Monday, 28 January 2019

శ్రీ వేంకటేశ్వర శతకము



శ్రీ వేంకటేశ్వర శతకము

ఛందము ఉత్పలమాల

శ్రీయుత తిర్మలేశ! సురశేఖర! శాశ్వత! లోకమందునన్
శ్రేయము లందజేయుటకు చిన్మయరూపము దాల్చినాడ
త్యాయత కీర్తి సంయుత! దయామయ! సంతత భాగ్యదాత! ని
న్నీ యుగదైవమంచు ప్రజ లెంచెద రంతట వేంకటేశ్వరా!                       .

శ్రీదుని విఘ్ననాయకుని చిన్మయరూపుని చంద్రశేఖరున్
మీదట నచ్యుతున్ విధిని మీరిన భక్తి దలంచి యెప్పుడున్
మీ దయ జూపి యన్నిటను మేలొనరించు డటంచు బ్రార్థనల్
మోదము తోడ జేసెదను మోక్షద! నిత్యము వేంకటేశ్వరా!                        .

ధీయుతుడై వెలుంగుచును, దివ్యవచోవిభవంబు చేత
త్యాయత సద్యశంబులిల నందిన మద్గురుదేవు నార్యునిన్
శ్రీయుతు విజ్ఞసత్తముని శిష్యశుభంకరు ముళ్ళపూడి నా
రాయణశాస్త్రి వర్యుని దలంచెద నాపయి వేంకటేశ్వరా!                         .

నాకు భవంబు నిచ్చి వచనంబులు పల్కగ నేర్పి విద్యలన్
ప్రాకట మొప్ప జూపుచును భవ్యగుణంబుల నందజేసి
త్యాకృతి నుండ దెల్పు నులై వెలుగొందిన తల్లిదండ్రులన్
హే కరుణామయా! దలతు నెప్పుడు భక్తిని వేంకటేశ్వరా!                       .

స్వీయ యశస్సు నీభువిని చిమ్మినదౌ హరివంశవార్ధి సం
స్తూయకు, సాంబరాజ్యమకు, శుభ్రగుణాఢ్యకు, శంకరైక
ద్ధ్యేయకు, వేంకటేశ్వరసతీమణి కేను జనించి సత్య నా
రాయణ నామ మందితి పరాత్పర! తిర్పతి వేంకటేశ్వరా                     .

ఛందము నేర్వనైతి పలుశబ్దములన్ సమకూర్చి పద్దియం
బందము గాగ బల్కు సుమహత్తర శక్తిని గాంచనైతి నే
మందుడ పద్యముల్ శతము మాధవ! నీపయి చెప్పబూనితిన్
వందన మేవిధిన్ పలుకు భాగ్యము గూర్తువొ వేంకటేశ్వరా!                      .


వేంకటనామ మందితివి విశ్వము నంతట నిండియున్న యా
సంకటముల్ హరించుటకు సాధుజనావన! హైందవాని కా
టంకము గూర్చు వారల మఠంబులు గూల్చి  మహద్రవంబుతో
హుంకృతి చేయుమంచు నిను నున్నతు వేడెద వేంకటేశ్వరా!                 .

అందము గోలుపోయినది యన్నిట శక్తులు సన్నగిల్లి యా
నందము నందలేక పలు నష్టములన్ చవిచూచుచున్న దే
మందును దేవదేవ! యిసుమంత బలంబును లేని దయ్యె మా
హైందవ మయ్యరో కనుమటంచును వేడెద వేంకటేశ్వరా!                       .

నిన్ను దలంచు వారలకు నిర్మల భావములంద జేసి యా
పన్నుల బ్రోచు చుందువిల భాగ్యవిధాతవు నీవటంచు నిన్
సన్నుతి చేయుచుండెదరు సత్కవులై వెలుగొందు భాగ్య సం
పన్నులు లోకనాథ! మము పాలన చేయుము వేంకటేశ్వరా!                   .

సప్తగిరీశ! లోకమున సత్యము ధర్మము సన్నగిల్లి దు
ర్వ్యాప్తము లయ్యె దౌష్ట్యములు భక్తుల భావము లన్ని చోటులన్
దీప్తులు కోలుపోయినవి దేవరసేవలు, దానధర్మముల్
సుప్తములై యణంగినవి చూడుము నీవిది వేంకటేశ్వరా!                       ౧౦.

హైందవజాతి ధైర్యమున నాత్మశివంకర యోగ్యకర్మ లా
నందముతోడ జేయుటకు నైజగతిన్ బ్రకటించలేనిదై
మందత బూనియున్న దనుమానము లేదు భయార్త యౌటచే
వందన మోదయామయ! కృపన్ గను మియ్యది వేంకటేశ్వరా!             ౧౧.

వేదపురాణశాస్త్రముల విజ్ఞత నించుక నెంచబోవ రు
న్మాదముచేత లోకమున మానవకోటి విశృంఖలంబుగా
నాదిమ సంస్కృతుల్ చితుల కర్పణ చేయుచు నున్నవారు నీ
వే దయజూపి గావవలె నేవిధినైనను వేంకటేశ్వరా!                               ౧౨.

ఏడుధరాధరంబులకు నిమ్మహి గౌరవ మందజేసి కా
పాడగ భక్తబృందమును పావన తిర్మల దివ్యభూమి నీ
వాడగ జేసికొంటి విది వాస్తవ మోకరుణాంతరంగ! మా
టాడుము బ్రోవ రమ్మిక దయామయ! శ్రీపతి! వేంకటేశ్వరా!                               ౧౩.

గోపకులైకభూషణుడు కోరిన వన్నియు నిచ్చువాడు మా
పాప మణంచువా డిలను బ్రార్థన జేసినవారి కెల్లెడన్
ప్రాపుగ నుండువా డనుచు భక్తిని గొల్చెడివారిపై సదా
చూపు మనుగ్రహం బనుచు స్తోత్రము చేసెద వేంకటేశ్వరా!                                  ౧౪.

కొండలవాడ! కావుమని గొబ్బుగ భక్తిని బూనుచుండి ని
న్నండగ నెంచుచుండి కడు నిష్ఠగ నంతట పాదచారులై
కొండల నెక్కి నిన్గనెడి కోరిక నీదరి జేరువారిపై
దండిగ జూపుమా దయను దైత్యకులాంతక! వేంకటేశ్వరా!                                   ౧౫.

నీవు దయామయుండవని నిన్ను దలంచెద, నీకథాసుధల్
నే వినుచుందు నిత్యమును, నిన్నె స్మరించెద నీదు నామమున్
పావన మంత్రరాజమను భావనతో జపియించుచుందు నన్
గావగ రాగదయ్య! యనుకంపను జూపుచు వేంకటేశ్వరా!                                    ౧౬.

గోత్రము లెక్కనైతిని యకుంఠితభావము కల్గియుండి
త్పాత్రత పొందనైతిని, శుభప్రదమై వెలుగొందు నట్లుగా
స్తోత్రము నేర్వనైతిని సుధామయ సుందరవాక్పటుత్వ మే
మాత్రము లేని మూఢుడను మన్నిక జూపుము వేంకటేశ్వరా!                                ౧౭.

నీవు కృపార్ద్రచిత్తుడవు, నిన్ను స్మరించెద, సత్యమన్న నీ
చే వివరంబు నేర్చెదను, నీకొరకే జనియించినా నిలన్
నీవలనన్ శుభంబులగు, నీకు నతుల్ పొనరించువాడ నో
 దైవమ! యంచు మ్రొక్కెదను నీపదసీమను వేంకటేశ్వరా!                                   ౧౮.

వేదపురాణశాస్త్రములు విస్తృత వాఙ్మయ మాధురీ సుధల్
మోదము గూర్చు సంస్కృతుల మూలములై విలసిల్లు ధర్మముల్
స్వాదుతరంబులై వెలుగు చక్కని సూక్తులు భారతాన
ర్వోదయ భావసంపదలు నున్నతి గూర్చును వేంకటేశ్వరా!                                  ౧౯.

నాది పవిత్రభూమి, సుమనస్కుల పర్యటనాస్థలంబు, సం
పాదిత సద్యశోవిభవభారము నిండు ధరాతలంబు భా
గ్యోదయ మందియుండినది యుత్సవ పూర్ణము భారతంబు
మ్మోదము గూర్చు ప్రాంతమిది మోక్షదమైనది వేంకటేశ్వరా!                                         ౨౦.

ఎవ్వడు సర్వకాలముల నిమ్మహి రక్షణచేయుచుండు వా
డెవ్వని యున్కిచే ధరణి నెల్లెడ ఖ్యాతి వహించె నాంధ్ర మిం
కెవ్వడు సర్వకాలముల నిచ్చట సౌఖ్యము లందజేయు వా
డవ్విభుడైన నీ కెపుడు నంజలి చేసెద వేంకటేశ్వరా!                                                      ౨౧. 

తల్లుల కెల్ల తల్లియయి దైన్యము గూల్చుచు నుండి యంతటన్
దల్లుల, వారి పిల్లలను తన్మయతన్ గరుణించుచుండి
మ్మెల్లర బ్రోచునట్టి జగదీశ్వరియౌ నలిమేలు మంగ కా
తల్లికి వందనంబు లిడెదన్ వరదాయక! వేంకటేశ్వరా!                                   ౨౨.

ఆర్యుల కీ ధరాస్థలిని హాని యొనర్చెడి వారి కేవిధిన్
ధైర్యమణంగగా వలయు, తాలిమి జూపుచు(నూనుచు) సంచరించు నా
చార్యుల కెల్ల సౌఖ్యములు శక్తివిశేషము లందుచుండి
త్కార్యము లెల్ల సాగవలె దానవనాశక! వేంకటేశ్వరా!                                   ౨౩

శ్రీదుడ వీవు భక్తులకు క్షేమము గూర్చుచునుండి నిచ్చలున్
వేదనుతా! సుఖంబులను విస్తృతరీతి యొసంగుచుందు వే
లాదయ జూపరావు సఫలం బొనరించవు నాదు కార్యముల్
ఖేదము గల్గుచున్న పరికించవు భక్తుని వేంకటేశ్వరా!                                   ౨౪.

కోరను వస్తుసంచయము, కోట్లకు మించు ధనంబు నెప్పుడున్
గోరను,,ధాన్యరాశులను గూర్చు మటంచును కోర నేవిధిన్
శ్రీరమణా! త్వదీయ పదసేవ టిల్లెడి భాగ్య మీయగా
గోరుచునుంటి చూపుమయ కూర్మిని నాపయి వేంకటేశ్వరా!                                 ౨౫.

జ్ఞానము బంచువారి చరణంబుల చెంతను జేరుచుండి
ద్ధ్యానము నిల్పి, వారికడ ధార్మిక వర్తన నేర్చుచుండి
న్మానము సంమందు గొను నైతిక శక్తిని నాకునిమ్ము
ర్మానుచరాప్తబంధు! మహిమాన్విత! శ్రీకర! వేంకటేశ్వరా!                                   ౨౬.

సత్య మదృశ్యమయ్యె నిక సర్వజగంబున దుష్టకర్మముల్
నిత్యములైన వేయెడల నేరచరిత్రలు సత్త్వయుక్తితో
నత్యధికంబులై జనుల కన్నిట భీతిని గొల్పుచున్న వీ
కృత్యములన్ని జూచుచును కిమ్మనవేమయ? వేంకటేశ్వరా!                                ౨౭.

సన్మతి దల్లిదండ్రులను సభ్యత జూపుచు నాదరింప రీ
జన్మకు వారుకారకులు సర్వవిధంబుల పూజ్యులన్న వి
ద్వన్మణులైన వారల శుభప్రద వాక్యము లెంచబోరు చూ
డన్మనుజుల్ హరీ! కటకటం బడరే యిల వేంకటేశ్వరా!                                         ౨౮.

స్వీయమతంబు భాషయును క్షేమము గూర్చెడి వెల్లకాల మా
ప్యాయత తోడ వానిగొని భాగ్యము లందెద మన్న మానసం
బీయుగమందు లేదుగద! యెవ్విధినైన పరాభిమానమే
శ్రేయదమన్న భావములు చేకొని రెల్లరు వేంకటేశ్వరా!                                         ౨౯.

ప్రాక్తన సంస్కృతుల్ తరతరంబుల సన్నుతసంప్రదాయముల్
ముక్తిదమైన మార్గము లమోములై వెలుగొందు ధర్మముల్
సూక్తులు నామమాత్రమయి సోదరభావము లంతరించి వే
దోక్తసుకర్మ లాగినవి యున్నతి గాంచక వేంకటేశ్వరా!                                          ౩౦.

దేహ మనిత్యమైనదను తీరు నెరింగియు తీవ్రమైన వ్యా
మోహముతోడ దీనిపయి మూర్ఖజనంబులు నిష్ఠబూని దా
సోహ మటండ్రు, కాలమును వ్యర్థము చేతురుగాని భోగిభు
గ్వాహన! నిన్ను గొల్వగల కాంక్షను బూనరు వేంకటేశ్వరా!                                   ౩౧.

మానవు డీధరాతలిని మాన్యుడనంచు మదించి పల్కు
న్గానక దుష్టకర్మము లకారణ బంధు విరోధభావముల్
పూని యహంకరించు నిల పొందునె సౌఖ్యము మిత్రహీను
వ్వానిని క్షేమమందునె భవన్నుతి సేయక వేంకటేశ్వరా!                                         ౩౨.

ఒజ్జల పంచజేరి సమయోచిత వర్తనతోడ నమ్రతన్
సజ్జనుడై చరించు సరసత్వము గల్గిన వాని కేవిధిన్
ముజ్జగమందు సద్యశము, మోదరకరంబగు జ్ఞాన మందు వి
ద్వజ్జయ మెల్లెడం గలుగు భవ్యగుణప్రద! వేంకటేశ్వరా!                                       ౩౩.

ధీప్రదమైన వాఙ్మయము దీవ్యదశేష సుపర్వరాజియున్
క్షిప్రజయంబు నిచ్చెడి విశిష్టములౌ బహు ధర్మకార్యముల్
విప్రముఖోపదిష్టమగు విశ్వహితేచ్ఛయు భారతంబునం
దప్రతిమంపు కీర్తు లెపు డందగ జేయును వేంకటేశ్వరా!                                       ౩౪.

స్వార్థము జూపకుండి యలసత్వము నందక కాల మింతయున్
వ్యర్థము చేయకుండి బహుభంగుల దీనులసేవ జేయుటే
సార్థక మీ భవంబునకు సత్య మటంచును నమ్మువారి
క్షార్థము నిల్చియుండెద వనంత! సతంబును వేంకటేశ్వరా!                                   ౩౫.

భాసుర వేదమంత్రముల పాఠము నేర్వనివాడ, దీక్షతో
వాసిని గొల్పురీతి బహుభంగుల వైదిక కర్మ లెచ్చటన్
చూసినవాడగా నటులె సుందరమౌగతి నీ పదార్చనా
భ్యాసము లేని మూఢు నను నచ్యుత! గావుము వేంకటేశ్వరా!                               ౩౬.

ఎల్ల జగంబునం గిరుల నింపగు దివ్యనదీతటంబులం
దుల్లము దోచుప్రాంతముల నొప్పు నుర్వికి రక్షకుండవై
పల్లెలు పట్టణంబులను భావము జూపక నీ దయాసుధల్
చల్లగ జేరియుండెదవు సద్గుణదాయక! వేంకటేశ్వరా!                                  ౩౭.

తల్లివి నీవె నా కిలను తండ్రివి దైవము సద్గురుండవై
యెల్ల విశేషముల్ మదికి నింపొనరించెడి రీతి నెప్పుడున్
దెల్లము జేయు వాడవిక దీప్తి యొసంగెడి మిత్రుడన్నచో
కల్ల యొకింత గాదు శుభకారక! కాంక్షద! వేంకటేశ్వరా!                                        ౩౮.

నేను వచించు వాక్యములె నిర్మలమైనవి సర్వలోక
మ్మానిత మైవెలుంగు మహిమంబు గలట్టిది నాదుమార్గమే
గాన సదా నమస్కృతుల గౌరవ మిండను గర్వయుక్తు
జ్ఞానియటన్న సత్యమగు జ్ఞానధనప్రద! వేంకటేశ్వరా!                                 ౩౯. 

నీవు సమస్త లోకములు నిత్యము బ్రోచుచునుండు వాడవై
ధీవిభవంబు సద్విమల తేజము భక్తుల కిచ్చుచుండి నీ
సేవకు యోగ్యమై వెలుగు చిత్తమొసంగగ నన్యదైవముల్
కావలెనేమి? వద్దనుటెగా  యుచితంబగు వేంకటేశ్వరా!                                         ౪౦.

భారతదేశ మన్నిటను భవ్యయశంబుల స్థానమౌచు దు
ర్వారములైన రుగ్మతల బారికి ద్రెళ్ళక పెక్కులౌ దురా
చారము లంటకుండగను సంతత భాగ్యము లందుచున్ శుభా
కారత నొప్పుచుండు విధి గావు మఘాపహ! వేంకటేశ్వరా!                                   ౪౧.

నిన్ను సహస్రనామముల నిత్యము గొల్చెడివారి కీభువిన్
మన్నిక నందజేసి యణిమాదులు గూర్చి పరంబునందు నీ
సన్నిధి జేరు మార్గమును సజ్జనరక్షక ! సాధుపోష! హే
సన్నుతమూర్తి ! చూపుమని సన్మతి గోరెద వేంకటేశ్వరా!                                     ౪౨.

అవతారములు:
మిక్కిలి యాదరంబునను మేదిని గావగ పెక్కు రూపముల్
చక్కగ దాల్చినాడవు నిజంబిది దానవకోటి నేయెడన్
స్రుక్కగ జేసి కూల్చితివి చూపితి వద్భుత మైన శౌర్య మీ
వక్కజ ముందురీతిని దయామయ! తిర్మల వేంకటేశ్వరా!                                    ౪౩.
మత్స్యావతారము:
అక్కట! మత్స్యమౌచు నపు డందరు గుందగ వేదరాశితో
నక్కుటిలాత్ము డాదనుజు డబ్ధిని దూరగ వాని ద్రుంచి పెం
పెక్కిన ప్రేమతోడ కరుణించుచు నానరనాథు నంతటన్
మక్కువ జూపి వేదములు మేదిని జేర్చవె వేంకటేశ్వరా!                                        ౪౪.
కూర్మావతారము:
దేవగణంబులున్ మరియు తీండ్రలు గల్గిన దైత్యసంముల్
త్రావగ నాసుధన్ కడలి ద్రచ్చుటకై యతనంబు చేయగా
నా వనమధ్యమంబునను నాయత కూర్మమ వౌచు గోత్రమున్
దావక సత్కృపన్ దెలియ(దెలుప) దాల్పవె శీఘ్రము వేంకటేశ్వరా!.                               ౪౫.
వరాహావతారము:
వాడు హిరణ్యనేత్రు డట, పావనమైన ధరాతలంబు
వ్వాడు హరించి పారగను వానిని జేర వరాహమూర్తివై
నాడు రసాతలంబునను నారదసంస్తుత! సంహరించి నీ
పోడిమి జూపి దెచ్చితివి భూసతి ప్పుడు వేంకటేశ్వరా!                                     ౪౬
నరసింహావతారము:
ఎక్కడయుండె నాహరిని నిచ్చట చూపగలాడ వేమిరా
మక్కువ విశ్వసించెదవు మానవటంచును క్రోధపూర్ణుడై
యుక్కున మోద కంబమున నొప్పు నందె నృసింహమూర్తివై
గ్రక్కునవానిచంపి మరి కావవె భక్తుని వేంకటేశ్వరా!                                             ౪౭.
వామనావతారము:
మున్ను వచించి నట్టులుగ మూడుపదంబులు స్వీకరించి యా
పన్నుల బ్రోచువాడవయి వామన మూర్తిగ దైత్యరాజు నా
సన్నుతు డౌబలిన్ హరి! సాతల మంపి యనుగ్రహింపవే
క్రన్నన రాక్షసాంతక! సుఖప్రద! శ్రీపతి! వేంకటేశ్వరా!.                                       ౪౮.
పరశురామావతారం.
యిలపైన క్షత్రియుల నెల్లర నీయెడ సంహరించుటే
ధ్యేయ మటంచు గొడ్డలని తేజము నిండగ దాల్చి యంద రౌ
రాయనునట్లుగా పరశురామునివై చరియించినాడ వో
శ్రీయుతమూర్తి! తిర్మలగిరీశ్వర! హర్షద! వేంకటేశ్వరా!                                       ౪౯.

ఇర్వది యొక్కమారు ధరణీశుల క్షత్త్రియ వంశజాతులన్
గర్వ మణంచి గొడ్డలకి కంఠములన్ బలియిచ్చి ధాత్రిలో
పర్విన క్షాత్ర ధర్మమును భంగమొనర్చవె యాగ్రహంబునన్
సర్వమయా! మునీంద్రగణసన్నుత!శ్రీకర! వేంకటేశ్వరా!                                    ౫౦.
రామావతారం
యాగఫలంబుగా దశరథాధిపు పుత్రుల నగ్రజుండవై
త్యాగము చేసి నీవు మరియాదకు బద్ధుడవౌచు రాజ్యమున్
వేగమె చేరలేదె యరివీరభయంకర! కాననంబులన్
కాగల దుష్టశిక్షణకు కష్టము నెంచక వేంకటేశ్వరా!                                                 ౫౧.

రావణు బంక్తికంఠుడగు రాక్షసనాథుని నాహవంబునన్
చేవయణంగు నట్టులుగ జేయుచు కంఠము లుత్తరింపవే
యావనజాక్షి జానకికి నాయెడ కీడొనరించ బూనగా
శ్రీవిభు! పద్మనాభ! హరి! శ్రీప్రద! చిన్మయ! వేంకటేశ్వరా!                                ౫౨.
కృష్ణావతారం
అల్లరివాడవై యదుకులాంబుధి చంద్రుడవై యశోదకా
తల్లి కమేయ హర్షమును, తన్మయతన్ కలిగించు చుండి వా
రొల్లక మన్ను దింటివన నొప్పు  నాస్యము చాచి చూపవే
యెల్ల జగంబులన్ జనని కేర్పడ కుక్షిని వేంకటేశ్వరా!                                    ౫౩.

ద్వాపర మందు నిన్ను సురతాపస వందితు నెంచలేక యా
పాపులు రాక్షసాధములు పల్మరు వేషము మార్చి చంపగా
నీపయి దూకబూనుతరి నిర్జరరక్షక! వారి కంతకున్
జూపవె శౌరివై యతుల సుందరవిగ్రహ! వేంకటేశ్వరా!                                         ౫౪. 

అందరివాడవై మురళి నద్భుత రీతిగ నోటమీటుచున్(నోటనూదుచున్)
సుందరమైన రాగములు శోభన మొప్పగ బల్కుచుండి యా
నందము గూర్చి గోపికల కాత్మసఖుండవుగా వెలుంగవే
వందన మందు మో యతులవైభవదీపిత! వేంకటేశ్వరా!                                        ౫౫.
బుద్ధావతారం
ఆకసమందు ద్రిమ్మరెడి యా దితిపుత్రుల దుష్టభావులన్
దాకెడి వేళ రుద్రునకు ధైర్యము బెంచెడి మిత్రరూపివై
హే కరుణాంతరంగ యపు డింపుగ బుద్ధుని నామ మంది నీ
తేకువ జూపినావనుచు దెల్పుదు రెల్లరు వేంకటేశ్వరా!                                         ౫౬.

గౌతమబుద్ధ నామమును గైకొని శాక్యమునీంద్ర! విస్తృతిన్
భూతలమందు జేసితివి బోధన మెల్లరి రక్షణార్థమై
చేతము లుల్లసిల్లు విధి శ్రేయద మయ్యది బౌద్ధమయ్యె నీ
కాతరులౌ జనంబులను గాచు వరంబయి వేంకటేశ్వరా!                                       ౫౭.
కల్క్యవతారము
కైటభమర్దనా! భువిని కల్క్యవతారము తోడ గావగా
పాటవ మొప్ప వత్తువని పండితు లెల్లరు బల్కుచుండి యా
రాటము జూపుచుందు రతి హర్షము నందుచు నెల్లవేళలన్
గాటపు భక్తి గొల్చెదరు కావుమటంచును వేంకటేశ్వరా! (కావగ రాగదె)                     ౫౮.
కొండల కూర్ధ్వభాగమున కూరిమి జూపుచు వడ్దికాసులన్
మెండుగ గొంచు భక్తులకు మిక్కిలి సౌఖ్యము లిచ్చుచుండి నే
నండగ నుండ మీకిచట నందగ నేల భయంబు భూమిపై
రండని బిల్చుచున్ బ్రజకు రక్షణ గూర్తువు వేంకటేశ్వరా!                                      ౫౯.

నిత్యము నీకడన్ నిలిచి నిష్ఠను బూని యనేక పూజలన్
భృత్యులమంచు చేయుదురు విజ్ఞశిఖామణు లర్చకోత్తముల్
సత్యము పుణ్యమెంత గతజన్మము నందున జేసినారొ నే
డత్యధికంపు భాగ్యమది యబ్బెను వారికి వేంకటేశ్వరా!                                       ౬౦. 

ఆశ్రితవత్సలా! యతుల హర్షద! కేశవ! శ్రీనివాస!
ర్వాశ్రయ! దైత్యనాశక! శుభంకర! మాధవ! భాగ్యదాత! యా
సాశ్రుల భక్తకోటులకు సత్వరమోదమునిచ్చి ప్రేమతో
నాశ్రయ మీయవే యనుచు నచ్యుత! వేడెద వేంకటేశ్వరా!                                   ౬౧.

భక్తవశంకరా! బహుళభాగ్యవిధాయక! విశ్వరూప! నీ
శక్తి యమేయమై భువిని సాధుజనంబుల బ్రోచుచుండు వై
రక్తులు సర్వకాల మనురక్తిని గొల్చుచు నేకచిత్తులై
ముక్తిని గోర నిచ్చెదవు మోదము నందుచు వేంకటేశ్వరా!                                     ౬౨

పిల్లలు, భార్య, బంధువులు విస్తృతమైన ధనంబు లీభువిన్
తెల్ల మశాశ్వతం బనుట దీని నెరింగియు వానికోసమై
యుల్లము నిండ కోరికల యూసులె దాల్చెడి మూఢు లీప్రజల్
ఫుల్లసరోజనేత్ర! నిను బుణ్యదు గొల్వరు వేంకటేశ్వరా!                                        ౬౩.

మేలగుగాక యెప్పు డలిమేలమ మాయెడ నుండగా నిలన్
చాల శుభంబు లందుచును సత్వరసిద్ధులు కర్మలందు నే
కాలము గల్గుచున్ సకల కాంక్షలు దీరు, సుఖంబులందు వే
వేల నమస్కృతుల్ గొనగ వేడెద నంబను వేంకటేశ్వరా!                                        ౬౪.

సవ్యమతిన్ జరించుచును సంములోని యనాథసేవయే
భావ్య మటన్న భావనకు బద్ధుల నెల్లెడ బాధపెట్టు క్షం
తవ్యులు గాని వారల హృదంతరమున్ సరిచేయగా దగున్
దివ్యగుణప్రదాతవగు దీనజనావన! వేంకటేశ్వరా!                                               ౬౫.

నీపదపద్మయుగ్మమునె నిత్యము గొల్చెద నిన్నె దల్చెదన్
శ్రీపతి! ధర్మకార్యముల శ్రేయము నందెడు మానసంబుతో
నీపృథివీ స్థలంబుపయి నెన్నగ నుండెడు శక్తినిమ్ము నా
కో పరమేశ్వరా! మహోదధి ద్రుంచుము వేంకటేశ్వరా!                                ౬౬.

కేశములిచ్చు వారలు సుఖించగ వత్సలభావమూని యా
క్లేశము లెల్ల ద్రుంచి లేశము నంటని రీతి దు:ఖముల్
నాశ మొనర్చుచున్ సతము నవ్యసుఖంబులనిత్తు వయ్య 
ర్వేశ! యనామయా! తిరుగిరీశ! నిరంజన! వేంకటేశ్వరా!                                      ౬౭.

స్వార్థము నిండిపోయినది సర్వజనంబుల మానసంబునన్
ప్రార్థన జేసినన్ వినని పాలకు లీజగమందు నిండగా
వ్యర్థములయ్యె ధర్మములు వైభవదీప్తులణంగుచుండె నో
పార్థసఖా! దయం గనుము భారతభూమిని వేంకటేశ్వరా!                                     ౬౮.

ధర్మము లుప్తమైనతరి దానిని లోకమునందు నిల్పి
త్కర్ముల నెల్ల బ్రోచుచు కుకర్మము లన్నియు ద్రుంచువాడవై
యర్మిలితోడ భూమిపయి నద్భుతరూపము లందుచుందు వా
మర్మము లెంచగా దరమె మా శుభచింతక! వేంకటేశ్వరా!                                     ౬౯.

ఏనుగు పిల్వ సత్వరమె యిమ్మహి జేరితి, వాకృశాంగి
మ్మానము నిల్ప బల్కితివి, మాధవ రమ్మని జీర స్తంభమం
దా నరసింహరూపమున నచ్చట నిల్వవె, భక్తి బిల్వగా
నానిముసంబునం దభయ మందగ జేతువు వేంకటేశ్వరా!                                     ౭౦.

ఇచ్చట నీ యడంగు, మరి యిచ్చట నిన్ను సతంబు జూడగా
వచ్చును, నీకు నియ్యది నివాసము గాదని యెంచనేల ని
న్నెచ్చట భక్తితోడ స్మరియించిన నచ్చట వారి నెంతయున్
మెచ్చుచు గానిపించెదవు మేదిని నెల్లెడ వేంకటేశ్వరా!                                          ౭౧.

మిక్కిలి భక్తిభావమున మెచ్చెడిరీతి పృథాసుతుండు నిన్
మ్రొక్కుచు దారిచూపుమని మున్ను వచించగ వాని ప్పుడున్
మిక్కుటమైన ప్రేమమున మేలని సారథివౌచు గావవే
చక్కగ నాహవంబునను సర్వజగన్నుత! వేంకటేశ్వరా!                                        ౭౨.

భవమందు సంమున నింపుగ సద్ధితుడౌచు నిల్చినన్
ప్రాభవమందు మానవుడు ప్రాక్తన పుణ్యము చేత నాదటన్
శోభన మొప్పనంచు వినుచుండియు లోకము(పు) మేలుగోర బో
డో భవబంధమోచన! మహోదయ! తిర్మల వేంకటేశ్వరా!                                     ౭౩.

వందన మందుమో విపులభాగ్యచయప్రద! వేదవేద్య ని
న్నందరు సర్వభారకుడటందురు నిత్యము నిన్ను గొల్తు నీ
ముందర వంగుచున్ నతులు మోదము నందుచు జేయువాడ నీ
మందుని బ్రోవగా దగదె? మౌనిజనస్తుత! వేంకటేశ్వరా!                                        ౭౪.

మానస మేలనో నిలుచు మాట యెరుంగదు నిన్ను గొల్వగా
జ్ఞానద! కన్ను మూయుతరి నాదరి జేరుచు నున్న వెన్నియో
దీనజనావనా! తలపు తెట్టెలు వీటిని దాట గల్గి
ద్ధ్యానము నిల్పు శక్తినిడు తండ్రి! జనార్దన! వేంకటేశ్వరా!                                     ౭౫.

చీటికి మాటి కీజనులు చెప్పుచు నుందు రసత్యవాక్యముల్
మాటలలోన చేతలను మానరు దౌష్ట్యము దు:ఖదాయి యౌ
బాటను సంచరించెదరు పావనమైన త్వదీయ నామమున్
నోటను బల్కబోవరు కనుంగొను మియ్యది వేంకటేశ్వరా!                                     ౭౬.

మేలగు పట్టు పుట్టములు మించిన వేడుక దాల్చుచుండి యా
మాలను ద్రిప్పుచున్ భువిని మాన్యత నందగ గోరుచుందు రే
వేళను దీనబంధులయి విజ్ఞత జూపరు మానవాళి నీ
వేల వరంబు లీయగల విట్టి జనాలకు వేంకటేశ్వరా!                                              ౭౭.

తల్లిని గౌరవించుటను, తండ్రికి మ్రొక్కుట యందునన్, సదా
పిల్లల నాదరించుటను, ప్రేమను భార్యకు బంచుచుండుటన్
చల్లగ మాటలాడుటను స్వార్థమె యెంచును మానవుండు నే
డెల్ల జగంబునన్ తిరుమలేశ్వర! సత్యము వేంకటేశ్వరా!                                       ౭౮.

చక్కని పైరు పచ్చలును, సాధుజలంబుల నిచ్చు నిమ్నగల్
మిక్కిలి హాయి గొల్పుచు నమేయ ముదంబును గూర్చి ప్రేమతో
నక్కున జేర్చు తీర్థముల నాదిగ సంస్కృతి నేర్పు క్షేత్రముల్
పెక్కులు భారతంబునను విజ్ఞత గూర్చును వేంకటేశ్వరా!                                     ౭౯.

వేదపురాణశాస్త్రముల విజ్ఞత నిండిన భారతంబునం
దాదిమ సంస్కృతిన్ జగతి కందగ జేయుచు నైతికత్వమున్
మేదిని పైన బంచి కడు మేలొనరించిన మౌని బోధలన్
మోదము నంద రీజనులు మూఢులు జూడగ వేంకటేశ్వరా!                                   ౮౦.

మున్నొకసారి యందు మునిముఖ్యుడు నిన్గని వక్షమందునన్
దన్నగ నాగ్రహించక సుధారస మొల్కెడి వాక్యసంపదన్
గ్రన్నన మ్రొక్కి వేడితివి గావుము తాపస! యంచు నమ్రతన్
మన్నిక నందువారలకు మార్గము జూపుచు వేంకటేశ్వరా!                                     ౮౧. 

కోపముతోడ యిందిరయు కొల్హపురంబున కేగ ప్పు డో
శ్రీపతి! వల్మికంబునను చేరితి వాస్థలసీమ దాపునన్
తాపసవందితా!  సుఖ విధాయక యాయమ సంతసించగా
చూపుచు ప్రేమనామెపయి సుందరవిగ్రహ! వేంకటేశ్వరా!                                     ౮౨.

నీదరి జేరవచ్చి తలనీలము లిచ్చెద నిష్ఠ బూనుచున్
స్వాదుతరంబుగా వెలుగు చక్కని నీ శుభనామమెప్పుడున్
వేదము వోలె బల్కెదను, విస్తృతమైన త్వదీయ సత్కథల్
నీదయ జూపుమా యనుచు నిత్యము విందును వేంకటేశ్వరా!                               ౮౩

కావవి శాశ్వతంబులు సుఖంబుల జూపెడి వస్తుసంతతుల్
కావు నిరామయంబులవి కాంతుల నీనెడి యంగరాగముల్
దేవ! త్వదీయ కీర్తనల దీప్తిని గాంచుచు నీవు మెచ్చగా
సేవలు సేయు కాలమిల క్షేమకరంబగు వేంకటేశ్వరా!                                            ౮౪

నిర్మలమైన భావమున నిత్యము దీనుల సేవచేయు
త్కర్మములందె తృప్తిగని కాలము బుచ్చగ నెంచువారి కా
దుర్మతు లెల్లరీతులను తోరపు కష్టము లిచ్చుచుంద్రు దు
ష్కర్ముల ద్రుంచి సజ్జనుల కావగ రావయ!  వేంకటేశ్వరా!                                    ౮౫.

దేహ మశాశ్వతం బికను దీప్తి యడంగుట కెంత కాలమో
దేహి యెరుంగలే డనుట తెల్లము గావున కాయమందునన్
మోహము వీడి సుంత సురముఖ్యుని ముక్తిదు నిన్ను గొల్వ సం
దేహము బూనకుండవలె దివ్యగుణప్రద! వేంకటేశ్వరా!.                                        ౮౬.

కాలము మించిపోరుతరి కర్మము నెంచుచు కుందుచుండు నే
వేళను శక్తియుక్తుడయి విజ్ఞత జూపుచు నిన్ను గొల్వ బో
డేలనొ మానవుండు పరికించగ ప్పుడు సత్త్వహీనుడై
జాలము చేసినాడనని చాలగ చింతిలు వేంకటేశ్వరా!                                   ౮౭.

కన్నులులేని భక్తులకు గాంచెడి శక్తిని, పంగులై భువిన్
మన్నన లేనివారలకు మాన్యతనంద చలించుశక్తి, యా
పన్నుల కండదండలును పామర కోటికి పాండితీ ప్రభల్
గ్రన్నన నందజేతువుసకాలము నందున వేంకటేశ్వరా!                                          ౮౮.

చిత్తము దుర్మదం బనెడి చీకటి కాస్పద మయ్యె, స్వీయమౌ
వృత్తిని మాని రీజనులు విస్తృతరీతి విదేశభావనా
యత్త మనస్కులై కలుగు నాపద లెంచరు ధర్మపాలనం
బుత్తమ మంచు జూడరిట నుర్వి గనందగు వేంకటేశ్వరా!                                     ౮౯.

దండము శ్రీనివాసునకు, ధార్మికదివ్యగుణప్రదాతకున్
దండము తిర్మలేశునకు, దైన్యవినాశక దు: హంతకున్,
దండము దేవదేవునకు తాత్త్విక చింతన గూర్చువానికిన్
దండము నీకటందు నతాపవిదారక! వేంకటేశ్వరా!                                           ౯౦.

భావములోన నిర్మలత, పల్కులలోపల మార్దవంబు సం
భావితకర్మలందు బహుభంగుల దక్షత జూపగల్గుటల్
ధీవిభవంబు త్వన్మహిమ దెల్పగ బూనుట కెల్లవేళ లం
దోవిభవప్రదాత! యిడు మూర్జిత సత్వద! వేంకటేశ్వరా!.                                      ౯౧.

సంతత భాగ్యదాయకము సర్వశుభప్రదమై వెలుంగు  నా
వంతయు కల్మషంబు నొడ లంటగ జేయక గాచుచుండు  నే
వంతలు చేరనీయకను, వైభవదీప్తి యొసంగుచుండు శ్రీ
కాంత! త్వదీయనామ మిల గంజదళేక్షణ! వేంకటేశ్వరా!                                      ౯౨.

నీరజనాభ! నిన్నెపుడు నిష్ఠురవాక్యము లాడుచుండు సం
సారులు స్వీయకార్యముల చందము లెంచుటకైన బూన
వ్వారల కష్టసౌఖ్యము లవారిత కర్మఫలంబు లౌచు నీ
ధారుణి నందుచుండు గద! తథ్యము తిర్పతి వేంకటేశ్వరా!                                  ౯౩.

జ్ఞానము గల్గియుండినను నవ్యయశంబులు గోరుచుండి
న్మానము కాంక్షజేసినను మానవు డీధరణీతలంబునన్
దీనుల సేవ చేయక విధేయత జూపక పండితాళికిన్
తాను సుఖించ గల్గునె సదా పరమందున? వేంకటేశ్వరా!                                       ౯౪.

వేసము గట్టి శిష్యపరివేష్టితు లౌచును ధర్మబోధనల్
చేసిన నేమి? చిత్తమున జేరుచు నుండగ దుష్టభావముల్
మోసము స్వీయకార్యముల ముఖ్యముగా జరియించువారి నె
ట్లాసగ విశ్వసించదగు నచ్యుత! మాధవ! వేంకటేశ్వరా!                                        ౯౫.

స్వామి! యనేకరూపముల సర్వజత్తున నిండియున్న ని
న్నీ మనుజాళి చూచుట కొకింతయు యత్నము చేయకుండ మా
కామన దీర్చ రాడని యకారణ తర్కము చేయుచుందు రీ
శ్రీమతు(ముఖు) లొక్క పేదకును చేతురె సాయము వేంకటేశ్వరా!                                ౯౬.

వేంకట నాయకా! యఖిలవేది! సుఖప్రద!  సప్తగిరీశ! పాపనా
శంకర! శ్రీనివాస! యలసత్వవినాశక! (విదారక) లోకబంధు! హే
పంకజనాభ! భక్తజనపాలక! ధీవిభవప్రదాత! నీ
యంకము జేర్చి కావుమయ! హర్ష మొసంగుచు వేంకటేశ్వరా!                              ౯౭.


వేమన పాపమౌను గద విస్తృతరీతిని నీయుగంబునన్
క్షామము గూర్చుకల్మషము గాల్చుట యేకటగా దలంతు రీ
భూమిని విజ్ఞులెల్లరును పూర్ణసుఖప్రద! వేంకటాఖ్యతో
కామన లన్ని దీర్చి మము గావుము నిత్యము వేంకటేశ్వరా!                                  ౯౮.

నిన్నిల నమ్మినాడ ననునిత్యము నీపదపంకజంబులన్
పెన్నిధిగా దలంచి నిను వేడుచు మ్రొక్కుచు నుండు నన్ను సం
పన్నుని జేయుమయ్య గుణవైభవమందు మహీతలంబునం
దెన్నడు నిన్ను గొల్చుటకు నీయవె శక్తిని వేంకటేశ్వరా!                                         ౯౯

నీదయచేత సౌఖ్యములు నిండుగ బొందితి, నిత్య మన్నిటన్
మోదము నందియుంటి నిక , మోక్షద! తీరని కాంక్ష లేదిలన్
నీదయ జూపి నాపయిని నిశ్చలభక్తిని నిన్ను గొల్చు జ్ఞా
నోదయ మందజేయ నిను నున్నతు వేడెద వేంకటేశ్వరా!                                      ౧౦౦

శత్రువు లౌచు దేహమును సర్వవిధంబుల గాల్చుచుండి తా
పత్రయ మొందజేయు నరివర్గము కామము మత్సరాదు లే
మాత్రము కీడు చేయని సమంచిత భావము నాకు నీయగా
శాత్రవమర్దనా! నిను బ్రజావను వేడెద వేంకటేశ్వరా!                                    ౧౦౧.

దీనుల భాగ్యహీనులను దీప్తికి నోచని వీధిబాలలన్
మేను కృశించ సంమున మిక్కిలి కష్టము లందువారినిన్
జ్ఞానవిహీనులన్ భువి ననాథజనంబుల వంచితాళి నీ
మానవకోటి గావుమయ మాధవ! నిత్యము వేంకటేశ్వరా!                                      ౧౦౨.

శ్రీవిభవంబు గూర్చుచును, చిత్సుఖమందగ జేయు చుండి యా
శావహ జీవనంబునకు సత్త్వము జూపుచు స్వాంత శుద్ధియున్
ధీవిభవంబుతో ప్రజను ధీరత నింపుచు బ్రోవుమంచు
ద్మావతి నాజగజ్జనని భక్తిగ గొల్చెద వేంకటేశ్వరా!                                                ౧౦౩

వాడె యదృష్ట జాతకుడు, వాడె ప్రభుండు, గురుండు చూడగన్
వాడె మహామహుం డికను వానిది భాగ్యము సర్వకాల మె
వ్వాడు భవత్పదద్వయిని భక్తిగ మ్రొక్కుచు సంతసించు నా
ప్రోడయె యున్నతిం బడసి పోడిమి నందును వేంకటేశ్వరా!                                 ౧౦౪. 


మోదము గూర్చినావు సురముఖ్యుల కెల్లర కన్నిరీతులన్
నీదయ జూపి పార్థునకు నిర్మల సద్యశ మిచ్చినావు ప్ర
హ్లాదుని జేరదీసితివి హర్షితు జేసితి వాకుచేలునిన్
శ్రీద! దయామయా! త్రిదశశేఖర! కావుము వేంకటేశ్వరా!                                    ౧౦౫.

భూమిని సర్వవస్తువుల పుణ్యదుడై వెలుగొందుచుండు నిన్
ధీమతి నౌచు నెంచగల దివ్యగుణంబును నాకు నిచ్చి నీ
నామమె పల్కు శక్తినిడి నా సహజన్ములుగా ప్రజాళికిన్
ప్రేమను బంచు భావమిడవే యని మ్రొక్కెద వేంకటేశ్వరా!                                    ౧౦౬.

ధర్మము సుస్థిరంబగుచు ధారుణిలో వికసించుచుండి సత్
కర్మలు సాగునట్లు  కలకాలము  సత్యము గూడునట్లుగన్
దుర్మతు లంతమౌ నటుల దు:ఖము లొందక లోకు లందరున్
కర్మఠులై చరించు విధి కావుము తిర్మల వేంకటేశ్వరా!                                         ౧౦౭.

మంచిని పెంచగా వలయు, మానవులందరి మానసంబులన్
వంచన ద్రుంచగా వలయు, వాస్తమున్ వెలుగొందు నట్లుగా
నంచితభావనా బలము నందగ జూడవలెన్, దురాగతం
బించుక లేనిరీతి ధర నింపుగ బ్రోవుము వేంకటేశ్వరా!                                         ౧౦౮.

సత్యము పల్కుటే దొసగు, సజ్జనసంగతి నేరమయ్యె, దు
ష్కృత్య మవశ్యమయ్యె, జనజీవన మంతయు భిన్నమై కనన్
నీత్యుపదేశ మన్న నతి నిష్ఠుర మయ్యెను లోకమందునన్
నిత్యము  కాంచ రా వెటుల నీకుచితం బిది? వేంకటేశ్వరా!                                    ౧౦౯.

మిక్కిలి వత్సలత్వమున మించు కృపన్ ప్రసరింప జేసి
న్నక్కున జేర్చి పామరుని నద్భుత పద్యశతంబు లేర్పడన్
చక్కగ బల్కజేసితివి సర్వద! ధన్యుడనైతి భక్తితో
 పెక్కులు వందనంబులను విశ్వప! చేయుదు వేంకటేశ్వరా!                                 ౧౧౦

                                                                  హ.వేం.స.నా.మూర్తి 

౦౭.౦౪.౨౦౧౭