Sunday, 21 December 2025

మానవ జీవితంలో గణితం.

 మానవ జీవితంలో గణితం.

(గణిత వారోత్సవాల సందర్భంగా)


సీ.

తల్లిగర్భమునుండి ధరణికి నేతెంచు

నప్పుడు గ్రహగతుల్ చెప్పునపుడు

బాల్యంబులో నాడు బహువిధ క్రీడలన్ 

మించు హర్షాన లెక్కించు నపుడు

మాట నేర్చిన వేళ  మామకుల్ వీరంచు

వ్రేళ్ళపై లెక్కలన్ వేయునపుడు

విద్యార్థిదశలోన వివిధపాఠ్యాంశాల

క్రమము జూచుచునుండు సమయమందు

గణుతి కెక్కించు సద్గుణములనంచనా

వేయుచు నుండెడి వేళలోన

జీవనార్థంబంచు సిరులనందెడువేళ,

నిత్యంబు గృహకార్య కృత్యములను

సంఘంబులో తాను సాధించియున్నట్టి

ఆధిక్యమునుజూచు నవసరమున

సర్వకాలములందు సవ్యాపసవ్యంపు

కర్మముల్ లెక్కించు క్షణములందు

ఆ.వె.

గణితమెల్లవేళ కావలె ననుటలో

సందియంబు లేదు సర్వజగతి

భువిని మానవునకు నవినాత్వ సంబంధ

మున్నదనుట సత్య ముర్విలోన. 


ఆ.వె.

మొక్కవోవు బ్రతుకు లెక్కలులేకున్న

నొక్కనిముసమైన నిక్కముగను

చక్కనుండబోదు మిక్కిలిగా మాట

లాడనేల నమ్ము డేడనైన. 


ఆ.వె.

లెక్క నేర్వకున్న చక్కని బ్రతుకైన

చిక్కు కష్టమందు మిక్కుటముగ

లెక్కలేని బ్రతుకు నిక్కుంభినిన్ జూడ

రాదు లెక్కలెపుడు మోద మొసగు. 

సీ.

ఒకదాని నొకటితో నొప్పుమీరగగూడి

ఉత్సాహమును గాంచు చుండవచ్చు,

నటులనే యొకదాని నద్దానిలోదీసి

శేష మెంతుండునో చెప్పవచ్చు

గుణకార మొనరించి గుర్తించగావచ్చు

లభియించు మొత్తంబు లలితగతిని

ఒకదాని నొకటిచే సుకరమౌ విధిలోన

భాగించి ఫలితంబు బడయవచ్చు

ఆ.వె.

సంఖ్యతెలియకున్న సాధించగావచ్చు

సూత్రవిధులతోడ సుందరముగ

గారడీలవంటి గమ్మత్తు లెన్నియో

చేసి చూపవచ్చు సిద్ధముగను. 


సీ.

కథలెన్నియో గూర్చి ఘనమొప్పగా బల్కి

గణితంబుతో తెచ్చి కలుపవచ్చు,

వ్యాపారసరళిలో చూపించగావచ్చు

లాభనష్టంబుల శోభలిందు,

క్రీడాత్మకంబులౌ క్రియలిందులో చేసి

సంతసించగవచ్చు నెంతయేని

మొద్దుబారిన మదిన్ ముద్దుగా గ్రహియించి

నిజమైన మేధస్సు నింపవచ్చు

ఆ.వె.

నరుని జీవితాన నరయంగ గణితంబు

నరనరంబులోన సురుచిరముగ

నిండియుండెననుట నిజమిది లేనట్టి

జీవితంబు నూహ చేయగలమె?

No comments:

Post a Comment