
శ్రీపతి! జగదాధారా!
పాపాపహ! చక్రధారి! పావనచరితా!
హే పరమానందద! చి
ద్రూపా!పద్మాయతాక్ష! దుఃఖవిదారా! 1.
అవనిలోపల ధర్మంబు నణగద్రొక్కి
తా నధర్మంబు వ్యాపింప, దాని గూల్చి
మానవాళిని రక్షించి జ్ఞానమొసగ
నవతరింతువు గోవింద! యద్భుతముగ. 2.
నీరూపము లనుపమములు
కారుణ్యాత్ముడవునీవు కంసారి! హరీ!
తోరపు భక్తిని గొల్చిన
వారికి కల్మషములుడుగు వైభవమబ్బున్. 3.
తొల్లి మత్స్యమవౌచు దుష్టు రాక్షసు గూల్చి
వేదరక్షణ చేసి విమలమతుల
జీవరాశుల నెల్ల నావలో నెక్కించి
జలధికావల జేర్చి సాకినావు,
సురసంఘములు నాడు శుక్రశిష్యులగూడి
క్షీరాబ్ధి ద్రచ్చంగ గోరునపుడు
కూర్మరూపంబంది కుధరంబు నిలబెట్టి
యమరుల కండయై యలరినావు,
నాడు వరాహమై నవ్యతేజముతోడ
నసురు హిరణ్యాక్షు నణచి భూమి
నుద్దరించుటచేత నుత్సాహమమరుల
కందించి యున్నాడ వద్భుతముగ!
నిరతంబు నినుగొల్చు నిజనందనుని జంపు
యత్నంబులోనున్న యసురపతిని
నరసింహరూపివై నఖములతో జీల్చి
చెండాడితివినీవు దండమయ్య,
పరమాద్భుతంబుగా వడుగౌచు వామనా
కారుండవై యజ్ఞకాలమందు
బలిని యాచనచేసి పదముల మూడింట
నాక్రమించెడి మేర నందినావు,
పరశురాముండవై బలమదయుతులైన
క్షత్రియులంబట్టి సంహరించి
క్షితినిక్షత్రియహీన జేయబూనినయట్టి
దక్షుండ వోదేవ! దానవారి!
రామావతారాన రావణాసురు గూల్చి
ధర్మంబు కాపాడి ధరణిజాత
కానందమును గూర్చి మానవాళికి సతం
బాదర్శ దైవమై ఖ్యాతి గాంచి,
యటుపైన కృష్ణుండ వౌచు యశోదకు
సంతసంబును నిల్పి సర్వగతుల
గోపాల బంధులన్ కాపాడుటే కాదు
కంసాది దుష్టులన్ క్రమత గూల్చి
భారతావనిలోన భవ్యసద్ధర్మంబు
నిలిపియుంటివి నీవు నిష్ఠబూని,
శాక్యవంశమునందు జన్మించి మునివౌచు
ధరణిపై నెన్నెన్నొ ధర్మములను
బోధించి యంతటన్ బుద్ధుండవై వెల్గి
లోకముల్గాచినా వేకదీక్ష
కలియుగాంతపువేళ యిలనుగావగ నీవు
కల్కివౌదు వటంచు పల్కుచుంద్రు
దేవ! వైకుంఠవాసి! హే దివ్యతేజ!
అఘవిదారక!కేశవ! హరి! ముకుంద!
భాగ్యదాయక! మాధవ! వాసుదేవ!
సకలభువనావనానంత! సత్యరూప! 4.
దుష్టరాక్షససంహార! దురితదూర!
నిత్యసంతోషదాయక! నిర్మలాంగ!
శిష్టరక్షక! దైత్యారి! శ్రీప్రదాత!
సన్నుతించెద సతతంబు నిన్నుదేవ!. 5.
సకలభువనంబులనుగావ జగతిలోని
జీవరాశుల నెద్దాని స్వీకరించి
రూపధారణ జేతువో పాపమణచ
నూహచేయగ లేరెవ్వరుర్విలోన. 6.
మణిభూషితుడై వెలుగుచు
నణిమాదుల నొసగదగిన యహిసత్తముడై
గణపతి కాత్మీయుండౌ
ఫణిరాజున కందజేతు ప్రణతుల నిపుడున్. 1.
మము మన్నించుము ఫణిపతి!
క్షమతోడను కాచుచుండి కరుణావార్ధీ!
విమలాంతరంగ! దయతో
మమతను గురిపించవయ్య మహిలో నెపుడున్. 2.
క్షీరంబు భక్తితోడను
చేరుచు నీచెంత కెపుడు స్థిరచిత్తముతో
తోరముగ నొసగుచుండెడు
వారిన్ కరుణించ వలయు పరమప్రీతిన్. 3.
క్రోధంబు చూపవల దిక
బాధించగ బూనవలదు పలురకములుగా
సాధించ వలదు మమ్మెపు
డాధికి గురిచేయవలవదహిపతి నీవున్. 4.
లోకములగాచుచుండెడి
శ్రీకంఠుని హారమౌచు స్థిరయశములతో
లోకంబుల విహరించెడి
నీకొసగెద ప్రణతిశతము నిష్ఠాత్ముడనై 5.

మేటిగ వర్తమానమున మిక్కిలి సౌఖ్యము లందజేయు కం
ప్యూటరు మానవాళి కిల నుత్సవదంబయి వెల్గుచుండు ము
మ్మాటికవశ్యవస్తువయి, మైమరపించుచు, కార్యదక్షతన్
పాటవ మందజేయుచును బంధునిభంబుగ నున్న దంతటన్. 1.
విషయ మెటులనున్న వేర్వేరుగా నంది
తనలోన దాచు తాననుపమముగ,
భాషతో భేదంబు పాటించగా బోక
జ్ఞానసంచయ మెంతొ మేన దాల్చు,
అడిగినప్పుడు పల్కి యనుమానములు తీర్చు
మార్గదర్శకమౌచు మనము దోచు,
చిటికలో విశ్వాన చేరదల్చిన చోటు
చక్కగా నంతరజాలమందు
చూపి తృప్తి బరచు శోధించు, సాధించు
నెట్టిదానినైన పట్టుదలకు
మారుపేరు చాలతీరుల గాన్పించు
గణకసాధనంబు ఖ్యాతిదంబు. 2.
చిన్నపిల్లలతోడ చిత్రాలు గీయించు
నాటలు నేర్పించు నందమొప్ప,
మధురసంగీతంబు మహిళల కందించు
నాట్యంబు చూపించు నవ్యముగను,
విద్యార్థులకు నెప్పు డద్యతనంబైన
విజ్ఞాన మందించు వివిధగతుల,
బహుమాన్యతను గూర్చు సహకార మందించు
నెల్లమానవులకు నుల్ల మలర
చిన్నదైన నేమి యెన్నెన్నొ విషయాల
నాత్మలోన దాచి యందరకును
కరము ముదము గూర్చు కంప్యూట రేవేళ
ధరను దీని ఘనత తరమె పలుక. 3.
పెద్ద చిన్నయనెడి భేదభావము లేదు
పురుషు లబల లనుచు నరయ బోదు,
ఘనత నందజేయు కంప్యూట రన్నింట
మిత్రుడట్లు నేడు మేదిని పయి. 4.
విజ్ఞులార! కనుడు విజ్ఞానమును గోరి
బామ్మగా రొకర్తె భాగ్యమనుచు
క్రమత నేర్చుచుండె కంప్యూట రక్కటా!
ప్రాయ మడ్డురాదు ధ్యేయమునకు. 5.
సరసిని మకరం బటపై
నరయంగా విహగమొక్క టద్భుతరీతిన్
నిరతము మైత్రిని బూనుచు
నరుసంబు వహించియుండు నందరు మెచ్చన్. 1.
జలవాసుల సంగతులం
బలుకును మకరంబు, పిదప పక్షుల గతులం
దెలుపును ఖేచర మక్కట!
జలచర ఖగములకు నిట్లు సఖ్యత గూడెన్. 2.
తననెచ్చెలి వచ్చుట గని
మనమున హర్షంబు నిండ మకరం బదిగో
ఘనతరముగ పైకెగయుచు
ననె హిత! కుశలంబె నీకు నన్నివిధాలన్. 3.
కుశలము తెల్పుచు పులుగిక
దశదిశలం దిరిగియుంట తనమిత్రునకున్
మశకాదులైన ప్రాణుల
దశలం దెలియంగ జెప్పి తనియగ జేసెన్ 4.
ప్రేమంబున తనచంచువు
నామకరపు ముఖము జేర్చి యాత్మీయతతో
సేమంబె మిత్రసత్తమ!
ధీమతి! యనె పక్కి మైత్రి దీపిల్లునటుల్ 5.
వారిద్దరి మాటలలో
భారతదేశంబులోని బహువిషయాలున్
వారింపలేని మోసము
లారయ చర్చలకు వచ్చె నౌరా యచటన్ 6.
ఎన్నికలు జరుగురీతియు
మన్నిక నందంగ దలచు మానవు లిలలో
పన్నుచు నుండెడి జిత్తుల
నన్నియు చర్చించి రప్పు డామిత్రు లటన్ 7.
కలలో నైనను భేదము
తలపని యాంధ్రంబు జూచి తమపని యనుచున్
నిలువున జీల్చినవారల
తలపులు చర్చించి రచట తా రామిత్రుల్. 8.
ఒకజాతి వారిమధ్యను
ప్రకటితమగు భేదమిలను బహువిధములుగా,
నకటా! సఖ్యము గాంచుడు
మకరము ఖగములకుమధ్య మానవులిందున్. 9.
ఏవేణు(గానంబు)నాదంబు భావింప హృదయంబు
లానందభరములై యలరుచుండు,
ఏవేణు(గానంబు)నాదంబు జీవరాశులలోన
నుత్సాహమును నింపు నున్నతముగ,
ఏవేణు(గానాంబు)నాదాంబు వీధరాస్థలిలోన
నమృతోపమానమై హాయి నొసగు,
ఏవేణు(గానంబు)నాదంబు నేవేళ వినగోరి
గోపికాసంఘాలు కూడుచుందు
రట్టి వేణువు మ్రోగించు నందగాని,
నల్లనయ్యను, గోవిందు, నందసుతుని,
మోహనాంగుని, యాదవముఖ్యు, ఘనుని
సన్నుతించెద భక్తితో సతతమేను. 1.
వందనము రాక్షసాంతక!
వందనమో దేవదేవ! వందనము హరీ!
వందనము లోకరక్షక!
వందనములు స్వీకరించు వసుదేవసుతా! 2.
నిన్నేనమ్మితి సత్యం
బెన్నంగా నొరులు గలరె! యీవిశ్వమునం
దెన్నడు గాచెడు వారలు
నన్నుం దయజూడవయ్య నందకుమారా! 3.
నీవే జగదాధారుడ
వీవే సర్వేశ్వరుండ వీవే సర్వం
బీవే కృష్ణా! కావుము
దేవా! నినుగొల్తు సతము స్థిరమతి యొసగన్. 4.
బాలులారా! రండు జాలమేలనొ నేడు?
చల్దులు భుజియించు సమయమయ్యె,
అలసియున్నారెంతొ పలుకులో దైన్యంబు
మిమ్మావరించెనో మిత్రులార!
క్షుద్బాధ తీరంగ కూరిమి మీరంగ
నారగించెద మిప్పు డంద మొలుక
బహుమాన్యమై యొప్పు భక్ష్యరాశిని గాంచు
డత్యంత మోదంబు నందగలరు
జాగు చేయవలదు సత్వరంబుగ రండు
మీర లంచు బిలువ వార లపుడు
రండు రండటంచు రయమున కృష్ణుని
చెంత జేరినారు సంతసమున. 1.
గోపబాలు రట్లు గోవిందు కెడ జేరి
పరమహర్ష మొదవ సరసులౌచు
కోరి కృష్ణు జుట్టి కూర్చుండి చవులూర
ముడులు విప్పిచల్ది మూటలపుడు. 2.
ఊరగాయ జూపి యూరించగా నొక్క
డారగించె దాని నంది యొకడు
మేలు భక్ష్య మొకడు చాలంగ జూపించ
లాగి మ్రింగె నొక్క డాగ కుండ. 3.
తనవద్ద నున్నట్టి ఘనపదార్ధములన్ని
భక్షించ రండంచు పంచె నొకడు,
తనభక్ష్యరాశులన్ తన్మయత్వము తోడ
మిత్రుల కందించె మేటి యొకడు,
ఒకని చిక్కములోని యోగిరంబుల బట్టి
పంచె నందరిలోన బాలుడొకడు,
మిత్రులందరిగూడి మిగుల సంతోషాన
నన్నదమ్ములయట్టు లద్భుతముగ
ఒకరి నొకరు గాంచి యుత్సాహభరితులై
పాడుచుండి హాస్యమాడుచుండి
కృష్ణు జూచుచుండి తృష్ణ తీరగ చల్ది
కుడుచుచుండి రచట కూర్మిమీర. 4.
శారీరికవైకల్యం
బేరీతిగ నడ్డురాదు, హితకాంక్షులకున్
ధీరత మనమున నిండిన
వారలకా ప్రభుడొసంగు బహుసౌఖ్యంబుల్. 1.
కోరికలు దీరు నెల్లెడ
చేరును విజయాలువారి చెంతకు సతమున్
తోరపు టుత్సాహము నె
వ్వారలు పూనెదరుసత్య పాలనతోడన్. 2.
రాబోదు కష్టకాలము
కాబోదిక దుర్భరంబు ఘనవైకల్యం
బాబాలవృద్ధ మందున
ధీబల మెవ్వారిలోన దీపిల్లు భువిన్. 3.
ఒకచేయి లేదటంచును
వికలుండై బాధపడక విజ్ఞతతోడన్
ప్రకటిత సామర్ధ్యముతో
నకటా! యీతండు ఖడ్గ మందెను చేతన్. 4.
శుభములు గల్గును నిత్యము
విభవంబులు పొందవచ్చు విస్తృతరీతిన్
ప్రభవించు సౌఖ్య మొదవెడు
నభయము వికలాంగుడైన యత్నముచేతన్. 5.