నూతనాంగ్ల సంవత్సరము 2023కు స్వాగతము
కం.
శ్రీలును శుభములు సుఖములు
మేలగు స్వాస్థ్యంబు జయము మీకందవలెన్
వాలాయముగా హర్షము
లోలిన్ నూత్నాబ్దమందు నుర్వీస్థలిలోన్. 1.
కం.
ఈవత్సరమం దంతయు
పావన భారతమునందు భాగ్యోన్నతి స
ద్భావైకదీప్తి కూడగ
దైవానుగ్రహముచేత దా నందవలెన్. 2.
కం.
అనుకూల వర్షపాతము
ఘనతర సస్యాభివృద్ధికారక మగుచున్
మనుజాళికి సంతసమును
గొనుడని నూత్నాబ్ద మిలను గూర్చగవలయున్. 3.
కం.
మనసంస్కృతి మనధర్మము
జననుతమయి విశ్వమందు సర్వవిధాలన్
ఘనతర సద్యశ మిచ్చట
ననుదిన మీయబ్దమందు నందించవలెన్. 4.
కం.
గతకాలపు రుగ్మత లీ
క్షితిపయి నశియించి ముదము చేకూరంగా
నతులిత కార్యస్థైర్యం
బతుకగవలె నరయ నూతనాబ్దంబందున్. 5.
కం.
విద్యార్థుల కందరకును
హృద్యంబగు విజయసిద్ధి యీయబ్దము తా
నద్యతనశక్తి యేర్పడ
నుద్యోగానందసౌఖ్య మొసగగ వలయున్. 6.
కం.
గురుజనులకు ఛాత్రులపై
నురుతరవాత్సల్యదీప్తి యొప్పారంగా
నిరతము శ్రధ్ధాసక్తుల
స్థిరతయు శిష్యులకు నిందు జేకూరవలెన్. 7.
కం.
తమతమ ధర్మంబులపయి
నమలిన సద్భావభాగ్య మమరగ వలయున్
క్రమముగ జనులందర కీ
క్షమపయి నీయబ్దమందు ఘనతరఫణితిన్. 8.
కం.
మనములలో నిర్మలతయు
పనులందున సవ్యఫణితి వాక్కులలోనన్
వినయం బీయబ్దంబున
మనుజుల కిట గూడవలయు మాన్యతలందన్. 9.
కం.
సోదరులయి ప్రజలందరు
నాదరభావంబుతోడ నందరి యెడలన్
మోదముతో వర్తించెడి
భేదము లేనట్టి శక్తి వెలుగొందవలెన్. 10.
కం.
ఈయాకాంక్షలతో నే
డీ యాంగ్లాబ్దమున కిప్పు డీయిలయందున్
శ్రేయస్కరమని తలచుచు
"జే"యంచును స్వాగతింతు సిరు లిట గూడన్. 11.
కం.
ఇరవై యిరవై రెండీ
ధరపయి తనయాత్ర సలిపి తానేగెను ని
న్నిరవై యిరవై మూడును
సురుచిరగతి స్వాగతింతు శోభలు నింపన్. 12.
కం.
నీపయి విశ్వాసంబును
జూపుచు స్వాగతసుమాల సుందరవాక్కుల్
దీపిల్ల బిలుచుచుంటిని
ప్రాపయి రక్షించ నూత్నవర్షమ! రమ్మా. 13.
అందరికి నూతనాంగ్ల సంవత్సరాగమన వేళ హృదయ పూర్వక శుభాకాంక్షలతో
మీ
హ.వేం.స.నా.మూర్తి.
No comments:
Post a Comment