సీ.
శ్రీమంతమైనట్టి జీవనంబున నిందు
క్షేమంబు లందంగ జేయు కొఱకు
శార్వరీసమమౌచు స్వాస్థ్యంబు హరియించు
మతియంద కీనేల మసలుకొఱకు
జగతికి భూతమై యగణితార్తిని గూర్చు
చెనటి కరోననున్ జీల్చు కొఱకు
సద్భావదీప్తులన్ సర్వత్ర యిచ్చోట
నంచితం బగురీతి బంచు కొఱకు
తే.గీ.
"ప్లవశుభాఖ్యను" సత్సౌఖ్యభాగ్యద యయి
దాల్చి యడుగిడ సిద్ధమై నిల్చియున్న
నూతనాబ్దంబు నీవేళ భూతలమున
స్వాగతించుచు నున్నాడ రాగమతిని.
సీ.
శ్రీలంది సౌఖ్యముల్ సిద్ధించి యిలలోన
నారోగ్యభాగ్యమ్ము లందుగాత,
ధార్మికత్వముచేత ధైర్యమ్ము వర్ధిల్లి
యనిశంబు విజయంబు లమరుగాత
బాంధవానీకమ్ము భవ్యాశయము బంచ
నతులమోదము సతం బగును గాత
కౌటుంబికములైన కల్యాణములు గూడి
విమలమై గృహసీమ వెలుగుగాత
ఆ.వె.
సాటివారిపైన సవ్యానురాగమ్ము
కలుగుచుండుగాత యిచట బ్లవను
నిత్యశుభములంది నిస్తులస్థైర్యముల్
చిత్తసీమలందు జేరుగాత.
No comments:
Post a Comment