శ్రీ క్రోధి నామ సంవత్సరమా స్వాగతము
శా.
శ్రీమ "త్క్రోధి "శుభాబ్దరాజమ! మహచ్ఛ్రేయంబు లొప్పార నీ
భూమిన్ నిల్పగ స్వాగతింతు నిటకున్ బూర్ణానురాగమ్ముతో
క్షేమస్థైర్యసుహర్షదీప్తివిలసచ్ఛ్రీయుక్తభాగ్యస్థితిన్
బ్రేమన్ జూపి శుభంబు గూర్తువను సద్విశ్వాసభావంబునన్. 1.
శా.
క్రోధాకారులు నీతిదూరులు మహత్క్రూరాత్ము లీనేలపై
బాధల్ గూర్చుచు నున్నవారు ప్రజకున్ వారిన్ భవచ్ఛక్తిచే
"క్రోధీ! " వత్సరరాజమా! సుమతులన్ గూడంగ జేయం దగున్
బోధించందగు సత్కృతుల్ సలుపగా మోదస్వరూపంబుతోన్. 2.
శా.
ధిక్కారంబున సభ్యమాన్యజనులన్, ధీరాత్ములన్ వృద్ధులన్
పెక్కుల్ బల్కుచు దోషభాషణములన్ విస్తారరూపంబునన్
త్రొక్కం జూచెడి దుష్టనీచమతులన్ "గ్రోధీ! " నిరోధించి తా
మిక్కట్లన్ గనునట్లు జేయగను నీ వీనేల నిల్వందగున్. 3.
శా.
నాదేశంబిది యార్యభూమి యిచటన్ నానాప్రకారంబుగా
వేదంబుల్ ఋజుధర్మమార్గములకున్ విస్తారభావంబులన్
మోదంబందగ జూపె వానియెడలన్ బూర్ణానురాగమ్ము
నేదంపూర్వవిధాన నిండవలయున్ నీరాకచే "క్రోధి " జే. 4.
మ.
మనధర్మంబిది భారతీయత గదా మాన్యత్వముం గూర్చు జీ
వనమున్ సల్పుట యోగ్యకర్మ యనుచున్ భావించ కన్నింటిలో
తనసౌఖ్యంబును గోరి దీనజనులన్ దౌష్ట్యంబుతో గూల్చు దు
ర్జన సంఘాపహయై ధరన్ నిలువుమా సత్వాఢ్య! "క్రోధీ! " యిటన్. 5.
శా.
సంతోషంబున సర్వమానవు లిలన్ సర్వార్థసంపత్తులన్
చింతల్గాంచక పొందునట్టి స్థితులన్ శ్రీమత్ సుఖావాప్తులన్
వంతల్లేమియు పొందునట్టి బలిమిన్ భావించ "గ్రోధీ" దయా
నంతా! చూపుము స్వాగతం బిచటకున్ హర్షప్రదా! నిర్మలా! 6.
మ.
వరదాతల్ శివకేశవాది దివిజుల్ వారిన్ మహద్భక్తితో
ధరవారల్ స్తుతియించు టొప్పగును తత్తద్భావులై భక్తులా
సురకోటిన్ భజియించు కాలమున నీసున్ "క్రోధి! " యవ్వారిలో
చొరనీకుండుము స్వాగతం బిదియె నీశోభన్ బ్రదర్శించగన్. 7.
శా.
త్సంతంతుమ్మని యర్థహీనఫణితిన్ సర్వజ్ఞభావమ్ముతో
సుంతైనన్ విబుధాళి గొల్వక మహచ్ఛూరత్వముం జూపి య
త్యంతావేశముతో కవిత్వమను సాహంకారులౌ వారికిన్
చింతించం దగు భావమిమ్ము దలతున్ జేయంచు "క్రోధీ! "నినున్. 8.
శా.
రమ్యంబై హరితాఢ్యమై సుఖదమై బ్రహ్మాండమం దంతటన్
సమ్యగ్రీతులు మానవత్వమునకున్ సంధించు నాభూమి స
త్కామ్యంబుల్ ఘటియింప జేయునది సత్యం బోయి "క్రోధీ!" మహత్
సౌమ్యా! స్వాగత మిందు ధార్మికతకున్ సత్వంబు చేకూర్చగన్. 9.
శా.
మాన్యుల్ నాకుభవంబు భూమిపయినన్ మన్నించుచున్ గూర్చి సౌ
జన్యత్వంబున బెంచినారు జనకుల్ జన్మంబు తానెంచినన్
ధన్యంబౌ గద వారిసేవ సలుపన్ తథ్యంబు గానంచు లో
కన్యాయంబున నిల్చుబుద్ధి ప్రజకున్ గల్గించు "క్రోధీ! " నతుల్. 10.
శా.
స్వామిత్వంబు వహించి సభ్యజనులై సర్వప్రజానీకమున్
క్షేమం బందెడి రీతి నేలగల రాశీభూతసౌజన్యులన్
మామానేతలుగా జరించునటులన్ మన్నించి యో "క్రోధి!" నీ
ప్రాముఖ్యత్వము జూప స్వాగతమిదే భవ్యానురాగాన్వితా! 11.
మ.
గతులన్ దప్పక హర్షకారకములై కల్యాణభావమ్ముతో
ఋతువుల్ సాగుచునుండ సస్యపటలిన్ హృద్యంబుగాజేయ నీ
క్షితిపై వర్షతతుల్ త్వదీయమహిమన్ జేర్చంగ నో "క్రోధి! " నీ
చతురత్వంబును జూప స్వాగతమిదే సంవత్సరశ్రేష్ఠమా! 12.
మ.
తనియన్ జేయుము జీవజాలము నిటన్ త్వత్క్రోధముం జూప కీ
వనయం బిచ్చట "క్రోధి!" శాంతిపవనం బత్యంత సౌఖ్యస్ఫుర
ద్ఘనతాదీప్తిని నింపునట్లుగ భవత్సామర్ధ్యముం జూపి మా
కనిదంపూర్వవిధాన శక్తినిడుమాయంచున్ నినున్ గోరెదన్. 13.
మ.
మునుపీ పృథ్వికి జేరి యేగినవి సమ్మోదప్రదాకారులై
ఘనతన్ గాంచిన హాయనంబు లటులే కల్యాణభావోన్నతిన్
జనపక్షంబు వహించి "క్రోధి"! యిచటన్ సర్వార్థముల్ గూర్చు భా
వనతో నిల్వుము స్వాగతమ్ము విమలస్వాంతా! శుభాకారిణీ! 14.
శా.
శ్రీలందించుచు స్వచ్ఛభావనలతో క్షేమంకరంబైన త్వ
ల్లీలాలాలిత్యము జూపి యీప్రజలకున్ "క్రోధీ" సుఖానందముల్
వాలాయంబుగ బంచ రమ్మనుచు నిన్ భవ్యానురాగోన్నతన్
మేలౌరీతిని స్వాగతించెదను సంప్రీతిన్ ప్రవేశించుమా!
మ.
శుభభావస్థిరు రాజకీయచతురున్ శుద్ధాత్మునిన్ నేతగా
ప్రభుశక్తిన్ గొనగల్గువానిని మహత్ప్రహ్లాదసంయుక్తునిన్
విభవాన్వీతుని నిర్ణయించు మిచటన్ ప్రేమోన్నతా! "క్రోధి"! నీ
వభయానందద వంచు లోకములు నీయాంతర్యమున్ మెచ్చగన్.
చం.
చతురతజూపి ధార్మికత చక్కగ సాగెడిరీతి జూడుమీ
వతులితసభ్యభావములనంతశుభప్రదసత్ఫలంబులన్
ప్రతిదినమందజేయుప్రియ వాయువులన్ బ్రసరింప జేయుమీ
క్షితిపయి "క్రోధి" వత్సరమ! జేయని నిన్నిట స్వాగతించెదన్.
మ.
అనుకూలంబగు వర్షపాతమిచటన్ హర్షంబు చేకూర్చున
ట్లొనరం జేయుచు సస్యదీప్తులు ఫలం బొప్పార వ్యాపించగా
జనసంఘంబులకాంక్షితార్థములకున్ సాఫల్యతల్ జేరున
ట్లనిదంపూర్వసుఖాప్తి జూపుమిదెనీకందింతు "క్రోధీ" నతుల్.
మ.
కులముల్ జాతులటంచు భేదములతో " క్రోధీ"ప్రజానీకమీ
యిలపైవైరముపూనకుండెడివిధిన్ హృత్పద్మపీఠంబులన్
వెలుగంజేయుము నీదుకాలముమహద్విస్తార మైత్రీస్థితిన్
దెలుపన్ స్వాగతమంచు బల్కెదను సందేహించకీవేళలోన్.