సరసిని మకరం బటపై
నరయంగా విహగమొక్క టద్భుతరీతిన్
నిరతము మైత్రిని బూనుచు
నరుసంబు వహించియుండు నందరు మెచ్చన్. 1.
జలవాసుల సంగతులం
బలుకును మకరంబు, పిదప పక్షుల గతులం
దెలుపును ఖేచర మక్కట!
జలచర ఖగములకు నిట్లు సఖ్యత గూడెన్. 2.
తననెచ్చెలి వచ్చుట గని
మనమున హర్షంబు నిండ మకరం బదిగో
ఘనతరముగ పైకెగయుచు
ననె హిత! కుశలంబె నీకు నన్నివిధాలన్. 3.
కుశలము తెల్పుచు పులుగిక
దశదిశలం దిరిగియుంట తనమిత్రునకున్
మశకాదులైన ప్రాణుల
దశలం దెలియంగ జెప్పి తనియగ జేసెన్ 4.
ప్రేమంబున తనచంచువు
నామకరపు ముఖము జేర్చి యాత్మీయతతో
సేమంబె మిత్రసత్తమ!
ధీమతి! యనె పక్కి మైత్రి దీపిల్లునటుల్ 5.
వారిద్దరి మాటలలో
భారతదేశంబులోని బహువిషయాలున్
వారింపలేని మోసము
లారయ చర్చలకు వచ్చె నౌరా యచటన్ 6.
ఎన్నికలు జరుగురీతియు
మన్నిక నందంగ దలచు మానవు లిలలో
పన్నుచు నుండెడి జిత్తుల
నన్నియు చర్చించి రప్పు డామిత్రు లటన్ 7.
కలలో నైనను భేదము
తలపని యాంధ్రంబు జూచి తమపని యనుచున్
నిలువున జీల్చినవారల
తలపులు చర్చించి రచట తా రామిత్రుల్. 8.
ఒకజాతి వారిమధ్యను
ప్రకటితమగు భేదమిలను బహువిధములుగా,
నకటా! సఖ్యము గాంచుడు
మకరము ఖగములకుమధ్య మానవులిందున్. 9.
ఏవేణు(గానంబు)నాదంబు భావింప హృదయంబు
లానందభరములై యలరుచుండు,
ఏవేణు(గానంబు)నాదంబు జీవరాశులలోన
నుత్సాహమును నింపు నున్నతముగ,
ఏవేణు(గానాంబు)నాదాంబు వీధరాస్థలిలోన
నమృతోపమానమై హాయి నొసగు,
ఏవేణు(గానంబు)నాదంబు నేవేళ వినగోరి
గోపికాసంఘాలు కూడుచుందు
రట్టి వేణువు మ్రోగించు నందగాని,
నల్లనయ్యను, గోవిందు, నందసుతుని,
మోహనాంగుని, యాదవముఖ్యు, ఘనుని
సన్నుతించెద భక్తితో సతతమేను. 1.
వందనము రాక్షసాంతక!
వందనమో దేవదేవ! వందనము హరీ!
వందనము లోకరక్షక!
వందనములు స్వీకరించు వసుదేవసుతా! 2.
నిన్నేనమ్మితి సత్యం
బెన్నంగా నొరులు గలరె! యీవిశ్వమునం
దెన్నడు గాచెడు వారలు
నన్నుం దయజూడవయ్య నందకుమారా! 3.
నీవే జగదాధారుడ
వీవే సర్వేశ్వరుండ వీవే సర్వం
బీవే కృష్ణా! కావుము
దేవా! నినుగొల్తు సతము స్థిరమతి యొసగన్. 4.
బాలులారా! రండు జాలమేలనొ నేడు?
చల్దులు భుజియించు సమయమయ్యె,
అలసియున్నారెంతొ పలుకులో దైన్యంబు
మిమ్మావరించెనో మిత్రులార!
క్షుద్బాధ తీరంగ కూరిమి మీరంగ
నారగించెద మిప్పు డంద మొలుక
బహుమాన్యమై యొప్పు భక్ష్యరాశిని గాంచు
డత్యంత మోదంబు నందగలరు
జాగు చేయవలదు సత్వరంబుగ రండు
మీర లంచు బిలువ వార లపుడు
రండు రండటంచు రయమున కృష్ణుని
చెంత జేరినారు సంతసమున. 1.
గోపబాలు రట్లు గోవిందు కెడ జేరి
పరమహర్ష మొదవ సరసులౌచు
కోరి కృష్ణు జుట్టి కూర్చుండి చవులూర
ముడులు విప్పిచల్ది మూటలపుడు. 2.
ఊరగాయ జూపి యూరించగా నొక్క
డారగించె దాని నంది యొకడు
మేలు భక్ష్య మొకడు చాలంగ జూపించ
లాగి మ్రింగె నొక్క డాగ కుండ. 3.
తనవద్ద నున్నట్టి ఘనపదార్ధములన్ని
భక్షించ రండంచు పంచె నొకడు,
తనభక్ష్యరాశులన్ తన్మయత్వము తోడ
మిత్రుల కందించె మేటి యొకడు,
ఒకని చిక్కములోని యోగిరంబుల బట్టి
పంచె నందరిలోన బాలుడొకడు,
మిత్రులందరిగూడి మిగుల సంతోషాన
నన్నదమ్ములయట్టు లద్భుతముగ
ఒకరి నొకరు గాంచి యుత్సాహభరితులై
పాడుచుండి హాస్యమాడుచుండి
కృష్ణు జూచుచుండి తృష్ణ తీరగ చల్ది
కుడుచుచుండి రచట కూర్మిమీర. 4.
శారీరికవైకల్యం
బేరీతిగ నడ్డురాదు, హితకాంక్షులకున్
ధీరత మనమున నిండిన
వారలకా ప్రభుడొసంగు బహుసౌఖ్యంబుల్. 1.
కోరికలు దీరు నెల్లెడ
చేరును విజయాలువారి చెంతకు సతమున్
తోరపు టుత్సాహము నె
వ్వారలు పూనెదరుసత్య పాలనతోడన్. 2.
రాబోదు కష్టకాలము
కాబోదిక దుర్భరంబు ఘనవైకల్యం
బాబాలవృద్ధ మందున
ధీబల మెవ్వారిలోన దీపిల్లు భువిన్. 3.
ఒకచేయి లేదటంచును
వికలుండై బాధపడక విజ్ఞతతోడన్
ప్రకటిత సామర్ధ్యముతో
నకటా! యీతండు ఖడ్గ మందెను చేతన్. 4.
శుభములు గల్గును నిత్యము
విభవంబులు పొందవచ్చు విస్తృతరీతిన్
ప్రభవించు సౌఖ్య మొదవెడు
నభయము వికలాంగుడైన యత్నముచేతన్. 5.

ద్రౌపది యశ్వత్థామను
పాపివి నీవంచు చూచి బహువిధములుగా
కోపోద్రేకభవంబగు
తాపంబున పలికెనిట్లు తానా వేళన్. 1.
చిన్నవారల నిద్రనున్నట్టివారలన్
..........సంహరించుట నీకు సముచితంబె?
నీవిరోధులుగారు, నిందింపగా రారు
..........వారి జంపుట కేమి కారణంబు?
గురుపుత్రుడవు నీవు కరుణ యించుక లేక
..........పుత్రతుల్యుల నెట్లు పొడిచినావు?
ద్రోణపుత్రుడవౌచు దురితమిట్లొనరించ
..........చేతులెట్లాడెనో ఆతతాయి?
శస్త్ర ధరులు కారు, సమరంబు నొనరింప
దలచి రమ్మటంచు బిలువబోరు
భద్రమూర్తులౌచు పవళించి యున్నట్టి
వారి జంపి యేమి బడసినావు? 2.
అని ద్రౌపది పలుకంగా
విని, పార్థుని యత్నమరసి వెన్నుం డనియెన్
ఘనతరమగు దురితంబును
చెనటితనంబును వహించి చేసె నితండున్. 4.
క్షమియింపరానట్టి కలుషమీతడు చేసె
..........హంతవ్యు డనుమాన మింతలేదు,
శిశులజంపుట జేసి పశుసమానుండయ్యె
..........బాపడా యీతండు పాపిగాని,
దుర్మార్గుడైన యీ ద్రోణపుత్రుని జంప
..........నుద్యమించుట పార్థ! యుచితమయ్యు
బ్రాహ్మణుండై యుంట ప్రాణాపహరణంబు
..........తగని దీతనిపట్ల దాన నిపుడు
పొగ రణంగు నట్లు తగురీతి యోచించి
వీని పనికి తగినదాని నరసి
రాక్షసాత్ము నితని శిక్షింపవలె గాన
వీరవర్య! యిద్ది వినుము విజయ! 5.
శిరముపైన వెలుగు శ్రేష్ఠమౌరత్నంబు
పెఱకివేసి శిఖను తఱుగు పనియె
అర్హమైన దట్టి యవమానభారంబె
చాలు నితని కిపుడు సవ్యసాచి! 6.
సిగలో రత్నముఁ దరుగుట
యగునిక సరియైన శిక్ష యర్జున! ద్రౌణిన్
తెగటార్చ వలదు విప్రుం
డగుటను వినుమంచు బలికె నచ్యుతు డపుడున్.
అమ్మ ఒడి - తొలిబడి
నవ్వు నేర్పును, వేలంది నడక నేర్పు
తినుట నేర్పును, బుద్ధిగ మనుట నేర్పు
అత్త, తాతలు నేర్పు తాననవరతము
తల్లియొడి యది తొలిబడి యెల్లరకును 1.
మమత బంచును, భావాన సమత బెంచు,
మంచి చెడుగులు బోధించు మాట నేర్పు,
తారతమ్యము లెరిగెడి తీరు జూపు
తల్లియొడి యది తొలిబడి యెల్లరకును 2.
కోప మొకయింత యైనను చూపకుండ
ఉగ్గుపాలను పోయుచు నుర్విలోని
సంగతులనన్ని వినిపించి శక్తి గూర్చు
తల్లియొడి యది తొలిబడి యెల్లరకును 3.
కథలరూపాన విశ్వంబు కలియద్రిప్పు
జ్ఞానదాయిని యెల్లెడ తాన యగుచు
పలుకు పలుకున సకలంబు తెలియ జెప్పు
తల్లియొడి యది తొలిబడి యెల్లరకును 4.
అలుక నేర్పును, ప్రేమగా పలుక నేర్పు,
అడుగ నేర్పును, బట్టలు తొడుగ నేర్పు,
రుచులు నేర్పును, శబ్దసంరచన నేర్పు
తల్లియొడి యది తొలిబడి యెల్లరకును 5.
దయయు, సత్యంబు, ధర్మంబు, భయము నేర్పు,
యశము లందుటలో గల్గు హాయి నేర్పు
సర్వవిధముల న్యాయానుసరణ నేర్పు
తల్లియొడి యది తొలిబడి యెల్లరకును 6.
ఔరా! భువనావనుడగు
కారుణ్యాత్ముండు ప్రభుడు కమలదళాక్షుం
డీరీతి యాత్మరక్షణ
గోరుచు ఛత్రంబు నందె కూరిమి నిండన్.
మెండుగ వరముల నొసగుచు
ఖండించుచు కల్మషంబు ఘనతరముగ మా
కండగ నన్నిట నిల్తువు
దండం బో పాండురంగ! దయజూపవయా!(ధర్మోద్ధారా)