Tuesday, 11 April 2017

నాదేశం

నాదేశం
ఛందము-ఇంద్రవజ్ర
ప్రేమింతు నెల్లప్పుడు వేదభూమిన్

క్షేమంబు లందించెడి శిష్ట ధాత్రిన్

శ్రీమంతమై యొప్పెడి శ్రేష్ఠ సీమన్

ధీమంతమౌ భారత దివ్యగోత్రన్
.


సర్వార్థసంధాయిని! సత్త్వ యుక్తా! 

నిర్వాణ సౌఖ్య ప్రద! నిత్య దీప్తా!

పర్వావళీ సంయుత! భాగ్యదాతా!

సర్వోత్తమా! దండము సార్ద్రచిత్తా!


వేదంబు లిచ్చోటనె విస్తరించెన్

నాదంబు లీనేలనె నాట్యమాడెన్

మోదంబు లీపృథ్విని ముచ్చడించున్

శ్రీదుండు నిద్ధారుణి సేవలందున్.


ఏనాడు గావించితి మెంత పుణ్యం

బీనాడు జన్మించితి మీ ధరిత్రిన్

నానాప్రకారంబుగ నైతికత్వం 

బీనేలపై నేర్చితి మింపుమీరన్.


దండంబు వేదస్తుత! ధన్య! నీకున్

దండంబు దీప్తిప్రద! తథ్య! నీకున్

దండంబు ధర్మస్థిత! దార్ఢ్య! నీకున్

దండంబు హే భారత ధాత్రి! నీకున్.

No comments:

Post a Comment