దివ్యభారతం- విజయభారతం.
చం.
స్థిరతరధర్మసంతతికి, చిన్మయశక్తికి, సంస్కృతీ స్ఫుర
ద్వరశుభభావనాపటలి వర్ధిలజేసెడి కార్యదీప్తికిన్,
సురుచిరవాక్యసంపదకు, సుందరజీవనశైలి కీయిలన్
భరతవసుంధరాస్థలము వాసిని గన్నది యన్నిరీతులన్.
ఉ.
న్యాయము, ధర్మవర్తనము, నైష్ఠికతామయదైవభక్తి, యా
ప్యాయతతోడ నందరి యనామయవృద్ధిని గాంక్ష సేయు, ట
త్యాయతనిర్మలత్వవసుధైకకుటుంబక భావయుక్తితో
స్వీయమహోన్నతత్వమును చెప్పక చూపుట లిందు నిత్యముల్.
ఉ.
"శాంతి యహింస లెల్లెడల సౌఖ్యకరంబులు నమ్ము" డంచు న
త్యంతశుభాశయాన్విత మహత్తరతత్వము విశ్వమందునన్
సంతతహర్షదీప్తికయి సన్నుతరీతిని తెల్పినట్టి యా
శాంతయశోవిభూషితము సత్యము భారతమన్న నెన్నడున్.
మ.
ఇది నాదేశవిశాలదివ్యబలమై యింపారు సత్స్నేహ మె
ప్డుదయించన్ నినదించు దుష్టమతులై యుగ్రాతివాదంబు తా
మెదలం నిల్పుచు హానిగూర్తు రిచటన్ హీనాశయస్వాంతులై
వదలం జూడదు వారిపాపగతులన్ పండించి పైకంపగన్.
శా.
చెండాడున్ ఖలకోటి యెందు మనినన్, సిందూరమై చీల్చుచున్
ఖండించున్, మహదగ్నియై సకలమున్ గాల్చున్ గదా భస్మమై
నిండన్ దుష్టులదేహముల్ ధరపయిన్ నిశ్శేషమౌనట్లు, బ్ర
హ్మాండం బంతయు భీతిలన్ భరతదివ్యానంతచక్రంబు తాన్.
హరి వేంకట సత్యనారాయణ మూర్తి.
9441320381
No comments:
Post a Comment