Sunday, 10 May 2020

అమ్మకు నమస్కారం


అమ్మకు నమస్కారం
(ఉత్పలమాలిక)

అమ్మను సన్నుతించెద ననంతయశో విభవాభిరామ తా
నిమ్మహి జన్మ మిచ్చి మహదిచ్ఛను జూపి సుతానురక్తితో
కమ్మని భావజాలమును  కానగురీతిని మానసమ్ములన్
సమ్మతి జూపునట్లుగ భృశంబగు ప్రేమను రంగరించి స
త్యమ్మును నమ్మునట్లుగను తన్మయ మందుచు నింపుచుండి ని
త్యమ్మును సంతతిన్ బహుళ యత్నము జేయుచు సాకుచుండి కృ
త్యమ్ములలోన సవ్యమగు హర్షము లందుట నేర్పుచుండి సం
ఘమ్మును గావగా దగిన కర్మలు  జూపుచు జీవితమ్ము నం
దమ్ముగ జేసికోగలుగు  దక్షత గూర్చుచు నుండి స్వార్థ మం
దెమ్మెయి గూరుకో దగని యింపగు సత్పథమందజేయుచున్
నమ్మకమైన దారులను నవ్య యశస్సులు గాంచు రీతులన్‌
సమ్ముద మందుచున్ దెలుపు  చల్లని రూపము తల్లి, యామెకున్
సమ్మత మైన మార్గమున జక్కని వర్తన తోడ స్వీయ స్వాం
తమ్మున సాధుభావము, సుధామయమై వెలుగొందు పల్కు,  హృ
ద్యమ్మగు సత్కృతుల్ నిలిపి ధర్మము తప్పక లోకమందు పం
తమ్మును బూని సజ్జనుల ధార్మిక దీప్తికి నడ్డుకట్టలై
చిమ్ముచు ద్వేషమన్ విషము క్షేమము గూల్చగ బూనువారి చి
త్తమ్ములలోని భూతమును ఛిన్నము జేయగ జేతనైన య
త్నమ్మును జేయుచున్ గనిన తల్లికి మోదము గూర్చువాడ మా
యమ్మను నిర్మలాత్మ నిట నన్నిట నున్నత మైనదానిగా
నమ్ముచు గొల్చువాడ  జననంబున నుండి మనంబు నందునన్
కొమ్మని దేశభక్తి సమకూర్చుట చేతను జన్మభూమికిన్
బమ్మయు శంకరాది సురవర్యులు  మెచ్చిన భారతాఖ్యమౌ
యిమ్మహికిన్ నమస్కృతుల నిప్పుడు జేయుచు నాకు నిందు జ
న్మమ్మును జూపు నిర్మలకు నమ్రత నమ్మకు నంజలించెదన్.

హ.వేం.స.నా.మూర్తి.
10.05.2020


No comments:

Post a Comment