడి యవినీతి వెంట జనక
సాధువర్తన నుండుట సభ్యత యగు
నిదియె యందమ్ము నిర్మల హృదయులార!              18.
తే.గీ.
ఆంగ్ల సంస్కృతి నిటనంది యమలమైన
స్వీయ సంస్కారములు రోయు ధ్యేయములను
విడిచి పెట్టుట యీనేల విజ్ఞతయగు
నిదియె యందమ్ము నిర్మల హృదయులార!              19.

తే.గీ.
మానవత్వంబు నిలుపుచు మమత జూపి
సాటి జనులందు సర్వధా సదయు డగుచు
మసలుచుండుట నరునకు నొసగు శుభము
లిదియె యందమ్ము నిర్మల హృదయులార!              20.
తే.గీ.
నాస్తికత్వంబునకు బోయి నైజ దీప్తి
గోలుపోకుండ నిత్య మీ నేలపైన
విజ్ఞతను జూప లభియించు వివిధ శుభము
లిదియె యందమ్ము నిర్మల హృదయులార!              21.
తే.గీ.
ప్రకృతి లోనున్న వివిధమౌ ప్రాణికోటి
యరయ తనవంటిదే యంచు సురుచిరమగు
భావమును దాల్చ సుఖములు బడయవచ్చు
నిదియె యందమ్ము నిర్మల హృదయులార!              22.
తే.గీ.
దీనజనులందు దయజూపు మానవునకు
దైవదర్శన మన్నింట తథ్యముగను
కలుగుచుండును సత్యమీ యిలను జూడ
నిదియె యందమ్ము నిర్మల హృదయులార!              23.
తే.గీ.
విద్యలను నేర్వ సర్వదా వినయమునను
సంచరించుచు నుండుట ఛాత్రతతికి
సముచితం బౌను సర్వత్ర జగతిలోన
నిదియె యందమ్ము నిర్మల హృదయులార!              24.

తే.గీ.
పెద్దలందున సద్భక్తి వివిధమైన
జ్ఞాన సముపార్జనాసక్తి సత్యయుక్తి
బాలురకు నొప్పు నిలలోన బడయ సత్వ
మిదియె యందమ్ము నిర్మల హృదయులార!             25.
తే.గీ.
సతికి పతిపైన సతతంబు సన్నుతమగు
భక్తిభావంబు విశ్వాసయుక్తి వలయు
సత్య మటులైన సుఖములు నిత్య మొదవు
నిదియె యందమ్ము నిర్మల హృదయులార!              26.
తే.గీ.
పతికి సతిపైన ననురాగ మతులమైన
నమ్మకంబుండ సంసార నౌక సాగు
సవ్యదిశలోన నిక్కమ్ము సర్వగతుల
నిదియె యందమ్ము నిర్మల హృదయులార!              27.
తే.గీ.
జన్మభూమికి ద్రోహమ్ము సలుపబూను
జనుల భావమ్ములను గాంచి సంహరించు
టుచిత మైనట్టి కార్య మీ యుర్విలోన
నిదియె యందమ్ము నిర్మల హృదయులార!              28.
తే.గీ.
గురువులకు చాత్రతతిపైన నిరుపమమగు
వత్సలత్వము కనిపింప వలయు సతము
దాన వికసించు నిలలోన జ్ఞానదీప్తి
యిదియె యందమ్ము నిర్మల హృదయులార!            29.

తే.గీ.
విద్యలందున సంస్కృతీ విభవ మెపుడు
నిండియుండిన దేశాన నుండ గలుగు
పౌరులందున సద్భక్తిభావగరిమ
యిదియె యందమ్ము నిర్మల హృదయులార!            30.
తే.గీ.
సాధుసంగంబు మదిలోని వ్యాధులకును
సమ్యగౌషధ మైయుంట సజ్జనాళి
జేరుచుండుట యుక్త మెవ్వారికైన
నిదియె యందమ్ము నిర్మల హృదయులార!              31.
తే.గీ.
భారతీయత యననేమి బహుళగతుల
ధార్మికత్వంబు సర్వత్ర కర్మలందు
నిలిపి యుంచుట యంచును  బలుక నొప్పు
నిదియె యందమ్ము నిర్మల హృదయులార!              32.
తే.గీ.
పాపభీతియు సద్భావ పరిమళంబు
సర్వ విధముల నన్నింట సమత మమత
కలిగియుండుట సద్యశోనిలయముగద
యిదియె యందమ్ము నిర్మల హృదయులార!            33.
తే.గీ.
గ్రంథ పఠనంబు తద్గత రమ్య విషయ
చయము మానస మందున జయము లంద
నిలుపు చుండుట సత్కార్య మిలను జూడ
నిదియె యందమ్ము నిర్మల హృదయులార!              34.

తే.గీ.
నిరత మెంతేని యత్నంబు స్థిరతరముగ
జేసి మనుజుండు శ్రేష్ఠుడై చిరము భువిని
యశము లందంగ వలయు తా నసదృశముగ
నిదియె యందమ్ము నిర్మల హృదయులార!              35.
తే.గీ.
నిత్య మైనట్టి యన్యాయ కృత్యములను
"ఛీ"యటంచును స్తంభింప జేయుటకయి
యువత సంసిద్ధులై యెప్పు డుండవలయు
నిదియె యందమ్ము నిర్మల హృదయులార!              36.
తే.గీ.
పెద్దవారల పనులందు పిన్న లెపుడు
చేతనైనట్టి సాయంబు చేయవలయు
నవని నటులైన జయముల నందవచ్చు
నిదియె యందమ్ము నిర్మల హృదయులార!              37.
తే.గీ.
పరమ పావన మైనట్టి భరత భూమి
కతుల యశముల నందించ నంద రిచట
యత్న మొనరించ వలయును నూత్న గతుల
నిదియె యందమ్ము నిర్మల హృదయులార!              38.
తే.గీ.
సజ్జనాళిని బీడించి సంతసంబు
కాంచుచుండెడి జనునకు గలుషమతికి
దగిన శాస్తిని జేయంగ దగును ధరణి
నిదియె యందమ్ము నిర్మల హృదయులార!              39.

తే.గీ.
సద్గుణాఢ్యున కిలలోన సంతతంబు 
భాగ్య మిదియంచు నమ్రులై ప్రణతు లిడుట
తగిన కార్యంబు నరులకు తథ్యము గద
యిదియె యందమ్ము నిర్మల హృదయులార!                      40.
తే.గీ.
సతత మత్యాశలకు బోయి సంపదలను
కూడబెట్టుట లక్ష్యమై యాడనీడ
తిరుగుచుండుట సరికాదు నరుల కిచట
నిదియె అందమ్ము నిర్మల హృదయులార!                41.
తే.గీ.
కుర్రవాండ్రకు మనమందు గోమలతయు
భవ్య మైనట్టి సంస్కృతీ వైభవంబు
నేర్పుచుండుట యుక్తంబు నిత్య మిచట
నిదియె అందమ్ము నిర్మల హృదయులార!                42.
తే.గీ.
అనిశ మిలలోన సంతానమునకు గడగి
వివిధ సంపద లైశ్వర్య మవిరళముగ
నిచ్చుటయెగాదు సంస్కార మీయనొప్పు
నిదియె అందమ్ము నిర్మల హృదయులార!                43.
తే.గీ.
సుతుడు ఖలుడైన జనకుల గతియె దోష
మందుచేతను సంతతి కందజేయ
వలయు నిరతమ్ము ధార్మిక వర్తనమ్ము
నిదియె అందమ్ము నిర్మల హృదయులార!                44.

తే.గీ.
మనుజు డనిశంబు సంతానమునకు సవ్య
మార్గదర్శన చేయుచు మహితమైన
దేశభక్తిని ధరియించ దెలుపవలయు
నిదియె అందమ్ము నిర్మల హృదయులార!                45.
తే.గీ.
సంతతికి దేశసౌభాగ్య సంపదలను
వృద్ధి పరచెడి దక్షతన్ విమలమతిని
నేర్పవలయును జనకులు నిచ్చలిచట
నిదియె అందమ్ము నిర్మల హృదయులార!                46.
తే.గీ.
స్వీయవర్తనమున జేసి విస్తృతముగ
పరుల మనములయందున బాధ కలుగు
నట్లు చరియించ కుండుట లగును ధర్మ
మిదియె అందమ్ము నిర్మల హృదయులార!               47.
తే.గీ.
కలియుగంబిది యంచును కలుషములకు
జంకకుండుట సరికాదు సర్వకాల
మవని సన్మార్గ గమనంబు నంద నొప్పు
నిదియె అందమ్ము నిర్మల హృదయులార!                48.
తే.గీ.
నరుడు సంఘాన జీవించు సురుచిరగతి
నొక్క డౌచును నేవేళ నుండలేడు
కనుక నొరులందు బ్రేమతో మనుట యొప్పు
నిదియె అందమ్ము నిర్మల హృదయులార!                49.

తే.గీ.
స్వార్థభావంబు క్రౌర్యంబు పరుషవాక్కు
ధర్మరాహిత్య మనిశంబు కర్మలందు
శ్రద్ధలేమియు త్యజియించ జనుడు వెలుగు
నిదియె అందమ్ము నిర్మల హృదయులార!                50.
తే.గీ.
పావనంబైన భారత భవ్యధర్మ
మెల్ల జగతికి జూపించి సల్లలితమగు
ఖ్యాతి గాంచుట యుక్త మీ జాతి కనయ
మిదియె యందమ్ము నిర్మల హృదయులార!             51.
తే.గీ.
సత్యవాక్పాలనార్థమై సర్వగతుల
కష్టములకోర్చి నిలబడి యిష్టముగను
సంచరించుట తగుగద జనున కెంచ
నిదియె యందమ్ము నిర్మల హృదయులార!              52.
తే.గీ.
జన్మభూమిని సంతోష ఝరులు నింప
నవసరంబైన ప్రాణంబు లడలకుండ
త్యాగధనుడౌచు నర్పించ దగును నరున
కిదియె యందమ్ము నిర్మల హృదయులార!               53.
తే.గీ.
పరుల సొమ్మును సర్పంబు పగిది జూచి
యపహరించుట కెంచ కీ యవని పయిని
భావపరిమళ మందుచు బ్రతుక వలయు
నిదియె యందమ్ము నిర్మల హృదయులార!              53.

తే.గీ.
నేతయౌవాడు సతతమ్ము నీతి దప్పి
సంచరించుచు నుండంగ సర్వగతుల
భంగపరచుట యొప్పు నవ్వాని నిచట
నిదియె యందమ్ము నిర్మల హృదయులార!              54.
తే.గీ.
ప్రజల హితమును గోరని ప్రభుతపయిని
తిరుగుబాటును జేయుట సరియగు పని
యగుట నరుడిందు పౌరుష మందవలయు
నిదియె యందమ్ము నిర్మల హృదయులార!              55.
తే.గీ.
కర్మభూమియు బహువిధ ధర్మభూమి
భారతం బౌట పురుషుండు ధీరు డిచట
కర్మఠుండౌచు సుఖములు గాంచ వలయు
నిదియె యందమ్ము నిర్మల హృదయులార!              56.
తే.గీ.
పౌరు డగువాడు శుభయుతాకారుడగుచు
దేశమంతట సద్భావదీప్తు లెపుడు
వ్యాప్తి చెందించ వలయు సంతృప్తి గలుగ
నిదియె యందమ్ము నిర్మల హృదయులార!              57.
తే.గీ.
ఖలుని వలెయుండి బహుదీర్ఘకాలమిచట
బ్రతికి యుండుట కన్నను నుతులు గాంచు
జీవనం బింత యందిన శ్రేష్ఠ మవని
నిదియె యందమ్ము నిర్మల హృదయులార!               58.

తే.గీ.
ఆస్తికత్వంబు  భాగ్యమీ యవనిలోన
గాన మనుజుండు దైవాన మానకుండ
బుద్ధి నిలుపుచు  హర్షంబు పొందవలయు
నిదియె యందమ్ము నిర్మల హృదయులార!              59.
తే.గీ.
పుట్టు సమయాన లేదయ్యె పోవునపుడు
వెంట రాదయ్యె విత్తంబు విజ్ఞమతిని
దీని దెలియుట మనుజున కౌను యుక్త
మిదియె యందమ్ము నిర్మల హృదయులార!             60.
తే.గీ.
సారహీనమ్ము చూడ సంసారమందు
రందె జగమంత బ్రభవించు నందు దీప్తి
సుఖము శుభములు చేకూరు చోటు గాన
నిదియె యందమ్ము నిర్మల హృదయులార!              61.
తే.గీ.
పైరు పచ్చల క్షేత్రాలతీరు లెప్పు
డవని నానందమున ముంచు నద్భుతముగ
వాని సంరక్షణం బొప్పు మానవునకు
నిదియె యందమ్ము నిర్మల హృదయులార!              62.
తే.గీ.
తాను సంతప్త యౌచును మానవునకు
నీడ నిచ్చెడి వృక్షంబు నిక్కముగను
దైవ మననొప్పు దానిని గావవలయు
నిదియె యందమ్ము నిర్మల హృదయులార!              63.

తే.గీ.
జగతి కాధారమై యొప్పు సతికి సతము
గౌరవంబును సమకూర్చు క్రమము నెరిగి
సంచరించుట సభ్యత సర్వజగతి
నిదియె యందమ్ము నిర్మల హృదయులార!              64.
తే.గీ.
మాతృభావాన నన్యయౌ మహిళ నెపుడు
చూచుచుండుట భువిలోన శుభకరమగు
జనున కియ్యది కర్తవ్య మనుట యొప్పు
నిదియె యందమ్ము నిర్మల హృదయులార!              65.
తే.గీ.
కనును, పెంచును, తల్లియై నత గూర్చు
నవని సోదరి, సతియౌచు జవము నింపు
లలన యాయమ కందించ వలయు సౌఖ్య
మిదియె యందమ్ము నిర్మల హృదయులార!             66.
తే.గీ.
దీనజనులందు దేవుండు జ్ఞానమూర్తి
వాసముండును సతతమ్ము వాస్తవమ్ము
దీని నెరిగిన మనుజుండు దీప్తి నందు
నిదియె యందమ్ము నిర్మల హృదయులార!              67.
తే.గీ.
హిందు వగువాడు నుదుటను సుందరమగు
తిలకధారణ మనిశమ్ము దీప్తమతిని
జేయు టొప్పగు నద్దాన జేరు శుభము
లిదియె యందమ్ము నిర్మల హృదయులార!              68.

తే.గీ.
దాన మొనరించు మనుజుండు దానివలన
ఫలితమును బొంద నిలలోన దలపరాదు
సత్య మది గూర్చు శుభములు సర్వగతుల
నిదియె యందమ్ము నిర్మల హృదయులార!              69.
తే.గీ.
సత్యమును బల్కు సమయాన నిత్య మిచట
కలుగుచుండెడి కష్టంబు దలపకుండ
ముందు కేగుట యుచిత మిందెందు గనిన
నిదియె యందమ్ము నిర్మల హృదయులార!              70.
తే.గీ.
వాదులాడుట, పెరవారి ఖేదమునను
మోదమందుట సరికాదు సాదరముగ
నెల్లవారిని బ్రేమించు టిందు సవ్య
మిదియె యందమ్ము నిర్మల హృదయులార!             71.
తే.గీ.
సంమును బట్టి పీడించు సర్వములగు
రుగ్మతల నంత మొందించ ప్రోడ యగుచు
మనుజు డుద్యోగమును జేయ జనుట యొప్పు
నిదియె యందమ్ము నిర్మల హృదయులార!              72.
తే.గీ.
ప్రకృతి లోనున్న బహువిధ భాగ్యచయము
ననుభవించుట కర్హులీ యవని జనులు
కాని యద్దాని జెరుపంగ కడగవలవ
దిదియె యందమ్ము నిర్మల హృదయులార!              73.

తే.గీ
వృత్తివిద్యలు సంస్కృతీవిభవమునకు
చిహ్నములుగాన వాటిచే సిరుల నందు
టుచిత మీభువి మానవు డుత్సహించి
యిదియె యందమ్ము నిర్మల హృదయులార!            74.
తే.గీ.
ధర్మమును గావ మనుజుండు తడయకుండ
ప్రాణములనైన తృణముల వలెను మదిని
దలచు టుచితంబు తర్కించ దలచ నేల
యిదియె యందమ్ము నిర్మల హృదయులార!            75.
తే.గీ.
తాను  భక్షించుచుండెడి దాని బట్టి
భావములు గల్గు మదిలోన వాస్తవమ్ము
కనుక సాత్వికాహారంబు గొనుట సవ్య
మిదియె యందమ్ము నిర్మల హృదయులార!             76.
తే.గీ.
దీప్తి నొసగవు జనునకు దివ్యమైన
భూషణంబులు మధురమౌ భాషణమున
నతులమైనట్టి సత్కీర్తి యంద గలుగు
నిదియె యందమ్ము నిర్మల హృదయులార!              78.
తే.గీ.
ప్రత్యహమ్మును సుఖమున బ్రాకులాట
సలుపుచుండెడి మనుజుండు క్షణము తాను
జన్మభూమికి వెచ్చించ సభ్యత యగు
నిదియె యందమ్ము నిర్మల హృదయులార!              79.

తే.గీ.
అక్షరవిహీను, నజ్ఞాను నబలుడైన
జనుని దయమాలి వంచించు టనుచితమని
తెలిసి పురుషుండు సుజనుడై మెలగవలయు
నిదియె యందమ్ము నిర్మల హృదయులార!              80.
తే.గీ.
వేదశాస్త్రాల విస్తృత విషయములను
విశ్వసించుట విశ్వస్థ విజ్ఞతతికి
విపుల లాభప్రదం బౌట విశదముగన
నిదియె యందమ్ము నిర్మల హృదయులార!              81.
తే.గీ.
బ్రతుకుటకు కూడు కావలె ప్రాణికిలను
కూటికోసమె బ్రతుకుట కూడనిపని
యనెడి సత్యమ్ము గ్రహియించ నగును హర్ష
మిదియె యందమ్ము నిర్మల హృదయులార!             82.
తే.గీ.
భారతాదులు బోధించు పద్ధతులిట
జనుని సర్వోత్తముని జేయు సర్వగతుల
కాన నవ్వాని మన్నించు టౌను యుక్త
మిదియె యందమ్ము నిర్మల హృదయులార!             83.
తే.గీ.
సాధు సంగతి సకలార్థ సాధకమయి
హితము చేకూర్చు గావున సతము జనుడు
తద్గతానందమున దేలి తనియ వలయు
నిదియె యందమ్ము నిర్మల హృదయులార!              84.

తే.గీ.
శ్రీలు గలుగంగ చెలరేగి చిందులాడి
లేమి యంటంగ దుఃఖించు టేమి భువిని?
స్థిరత యొప్పును సర్వత్ర నరున కెప్పు
డిదియె యందమ్ము నిర్మల హృదయులార!              85.
తే.గీ.
దైవమును జేరి యర్చించ దలచువేళ
భావశుద్ధియు సద్భక్తి పావనతయు
దాల్చవలె నరు డన్యంబు తలచకుండ
నిదియె యందమ్ము నిర్మల హృదయులార!              86.
తే.గీ.
ఎదుటివారికి సాయమందించువేళ
ప్రతిఫలంబును గోరుట పాడిగాదు
నిర్మలత్వము హృదయాన నిలుపవలయు
నిదియె యందమ్ము నిర్మల హృదయులార!              87.
తే.గీ.
మధురమైనట్టి యొక రెండు మాటలాడి
పరుల కొకయింత హర్షమ్ము పంచు పనికి
సంశయించుట సరికాదు సర్వగతుల
నిదియె యందమ్ము నిర్మల హృదయులార!              88.
తే.గీ.
కన్నవారిని, జ్ఞానసంపన్నుల నిక
గురుజనాళిని సజ్జనవరుల నెపుడు
చేరి  సేవించు టొప్పగు నేరికైన
నిదియె యందమ్ము నిర్మల హృదయులార!              89.

తే.గీ.
మాతృభాషానురక్తుడై మానవుండు
నిరత మద్దాని నాత్మలో నిలుపుకొనుచు
హాయి నందుట యుచిత మిం దన్నిగతుల
నిదియె యందమ్ము నిర్మల హృదయులార!              90.
తే.గీ.
కవిత వ్రాయంగ దక్షత గలుగువాడు
సంహితమును గోరుచు సన్నుతమగు
రచన చేయంగవలయును రమ్యగతిని
నిదియె యందమ్ము నిర్మల హృదయులార!              91.
తే.గీ.
ఎన్ని యిబ్బందు లెదురైన నేడనున్న
స్వీయ ధర్మంబు విడనాడ జిత్తమందు
తలచు టైనను సరికాదు తెలియు డెల్ల
రిదియె యందమ్ము నిర్మల హృదయులార!              92.
తే.గీ.
సవ్యమార్గాన నడచుచు సన్నుతమగు
భావమును దాల్చి యుండుట భావిగతికి
సాధనమ్మిందు లేదింత సంశయమిట
నిదియె యందమ్ము నిర్మల హృదయులార!              93.
తే.గీ.
ఆడజాలక మద్దెల యోడటంచు
పలుకునట్లుగ యుగమిది కలి గదయని
తెలుప సరికాదు యత్నమ్ము సలుపవలయు
నిదియె యందమ్ము నిర్మల హృదయులార!              94.

తే.గీ.
పెద్ద లందున సద్భక్తి పిన్నలయెడ
వత్సలత్వంబు ప్రేమయు పరుల యెడల
జూపగలిగిన మనుజుండు శుభము లరయు
నిదియె యందమ్ము నిర్మల హృదయులార!              95. 
తే.గీ.
నాదు ధర్మంబు బహువిధ మోదకారి
యున్నతోన్నత మన్నింట నుర్విలోన
ననుచు చాటుటలో సత్వ మమరియుండు
నిదియె యందమ్ము నిర్మల హృదయులార!              96.
తే.గీ.
న్యాయమును గాతు నాకున్న ధ్యేయమునకు
క్షతిని జేకూరనీయ నీ క్షితిని సతత
మనెడు స్థైర్యంబు గావలె జనున కెప్పు
డిదియె యందమ్ము నిర్మల హృదయులార!              97.
తే.గీ.
బహుళయశముల నందిన భరతభూమి
నాదు జనయిత్రి యీయమ కేదియేని
హాని రానీయ ననుట సన్మాన మిచ్చ
టిదియె యందమ్ము నిర్మల హృదయులార!              98.
తే.గీ.
చదువు నేర్చెడి కాలాన ఛాత్రతతికి
నస్మదాచార ధర్మంబు లందజేయ
వలయు సత్పౌరులైయిందు నిలుచు కొరకు
నిదియె యందమ్ము నిర్మల హృదయులార!              99.

తే.గీ.
ఇలను జెట్లను నదుల గోవులను బసుల
తనకు నాదర్శములుగ జేకొనుట తగును
పరహితంబును గోరెడి పనికి సతత
మిదియె యందమ్ము నిర్మల హృదయులార!             100.
తే.గీ.
ఆధునిక మెంచి సంస్కృతి నణచబోక
ముంగిళులలోన చక్కని మ్రుగ్గు బెట్టి
యతిథులను స్వాగతించు టీయవనినొప్పు
నిదియె యందమ్ము నిర్మల హృదయులార!              101.
తే.గీ.
భువిని సాంకేతికత్వంబు పూర్ణముగను
నిండియున్నను జాతికి మెండు కీర్తి
నందజేసెడి వృత్తుల నింద కూడ
దిదియె యందమ్ము నిర్మల హృదయులార!              102.
తే.గీ.
వివిధరూపాలలోనుండి భువికి సుఖము
లందజేసెడి భగవాను డరయ నొక్క
డనెడి భావాన మనుజుండు మనుట యొప్పు
నిదియె యందమ్ము నిర్మల హృదయులార!              103.
తే.గీ.
తలచి చేపట్టు కర్మలం దలయకుండ
విఘ్నతతులకు బెదరక విమలమతిని
ముందు కేగుట ధర్మంబు మోదకారి
యిదియె యందమ్ము నిర్మల హృదయులార!            104.

తే.గీ.
పలుకు లందున మధురిమ తలపులోన
నిర్మలత్వమ్ము ధరియించి నిష్ఠబూని
కర్మలను జేయ శుభములు కలుగుచుండు
నిదియె యందమ్ము నిర్మల హృదయులార!              105.
తే.గీ.
కలలు నిజమౌను సత్యమ్ము కల్లకాదు
సముచితంబైన యత్నమ్ము సన్నుతగతి
విశ్రమించక చేసెడి విజ్ఞమతికి
నిదియె యందమ్ము నిర్మల హృదయులార!              106.
తే.గీ.
ఫలములనుగోరి నిత్యమ్ము పరు గదేల
భావశుద్ధిని కర్మయే దైవ మనుచు
దలచి యత్నించ సిద్ధించు ధరణిలోన
నిదియె యందమ్ము నిర్మల హృదయులార!              107.
తే.గీ.
వారు వీరంచు నెంచక బహుళమైన
కష్టముల నున్న వారల కడకు జేరి
చేతనైనంత సాయమ్ము చేయవలయు
నిదియె యందమ్ము నిర్మల హృదయులార!              108.
తే.గీ.
సవ్యరీతిని హరివంశసంభవుండు
సత్యనారాయణుడు వ్రాసె సంతసమున
సాధుచరితుండు సౌందర్య శతక మిట్టు

లిదియె యందమ్ము నిర్మల హృదయులార!              109.


హ.వేం.స.నా.మూర్తి.
22.09.2019.


Saturday, 21 September 2019

ఇది కదా నిజమైన అందం.


ఇది కదా నిజమైన అందం.

కం.
శ్రీకరమగు యత్నంబును
ప్రాకటముగ నందియుండి బహుకార్యములన్
జేకొని జనహిత మిందని
యేకాలము జేయు టెల్ల యిందందమగున్.                                       ౧.
చం.
సదమలమైన చిత్తమున సన్నుతరీతిని సాధుభావ సం
పదలను నింపి సంతతశుభంబులు జీవనమందునందగా
నదనున జాగృతిం గనుట యన్నివిధంబుల యోగ్యకార్యమౌ
నిదియె కదా మనుష్యునకు నిచ్చట నందము గూర్చు నెన్నడున్.          ౨.
ఉ.
సంతతమీధరాస్థలిని సర్వజనంబుల కన్నిరీతులన్
సంతస మందుచుండవలె, సౌఖ్యము గూడుచు జీవనంబునన్
దంతట నిండుచుండవలె నద్భుత సద్విజయంబులంచు తా
నెంతయు బ్రీతి నెంచుటయె యిచ్చట నందము గూర్చు నెన్నడున్.      3.
మ.
తనకన్నింటను సౌఖ్య మందుటకునై ధర్మంబునున్ వీడి నూ
తనమార్గంబులు వంచనార్థ మిచటన్ తానందగా జూచుచున్
మనుజుండిందు జరించకుండ హృదిలో మాలిన్యమున్  వీడుటం
దనుమానం బొకయింతలేదు  సొగ సత్యంతంబు సంధిల్లెడిన్.               4.  
శా.
నీనాభేదము లెంచకుండ శుచియై నిత్యంబు లోకంబునన్
వానిన్ వీనిని నాత్మతుల్యులనుగా భావించి కల్యాణ మిం
దేనాడైనను సర్వమానవులకై యెప్పట్టునన్ గోరుచున్
దానన్ సంతస మందుచుండటయె యందంబన్న సత్యంబగున్.           5.
సీ.
తనకు జన్మంబిచ్చు తల్లిదండ్రులయందు
………………………….దయగల్గియుండుట, ధరణిలోన
దీనులై చరియించు మానవాళినిజేరి
………………………….యండయై నిలబడి యుండుటయును,
స్వార్థమ్ము విడనాడి జన్మమందలి మర్మ
………………………….మాత్మలో సంతత మరయుటయును
జన్మభూమికి రక్ష సద్భక్తుడై చేయ
………………………….సంసిద్ధుడై యుండి సాగుటయును
తే.గీ.
భువిని జన్మించి యున్నట్టి పురుషున కిట
సమ్యగానంద సంధాయి సత్వదాయి
యగును సత్యమ్ము సందియ మందనేల
యదియె యందమ్ము నిర్మల హృదయులార.                          6. 


Sunday, 15 September 2019

సమర శతకము


తప్పక సమరమును జేయదగును.
(సమర మెల్లగతుల సలుప దగును).
సమర శతకము
ఆ.వె.
శ్రీల నందగోరి మేలైన సౌఖ్యముల్
పడయుచుండి సతము వసుధపైన
తిరుగదలచువాడు నిరత ముద్యోగియై
సమర మెల్లగతుల సలుప దగును.                           1.
ఆ.వె.
జీవనంబు నందు దైవత్వమును గాంచి
దుష్టభావనమును ద్రోయ దలచు
వాడు నిత్య మిచట బహుయత్నయుక్తుడై
సమర మెల్లగతుల సలుప దగును                            2.
ఆ.వె.
ధర్మకార్యమందు ధన్యత్వమును గాంచ
దలచువాడు భువిని దనుజులపయి
దీక్షబూని స్వీయ తేజంబు చూపించి
సమర మెల్లగతుల సలుప దగును                            3.
ఆ.వె.
సత్యనిష్ఠతోడ సర్వత్ర చరియించు
చుండి విజ్ఞు డౌచు నుండగోరు
వాడు బొంకులాడు వారితో సర్వదా
సమర మెల్లగతుల సలుప దగును.                           4.
ఆ.వె.
దేశమందు భక్తి దివ్యమౌ ధీశక్తి
కలిగియుండు వాడు పలువలందు
సన్నుతించురీతి సత్వంబు జూపించి
సమర మెల్లగతుల సలుప దగును.                           5.
ఆ.వె.
దీనజనులయందు దివ్యత్వముం జూడ
దలచి దీక్షబూని మెలగువాడు
మనసులోన జేరు దనుజభావంబుతో
సమర మెల్లగతుల సలుప దగును.                           6.
ఆ.వె.
సకలజనులలోన సర్వేశ్వరుని జూడ
నుత్సహించి మనుచు నుండువాడు
విస్తృతముగ జేరు విఘ్నసంతతితోడ
సమర మెల్లగతుల సలుప దగును.                           7.
ఆ.వె.
శక్తి జూపుచుండి సమసమాజమునందు
హాని గూర్చునట్టి యసురభావ
ములను ద్రుంచు కొరకు ఖలులపై విజ్ఞుండు
సమర మెల్లగతుల సలుప దగును.                           8.
ఆ.వె.
స్వార్థబుద్ధితోడ సంఘంబునకు గీడు
కలుగ జేయుచుండు కఠినులందు
కరుణ పనికిరాదు నిరతంబు మనుజుండు
సమర మెల్లగతుల సలుప దగును.                           9.
ఆ.వె.
అనయ మిచట జేరి నపిశాచము లట్లు
కరుణ లేక  నరుని జెరచుచుండు
దుఃఖ మందజేయు దుర్నీతులను ద్రుంచ
సమర మెల్లగతుల సలుప దగును.                           10.
ఆ.వె.
బలము గలుగువాడు బలహీనులను జేరి
మానధనములన్ని దానవుడయి
యపహరించుచుండ నవ్వాని నణచంగ
సమర మెల్లగతుల సలుప దగును.                           11.
ఆ.వె.
పాలకుండు నౌచు బహుభంగులను దేశ
హితము గోరకుండ నతులమైన
స్వార్థబుద్ధితోడ సంచరించుచునుండ
సమర మెల్లగతుల సలుప దగును.                           12.
ఆ.వె.
సాధువర్తనాన జగతికి గల్యాణ
మంద జేయువారి కనుపమ మగు
కష్ట మొదవజేయు కఠినాత్ములను జీరి
సమర మెల్లగతుల సలుప దగును.                           13.
ఆ.వె.
సన్నుతించదగిన సన్మార్గములయందు
సంచరించువాని సత్త్వములకు
బాధ కూర్చునట్టి పాపులపై నిత్య
సమర మెల్లగతుల సలుప దగును.                           14.
ఆ.వె.
సద్యశంబు లంది సర్వకాలములందు
జగతిలోన నిలువ దగిన రీతి
నుండ దలచువార లొప్పార నముపై
సమర మెల్లగతుల సలుప దగును.                           15.
ఆ.వె.
స్వీయధర్మ మొసగు శ్రేయంబులని నమ్మి
తద్గతాస్థ గలుగు ధైర్యశాలి
నిద్రబోక సతము తద్రక్షణార్థమై
సమర మెల్లగతుల సలుప దగును.                           16.
ఆ.వె.
భువిని జీవనంబు బుద్బుదప్రాయంబు
కనుక యాలసించ కనుదిన మిట
మంచిపనులు చేయ మనవలె, చెడుగుపై
సమర మెల్లగతుల సలుప దగును.                           17.
ఆ.వె.
వసుధలోన నిచట వర్తమానమునందు
ప్రగతి నడ్డగించి బహుళమైన
ము గూర్చుచున్న యవినీతిపై గోరి
సమర మెల్లగతుల సలుప దగును.                           18.
ఆ.వె.
కవిత వ్రాయగలిగి కవియౌచు వెలుగొందు
విజ్ఞవరుడు నేడు విశ్వమందు
నలమి యుండినట్టి కలుషజాలంబుపై
సమర మెల్లగతుల సలుప దగును.                           19.
ఆ.వె.
ఒరుల నేమి యనక యుత్తముం డనురీతి
మసలుచుండువాని మనమునకును
బాధ గలుగజేయు పాపాత్ము నణచంగ
సమర మెల్లగతుల సలుప దగును.                           20.
ఆ.వె.
సంమందు నేటి సామాన్య జనులకు
నందకుండ ధరలు నాకసమున
జేరుచుండ నిచటి వారలు దీక్షతో
సమర మెల్లగతుల సలుప దగును.                           21.
ఆ.వె.
రాజకీయ మనుచు రావణభావాలు
రుద్దుచుండు వారి పెద్దరికము
నణచ బూని పౌరు డత్యంత శక్తితో
సమర మెల్లగతుల సలుప దగును.                           22.
ఆ.వె.
సేవలంది యుండి జీవనంబున కైన
భృతిని జూపకుండ నతులకష్ట
మొసగు వానిపైన నసదృశసత్త్వాన
సమర మెల్లగతుల సలుప దగును.                           23.
ఆ.వె.
అవనిలోన నున్న యంధవిశ్వాసాల
యునికి గూలద్రోసి యుత్సవంబు
లిచట జేయగోర నెంతేని దీక్షతో
సమర మెల్లగతుల సలుప దగును.                           24.
ఆ.వె.
తోరమౌచునున్న దుష్కృత్యములకిందు
నునికి నణచివేసి యనుపమమగు
హాయి నిలకు నిత్య మందించ దలచిన
సమర మెల్లగతుల సలుప దగును.                           25.
ఆ.వె.
మున్ను తాను చేసి యున్నవాగ్దానాల
నొక్కటైన గాని యొప్పు మీర
తీర్చనట్టి నేత తీవర మణచంగ
సమర మెల్లగతుల సలుప దగును.                           26.
ఆ.వె.
వీరు వారటన్న భేదభావంబులు
మదిని జేరకుండ మమత యందు
కొరకు చిత్తమందు నిరతంబు సరియైన
సమర మెల్లగతుల సలుప దగును.                           27.
ఆ.వె.
చేవ గలిగి యుండు భావగర్భితమైన
పద్యరచన చేయ వలయునన్న
యతులు ప్రాసలందు నతులితం బగురీతి
సమర మెల్లగతుల సలుప దగును.                           28.
ఆ.వె.
అతులశక్తి బూని యన్యాయమును ద్రుంచి
న్యాయవర్ధనంబు చేయబూను
వాడు వెరవకుండ బహుళాపంక్తితో
సమర మెల్లగతుల సలుప దగును.                           29.
ఆ.వె.
సజ్జనుం డటంచు సర్వకాలములందు
ఖ్యాతి నందగోరు నున కిచట
నతులమైన పీడ నందించు వారితో
సమర మెల్లగతుల సలుప దగును.                           30.
ఆ.వె.
దివ్యదేహు డౌచు దీపిల్లవలెగాని
యంధకారమందు నణగి మనుజు
డుండరాదు దాని కొప్పిదం బగురీతి
సమర మెల్లగతుల సలుప దగును.                                   31.
ఆ.వె.
వెరపు గూర్చ బూని సరిహద్దులను దాటు
వారి నణచ జనుడు ధీరు డగుచు
నిలిచియుండ వలయు తలచి యవ్వారితో
సమర మెల్లగతుల సలుప దగును.                                   32.
ఆ.వె.
యోగ్యమైన దివ్యభాగ్యంబులను గూర్చు
భారతీయవేద పరిమళముల
నతకరించువారి నణచంగ సతతంబు
సమర మెల్లగతుల సలుప దగును.                                   33.
ఆ.వె.
పలురకంబులైన కులమతభేదాలు
నేర్పుచుండు ఖలుల నిస్తులమగు
సత్వ మణచ జనుడు సర్వసన్నద్ధుడై
సమర మెల్లగతుల సలుప దగును.                                   34.
ఆ.వె.
జనుడు సంతసాన తన లక్ష్యమును జేర
గోరుచుండ వాని జేరనీక
యడ్డగించు వాని నణచెడి కార్యాన
సమర మెల్లగతుల సలుప దగును.                                   35.
ఆ.వె.
అంతరంగమందు ననిశంబు వసియించి
చెరుపు గూర్చు నట్టి యరుల నణగ
ద్రొక్క బూని జనుడు తోరంపు దీక్షతో
సమర మెల్లగతుల సలుప దగును.                                   36.
ఆ.వె.
సమసమాజమందు సామాన్య జనులను
బ్రతుకనీయకుండ బహుళగతుల
బాధపెట్టుచుండు పాపాత్ములను గాంచ
సమర మెల్లగతుల సలుప దగును.                                   37.
ఆ.వె.
తానె పండితుండ తనకంటె నధికుండు
లేడటంచు జగతి నాడ నీడ
మచ్చరించువాని మదమును ద్రుంచంగ
సమర మెల్లగతుల సలుప దగును.                                   38.
ఆ.వె.
దేశభవితకొరకు లేశమైనను గొంకు
లేక "చెరుపుగూర్చు మూకలపయి"
యుత్సహించి దూకు టొప్పౌను వారితో
సమర మెల్లగతుల సలుప దగును.                                   39.
ఆ.వె.
క్షితికి తిండి బెట్టి యతులిత సౌఖ్యంబు
గూర్చుచుండు రైతు కోరికలను
నమిత శక్తి జూపి యణచెడి వారిపై
సమర మెల్లగతుల సలుప దగును.                                   40.
ఆ.వె.
లోపములను జూపి వాపోవు రీతిగ
సాటిజనులనుండి సంపదలను
గుంజునట్టి నేటి ఘోరకృత్యములందు
సమర మెల్లగతుల సలుప దగును.                                   41.
ఆ.వె.
అఖిల జగతిలోన నాధారమైనట్టి
యతివ కాదరంబు నందజేయ
జనుడు సంతతంబు సరియైన మార్గాన
సమర మెల్లగతుల సలుప దగును.                                   42.
ఆ.వె.
ప్రతిభ జూడకుండ పట్టంబులను గట్టు
యత్నములను ద్రుంచ నూత్నమైన
శక్తినంది వారి సత్వంబు లణగంగ
సమర మెల్లగతుల సలుప దగును.                                   43.
ఆ.వె.
బాల్యమందు విద్య బడయంగ దగియుండ
నట్టివారి నెప్పు డతులమైన
శ్రమకు  ద్రోయునట్టి క్రమమును మాన్పంగ
సమర మెల్లగతుల సలుప దగును.                                   44.
ఆ.వె.
మునిజనంబు లిచట ముందు జూపినయట్టి
సవ్యమార్గమందు సాగుకొరకు
దైవశక్తి నంది యావశ్యకంబైన
సమర మెల్లగతుల సలుప దగును.                                   45.
ఆ.వె.
మదుల నుబ్బురీతి సదమల జలములు
ముదముతోడ నొసగు నదులయందు
గలుపుచుండునట్టి కాలుష్యముల నాప
సమర మెల్లగతుల సలుప దగును.                                   46.
ఆ.వె.
నీది నాది యనెడి భేదభావంబుతో
జగతిలోన ద్వేష మగణితముగ
బెంచు భావనలను ద్రుంచంగ వలసిన
సమర మెల్లగతుల సలుప దగును.                                   47.
ఆ.వె.
విమలురై వెలుంగు విజ్ఞసత్తములందు
హద్దుమీరి పలుక ననవరతము
చూచుచుండువారి చొప్పడగించంగ
సమర మెల్లగతుల సలుప దగును.                                   48.
ఆ.వె.
దుర్మదాంధులౌచు కర్మంబు లన్నింట
దైత్యభావ మొదవ దడయకుండ
ముందు కేగ జూచు మూర్ఖుల నాపంగ
సమర మెల్లగతుల సలుప దగును.                                   49.
ఆ.వె.
ఆశతోడ రేగి దేశభాగ్యాలతో
నాటలాడుచుండి యనవరతము
తిరుగు చెనటులందు గరువంబులను ద్రుంచ
సమర మెల్లగతుల సలుప దగును.                                  50.
ఆ.వె.
సందియంబు లేదు సర్వకార్యములందు
ప్రజల హితము గోరి పాటు పడెడి
భావములను జెరచు వారితో నెటులైన
సమర మెల్లగతుల సలుప దగును.                                   51.
ఆ.వె.
బుద్ధిహీనులౌచు పోరాటము లటంచు
సంమందు నున్న సంపదలను
నష్టపరచుచుండు దుష్టుల నాపంగ
సమర మెల్లగతుల సలుప దగును.                                   52.
ఆ.వె.
విశ్వవీధిలోన విస్తృతంబగురీతి
ఖ్యాతి నందు భరతజాతి కార్తి
కలుగజేయు వారి తలపులు ద్రుంచంగ
సమర మెల్లగతుల సలుప దగును.                                   53.
ఆ.వె.
జనులలోన నుండు జవసత్వముల నెల్ల
జంపురీతి వస్తుచయమునందు
కల్మషములు నింపు క్రమమును ఖండించ
సమర మెల్లగతుల సలుప దగును.                                   54.
ఆ.వె.
నాకతుల్య మౌచు నైకమత్యపుదీప్తి
పొందియున్న భరతభూమిలోన
కలహములను బెంచు తలపులు ఖండించ
సమర మెల్లగతుల సలుప దగును.                                   55.
ఆ.వె.
పేదజనులయందు మోదంబు గలిగించు
నట్లు నేత లంద రనవరతము
మెలగునట్లు వారి తలపులు మార్చంగ
సమర మెల్లగతుల సలుప దగును.                                   56.
ఆ.వె.
మాతృభాషయందు మమతానురాగాలు
కలిగి యగ్రమందు నిలుప బూను
వారియందు సుఖము చేరుట కనువైన
సమర మెల్లగతుల సలుప దగును.                                   57.
ఆ.వె.
పరుల సుఖము గోరి నిరతంబు శ్రమియించు
సజ్జనాళి చేయు సవనమందు
నడ్డుపడెడివారి యత్నంబులను గూల్చ
సమర మెల్లగతుల సలుప దగును.                                   58.
ఆ.వె.
నాస్తికత్వమిచట నాస్తిగ భావించి
విశ్వసించువారి విషయమందు
కంటకంబు లట్టు లంటు వ్యాధులపైన
సమర మెల్లగతుల సలుప దగును.                                   59.
ఆ.వె.
నేడు సంమందు పీడించుచున్నట్టి
మూఢభావతతుల మొదలు నరుక
బూను యత్నమందు కానైనరీతిలో
సమర మెల్లగతుల సలుప దగును.                                   60.
ఆ.వె.
బ్రతుకు తెరువటంచు బహుపద్ధతులలోన
సత్యదూరు లౌచు నిత్య మిచట
నటన జేయువారి నాటకంబుల నాప
సమర మెల్లగతుల సలుప దగును.                                   61.
ఆ.వె.
తల్లిదండ్రులందు, తనవారియందును,
సాటిజనులయందు సర్వమందు
దయను జూపువారి కయుతసత్వము గూర్చ
సమర మెల్లగతుల సలుప దగును.                                   62.
ఆ.వె.
మంచి మాటలాడి వంచించగా బూని
మిత్రకోటి కార్తి మిగుల గూర్చు
వారి నణచుకొరకు వలసిన రీతిలో
సమర మెల్లగతుల సలుప దగును.                                   63.
ఆ.వె.
మనుజు డౌట నిచట జననంబు నందుట
పూర్వజన్మలోని పుణ్యఫలము
కాన నగ్రగామి కాగోరి యుక్తమౌ
సమర మెల్లగతుల సలుప దగును.                                   64.
ఆ.వె.
నేత యౌచు జేరి జాతికి సరియైన
యండ యగుచు నిలిచి యుండనట్టి
వాని కెట్టులైన వాస్తవంబును నేర్ప
సమర మెల్లగతుల సలుప దగును.                                   65.
ఆ.వె.
చదువులందు మిగుల సత్వంబులను గాంచి
విజ్ఞు లౌచు నిచట వెలుగగోరు
వారు మార్గమందు బహుకష్టపంక్తితో
సమర మెల్లగతుల సలుప దగును.                                   66.
ఆ.వె.
ఆత్మశుద్ధి లేక యాచారమున బోక
హితుడుగాక జగతి కతులితమగు
హాని గలుగజేయు వానిని దండించ
సమర మెల్లగతుల సలుప దగును.                                   67.
ఆ.వె.
భరతభూమిలోని స్థిరతర సంపత్తి
యైన భారతాదులందు నున్న
వాని నొప్పనట్టి భావంబులను మార్చ
సమర మెల్లగతుల సలుప దగును.                                   68.
ఆ.వె.
నాది నా కటంచు నవ్యప్రయత్నంబు
స్వీయసుఖము గోరి చేయునట్టి
భావ మాత్మలోన చేవ జూపనిరీతి
సమర మెల్లగతుల సలుప దగును.                                   69.
ఆ.వె.
గ్రంథపఠనమందు కాలయాపన చేయు
సవ్యమతుల నడ్డి సంతతంబు
దుఃఖమందు ద్రోయు దుర్వ్యసనాలపై
సమర మెల్లగతుల సలుప దగును.                                   70.
ఆ.వె.
దేహదీప్తి గూర్చి మోహంబు పుట్టించి
జనుని గూల్చునట్టి సరణులందు
కూరుకొనక వాని నోరిమితో గెల్వ
సమర మెల్లగతుల సలుప దగును.                                   71.
ఆ.వె.
కలిగినంత చాలు నలఘుసౌఖ్యం బేల
నంచు దలచ కూడ దంచిత మగు
హాయి నందగోరి యందు కానగురీతి
సమర మెల్లగతుల సలుప దగును.                                   72.
ఆ.వె.
మానవుండు సతము తాను కాంక్షించిన
లక్ష్య మందగోరి లక్షణముగ
చేయదగు ప్రయత్న మాయెడ వలసినన్
సమర మెల్లగతుల సలుప దగును.                                   73.
ఆ.వె.
ఆత్మరక్షణార్థ మత్యంతదీక్షతో
దక్షు డౌచు జనుడు తత్పరతను
గొంకకుండ సతము కువలయంబందున
సమర మెల్లగతుల సలుప దగును.                                   74.
ఆ.వె.
విశ్వవీధిలోన శాశ్వతంబుగ జన్మ
భూమి నత చాటు కామనలకు
నడ్డు తగులు నట్టి యాటంకములపైన
సమర మెల్లగతుల సలుప దగును.                                   75.
ఆ.వె.
సర్వజగతిలోన సజ్జనుండను ఖ్యాతి
నందగోరు వ్యక్తి యిందు నుండి
జవము నణచునట్టి యవగుణరాశిపై
సమర మెల్లగతుల సలుప దగును.                                   76.
ఆ.వె.
వేదభూమిలోని విమలధర్మంబులన్
పుడమిలోన జాట గడగువాడు
తారసిల్లునట్టి దనుజభావాలపై
సమర మెల్లగతుల సలుప దగును.                                   77.
ఆ.వె.
నీతిమాలి జనుడు నిత్య మీ భూమిలో
దుఃఖ మొసగునట్టి దుష్కృతులను
చేయుచుండె వాని ఛీయంచు నాపంగ
సమర మెల్లగతుల సలుప దగును.                           78.
ఆ.వె.
పిన్నవారిలోన పెద్దలన్నను భక్తి
ప్రేమ పిన్నలందు వృద్ధులకును
గలుగజేయు కొరకు కానైనరీతిలో
సమర మెల్లగతుల సలుప దగును.                           79.
ఆ.వె.
ఇంద్రియములరాశి యీదేహ మందున
బహుళకష్టతతుల నహరహమ్ము
కలుగజేయుచుండు కావున దానిపై
సమర మెల్లగతుల సలుప దగును.                           80.
ఆ.వె.
తుచ్ఛసుఖము లొసగి స్వేచ్ఛను భక్షించి
జీవనంబులోన స్థిరతరమగు
కష్ట మొసగునట్టి దుష్టభావాలతో
సమర మెల్లగతుల సలుప దగును.                           81.
ఆ.వె.
చిన్నపిల్లలందు, కన్నవారలయందు,
మహిళలందు నట్లె మాన్యులందు
నాదరంబు లేని యవ్వారలను మార్చ
సమర మెల్లగతుల సలుప దగును.                           82.
ఆ.వె.
ప్రజల సొమ్ముతోడ బహుసౌఖ్యములనంది
ధ్యాసలోన వారి యూసులేక
తిరుగుచుండు నేత ధీరత్వమును ద్రుంచ
సమర మెల్లగతుల సలుప దగును.                           83.
ఆ.వె.
అఖిలజగతిలోన నాధునికాఖ్యతో
జేరియుండి కష్టకారణమయి
నిలిచియున్నదాని నిజరూపమును దెల్ప
సమర మెల్లగతుల సలుప దగును.                           84.
ఆ.వె.
హరిహరాదులందు నఖిలదైవములందు
భేదభావ మరసి ఖేద పడెడు
జనుల చిత్తమందు సవ్యత్వమును జేర్చ
సమర మెల్లగతుల సలుప దగును.                           85.
ఆ.వె.
జీవహింస జనుని పావనత్వము గూల్చు
నిడుము లందు ద్రోయు నెల్లజగతి
ననెడి వాస్తవంబు నతనికి నేర్పంగ
సమర మెల్లగతుల సలుప దగును.                           86.
ఆ.వె.
ఘోరమైనరీతి గోమాత నీనేల
గష్టమందు ద్రోయు కఠినులందు
బ్రేమ బుట్ట జేయ నీమంబుగానంది
సమర మెల్లగతుల సలుప దగును.                           87.
ఆ.వె.
కుక్షి నింపుకొనగ క్షుద్బాధ నణచంగ
లేవె కూర లెన్నొ జీవహింస
తగదు మిత్రులార! జగతి నంచును దెల్ప
సమర మెల్లగతుల సలుప దగును.                           88.
ఆ.వె.
దైవపూజలందు ధనమును వెచ్చించు
మానవుండు చూడ దీనులందు
దయను జూప డౌర! తద్గత యత్నాన
సమర మెల్లగతుల సలుప దగును.                           89.
ఆ.వె.
విజయ మందగోరి విస్తృతంబగురీతి
వరుస దాన మొసగు వాక్కులందు
నేతయైన పిదప నాతని కది దెల్ప
సమర మెల్లగతుల సలుప దగును.                           90.
ఆ.వె.
ఇంటిలోన గాని యిలలోన నైనను
స్వీయభావములకు జేటు గలుగు
విధము గూడెనేని వేయేల దానికై
సమర మెల్లగతుల సలుప దగును.                           91.
ఆ.వె.
వేలరకములందు విఘ్నేశ్వరుని రూపు
మార్చుచుండె నిచట మానవుండు
వాస్తవంబు జూపి వానికి బోధించ
సమర మెల్లగతుల సలుప దగును.                           92.
ఆ.వె.
కులము మతము లంచు నిలలోన నిత్యమ్ము
తగవు లాడుకొనుట తగదు నిజము
దీని దెలిపి జనుని జ్ఞానాన్వితుని జేయ
సమర మెల్లగతుల సలుప దగును.                           93.
ఆ.వె.
వృక్ష మెల్లవేళ రక్షించు మనుజుని
సత్యమంచు దెలిసి నిత్య మిచట
నరుకుచుండునట్టి నరుని బోధించంగ
సమర మెల్లగతుల సలుప దగును.                           94.
ఆ.వె.
కలుషితాత్ము లౌచు ఖాద్యవస్తువులందు
కశ్మలంబు లన్ని కలుపుచుండు
మనుజు గృత్యములను మాన్పంగ సరియైన
సమర మెల్లగతుల సలుప దగును.                           95.
ఆ.వె.
దైవమందు భక్తి, ధర్మాస్థ సచ్ఛీల
మంది యున్న జనున కనవరతము
చేటు గలుగ జేయు చెనటిని మార్చంగ
సమర మెల్లగతుల సలుప దగును.                           96.
ఆ.వె.
ఇచట జన్మ నంది యీదేశమున కేను
హితము గూర్చినాడ నేమి యిచ్చె
నాకు దేశ మనెడి నరుని మార్చగ బూన
సమర మెల్లగతుల సలుప దగును.                           97.
ఆ.వె.
పనులు చేయుకొరకు నతరమౌరీతి
చేయి చాపు టొక్క ధ్యేయముగను
సంచరించు జనుని సవ్యమార్గము ద్రిప్ప
సమర మెల్లగతుల సలుప దగును.                           98.
ఆ.వె.
బాలలందు గూడ పశువులై చరియించు
దుష్టజనులలోని దుర్మతులను
పారద్రోల గడగి చేరజూచినవారు
సమర మెల్లగతుల సలుప దగును.                           99.
ఆ.వె.
కలుషపూర్ణు లౌచు కాషాయములు దాల్చి
జనుల మోసగించు నుల కిలను
సవ్యమైన రీతి సత్యంబు జూపించు
సమర మెల్లగతుల సలుప దగును.                           100.
ఆ.వె.
చదువులందు మొదటి స్థానంబునకు జేరి
యగ్రపదము భావి నందగోరు
ఛాత్రు లిచట గలుగు సర్వవిఘ్నములందు
సమర మెల్లగతుల సలుప దగును.                           101.
ఆ.వె.
సారహీనమైన సంసారజలధిలో
మునిగియుండి సుఖము  నతరముగ
నందగోరువార లందు కష్టాలతో
సమర మెల్లగతుల సలుప దగును.                           102.
ఆ.వె.
దైవదర్శనంబు కావలెనని యెంచు
వాడు దీక్షతోడ భావమందు
నంటియుండునట్టి యస్థిరత్వము పైన
సమర మెల్లగతుల సలుప దగును.                           103.
ఆ.వె.
మంచిపనులు చేయు మానసంబున నుంటి
నందకుండె ఫలిత మనెడి జనుడు
చేవజూపి స్వీయ భావజాలంబుపై
సమర మెల్లగతుల సలుప దగును.                           104.
ఆ.వె.
ధనము గలుగువారు ధరలోన భూతమై
పేదవారి నెల్ల పీడలకును
జేర నెట్టు చుండు దారిద్ర్యమును గూల్చ
సమర మెల్లగతుల సలుప దగును.                           105.
ఆ.వె.
శక్తి గలుగువాడు సత్వంబు జూపించి
జన్మభూమికొరకు సన్మతియయి
దుర్మదాంధులందు కర్మఠుడై నిల్చి
సమర మెల్లగతుల సలుప దగును.                           106.      
ఆ.వె.
సభలలోన సతము సత్కీరి నందంగ
గోరువాడు నాశ కారణమయి
యాత్మలోన జేరు నహముపై నిత్యమ్ము
సమర మెల్లగతుల సలుప దగును.                           107.
ఆ.వె.
భావపరిమళంబు పదిమందికిని బంచ
గోరుచుండువాడు ఘోరములగు
నాత్మనంటుకొనెడి యరులపై సతతంబు
సమర మెల్లగతుల సలుప దగును.                           108.
ఆ.వె.
ఆదివార మగుట హరివంశజుండైన
"మూర్తి" వ్రాసె నేడు ముదముతోడ
భవ్యయశము గల్గు "ప్రజపద్యసభలోన"
"సమరశతక"మొకటి క్రమముగాను. 109.

హ.వేం.స.నా.మూర్తి.
15.09.2019.