శ్రీ గురుభ్యో నమః
కం.
శ్రీకరమగు భావంబున
కాకరమగు వత్సలత్వ
మనునిత్యంబున్
ప్రాకటముగ బంచెడి జ్ఞా
నాకృతి గురుడౌట భక్తి నర్పింతు
నతుల్. 1.
కం.
మనమందలి యజ్ఞానం
బును గూల్చుచు సంతతంబు పూర్ణప్రేమన్
ఘనతరవిజ్ఞానోన్నతి
గొనుమని శిష్యునకు నొసగు
గురునకు బ్రణతుల్. 2.
కం.
తనకన్న గొప్పవాడయి
జనమాన్యుం డగుచు భువిని
ఛాత్రుడు వెలుగన్
విని కని సంతోషాబ్ధిని
మునిగెడి గురువునకు నతులు
మునితుల్యునకున్. 3.
కం.
సురుచిర శుభకర పథముల
నరయగదగు విధము దెలిపి యతులిత
యశమీ
ధరపయి గొనుడను గురువర
చరణములకు బ్రణతు లిడుదు జయజయ
యనుచున్. 4.
కం.
అనఘత్వము తనశిష్యుల
కనుపమభూషణము పగిది నమరెడిరీతిన్
తనవిధిగ జూపుచుండెడి
ఘనుడగు గురువరుని యెదుట గరములు
మోడ్తున్. 5.
కం.
నడిచెడి గ్రంథాలయమన
గడు దక్షతతోడ ఛాత్ర గణములశంకల్
విడిపోవ జేసి మనముల
జడతను దొలగించు గురుని సరణికి
బ్రణతుల్. 6.
కం.
ధాతగ, నారాయణునిగ
చేతంబుల నిండియుండు శ్రీకంఠునిగన్
భూతలమున ననుపమమగు
ఖ్యాతిని గొను గురున కిప్పు డర్పింతు
నతుల్. 7.
కం.
అక్షయమగు విజ్ఞానం
బక్షరరూపమున జూపి యన్నివిధాలన్
శిక్షణ నొసగును ఛాత్రున
కక్షీణ బలంబు గూర్చ నా గురు గొలుతున్.
8.
కం.
వందనములు గురుజనులకు
సుందరభావప్రకాశ శోభితులగుచున్
నందనులని శిష్యావళి
నందరిని దలంచు వారి కర్పింతు నిటన్.
9.
హ.వేం.స.నా.మూర్తి
13.07.2022.