Sunday, 16 October 2011

నేటిభారతం

నేటి భారతం
(వర్తమాన దేశపరిస్థితులగూర్చి వ్రాసిన పద్యములు)
(ఛందము - ఉత్పలమాల)


ఏమి విచిత్రమో తెలియదీభరతావనిలోన దుష్టతా
ధూమము విస్తరిల్లినది, దుర్జనసంగతితోడ మానవుల్
నీమము దప్పి యుండిరిట నిత్యములయ్యె నధర్మకార్యముల్
సేమము మృగ్యమైనయది, చిందరవందరయయ్యె సౌఖ్యముల్.


పూర్వపు వైభవంబులవి పోయినవెక్కడ? దేశమంతటన్
పర్వములన్నియున్ కనగ భావవిహీనములయ్యె, సృష్టిలో
సర్వము పాపపూరితమసారమునయ్యె, సహిష్ణుతా
నిర్వహణంబు శూన్యమయి నీరసమయ్యెను వేదపాఠముల్.


సత్యము నామమాత్రమయి సర్వజనంబుల యంతరంగముల్
నిత్యము కల్మషంబులను నిండి యకారణ శత్రుభావముల్
హత్యలు, మానభంగములు నాసురకృత్యము లన్నిచోటులన్
నృత్యము చేయుచున్నయవి నిర్మలసఖ్యము కానరాదిలన్.


వేదవిచారశూన్యులయి విప్రులనేకులు భారతాన సం
పాదితభూసురత్వమును, బంధురవిజ్ఞత గోలుపోయి, దా
మోదరశంకరాది సురముఖ్యుల సేవలు విస్మరించి యు
న్మాదముతోడ నుండిరిట మత్సరగ్రస్తత ధర్మబాహ్యులై.


నాలుగుజాతులందు నిల నైతికవర్తన మంతరించె నే
డేలనొ, భారతానగల యేలికలందరు స్వార్థభావనా
జాలము చిత్తమందు గొనసాగ నగణ్యదురాగతంబులన్
దేలుచు సఖ్యముండిరిట దేశపురోగతి కడ్డుగోడలై. 


సత్యముబల్కువారలకు సర్వపరాభవదు:ఖసంతతుల్
నిత్యమసత్యభాషణము, నీమము దప్పిన వర్తనంబులున్
హత్యలు, దోపిడీలు, పరిహాసవచస్సులు బల్కుచుండి స
త్కృత్యము దూరువారలకు దివ్యసుఖంబులు నేడు జూడగన్.

No comments:

Post a Comment