Tuesday, 27 September 2011

అమ్మ

 
శ్రీ సామ్రాజ్యశుభాఖ్య లక్ష్మియుతయై శ్రేయంబులంగూర్చగా
నాసంగళ్ళపురా కృష్ణతటిపై నత్యంత మోదంబునన్
వాసింగొల్పగ వేంకటేశు సతియై వర్ధిల్లి సత్సంతతిన్
భాసిల్లంగ జనింపజేసి పడసెన్ భవ్యంపు సత్కీర్తులన్.

నలుగురు పుత్రులు, పుత్రిక
లిలపై మరి మువ్వురంత నిర్వురు నొకరున్
కలిగిన బహుసంతానము
నలసట లేకుండ సాకె నతివత్సలతన్.

సాధువర్తనంబు, సత్యవాక్పాలన,
కలిగినంతలోన ఘనముగాను
చింతలేక చేయు జీవనయానంబు
మాకు నేర్పియుండె మాతృమూర్తి.

బహుళదారిద్ర్యదశజూచి వణకకుండ
నిండు కుండయ యన్నట్లు మెండుగాను,
స్థిరత వహియించి సంతతి జేరదీసి,
మమ్ము బెంచిన ఘనురాలు మాతృమూర్తి.

తనజీవిత మందంతట
కనగా బహు కష్టతతులు, కడుదు:ఖంబుల్
వినయముగా సహియించిన
దనయము మా మాతృమూర్తి యవనిజనిభయై. 


తనకు సేవ చేసి ధన్యత నందెడు
భాగ్యమించుకైన పండనీక
కాలధర్మమంది కైవల్యధామంబు
చేరిపోయె నాడె శీఘ్రముగను.




No comments:

Post a Comment