Wednesday, 16 January 2013

గోవర్ధనోద్ధరణం


పద్య రచన - 223 

బుధవారం 16 జనవరి 2013

 

భీతిలనేల మీరు యదువీరులు మత్సఖు లాత్మబంధువుల్
ఖ్యాతిని గల్గువార లమరాధిపుగర్వము నేడు గూల్తు, నా
చేతి కనిష్ఠికన్ గిరిని సేమము గూర్పగ దాల్తు రండు మీ
చేతము లుల్లసిల్లునని చీరెను కృష్ణుడు పల్లెవారలన్.


లోకరక్షకుండు శోకార్తులైయున్న
వారి ననునయించి, భయము బాపి
గోకులంబు గావ గోవర్ధనాఖ్యమౌ
గిరిని లేవనెత్తె సరసు డగుచు.


గోవర్థనగిరి యప్పుడు
భావింపగ ఛత్రమట్లు భాసిల్లె నటన్
గోవులు గోపకులంబులు
గోవిందుని చెంతజేరి కూరిమి మీరన్


గిరిపంచను సుఖమందుచు
నరుసంబున వారు చేసి రద్భుతరీతిన్
కరుణామయుడౌ కృష్ణుని

వరగుణసంకీర్తనంబు వైభవమొప్పన్.

రాళ్ళవానయైన ప్రళయాగ్నియైనను
అవనిజముల గూల్చు పవనమైన
సర్వభారకుండు సంరక్షకుండౌచు
చేరదీయ నేమి చేయగలవు?


తానొనరించిన దొసగును
మానసమున దలపకుండ మన్నించంగా
నానావిధముల శక్రుం
డానారాయణుని వేడె నతిభక్తిమెయిన్.


హరి ప్రసన్నుడౌచు కరుణార్ద్రదృక్కుల
జూచె, నింద్రుడంత జోత లొసగె
ఖేచరాదులెల్ల కీర్తించి రాశౌరి
లీల గాంచి మేలు మేలటంచు.

వందనంబు నీకు వైకుంఠ! మాధవ!
వందనంబు నీకు భవ్యచరిత!
వందనంబు నీకు నందాత్మసంజాత!
వందనంబు గొనుము వాసుదేవ! 

 

No comments:

Post a Comment