Monday, 3 October 2022

రేపల్లె గురువందనము

 

మ.

తమలో నిండిన పాండితీవిభవమున్ తత్తద్విధానమ్మునన్

శ్రమయం చెంచక శిష్యకోటికి సదా సన్మార్గదంబౌ గతిన్

క్రమ మొప్పంగను బంచిరీ బుధజనుల్ కారుణ్యపూర్ణాత్ములై

"నమ" యంచీగురు పాదపద్మములపై నాశీర్షమున్ జేర్చెదన్

శా.

ఛాత్రస్థాయినెరింగి బోధనకునై సర్వానుకూలంబుగా

మైత్రిం జూపుచు మార్గమెంచి యెపుడున్ మాన్యుల్ లసద్విద్యలన్

స్తోత్రార్హంబగునట్లు బంచిరి వరాస్తోకానురాగాన మ

ద్గాత్రంబీభువి జేర్చి మ్రొక్కెద మహద్భావాఢ్యులన్ నిచ్చలున్.

చం.

వరగుణులౌచు శిష్యులను స్వాత్మజులన్నవిధాన నెంచుచున్

సురుచిరభావనాబలము జూపుచు యోగ్యములైన మార్గముల్

ధరణిని గాంచు శక్తినిడి తామొనరించిరి బోధనంబు నీ

గురువులు భక్తితో నతులు కూర్చెద  పద్యసుమంబులందునన్.

ఉ.

వీరికి సాటిరాగలుగు విజ్ఞులు లోకమునందు జూడగా

లేరను మాట సత్యమగు లేఖులతోడ సమానులైన యీ

కారణజన్ములన్ గొలుచు కాంక్షను జూపుచునుందు నిత్యమున్

జేరిచి వీరి పాదమున శీర్షము శిష్యుడనౌట వీరికిన్.

సీ.

రేపల్లె నిలయమై దీపిల్లె కళలకు

సాహితీభూమియై స్తవములందె

శ్రీశంకరాఖ్యతో శ్రీప్రదంబౌచును

విద్యాలయం బందు వెలుగులీనె

నచ్చోట సద్విద్య లరయంగజేరిన

వారికీ గురుజనుల్ తోరముగను

వాత్సల్యమును జూపి బహుళవిజ్ఞానమ్ము

పంచినారనిశమ్ము వరదులనగ

తే.గీ.

అట్టి గురువుల ఋణము నీ యవని లోన

నేమి యొసగిన దీర్చంగ లేము కనుక

వారు నేర్పించి యున్నట్టి వాక్యచయము

లందు నర్పించుచుంటిని వందనములు.

కం.

గురుచరణమె శిష్యులకిల

శరణము సర్వార్థదంబు జ్ఞానప్రదమై

నిరతము వరలును నేనా

చరణములకు మ్రొక్కువాడ సద్భక్తి నిటన్.

No comments:

Post a Comment