Saturday, 9 July 2022

శ్రీ విష్ణవే నమః

 శ్రీ విష్ణవే నమః


శా.

శ్రీమత్పావననీలమేఘరుచితో జిన్ముద్రతో సంతత

క్షేమంబుల్ జగమందు నిల్పుచు మహచ్ఛ్రేయంబులం గూర్చుచున్ 

స్వామీ! కావుమటన్న జేరుచు సదా భక్తాళినిన్ బ్రోచుటే

నీమం బంచు దలంచుచుందువు గదా నిన్గొల్తు నో శ్రీహరీ!


మ.

శుభదశ్రేష్ఠము శంఖచక్రయుగమున్ సొంపారు నా శార్ఙ్గమున్

బ్రభుతన్ దెల్పు గదాయుధంబు, నతుల ప్రహ్లాదముం గూర్చి స 

ద్విభవంబున్ బ్రకటించు కౌస్తుభమణిన్ విశ్వైకవంద్యుండవై 

యభయం బంచు ధరించు నీకు నతులె ప్డర్పింతు నోశ్రీహరీ!


మ.

జగతీస్థానమునందు దుర్మదముతో సర్వప్రయత్నంబుతో 

వగపున్ నింపుచు ధర్మకార్యములకున్ బహ్వార్తి గల్గించుచున్ 

నిగమౌన్నత్యము గూల్చబూను ఖలుల న్విశ్వప్రభుత్వంబుతో

దెగటార్చన్ బ్రభవించు నీకు నతులో దేవేశ్వరా!శ్రీహరీ!


శా.

క్షీరాబ్ధిన్ జగమెల్ల గాచుకొరకై శేషాహియే శయ్యగా

ధీరాగ్రేసర! చేరియుండెడి నినున్ దీప్తిప్రభావస్ఫురత్

కారుణ్యామృతవారిధిన్ గొలిచెదన్ గల్యాణ భావంబు నన్ 

జేరం జూడుము దేవదేవ! ప్రణతుల్ క్షేమప్రదా! శ్రీహరీ!


మ.

కమలానాయక!  కామితార్థవరదా! కైవల్యసంధాయకా! 

విమలైశ్వర్యవిధాయకా! విధినుతా!విశ్వైకసంరక్షకా!

అమరప్రాభవకారణా! యఘహరా! హర్షస్వరూపా! నినున్ 

సుమమాలాధరు సన్నుతించెదను సుశ్లోకా! యిటన్ శ్రీహరీ!


హ.వేం.స.నా.మూర్తి.

10.07.2022


No comments:

Post a Comment