Monday, 21 January 2019

శ్రీ గణేశ శతకము

శ్రీరామ
శ్రీ విఘ్నేశ్వరాయ నమః
శ్రీ గణేశ శతకము
కందపద్యములు
శ్రీకంఠుని తనయుడవై
చేకొనుచును ప్రథమపూజ శీఘ్రముగాగన్
మూకలు కట్టిన విఘ్నము
లోకరుణామయ! హరింతువోయి గణేశా!             1.

గౌరీనందన! త్రిజగ
ద్వీరా! కరుణాంతరంగ! విఘ్నవిదారా!
రారా! కావగ నీసము
లీరేడు జగాలలోన నేరి గణేశా!                          2.

భాద్రపదంబున చవితిని
రుద్రాత్మజ! వ్రతము సేతు బ్రోవగరమ్మో
భద్రాకారా! హృద్గత
నిద్రను శమియింప గొల్తు నిన్ను గణేశా!              3.

మోదకముల నర్పించెద
నీదయ చూపించవయ్య, నిత్యము స్తవముల్
మోదంబున సద్భక్తిని
వేదస్తుత! చేతునయ్య! వినుము గణేశా!              4.

నిను దలపక జేజేలను
విను మింకెవ్వారిగాని వినుతింపనయా!
నవిఘ్నంబుల గూల్చుము
దనుజాంతక! వామదేవతనయ గణేశా!!              5.

సుముఖుడవై వరదాతల
ప్రముఖుడవై చేరుచుండి భక్తిని గొలువన్
విముఖులుగా చరియించెడి
ద్విముఖుల సరిచేయవయ్య దేవ! గణేశా!           6.
నిను జూచిన విఘ్నంబులు
నభీతిని జెంది బాఱు గణపతి విక మా
కనుదినము సత్త్వ మొసగుము
వినుతింతును విఘ్ననాథ! వినుము గణేశా!          7.

ఇరువది పైనొక రకముల
సురుచిర పత్రాలతోడ శుభకర నీకున్
ధరపయిని జరుగు పూజల
నరయుచు మముజేరి బ్రోవు మయ్య గణేశా!       8.

హైమవతీ ప్రియనందన!
భూమిని నిరతంబు గాచు పుణ్యాత్ముడ యో
శ్రీమంత! విఘ్ననాశక!
కామితములు దీర్చ మమ్ము కనుము గణేశా!       9.

లంబోదర! గణనాయక!
యంబాసుత! వక్రతుండ! యనాశక! హే
సాంబాత్మజ! కల్మషజా
లంబును తడయక దునుమ వలయును గణేశా!   10.

నలుగున బెట్టిన పిండియె
వెలయంగా బొమ్మజేసి విస్ఫుట రీతిన్
మలచినది యంబ నిన్నని
పలికెద రిచ్చోట జనులు వసుద! గణేశా!             11.

కరి వక్త్రంబును శంకరు
డురుతర వాత్సల్యమూని యుత్సవ మనుచున్
వరదాయక! నీకిడెనని
ధర బల్కుట యెంతయేని తగును గణేశా!         12.

నిన్నుం గొల్చెద నిత్యము
మన్నించుము ప్రార్థనంబు మాహేశ్వర! మా
కన్నింట శుభము లొసగుము
సన్నుతులో విఘ్ననాథ! సదయ గణేశా!            13.

ఉదరము బృహదాకారము
ముదమును నద్దానిలోన మునిజనవినుతా!
సదయా! నింపితివేమో!
యెదలను మురిపింపజేతు విచట గణేశా!           14.

విద్యాగణపతి వౌచును
హృద్యంబగు వాక్పటుత్వ మెల్లరిలోనన్
సద్యస్స్ఫూర్తిని నింపెద
వద్యతన సుఖంబు లంది యలర గణేశా!           15.

హేరంబా! నీనామము
నోరార జపించ గలుగు నూతన శక్తుల్
శూరాగ్రేసర! గొలిచెద
చేరవె యిడుములను బాప శ్రీద! గణేశా!          16.

నీయాకృతి నపహాసము
చేయగ రేరాజు గాంచె చెనటిగ నిందల్
నీయానతి లేకుండిన
నీయవనిని కీడుమూడు నెందు గణేశా!              17.

భారతమును రచియించెడి
కోరికగల వ్యాసమునికి కూర్మిని నీవున్
మారాడక లిఖియించుచు
నోరిమి సహకృతిని జూపి తోయి గణేశా!            18.

నాగంబులు నీతనువున
రాగిల్లుచు యజ్ఞసూత్ర రమణీయములై
యాగమవినుతా! యుండెడు
నోగణపతి! నతులొనర్తు నోయి గణేశా!             19.
గజకర్ణంబులు దాల్చుట
ప్రజ చెప్పెడి కష్టతతుల బహువత్సలతన్
నిజకృప జూపుచు వినుటకె
నిజమిది వందనము చేతు నీకు గణేశా!             20.

మూషకవాహన! సుఖసం
తోషంబులు భక్తతతికి తోరముగాగన్
దోషం బెంచక బంచగ
నీషణ్మాత్రంబు గొంక వీవు గణేశా!                   21.

గణపతి! సతతము నినుగని
ప్రణతుల నిడుదును నిజమిది బహుసరసములౌ
గుణముల నొసగుము భువిపయి
గణుతిని గనదగెడు ఫణితి కపిల! గణేశా!            22.

సురవర! గిరిజాతనయా!
హరనందన! విఘ్నరాజ! హస్తిముఖాద్యా!
నిరతానందద! శుభకర!
వరదాయకుడౌచు కావ వలయు గణేశా!            23.

తల్లివి తండ్రివి మిత్రుడ
వెల్లరకును రక్షకుండ విమ్మహిలోనన్
కల్లోలంబుల గూల్చుచు
నుల్లాసము గూర్చుచుండు మోయి గణేశా!        24.

తలపున పలుకుల పనులను
నిలువగవలె సుముఖ! వినుము నిరతము విధిగా
తలచెద బహుదళములనిడి
గొలిచెద నతులనిశమిడుదు కొనుము గణేశా!      25.

ధార్మిక శక్తిని గూర్చుచు
మర్మంబుల దాచియుంచి మాన్యత నిలలో
నర్మిలి జూపుచు గాచుచు
నిర్మలహృది నొసగ దలతు నిన్ను గణేశా!         26.

ధార్మిక శక్తిని గూర్చుచు
మర్మంబుల దాచియుంచి మాన్యత నిలలో
కర్మణ్యతాస్థ నిడుచును
నిర్మల హృది నొసగు మయ్య నీవు గణేశా!        ౨౭.

తీండ్రలు దీర్చుచు గావుము
తండ్రీ! భక్తుడను గాన తగువిధి నీ కే
నుండ్రాళ్ళు పోసి కొలిచెద
గాండ్రించక చూపుమయ్య కరుణ గణేశా!          28

జనముల మనముల నమగు
ధనతృష యనుదినము పెరిగె తనియనిగతి వా
రనయము తగునిదె యనుచును
పనిగొని తిరుగుదురు కనుము భవజ గణేశా!      29.  

కలుషము లడచుట పనియని
మెలగుము జగములను కపిల! మెలకువ గొనగా
బలుకుము జనులను ను నిను
తలచినకడ కరుగు మెపుడు దయను గణేశా!      30.

వ్రతమొనరించెద నిష్ఠను
సతతము నీనామ జపము శ్రద్ధగ జేతున్
వెతలన్ని దీర్చి యనిశం
బతులిత హర్షంబు గూర్చుమయ్య గణేశా!        31.

నాలోని స్వార్థభూతము
నేలా ద్రుంచంగ జూడ వెల్లవిధాలన్
బాలిశుని చేయుచున్నది
కాలగళాత్మజ! నమోస్తు కనుము గణేశా!         32.

మాపాలిటి దైవంబై
పాపములను ద్రుంచుచుండి బహువిధములుగా
దీపిల్లు శక్తి నీయవె
యోపావనమూర్తి! హర్ష మొప్ప గణేశా!             33.
జీవనము బుడగ వంటిది
భావింపగరాదు త్రుళ్ళి పదియెడి వేళన్
కావున సత్వరముగ నిను
సేవింతును విఘ్ననాథ! శ్రీద గణేశా!                34.

వందనము విఘ్ననాయక!
వందనమో శూర్పకర్ణ! వందన మహా!
వందనము స్కందపూర్వజ!
వందనములు స్వీకరింపవలయు గణేశా!           35.

నీనామ జపము చేతును
జ్ఞానప్రదమైన నీదు చరితమె దలతున్
దీనులలో నిను గాంచెద
రానీయకు బాధ విఘ్నరాజ! గణేశా!                  36.

స్కందాగ్రజ! వికటాఖ్యా!
బృందారకబృందవినుత! విఘ్నవినాశా!
సుందరచరితా! గిరిజా
నందన! దయ జూడవయ్య నన్ను గణేశా!          37.

వారంచును వీరంచును
చేరంగా బోవనేల శ్రేష్ఠామరులన్
దూరము చేయుచు నిడుముల
గారుణ్యము నీవు జూప కరము గణేశా!             38.

దేవా! నీవే దిక్కని
భావించెడి వారి నరసి పరమప్రీతిన్
దీవించి శుభములొసగుము
తావక దయజూపి సత్త్వదాత! గణేశా!              39.

సత్యము బలికిన కష్టము
లత్యంతము గలుగునందు రవనిని మొరకుల్
నిత్యములా సుఖసంపద
లత్యాయతమౌనె జన్మమవని గణేశా!       40.
వేదోక్త పూజ లెరుగను
సాదర వాక్యములు నిత్య సన్నుత విధులున్
మేదిని నెవరిని గొలుతును
నీదయ జూపించు దలతు నిన్ను గణేశా!           41.

ఛందములలో గలిగెడు
చందంబును నేర్వనైతి సద్వాక్యములన్
సుందరముగ ననజాలని
మందుడ దయజూడవయ్య మాన్య గణేశా!       42.

కరుణామయ! వరదాయక!
కరిముఖ!సత్సౌఖ్యదాత! న హేరంబా!
పరమేశాత్మజ! శుభకర!
నిరతము సేవింతునయ్య నిన్ను గణేశా!           43.

కనుమయ్యా జగములలో
ననుదిన మవినీతి హెచ్చె యసురత్వంబీ
మౌనుజులలో నిలుగట్టెను
పెనుభూతము వోలె నిజము వికట!గణేశా!          44.

మతములు మార్చెడి పనిలో
సతమతమగుచుంద్రు ప్రజలు సర్వవిధాలన్
క్షితిపయిని స్వీయధర్మం
బతిసుఖదంబని దలంప రైరి గణేశా!                  45.

నీనా భేదములెంచుచు
నేనాడును సమత జూప రేలనొ మనుజుల్
దీనులయెడ నొకయించుక
వానిది వీనిదియు నొకటె భవము గణేశా!            46.

పరభాషావ్యామోహము
నరులందున హెచ్చె నేడు నవ్యజగానన్
సురుచిరమగు తమ భాషను
మరచిరి పరికించుమయ్య మహిని గణేశా!         47.

ధనదాహం బధికంబై
మనుజులలో స్వార్థపరత మహినెల్లెడలన్
నతరమై వ్యాపించెను
కనుమయ్యా దీనిసౌరు ఖలహ! గణేశా!             48.

ధనముండిన శూరుండగు
ధనముండిన వీరుడౌను తానధిపుండౌ
ధనముండిన శ్రేష్ఠండగు
ధనహీనత గల్గు బ్రతుకతరమె గణేశా!              49.

గురుజనులకు హితకరమగు
సురుచిరవర్తనమొసంగి సూనృత వాక్య
స్ఫురణంబును సేవా త
త్పరతయు నాకీయుమయ్య! దయను గణేశా!   50.

తలచిన దానిని పొందగ
బలమంతయు చూపుచుండు పరులహితంబున్
తలప డొకింతయు చూడగ
కలియుగమున మానవుండు కనుము గణేశా!     51.

ఉచితానుచితము లరయడు
సుచరిత్రము లెంచబోడు సుందరకృతులన్
ప్రచురించగ దలపడు జను
డచలస్థిర సద్యశంబు లంద గణేశా!                   52.

నిత్యంబు నసత్యంబుల
నత్యంతము పల్కుచుండు నంతట జగతిన్
వ్యత్యాసము జపియించును
సత్యంబిది కాంచుమయ్య సదయ గణేశా!         53.

హితవాక్యంబులు బల్కుట
వ్రతముగ సన్మార్గమందు వర్తించుటయున్
క్షితిపయి దుర్లభమయ్యెను
నుతగుణ! కనుమయ్య నీకు నతులు గణేశా!     54
ఒకనిని మించిన పాలకు
డొకడయ్యెను భారతాన నో జగదీశా!
వికృతంబుగ సామాన్యుల
సుకృతంబును దోచువారు శుభద గణేశా!         55.

మనమానందము చెందును
నగుణుడగు నిన్ను గొలువ కలుగును సౌఖ్యం
బనయము నీచరితంబును
వినుచుండిన కల్ల కాదు వినుము గణేశా!           56.

సుందరమగు హృదయంబును
వందన కర్హంబులైన వాక్యంబులనున్
బృందారకమణి! యొసగుము
సందియమిట లేక గొల్తు సతము గణేశా!           57

ధర్మంబున జరియించుచు
కర్మంబులలోన నిష్ఠ కలుగు విధానన్
మర్మజ్ఞా! యీ జనులకు
నిర్మలమతి జూపవయ్య నీవు గణేశా!             58

గురుజనులను సేవించెడి
సురిచిర సద్భావదీప్తి సుందర చరితల్
వరదాయక! విఘ్నేశా!
కరుణను సమకూర్చవయ్య ఖలహ!గణేశా!      59

ధనమదమున ప్రజ లెల్లెడ
కనుగానక తిరుగుచుండి కలుషితమతులై
కనికరము జూపకుండిరి
యనుచితమిది పేదలందు నరయ గణేశా!        60

అమలినమై వెలుగొందెడు
తమధర్మమువీడి జనులు తగునిది యనుచున్
క్రమముగ నన్యంబులపై
భ్రమగొని చరియింత్రు చూడవలయు గణేశా!    61
సమతా మమతలు శాంతియు
తమయునికిని గోలుపోవ ధరపయి నేడున్
శ్రమజీవుల జీవనమున
గుమికూడెను కష్టతతులు కనుము గణేశా!          62

కులభేదము మతభేదము
వలదని వేదికలపైన పలికెడి నులే
తలచుట తరతమ భేదము
లిల చిత్రముగాదె చూడ నిపుడు గణేశా!             63

ధనకాంక్ష మేర మీరగ
తనయుల కీకాలమందు తమ జనకులపై
కనికరము శూన్యమైనది
నతర వృద్ధాప్యవేళ కనుము గణేశా!             64

పలుకులలో మాధుర్యం
బొలికించుచు గానవత్తు రుర్విని జనముల్
తలపులలో నొక్కించుక
ఛలహీనత కాబడదు సతము గణేశా!               65

తానే సర్వజ్ఞుడనని
జ్ఞానంబున నిధినటంచు జనుడనుకొను న
జ్ఞాని యెరుగనేరడు
తానొక పరమాణువంచు ధరను గణేశా!             66

దయజూపించుచు దీనుల
భయమును పోగొట్ట దలచు భవ్యాత్ముండౌ
జయశీలున కెల్లెడలను
శ్రియములు తమకడకు వచ్చి చేరు గణేశా!        67

పద్ధతులు మారిపోయెను
సిద్ధాంతము లెల్ల గూలి చిత్తములందున్
శుద్ధి నశించుచునుండెను
సిద్ధం బీనాడు జూడ జెల్లు గణేశా!                    68
సత్యము పలికెడి నునకు
నిత్యములౌ సుఖము లమరు నిర్మల మతి స
త్కృత్యము లనిశము చేసిన
నత్యుత్తమ విభవ మొదవు నవని గణేశా!            69

సతతము విత్తార్జనమున
క్షితి దిరుగును గాని జనుడు  శ్రీకర మనుచున్
సుతులకు వలసిన దింతయు
హితమును బోధించకుండె నిచట గణేశా!           70

నిను గొలిచెద నో గణపతి!
మనమున స్వచ్ఛతను గూర్చి మమతా సమతల్
నను జేరెడి సద్వరమిడు
మని గోరుచు నున్నవాడ నయ్య గణేశా!            71

కలుషములకు మోసములకు
నెలవై నర్తించుచున్న నేలను మనుటల్
దలచిన చాలును దేహం
బలయుచు నుండినది కంప మంది గణేశా!         72

అవినీతి లోకమందున
నవమగు చేతనము పొంది నానాగతులన్
స్తవనీయా! వ్యాపించిన
దెవరయ? తొలగించు వార లికను గణేశా!          73

నిను నమ్మితి రక్షకుడని
పనిగొని నన్నలుముకొన్న భవబంధములన్
వినుమిదె త్రెంపగ నీ వా
హనమును పంపంగవలయు నయ్య గణేశా!       74

గజవదనా నైర్మల్యము
నిజ మొక్కింతయును లేదు నిటలాక్షసుతా!
ప్రజలను పాలించెడియెడ
విజయార్థులలోన నేడు వినుము గణేశా!            75.
తనకంటె నులు లేరని
మనుజుడు సత్యంబు నేడు మదగర్వితుడై
యనుదినమును స్వార్థంబున
మనుచుండెను చూడుమయ్య మహిని గణేశా!    76.

కలియుగధర్మం బంచును
పలురకముల దుష్కృతములు బహు దీక్షితులై
యిలలో నరు లొనరించుట
దలపక శిక్షింపకునికి తగునె గణేశా!                  77.

నీనామము జపియించుచు
జ్ఞానప్రదు నిన్ను గొలుచు సజ్జనులకిలన్
దీనావస్థను ద్రుంచుచు
నీనాముగ సుఖము లొసగ వేమిగణేశా!            78.

నిను దలచెద నిను గొలిచెద
నిను వరదుడవనుచు జేరి నీకథ లెపుడున్
వినుచుండెద నో గణపతి!
యనుకంపను జూపి కావు మయ్య గణేశా!        79.

వరసిద్ధి వినాయకుడని
నిరతము నీ పదములందు నిష్ఠాయుతులై
శిరములను వంచి మ్రొక్కెడి
వరగుణులకు శుభము జూప వలయు గణేశా!    80.

జీవితము ముగియు సమయము
భావింపగ నేరి తరము ఫలదాయక! నిన్
సేవించు బుద్ధి నిత్యము
భావజహరపుత్ర! యీయవలయు గణేశా!        81.

వరమడిగితినా? పలుకవు
సిరిసంపద లిమ్మటంచు చేరితినా సు
స్థిరజీవన మడిగితినా?
కరుణను జూపించ మంటి గాదె గణేశా!             82.
ధరవారికి స్థిరసౌఖ్యము
సురుచిర జీవనము భాగ్య శోభలు సతతం
బరమరలు లేని మానస
మరయగ సత్త్వంబు గూర్చు మయ్య గణేశా!    83.

ఆశాపాశముతో సక
లేశా! బంధింపబడుచు నిహపరగతులన్
లేశంబును భావించరు
నాశము గాకుందురేమి నరులు గణేశా!             84.

కలియుగమున పరికించిన
పలుకులలో పనులలోన భావములందున్
సలలితముగ సామ్యము నే
డిలలో కంపించకున్న దేమి? గణేశా!                85.

కతమున్నను లేకున్నను
సతతము మానవుల కిం దసత్యమె నేడున్
క్షితిపయి నారాధ్యంబయి
యతులిత యశమందుచుండె నయ్య గణేశా!    86.

పలుకులలో మాధుర్యం
బొలికించు నమ్మజూపి యురు వంచనతో
నిలపయి దిరుగుచు నుండెడి
తులువకు సుఖమేలపుష్టితోడ  గణేశా!              87.

నాస్తికులకు నీజగమున
స్వస్తి వచస్సులను గూర్చి సన్మానములన్
ప్రస్తావించెద వెందుల
కస్తోకానంద దాత వగుచు గణేశా!                  ౮8.

ఉన్నా వనియెడి వారికి
కన్నుల కేనాడు నైన కన్పించవు నీ 
వెన్నంగా నను వారల
కన్నింటను మహిమ జూపు మయ్య గణేశా!       ౮౯
ఆధునికత మితి మీరుచు
బాధలకును మూలమయ్యె భరతావనిలో
మేధా శక్తిని  నాశక
సాధనముగ గొనిరి నేడు జనులు గణేశా!          90.

కులములు మతముల యూసిల
వలదని వేదికలమీద భాషించుచు నా
తలపులలో తనపరములు
నిలిపెడి వాడగుట తగునె నేత గణేశా!               91.

ప్రతిభకు పట్టము గట్టెడి
చతురతగల ప్రభుత గల్గి సర్వజగానన్
సతతంబును  సుఖసంపద
లతులితముగ జేర జాపు మయ్య గణేశా!          92.

నీతండ్రికి నభిషేకము
నీ తల్లికి నర్చనంబు  నిర్మల భక్తిన్
వాతాశనహారసుతా!
చేతును మది కొసగుమయ్య స్థిరత గణేశా!        93.

టెంకాయలు వడపప్పులు
సంకట హర! గుడ జలంబు సరియగు చెరకుల్
పంకజములు  నీకొరకిదె
శంకరసుత తెచ్చినాను జయము గణేశా!          ౯౪.     

మాతా పితరుల సేవయె
భూతలనిమ్నగల మున్గు పోడిమి నిచ్చున్
చేతన మదియని యంటివి
చేతము రంజిల్ల తెలియ జేసి గణేశా!                 ౯౫.

హితకరులును పెరవారలు
క్షితిపయి యుపకార మరసి చేసెడి వారల్
మతిహీనులు వంచకులును
జతగొన గుర్తించ దగును జగతి గణేశా!            ౯౬.
నామదిలో ననునిత్యము
స్వామీ! నిను గొల్తు సవ్య  భావముల గముల్
నీమముగా జనులందరి
క్షేమంకర వాంఛకల్గ జేయ గణేశా!                   ౯7.             

భాద్రపదంబున నిలపయి
భద్రాకారంబుతోడ భక్తుల కొరకై
చిద్రూప! వచ్చుచుందువు
రుద్రాత్మజ!కూల్చబూని రుజలు గణేశా!          98.

నీపైని దండకంబులు
హేపావనమూర్తి! పలికి యెంతయు భక్తిన్
చూపించెడి నీ దాసుల
పాపంబులు కూలద్రోయ వలయు గణేశా!       99.

పాపము చేయుచు పశ్చా
త్తాపం బందుచును జేరి తరగని భక్తిన్
చూపించుచుందు మనిశము
కోపించక జూపుమయ్య కూర్మి గణేశా!          ౧౦0.

అరిహంతా! యనాశక!
సురమునివందితచరిత్ర! సురుచిరభావా!
వరసిద్ధిగణపతీ! నిను
కరివదనా! కొల్తు నన్ను గావ గణేశా!             ౧౦1.

ఏమని చెప్పుదు విను నీ
నామము జపియించ బూను నన్ననిశంబున్ 
నీమము ద్రుంచెడి భావన
లేమాత్రము వదలకుండె నేల గణేశా!            ౧౦2.

సద్వాక్య శక్తి నందుచు
విద్వాంసుల సేవచేసి విస్తృతరీతిన్
సద్వైభవమందగ దగు
మద్వాంఛను దీర్చు మయ్య మాన్య! గణేశా!   ౧౦3.

నేనయ్యా హరివాడను
ధీనిధి! నీపాదధూళి దేహము నందున్
జ్ఞానద మనుచును దాల్చెడి
మానవుడను పోల్చలేదె? మాన్య! గణేశా!       ౧౦4.     
శ్రీ వేంకటేశ తనయుడ
దేవా! సామ్రాజ్యలక్ష్మి తేజోమయి నా
కీవసుమతిని తల్లి నను
తావక సేవకుని గావ దగును గణేశా!                 105.

నారాయణ శాస్త్రార్యుడు
హేరంబా! గురువరేణ్యు డీ నీ భృత్యున్
కారుణ్యంబున జూచెను
జేరగ విద్యలనుపొంద జేసి గణేశా!                   ౧౦౬.

"సత్య"మటందురు కొందరు
నిత్యా! నన్ "మూర్తి"యంచు నీ యర్చకునిన్
ప్రత్యహము కొందరందురు
భృత్యుని నన్ గావవలయు వినుము గణేశా!      ౧౦౭.

మందుండను వాక్యంబుల
చందంబును నేర్వనట్టి సామాన్యుడనో
వందిత సర్వామర ముని
బృందా! వందనము గొనుము విజ్ఞ! గణేశా!       ౧౦౮.

ధన్యుండనైతి సురస
మ్మాన్యా! నన్ కరుణ జూచి మహితోక్తులతో
జన్యం బగు శతకంబు వ
దాన్యా! పలికించి తేకదంత! గణేశా!                 ౧౦౯.
        
దండము గౌరీనందన!
దండము గజరాగక్త్ర! దండము కపిలా!
దండము మూషకవాహన!
దండంబులు స్వీకరింప దగును గణేశా!              110.

మంగళము విఘ్ననాయక!
మంగళమో శూర్పకర్ణ! మంగళచరితా!
మంగళము లోకసన్నుత!
మంగళమో సుముఖ! శివకుమార! గణేశా!          111.

జేజే విఘ్నవినాశక!
జేజే యహియజ్ఞసూత్ర! శివసుత! జేజే
జేజే సకలశుభంకర!
జేజే లివె కొనుము నీకు జేతు గణేశా!                 ౧౧౨.

హ.వేం.స.నా.మూర్తి.

No comments:

Post a Comment