Wednesday, 9 May 2012

మోహిని

ది.10.05.2012 వ తేదీ  
"శంకరాభరణం" బ్లాగులో  
"పద్యరచన" శీర్షికన ఇవ్వబడిన చిత్రానికి వ్రాసిన 
పద్యవ్యాఖ్య
మోహిని
సీ.
తొల్లి మత్స్యంబౌచు ఎల్లవేదంబులన్
          కాపాడి యున్నట్టి ఘనుడతండు,
సకల సురాసురుల్ సాగరంబున జేరి
          అమృతంబు కాంక్షించి యందులోన
మంథరాద్రిని నిల్పి మహిమాన్వితుండైన
          వాసుకిన్ త్రాడుగా చేసినపుడు
కూర్మరూపంబుతో కోరనచ్చట జేరి
          గిరిని దాల్చిన యట్టి సురవరుండు
తే.గీ.
సిరిని చేపట్టి యలరించు సరసుడగుచు
దానవారులు ప్రార్థింప దయను జూపి
అమృత మందింతు వీక్షింపు డని యటంచు
సౌరులొలికించు నతివగా మారెనపుడు. 
కం.
మోహినియై చూపరులకు 
మోహంబును గల్గజేసి మురహరు డనఘుం
డాహరి యమృతపు భాండం
బాహా! యరచేత బూని యచ్చట నిలిచెన్.
కం.
జేజే మోహనరూపా!
జేజే కమలాయతాక్ష! జేజే శార్ఙీ!
జేజే యసుర నిహంతా!
జేజే భువనైకనాథ! జేజేలు హరీ!
కం.
హరి! నీనామము దలచిన
హరియించును పాపచయము లానందమగున్.
"హరిహరిహరి" యని యందును
కరుణను జూపించి మమ్ము గావు మనంతా!


శ్రీ గురజాడ అప్పారావు

ది. 09.05.2012 వ తేదీ "శంకరాభరణం" బ్లాగులో 
"పద్యరచన" శీర్షికన ఇవ్వబడిన 
"గురుజాడ అప్పారావుగారి" చిత్రానికి 
వ్రాసిన పద్యవ్యాఖ్య.
శ్రీ గురజాడ.
శా.
శ్రీమంతంబగు తెల్గునేల కిలలో శ్రేయంబు లందించు హే
ధీమన్! శ్రీ గురజాడవంశతిలకా! దివ్యాంశసంభూత! యీ
భూమిన్నిల్చు త్వదీయనిర్మలయశ: పుజంబు సంస్కారరూ
పా! మాన్యా! కొనుమంజలుల్ శతము లప్పారాయ విద్వన్మణీ!
సీ.
దేశాన్ని ప్రేమించు, దీప్తులెల్లెడ చాటు
          జగతిలో శ్రేష్ఠంబు జన్మభూమి,
దేశానికర్థంబు దేశవాసులెగాని
          మట్టికాదనుమాట మదిని నిల్పి
సొంతలాభం బింక కొంతైన మానుచు
          నరుడ! తోడ్పడవోయి పొరుగులకును
అన్నదమ్ముల వోలె యఖిలాంధ్ర జనులార!
          మతభేదములు మాని మసలుకొనుడు
ఆ.వె.
దేశవాసులార! యాశాలతను బూని
కలసి మెలసి యుండు డిలనటంచు
సోదరత్వబోధ లాదరంబుగ జేసె
సకల జగతికి గురజాడ నాడు. 
కం.
కన్యాశుల్కము మాన్పగ
నన్యాయము ద్రుంచఁ బూని యద్భుతకృతులన్
ధన్యుండై యొనరించెను
మాన్యుడు గురజాడ చూడ  మహితాత్ముడిలన్.
కం.
గురజాడకు నరయంగా
సరిసములెవ్వారు లేరు సకలజగాలన్
నిరతము సంఘంబున సం
స్కరణమునన్ మగ్నుడైన ఘనుడాతండున్. 
ఆ.వె.
సార్థకం బొనర్చె సంఘసేవను జన్మ
ధన్యజీవి యతడు ధరణిలోన
స్మరణయోగ్య మింక సకలాంధ్రజగతికి
నా మహానుభావు నామ మెపుడు. 


ముత్యాల సరాలు.

నేడు మిక్కిలి భక్తితో గుర
జాడ కంజలి చేసి నిల్తును
తోడు నీడై సంఘమంతకు
నాడు నిల్చెను తాన్.


స్వార్థభావన విడిచి పెట్టుట
సంఘసేవకు నడుము కట్టుట
నిజముగా గురజాడ కంజలి
సత్యమియ్యదియే.


Monday, 7 May 2012

పిలుపు


ఉ.
భారత భావిపౌరులగు బాలకులార! యనన్య సాధ్యమౌ
కారణజన్మ మీ భరత ఖండమునందు లభించె గావునన్
ధీరత నీ ధరాస్థలిని దీవ్యదనంత సుఖప్రదంబుగా
గూరిచి గావ బూనుడిక కూర్మిని నేటి సభాముఖంబుగన్. 
ఉ. 
వేదచతుష్టయంబులవి విశ్వవిభూతికి కారణంబు లీ
మేదినిలో జనించినవి, మించు యశంబుల గూర్చు శాస్త్రముల్
మోదము నందగా నిచట మున్ను భవంబును బొందియుండె న
య్యాదిమ మౌని వర్గమిక నందిరి జన్మము భారతావనిన్.
ఉ.
వానిది భాగ్యవైభవము, వానిది సార్థక జీవనం బికె
వ్వాని హృదంతరంబిలను భారత మాతృక శాంతి దుగ్ధముల్
పానము చేసి, తన్మయత భారతి విస్ఫుట సాధుగీతికల్
గానముజేసి ధన్యతను గాంచునొ  వాడు మునీంద్ర తుల్యుడౌ.
ఉ.
ఇట్టు(ట్టి) విశిష్టమై వెలుగు నీ భరతావనిలో గనంగ నే
పట్టున జూచినన్ మతము, భాగ్యవిహీనత, దౌష్ట్యవర్ధనల్
బిట్టుగ నుగ్రవాదములు, భిన్నత బెంచెడి ప్రాంత భేదముల్
ముట్టడి జేసి దేశమును ముక్కలు చేయగ బూనె హా విధీ!
ఉ.
రండు ప్రతిజ్ఞ బూనగను రమ్యశుభోదయవేళ నిప్పుడీ
పండిత బృంద సంయుత సభాస్థలి నిర్మలభావపూతమౌ
నిండు మనంబుతో నిలను నిత్య మనోహరజేసి కావగా
మెండుగ బద్ధకంకణత  మీరలు సంతత సత్యసంధులై.
కం.
ఎటు చూచిన మతమౌఢ్యం
బెటు గన్నను స్వార్థపరత యిలలో నేడున్
పటుతర శాంతి సమీరము
కటకట! కరువయ్యె గాదె కాంచుడు మీరల్.
రిపబ్లిక్ దినోత్సవ సందర్భంగా 
విద్యార్థులనుద్బోధిస్తూ వ్రాసిన పద్యములు
26.01.2002
జ.న.వి.వెన్నెలవలస, శ్రీకాకుళం




Sunday, 6 May 2012

సతీ సావిత్రి

ది. 07.05.2012 వ తేదీ "శంకరాభరణం" బ్లాగులో 
పద్యరచన శీర్షికన ఇవ్వబడిన చిత్రానికి 
వ్రాసిన పద్యవ్యాఖ్య.
సతీసావిత్రి
సీ.
జనకున కలనాడు జగదంబ గూర్చిన
          వరదాన మహిమచే భవమునొంది,
ఆటపాటలతోడ అలరించి మురిపించి
          అన్నింట సంతసం బందజేసి
భర్తగా దలచిన వాని కాయువు జూడ
          చిరము గాదనుపల్కు లెరిగి యుండి
పరిణయం బాడి యా పతిసేవ జేయుటే
          వ్రతముగా బూనిన పరమ సాధ్వి
తే.గీ.
అపుడు సద్భక్తి జూపించి యముని నుండి
పతికి పూర్ణాయువును బొంది సుతుల గాంచి
మహి నతివలకు మేటియై బహుళయశము
బడయు సావిత్రి నీకివె ప్రణతులమ్మ!
చం.
వరమహిళాశిరోమణికి, భర్తకు నెల్లెడ తోడునీడయై
ధరపయి మృత్యుదేవతకు తన్మయతన్ గలిగించి, స్వామికిన్
సురుచిరమైన జీవనము చూపిన సాధ్వికి, దివ్యశక్తికిన్
పరమపతివ్రతాసతికి(మణికి) భక్తినొనర్తు ప్రణామముల్ మదిన్

Saturday, 5 May 2012

తిరుపతి వేంకట కవులు

ది. 06.05.2012 వ తేదీ  
"శంకరాభరణం" బ్లాగులో ఇవ్వబడిన 
"తిరుపతి వేంకట కవుల" చిత్రానికి 
వ్రాసిన పద్య వ్యాఖ్య.
కం.
శ్రీమత్తిరుపతి వేంకట
నామాఢ్యుల కాకవిత్వ నైష్ఠికుల కికన్
ధీమతులకు జేయుదము ప్ర
ణామము కవిమిత్రులార! నమ్రత తోడన్. 
కం.
తిరుపతి వేంకట కవులకు
నిరతము సాహిత్యసేవ నెరపుచు ఘనులై
దిరిగిన కవియుగ్మంబున
కరుసంబుగ జేతు నుతుల ననవరతంబున్. 
కం.
ఏనుగు లెక్కిరి మరి స
న్మానములకు లెక్కలేదు మహిలో మాన్య
శ్రీనిధులై యలరుచు నవ
ధానము లొనరించునట్టి ధన్యులకు నతుల్. 
కం.
భాషాద్వయమున మేమే
భాషించగ ఘనులమింక బహురీతులలో
రోషంబున్నను రండిక
వేషంబులకేల? యనెడు విజ్ఞులకు నతుల్. 
కం.
శతసంఖ్యను కావ్యంబుల
నతిదక్షతతోడ బలుకు ననఘాత్ములకున్
జతగా నుండెడు వీరికి
స్తుతిశతములు చేయవలయు సురుచిరభక్తిన్.

Wednesday, 2 May 2012

శ్రీ కందుకూరి వీరేశలింగము

"శ్రీ కం దు కూరి వీ రే శ లిం గ ము"
నామాక్షర పద్యమాలిక
("శంకరాభరణం" బ్లాగులో ది. 02.05.2012 తేదీ
 "పద్యరచన" శీర్షికన ఇవ్వబడిన వీరేశలింగం గారి చిత్రానికి వ్రాసిన 
పద్యవ్యాఖ్య.
ఛందము - కందము.

శ్రీకరుడై సంఘంబున
  మూకలుగా నిండియున్న మూఢాచారా
  లేకాగ్ర చిత్తధరుడయి
  పోకార్చిన ఘనుడు తాను పుణ్యాత్ము డికన్. 

కంటకతుల్యములై పలు
  తంటాలను తెచ్చుచుండి ధరణీతలమం
  దంటిన బాల్యవివాహా
  లింటింటికి చేయు కీడు నీతడు తెల్పెన్(మాన్పెన్.)

దురితంబుల నెల్లెడలం
  బరిహారము చేయుచుండి, పడతుల కిలలో
  సురుచిర జీవనమునకై
  నిరతము శ్రమియించినట్టి నిర్మలు డతడున్. 

కూరిమి తనువున నిండిన 
  ధీరుడు వీరేశలింగ ధీశాలి (యికన్) యహో
  కారణజన్ముం డాతడు
  వేరెవ్వరు సాటి లేరు విశ్వము నందున్. 

వీరను వారను భేదం
  బారయు నజ్ఞానిజనుల కనవరతంబున్
  కోరుచు నుద్బోధించెను
  మీరిట్టులు చేయ దగదు, మీరకుడనుచున్. 

రేలుంబవ లనునిత్యం
  బాలోచన చేసి స్త్రీల కద్భుతరీతిన్
  మేలొనరించెడి విద్యా
  శాలలు స్థాపింప జేయు సజ్జను డతడున్. 

తవిధముల యత్నించిన
  గతిలేని వితంతులైన కర్మఠుల కిలన్
  హితకారిణి యను సంస్థను
  వెతలం ద్రుంచంగ నిల్పు విజ్ఞుం డతడే. 

లింగాకారుని దలచిన
  కంగారై తొలగిపోవు కల్మష మట్లున్
  వంగడములు సుఖదములౌ
  నంగీకృతులౌచు వీరి యనుసరణమునన్. 

ద్యంబున తిక్కనయై
  పద్యంబున ప్రోడ యగుచు బహుకావ్యంబుల్
  హృద్యంబుగ రచియించిన
  విద్యావంతునకు జేతు వినయాంజలులన్. 

మునులను మించిన వాడత
  డనవరతము సంఘసేవ కంకిత మగుచున్
  తనువుకు ధన్యత గూర్చిన
  ఘనచరితుడు కందుకూరి కవిసత్తముడున్. 
హ.వేం.స.నా.మూర్తి.


Tuesday, 1 May 2012

సర్పయాగం

 ది. 29.04.2012 వ తేదీ "శంకరాభరణం" బ్లాగులో పద్యరచన శీర్షికన  ఇవ్వబడిన చిత్రానికి వ్రాసిన పద్యవ్యాఖ్య. 
సర్ప యాగం
ఛందము - ఆటవెలది.

తక్షకాహి విషపు దావానలంబున
జనకుడంతమౌట వినిన మీద
మునుపు చేయు చుండె జనమేజయాఖ్యుండు
సర్పయాగ మచట నేర్పు మీర.

సర్పకులములన్ని సత్వంబు నశియించి
మహితమైన మంత్ర మహిమవలన
ఒకటి రెండు గాదు, సకలాహిసంఘాలు
వరుసగట్టి యజ్ఞవాటి కపుడు

చేరి పడుచు నుండె నేరుగా హోమాగ్ని
గోరినట్లు వాటి తీరు గనుడు 
తక్షకుండు తాను ధైర్యంబు గోల్పోయి
నాకలోకమందు నక్కియుండె. 

సిద్ధ మచట మఘవు సింహాసనంబును
చుట్టి చేరి యుండె, చోద్య మపుడు
యాగశాలలోని యాజ్ఞికవరు లంత
"ఇంద్రయుతుడ! వ్యాళ మిలకు రమ్ము".

అనుచు బల్కి వార లాహుతు లీయంగ
చిత్రమేమొ గాని సేంద్రు డగుచు
తక్షకుడను పాము ధరణికి నేతెంచి
యాగ వహ్నిలోన వేగ మపుడు,

పడుచు నుండ బోవ పరమ దయాళుండు
ఘోర మాపదలచి  చేరి నిలిచి
స్వస్తివచనశీలి యాస్తీకు డదిగని
దయను జూపు మనియె ధరణిపతికి.

సాధువర్తనుండు జనమేజయుండంత
శాంతమూర్తి యగుచు శ్రద్ధ తోడ
ప్రణతులొసగి యాగ పరిసమాప్తిని జేసె
జగములన్ని మిగుల సంతసించ.