ఒకచేతి వ్రేళ్ళతో నొప్పుగా వాక్యాలు
లెక్కించు వాడౌచు నొక్కచేత
జందెమంటుచునుండి శ్రద్ధతో పన్నాలు
వల్లించు చున్నట్టి బాలు జూడ
వేదవిద్యాభ్యాస మాదరంబుగ జేయు
సచ్ఛాత్రు డనుటలో సందియంబు
లేదు కొంచెంబైన వేదరాశిని యీత
డాపోశనం బంది యనుపమమగు
ఖ్యాతి నందుట నిక్క మాపైని వేదార్థ
భాష్యంబు పఠియించి బాగుగాను
లక్షణంబులు నేర్చి దక్షుడై వెలుగొందు
విజ్ఞానఖని యౌచు వివిధగతుల
ధర్మానురక్తుడై ధరణిపై వేదోక్త
కర్మంబు లన్నియు ఘనతరముగ
జరుగునట్లుగ జూచు సామర్ధ్యముం బొంది
విశ్వాని కాప్తుడై వినుతులొందు
ఇతని గన్నతల్లి సుతుని వైభవదీప్తి
గాంచి ధన్యనైతి నంచు మిగుల
సంతసించుచుండు సర్వకాలములందు
సత్సుఖంబు లొదవి జగతిలోన. 1.
వేదము సర్వవిధంబుల
శ్రీదంబై జగతిలోన స్థిరసౌఖ్యంబుల్
మోదంబు గలుగ జేయుచు
నాదరముగ గాచు జనుల నత్యుత్తమమై. 2.
నిగమాధ్యయనం బెంతయు
తగినట్టిది విప్రతతికి ధరణి సురత్వం
బగణిత యశముం గూర్చుచు
భగవానుని యండ నొసగు భాగ్యదమగుచున్ 3.
క్షేమమిచ్చట నేను శ్రీమతీ! నీవెట్టు
లున్నావు? క్షేమమా యువిద నీకు?
నిన్నె తలచుచునుండి నిరతంబు నేనిందు
నీరూపు మదిలోన నింపుకొంటి
నిద్రలో మెలకువ న్నీసుందరాకార
మగుపించు చున్నదో యతివ నిజము,
స్వామికార్యంబూని నీమంబుతో నింత
దూర మేతెంచితి చారుశీల!
కార్యనిర్వహణాన కాంత! యొక్కింతైన
ఉత్సాహ మెదలోన నూనదాయె
నీసాహచర్యంబు, నీచిద్విలాసంబు
ప్రేమపూర్ణంబైన పిలుపునకును
దూరమై యున్నట్టి కారణంబున నాకు
క్షణ మొక్కయుగముగా గడచుచుండె
కొద్దిరోజులలోనె కోరినట్టుల నేను
నీచెంత కేతెంతు నిర్మలాంగి!
సుదతి! నారాక కోసమై చూచుచుండి
ధైర్యమును వీడవలదంచు తనమగండు
వ్రాసి పంపిన లేఖ నాపడతి చూచి
యతుల మైనట్టి సంతస మందె నపుడు.
అన్నివేళలందు నత్యంత వాత్సల్య
పూర్ణ మానసమున పుడమి జనుల
గాచునట్టి దేవ! కంసారి! కేశవా!
నిద్రనున్న కృష్ణ! నిన్ను గొలుతు. 1.
పొట్టలోన సకల భువనంబులం దాచి
చిన్నవాడ వౌచు నెన్నదగిన
మహిమలెన్నొ చూపి మముగావగా బూను
చిన్ని కృష్ణ! నీకు చేతునతులు. 2.
క్రోధమేల మీకు? బాధచెందగనేల?
శాంతమూని మనుడు జనులటంచు
తెలుపగోరి యిట్లు స్థిరమానసంబుతో
నిద్రబోవు కృష్ణ! నిన్ను గొలుతు. 3.
జగతి నేలునట్టి సర్వేశ్వరుండవై
బాలుపగిది మారి లీలజూపి
యోగనిద్రబోవు యోగేశ్వరా! కృష్ణ!
వెన్నదొంగ! నిన్ను సన్నుతింతు. 4.
స్తుతుల కందబోవు, మతులతో యోచింప
చిక్కబోవు నిన్ను చేరుటెట్లు?
శుద్ధమానసమున జోడింతు కరములు
వాసుదేవ! కొనుము వందనంబు. 5.

పుస్తకంబు భువిని హస్తభూషణ మండ్రు
భూషణంబె కాదు పుడమి జనుల
కధికమైన జ్ఞాన మందించు శ్రేష్ఠుడౌ
హితునివలెను చేరి ఎల్లవేళ. 1.
పుస్తకంబు చదువ మస్తిష్కవికసనం
బగుట సత్యసూక్తి యన్నిగతుల
పొత్తమునకు సాటి పుడమి లేదొక్కటి
పుస్తకంబు శ్రేష్ఠభూషణంబు. 2.
మంచి చెడులు తెలుపు, మమతానురాగాలు
పంచుచుండి జనుల కంచితమగు
ధర్మపథములోని మర్మంబులన్నియు
విస్తరించి చూపు వివిధగతుల. 3.
ఆచరించదగిన దత్యుత్తమంబైన
రీతిలోన పలుకు, నీతితోడ
చేయు వర్తనమున సిద్ధించు సుఖములన్
పుస్తకంబు తెలుపు విస్తరించి. 4.
సంఘమందునుండు సభ్యులందరికెంతొ
యుపకరించుచుండు నున్నతముగ
ప్రాణమిత్రుడట్లు పథమును చూపించు
పుస్తకంబు శ్రేష్ఠభూషణంబు. 5.
గురువు పలుకుచుండు పరమాద్భుతంబులౌ
సూక్తులన్ని యొక్క చోట జేర్చి
విశదపరచుచుండు విజ్ఞానమును పెంచు
పుస్తకంబు శ్రేష్ఠభూషణంబు. 6.
పిన్న పెద్ద యనెడి భేదభావము లేక
ఉర్విజనుల కెల్ల నున్నతమగు
భావజాలమొసగు పరమహర్షముతోడ
పుస్తకంబు శ్రేష్ఠభూషణంబు. 7.
బ్రతుకుతెరువు చూపు, భాగ్యంబులందించు
సంఘజనులతోడ సవ్యగతిని
వ్యవహరించు తీరు పలుకు నేందేగిన
పుస్తకంబు శ్రేష్ఠభూషణంబు. 8.
ఇందునున్నయట్టి దెందైన గాన్పించు
నిందులేని దొక్క టెందు లేదు
జగతిలోన వెలుగు సర్వాత్మకంబౌచు
పుస్తకంబు శ్రేష్ఠభూషణంబు. 9.
పుస్తకాలపురుగు మస్తకంబంతయు
జ్ఞానసాగరమున స్నానమాడ
నితని జూడదగును సతతంబు పఠియించు
చుండె నౌర! స్వాంతశుద్ధిగోరి. 10.

శ్రీపతి! జగదాధారా!
పాపాపహ! చక్రధారి! పావనచరితా!
హే పరమానందద! చి
ద్రూపా!పద్మాయతాక్ష! దుఃఖవిదారా! 1.
అవనిలోపల ధర్మంబు నణగద్రొక్కి
తా నధర్మంబు వ్యాపింప, దాని గూల్చి
మానవాళిని రక్షించి జ్ఞానమొసగ
నవతరింతువు గోవింద! యద్భుతముగ. 2.
నీరూపము లనుపమములు
కారుణ్యాత్ముడవునీవు కంసారి! హరీ!
తోరపు భక్తిని గొల్చిన
వారికి కల్మషములుడుగు వైభవమబ్బున్. 3.
తొల్లి మత్స్యమవౌచు దుష్టు రాక్షసు గూల్చి
వేదరక్షణ చేసి విమలమతుల
జీవరాశుల నెల్ల నావలో నెక్కించి
జలధికావల జేర్చి సాకినావు,
సురసంఘములు నాడు శుక్రశిష్యులగూడి
క్షీరాబ్ధి ద్రచ్చంగ గోరునపుడు
కూర్మరూపంబంది కుధరంబు నిలబెట్టి
యమరుల కండయై యలరినావు,
నాడు వరాహమై నవ్యతేజముతోడ
నసురు హిరణ్యాక్షు నణచి భూమి
నుద్దరించుటచేత నుత్సాహమమరుల
కందించి యున్నాడ వద్భుతముగ!
నిరతంబు నినుగొల్చు నిజనందనుని జంపు
యత్నంబులోనున్న యసురపతిని
నరసింహరూపివై నఖములతో జీల్చి
చెండాడితివినీవు దండమయ్య,
పరమాద్భుతంబుగా వడుగౌచు వామనా
కారుండవై యజ్ఞకాలమందు
బలిని యాచనచేసి పదముల మూడింట
నాక్రమించెడి మేర నందినావు,
పరశురాముండవై బలమదయుతులైన
క్షత్రియులంబట్టి సంహరించి
క్షితినిక్షత్రియహీన జేయబూనినయట్టి
దక్షుండ వోదేవ! దానవారి!
రామావతారాన రావణాసురు గూల్చి
ధర్మంబు కాపాడి ధరణిజాత
కానందమును గూర్చి మానవాళికి సతం
బాదర్శ దైవమై ఖ్యాతి గాంచి,
యటుపైన కృష్ణుండ వౌచు యశోదకు
సంతసంబును నిల్పి సర్వగతుల
గోపాల బంధులన్ కాపాడుటే కాదు
కంసాది దుష్టులన్ క్రమత గూల్చి
భారతావనిలోన భవ్యసద్ధర్మంబు
నిలిపియుంటివి నీవు నిష్ఠబూని,
శాక్యవంశమునందు జన్మించి మునివౌచు
ధరణిపై నెన్నెన్నొ ధర్మములను
బోధించి యంతటన్ బుద్ధుండవై వెల్గి
లోకముల్గాచినా వేకదీక్ష
కలియుగాంతపువేళ యిలనుగావగ నీవు
కల్కివౌదు వటంచు పల్కుచుంద్రు
దేవ! వైకుంఠవాసి! హే దివ్యతేజ!
అఘవిదారక!కేశవ! హరి! ముకుంద!
భాగ్యదాయక! మాధవ! వాసుదేవ!
సకలభువనావనానంత! సత్యరూప! 4.
దుష్టరాక్షససంహార! దురితదూర!
నిత్యసంతోషదాయక! నిర్మలాంగ!
శిష్టరక్షక! దైత్యారి! శ్రీప్రదాత!
సన్నుతించెద సతతంబు నిన్నుదేవ!. 5.
సకలభువనంబులనుగావ జగతిలోని
జీవరాశుల నెద్దాని స్వీకరించి
రూపధారణ జేతువో పాపమణచ
నూహచేయగ లేరెవ్వరుర్విలోన. 6.
మణిభూషితుడై వెలుగుచు
నణిమాదుల నొసగదగిన యహిసత్తముడై
గణపతి కాత్మీయుండౌ
ఫణిరాజున కందజేతు ప్రణతుల నిపుడున్. 1.
మము మన్నించుము ఫణిపతి!
క్షమతోడను కాచుచుండి కరుణావార్ధీ!
విమలాంతరంగ! దయతో
మమతను గురిపించవయ్య మహిలో నెపుడున్. 2.
క్షీరంబు భక్తితోడను
చేరుచు నీచెంత కెపుడు స్థిరచిత్తముతో
తోరముగ నొసగుచుండెడు
వారిన్ కరుణించ వలయు పరమప్రీతిన్. 3.
క్రోధంబు చూపవల దిక
బాధించగ బూనవలదు పలురకములుగా
సాధించ వలదు మమ్మెపు
డాధికి గురిచేయవలవదహిపతి నీవున్. 4.
లోకములగాచుచుండెడి
శ్రీకంఠుని హారమౌచు స్థిరయశములతో
లోకంబుల విహరించెడి
నీకొసగెద ప్రణతిశతము నిష్ఠాత్ముడనై 5.

మేటిగ వర్తమానమున మిక్కిలి సౌఖ్యము లందజేయు కం
ప్యూటరు మానవాళి కిల నుత్సవదంబయి వెల్గుచుండు ము
మ్మాటికవశ్యవస్తువయి, మైమరపించుచు, కార్యదక్షతన్
పాటవ మందజేయుచును బంధునిభంబుగ నున్న దంతటన్. 1.
విషయ మెటులనున్న వేర్వేరుగా నంది
తనలోన దాచు తాననుపమముగ,
భాషతో భేదంబు పాటించగా బోక
జ్ఞానసంచయ మెంతొ మేన దాల్చు,
అడిగినప్పుడు పల్కి యనుమానములు తీర్చు
మార్గదర్శకమౌచు మనము దోచు,
చిటికలో విశ్వాన చేరదల్చిన చోటు
చక్కగా నంతరజాలమందు
చూపి తృప్తి బరచు శోధించు, సాధించు
నెట్టిదానినైన పట్టుదలకు
మారుపేరు చాలతీరుల గాన్పించు
గణకసాధనంబు ఖ్యాతిదంబు. 2.
చిన్నపిల్లలతోడ చిత్రాలు గీయించు
నాటలు నేర్పించు నందమొప్ప,
మధురసంగీతంబు మహిళల కందించు
నాట్యంబు చూపించు నవ్యముగను,
విద్యార్థులకు నెప్పు డద్యతనంబైన
విజ్ఞాన మందించు వివిధగతుల,
బహుమాన్యతను గూర్చు సహకార మందించు
నెల్లమానవులకు నుల్ల మలర
చిన్నదైన నేమి యెన్నెన్నొ విషయాల
నాత్మలోన దాచి యందరకును
కరము ముదము గూర్చు కంప్యూట రేవేళ
ధరను దీని ఘనత తరమె పలుక. 3.
పెద్ద చిన్నయనెడి భేదభావము లేదు
పురుషు లబల లనుచు నరయ బోదు,
ఘనత నందజేయు కంప్యూట రన్నింట
మిత్రుడట్లు నేడు మేదిని పయి. 4.
విజ్ఞులార! కనుడు విజ్ఞానమును గోరి
బామ్మగా రొకర్తె భాగ్యమనుచు
క్రమత నేర్చుచుండె కంప్యూట రక్కటా!
ప్రాయ మడ్డురాదు ధ్యేయమునకు. 5.