Monday, 21 April 2014

శ్రీసత్యనారాయణ వ్రతకథ(తెలుగు పద్యకావ్యము)-అధ్యా.1



శ్రీసత్యనారాయణ వ్రతకథ
(తెలుగు పద్యకావ్యము)
మొదటి అధ్యాయము ప్రారంభము
కం.    శ్రీమంతమగుచు వెలిగెడు

నైమిశవనమందు జేరి నాడు మహర్షుల్

ధీమతులు శౌనకాదులు

స్వామీ! వినుడంచు సూత సంయమితోడన్.          1.

ఆ.వె. వినయ మొలుకుచుండ వేదోక్తరీతిగా

భక్తిభావమలర వందనమిడి

కలియుగంబులోన కష్టంబులం బాపి

కామితములు దీర్చి గాచునట్టి,                            2.

ఆ.వె. వ్రతము, తపము లాది బహువిధోపాయాల

నొక్కదాని దెల్పు డుర్విజనులు

సుఖములందునట్లు సులభసాధ్యంబైన

దాని నంచు బల్కి రానతులయి.                          3.

కం.    సూతుం డిట్లనె హర్షం

బాతని ముఖకమలసీమ నలముకొనంగా

నోతపసులార! నారదు

డాతతకరుణార్ద్రహృదయు డఖిలజగాలన్.            4.

ఆ.వె. పర్యటించ గోరి వరుసగా లోకంబు

లన్ని చేరుచుండి యందు నుండు

జీవరాశి నరసి క్షేమముల్ దర్శించు

చుండి సంతసించుచుండు నపుడు.                      5.

సీ.      భూలోకమున కేగి పుడమివారలు నిత్య

మనుభవించుచునుండు యాతనలను

గాంచి కరుణతోడ కష్టసంతతి బాసి

జనులు సుఖము లందు ననుపమమగు

మార్గ మడుగ నెంచి మాధవ దర్శన

కాంక్షతోడ త్వరితగతిని బూని

విష్ణులోకము జేరి వినయానతుండౌచు

శంఖచక్రయుతుని, శా±µÚþØ ధరుని

ఆ.వె. శ్వేతవర్ణు, నాల్గుచేతులు గలవాని

గదను చేతబట్టు ఘనుని, హరిని

తన్మయంబుతోడ దర్శించి భక్తితో

వందనంబు చేసి పలికెనిట్లు.                                 6.

తే.గీ.   ఆది మధ్యాంతహీనుండ, వఖిలజనుల

కాదిభూతుడ, వఘముల నణచువాడ,

వార్తినాశన మొనరించి హర్షమొసగు

నిర్గుణుండవు మాధవ! నీకు నతులు.                    7.

కం.    వందన మార్యాసన్నుత!

వందనమో జగదధీశ! వైకుంఠ! హరీ!

సుందరరూపా! కొను నా

వందనములు చక్రపాణి! భక్తాధీనా!                      8.

శా.     నీమాహాత్మ్యము దెల్ప శక్యమగునా? నిన్నెంచగా సాధ్యమా?

స్వామీ! వాక్కుల కందబోవు మదులన్ సంధించి యోచించినన్

మామామానసవీధి చిక్కవుగదా! మాభాగ్య నిర్ణాయకా!

శ్రీమన్మాధవ! వందనంబు గొనుమా, చిద్రూప! దామోదరా!   9.

ఆ.వె. అనుచు వివిధగతుల నానందదంబైన

స్తుతిని జేయుచున్న హితమతియగు

నారదర్షితోడ నారాయణుండిట్లు

పలుకసాగె భక్తవత్సలుండు.                                 10.

కం.    నారద! యేయేవాంఛలు

దీరగ నేతెంచినావు? దివ్యమునీంద్రా!

కోరుము సంకోచించక

నీరమ్యస్తవము మదిని నింపెను ముదమున్.             11.

ఆ.వె. అనిన నారదర్షి యానందభరితుడై

పలికెనిట్లు దేవ! ప్రజలు భువిని

పాపకర్ములౌచు బహుజన్మలందుచు

కాంచుచున్నవారు కష్టతతిని.                              12.

కం.    వారలకష్టము, లఘములు

తీరగ నేదేని వ్రతము స్థిరమతి కలుగన్

కూరిమితో వచియించగ

నారాయణ! కోరుచుంటి నళినదళాక్షా!                 13.

కం.    అని పలికిన వైకుంఠుం

డనుమానములేక తెలియు మన్నిట జూడన్

ఘనతరమై కలియుగమున

మనుజాళిని గాచునట్టి మహిమాన్వితమౌ.             14.

కం.    వ్రత మొక్కటి తెల్పెద విను

మతులిత సౌఖ్యంబు లొసగి యానందదమై

వెతలం దీర్చెడి సత్య
వ్రతమది చేయంగ గలుగు వైభవవృద్ధుల్              15.

సీ.      దుఃఖంబు లణగారు, తులలేని సౌఖ్యంబు

లందుచుండును సతం బవనిలోన,

శోకనాశనమౌను, శుభసంతతులు గల్గు,

ధనధాన్యవిభవంబు మనుజులకును,

సంతానహీనులౌ జనులకు తత్ప్రాప్తి

కలుగును సత్యంబు కలియుగాన,

అన్నింట విజయంబు లందుచుండుటె కాదు,

హర్షానుభూతియౌ ననుదినంబు,

ఆ.వె. ఇహమునందు పొంది యీరీతి మానవుం

డంత్యమందు ముక్తి నంది నన్ను

జేరగలడు వినుము, నారదర్షీ! యంచు

మాధవుండు పలికె మమత లొలుక.                      16.

సీ.      సంగ్రామభూమికై సాగబోయెడి వేళ,

విజయకాంక్షను చేయు వేళలోన,

క్లేశజాలము దేహగేహంబులం జేరి

స్థైర్యంబు నణగార్చు సమయమందు,

దారిద్ర్యభూతంబు తనువు గాల్చెడివేళ

సంతానకాంక్షులౌ సమయమందు,

శుభకార్యసముదాయ విభవమందినవేళ

సద్యశః కామనాసమయమందు,

ఆ.వె. ఎప్పుడైనగాని, ఎవ్వారలైనను

చేయవచ్చువ్రతము స్థిరసుఖంబు

నరులు పొందగలరు నారదర్షీ! యంచు

మాధవుండు పలికె మమత లొలుక.                    17.

ఆ.వె. మహిని చేయవచ్చు మాసాని కొకసారి

కానియెడల వత్సరానికైన

చేయుచుండ వ్రతము సిద్ధించు కామనల్

సందియంబు లేదు సంయమీంద్ర!                      18.

కం.    ఏకాదశి ప్రతిమాసము

రాకాశశి యుండునట్టి రమ్యదినంబున్

శ్రీకర రవిసంక్రమణం

బేకాలము యుక్తమైన దీవ్రతమునకున్.                19.

ఆ.వె. వరుస మాఘమైన, వైశాఖమైనను,

కార్తికాఖ్యమైన కాలమైన

శ్రేష్ఠ మంచు దెలిసి చేయబూనిన గల్గు

కామ్యసిద్ధి నిజము రమ్యచరిత!                            20.

సీ.      సత్యదేవుని పూజ యత్యుత్తమంబంచు

తలచి చేసెడివారు ధరణిలోన

సూర్యోదయాత్పూర్వ మార్యోక్తవేళలో

నిద్రను మేల్కాంచి నియమితమగు

కాలకృత్యములన్ని క్రమత నిర్వర్తించి

భగవానుకడ జేరి భక్తితోడ

దైత్యారి! విశ్వేశ! దామోదరా! దేవ!

సత్యనారాయణస్వామి వ్రతము

ఆ.వె. చేయబూనినాడ నాయందు దయజూపు

త్వత్ప్రియార్థమేను వాసుదేవ!

శరణు నీవయనుచు సంకల్పముం జేయ

వలయు మొట్టమొదట భక్తులగుచు.                      21.

సీ.      మధ్యాహ్నకాలాన మాధ్యాహ్నికము దీర్చి

సూర్యాస్తవేళలో శుభకరముగ

సద్భావపూర్ణుడై స్నానమప్పుడు చేసి

సత్యనారాయణ స్వామి వ్రతము

రాత్రికారంభమౌ రమణీయకాలాన

చేయబూనగవలెన్ శ్రేయమంద

పూజాగృహంబంత తేజోమయంబౌచు

మించునట్టు లలంకరించవలయు

ఆ.వె. వ్రతము చేయుచోటు పావనంబౌటకు

గోమయంబు దెచ్చి కూర్మిమీర

నలికి దానిపైన నైదు చూర్ణాలతో

రచన చేయవలయు రంగవల్లి.                           22.

సీ.      రంగవల్లులపైన రంగారు పీఠంబు

నుంచి దానిమీద నుత్తమమగు

వస్త్రమొక్కటి వేసి శాస్త్రోక్తరీతిగా

తండులంబును బోసి దానిమధ్య

ఘనదీప్తి వెలుగొందు కలశంబు నొకదాని

నుంచగావలె నెంతొ యుత్సవముగ

రజతనిర్మితమౌచు రాజిల్లు పాత్రయు,

తామ్రనామముగల్గు ధాతుపాత్ర

ఆ.వె. కంచుపాత్రనైన నుంచంగవలె నందు

శక్తిలేనివాడు శ్రద్ధబూని

మట్టిపాత్రనైన పెట్టంగవలెగాని

కలశహీన పూజ ఫలము నీదు.                          23.

కం.    శ్రీసత్యదేవు ప్రతిమను

భాసురముగ వెలుగుచుండు బంగారముతో

నో సంయమీంద్ర! నారద!

వాసిగ చేయించవలయు బంధురఫణితిన్.           24.

ఆ.వె. భక్తిభావమలర పంచామృతాలతో

చిత్తశుద్ధిగ నభిషేక మప్పు

డందజేసి దాని నామంటపంబందు

చేర్చి పిదప పూజ చేయవలయు.                      25.

సీ.      విఘ్నేశు, పద్మజన్, విష్ణు నాదట మహా

దేవుని, బార్వతిన్ స్థిరమతియయి

కలశాని కుత్తరస్థలమున నెలకొల్పి

యష్టదిక్కులలోన నమిత భక్తి

సాంగ సాయుధులైన శక్రాది దిక్పాల

సంఘంబునకు పూజ సలిపి యంత

అధిదైవతముల, ప్రత్యధిదేవతలతోడ

ఘననవగ్రహములన్ కలశమునకు

తే.గీ.   ఉచితభాగంబులందుంచి యుత్సహించి

యంగదేవతలైయుంట నాదిలోన

పూజ చేయంగ వలయును, పూర్వమందె

వరుణపూజను కలశాన జరుపవలెను.               26.

కం.    పిమ్మట సత్యప్రభునిగ

నమ్ముచు కల్పోక్తవిధిని నమ్రతతోడన్

సమ్మోదంబున కలశము

నమ్మహి బూజింప గలుగు నతులసుఖంబుల్    27.

తే.గీ.   నాల్గువర్ణాలవార లానందమూని

చేయదగినట్టి వ్రతమిది క్షితిని జూడ

పురుషులే కాదు మహిళ లాదరముతోడ

నాచరించిన తొలగు సర్వాఘపంక్తి.                 28.

తే.గీ.   విమలమతులై నిశారంభవేళయందు

భక్తితోడను, శ్రద్ధతో బంధుజనుల

గూడి కల్పోక్తవిధమున కూర్మితోడ

సత్యదేవుని వ్రతమును జరుపవలయు.           29.

సీ.      గోధూమచూర్ణంబు కోరినంతగ దెచ్చి

శర్కరన్ గొనివచ్చి సమముగాను

అత్యుత్తమంబైన నరటిపండ్లను దెచ్చి

యావుపాలును, నెయ్యి యందులోన

కలిపి సద్భక్తితో నిలిచి మ్రొక్కినమీద

నైవేద్యరూపాన దేవునకును

యర్పించగాబూని యద్దానితోబాటు

మేలైనభక్ష్యాలు మిక్కిలిగను

ఆ.వె.  మంత్రయుతముగాగ మాధవార్పితమంచు

పలికి భోజనంబు బంధువులకు

తనివిదీర బెట్టి దక్షిణలందించి

ధరణిసురుల దృప్తి పరుచవలయు.                30.

తే.గీ.   నరులు గోధూమచూర్ణంబు దొరకదేని

శాలి చూర్ణంబు, శర్కర సరిపడునటు

లభ్యపడదేని గుడమును లక్షణముగ

వాడవచ్చు ప్రసాదమం దేడనైన.                    31.

తే.గీ.   వ్రతము చేయగ సామగ్రి వలసినంత

శ్రద్ధతోడుత సమకూర్చి సన్మతియయి

పూజ చేయంగవలెగాని భూజనులకు

విత్తశాఠ్యంబు కూడదు వినుము మౌని!          32.

కం.    ఈవిధముగ నెవ్వారలు

పావనమగు సత్యదేవు వ్రతమును భువిలో

నేవేళ చేయుచుండెద

రావెళనె ఘోరమైన యఘము నశించున్.       33.

కం.    వారికి మోక్షం బబ్బును

చేరెద రావిభుని వారు సిరులంది యిలన్

కోరినది చెప్పినాడను

నారదముని! యంచు పలికె నారాయణుడున్   34.

తే.గీ.   సత్యదేవుని వ్రతమును జరుపుకొరకు

వలయు సామగ్రి, నియమాలు, పద్ధతులును

కోర హరిదెల్పె నలనాడు నారదునకు

ననుచు పలికెను సూతుడా మునులతోడ.         35

మొదటి అధ్యాయము సమాప్తము.



       











1 comment:

  1. హరినారాయణ మూర్తిగారూ! మీ సత్యనారాయణ వ్రతకథ పద్యాలు హృద్యంగా, సరళ సుందరంగా వున్నాయి. అభినందనలు.
    ఇలానే నాన్న గారు శ్రీ పింగళి వెంకట శ్రీనివాసరావుగారు వినాయక వ్రతకథ మొత్తం "మహాగణపతిం మనసా స్మరామి" పేర వ్రాయగా 2013 ఆగష్టు లో ఆవిష్కరింపబడింది. అప్పటిలో కొన్ని పేపర్లలో ఆ విశేషాలు రాగా, క్రితం నెల సాహితీ కిరణంలో దానిపై సమీక్ష కూడా వచ్చింది.
    మీరు వ్రాసే వ్రతకథాకావ్యం చూడగానే చెప్పాలనిపించింది. అన్యధాభావించకండి.

    ReplyDelete