Tuesday, 8 October 2013

“వేఁప పుల్ల”

“వేఁప పుల్ల”
దంతమలినజాల మంతయు పోగొట్టి
హర్ష మందజేసి యనుదినంబు
జనుల గాచుచుండు ఘనరుగ్మతలనుండి
విజ్ఞులార! నిజము వేపపుల్ల.


చేదు నెంచ వలదు సేమంబు తాఁగూర్చు,
క్రిముల జేరనీదు, విమలముగను
దంతపంక్తి నుంచు దారుఢ్యతను బెంచు

విజ్ఞులార! నిజము వేపపుల్ల.

పళ్ళు తోము కొరకు బహువిధ చూర్ణాలు
మరియు లేహ్యతతుల మాటయేల?
తనివిదీర్చగలదు తానొక్కటున్నచో

విజ్ఞులార! నిజము వేపపుల్ల.

ధనము కోరబోదు, మనమున కెంతయో
హాయి నొసగుచుండు, హానికరము
కాదు కొంచెమైన, వాదు లింకేలనో

విజ్ఞులార! నిజము వేపపుల్ల.

పిన్నవారికైన, పెద్దవారలకైన
కోరి పూనువారి కేరికైన
అతుల చేతనత్వ మారోగ్య మందించు

విజ్ఞులార! నిజము వేపపుల్ల. 

No comments:

Post a Comment