Saturday, 26 October 2019

శుభదీపావళి.


కం.
శ్రీదుండగు గోవిందుం
డీదీపావళికి భక్తు లింపలరంగా
మేదినిపయి దీపంబులు
సాదరముగ నిలుప నొసగు సద్గతు లచటన్.          1.
కం.
దీపమె బ్రహ్మంబై యిట
దీపిల్లుచునుండు గాన స్థిరచిత్తమునన్
పాపాపహ మయి వెలిగెడు
దీపంబును నిలుప దగును దీప్తిని గాంచన్.             2.
కం.
దీపౌన్నత్యము జాటెడి
దీపావళి యున్నతంబు తేజోమయుడౌ
శ్రీపతికి లోకజననికి
నీపృథ్విని ముదముగూర్చు నెల్లవిధాలన్.               3.
కం.
పిన్నలు పెద్దల భేదం
బెన్నంగా దగదు నేటి యీపర్వమునన్
సన్నుతరీతిని దీపము
లున్నతముగ నిలుప వలయు నురుహర్షమునన్.     4.
కం.
అందరకును సాదరముగ
వందనములతోడ సాధు వచనములందున్
సుందరముగ శుభకామన
లందించుచునుంటి  నందు డార్యులు మీరల్.          5.

No comments:

Post a Comment